Jul 2, 2025

కమ్మ వారి విశిష్టత

కమ్మవారి చరిత్ర 

కమ్మ అనేది  భారతదేశంలో ఒక బలమైన కులంగా విరాజిల్లుతోంది.  కమ్మ సామాజిక వర్గం వారు  ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో ఉన్నారు. కొంత మంది ఇంటి పేరు కమ్మ అని కూడా ఉంటుంది. ఈ కులంలోని వారు చివర చౌదరి లేదా నాయుడు అని గౌరవంగా పెట్టుకుంటారు.  మొదటి కమ్మ మహాసభ  1910లో కృష్ణా జిల్లా కౌతారంలో జరిగింది.  ఈ సభ నిర్వహణలో  కంఠంనేని వెంకట రంగయ్య, బొబ్బా పద్మ నాబయ్య కీలక పాత్ర పోషించారు. కమ్మ అన్న పదం సామాన్య శకం (క్రీస్తు శకం) ఒకటో శతాబ్దం నుంచి ఉంది. కమ్మ వారి పుట్టుపూర్వోత్తరాలు, చరిత్ర విషయంలో పలు సిద్ధాంతాలు, వాదనలు ఉన్నాయి. గుండ్లకమ్మ, పేరికమ్మ (కృష్ణా నది) నదుల మధ్య ఉన్న ప్రాంతాలను ప్రాచీన ప్రాంత విభాగమైన కమ్మనాడుగా పిలిచేవారు. ఆ ప్రాంతంతో కమ్మవారి మూలాలు ముడిపడివుండడంతో ఈ కులానికి కమ్మ అన్న పేరు వచ్చినట్టు చెబుతారు. 

 కమ్మ కులస్తులైన  కొందరు చరిత్రకారులు రాసిన  ప్రకారం వీరు సామాన్య శక పూర్వం గంగా మైదానంలోని కర్మ రాష్ట్రానికి చెందిన బౌద్ధులనీ, సా.శ.పూ. 184 సమయంలో రాజ్యానికి వచ్చిన పుష్యమిత్ర సుంగుని కాలంలో పెద్ద సంఖ్యలో దక్షిణాదిన ఉన్న కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి వలస వచ్చారనీ చెప్తారు. సంస్కృతంలోని కర్మ పదం పాళి భాషలోని కమ్మగా మారిందనీ, ఆ పదాన్నే వీరు వెంట తీసుకువచ్చి తమను కమ్మ కులస్తులుగా చెప్పుకున్నారనీ అంటారు. ఈ సిద్ధాంతం కృష్ణా పరీవాహక ప్రాంతాల్లోని బౌద్ధ సంస్కృతిని వారు కమ్మ రాష్ట్రం నుంచి తీసుకువచ్చారని పేర్కొంటోంది. సా.శ. పదో శతాబ్దం నుంచి కమ్మ వారు ఒక కులంగా ఉన్నట్టు ప్రస్తావనలు ఉన్నాయి. ఐతే, కమ్మనాడు సంబంధించిన మిగతా వర్గాలను కూడా చారిత్రకంగా కమ్మ బ్రాహ్మణులు, కమ్మ కాపులు, కమ్మ కోమటులు అని పిలిచేవారు. కాలక్రమములో ఈ భౌగోళిక సూచన కమ్మ వారికి మాత్రమే కుల నామమంగా మిగిలిపోయింది.

కమ్మ వారు ఎక్కువగా ఆంధ్ర పాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్నారు. ఇక్కడ నుంచి వీరు ప్రపంచం వ్యాప్తంగా విస్తరించారు. కమ్మవారు ఆడ అయినా, మగ అయినా కష్టపడే స్వభావం కలిగినవారు. అందువల్లే వీరు  ఏ రంగాలోనైనా ఇట్టే ఇమిడిపోతారు. విద్య, వైద్యం, సాంకేతిక పరిజ్ఞానం, సాహిత్యం, సినిమా, వ్యాపారం... ఇలా రంగాల్లో అత్యున్నత స్థాయిలకు ఎదిగారు. అంతే కాకుండా వీరు సామాజిక చైతన్యం కలిగినవారు. కమ్యూనిస్టు పార్టీలలో కూడా  కమ్మ వారు చాలా కీలకమైన పదవులను అలంకరించారు.  తెలుగు దేశం పార్టీ పుట్టే వరకు కమ్మ వారు ఎక్కువ మంది కమ్యునిస్టు ఉద్యమంలోనే పని చేశారు.  గుంటూరు జిల్లాకు చెందిన కమ్మ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన త్రిపురనేని రామస్వామి చౌదరి కులాలకు వ్యతిరేకంగా గొప్ప సామాజిక ఉద్యమానికి నాయకత్వం వహించారు.   కమ్మవారి ప్రధాన వృత్తి వ్యవసాయం. వీరు వ్యవసాయం చేయడంలో దిట్టలు. అత్యుత్తమ వ్యవసాయ పద్దతులు అవలంబించేవారు.  కృష్ణా నది ప్రవహించే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో  వ్యవసాయంలో పట్టు సాధించి మంచి స్థితిమంతులుగా ఎదిగారు.  కమ్మ వారు శతాబ్దాలుగా వ్యవసాయం ప్రధాన వృత్తిగా కొనసాగింది. కృష్ణా డెల్టా ప్రాంతంలో 20 శాతం జనాభా, 80 శాతం వ్యవసాయ భూమి వీరిదేనని చెబుతారు.   వీరు ఏ ప్రాంతంలో ఉన్నా ఆయా ప్రాంతాలలో భూములను వ్యవసాయం చేస్తూ సస్యశ్యామలంగా ఉంచుతారు. కృష్ణ, గుంటూరు జిల్లాల నుంచి వెళ్లిన కమ్మవారు తెలంగాణ, కర్ణాటకలలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు. అక్కడి వారికి కూడా నూతన వ్యవసాయ పద్దతులను అలవాటు చేశారు. వారు క్రమంగా ఆయా ప్రాంతాలలో స్థితిమంతులుగా,  ఆర్థికంగా, వ్యాపారస్తులుగా స్థిరపడిపోయారు.  ఆ విధంగా వారూ లాభపడ్డారు. ఆయా ప్రాంతాలను అభివృద్ది చేశారు. కాల క్రమంలో కమ్మవారు చదువులలో, రాజకీయాలలో, సినిమా తదితర రంగాలతోపాటు అన్ని రకాల వ్యాపారాలలో బాగా రాణించారు. వారి పిల్లలు ఆడ, మగ ఉన్నత చదువులు చదివి విజ్ఞాన వంతులుగా ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రతిభను చాటుతున్నారు. అలాగే, వ్యాపారంలో కూడా వీరు బాగా రాణిస్తున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, జగ్గయ్య, కృష్ణ, శోభన్ బాబు, మురళీమోహన్, నాగార్జున, బాలకృష్ణ,  ఎల్.వి.ప్రసాద్,  డి.రామానాయుడు తదితరులు అగ్రకథానాయకులుగా, దర్శక, నిర్మాతలుగా  సినిమా రంగాన్ని ఏలారు. ఏలుతున్నారు. రామోజీరావు, కేఎల్ఎన్ ప్రసాద్.. వంటి వారు పత్రికా రంగాన్ని కూడా ఏలారు.

చారిత్రకంగా కాకతీయ సామ్రాజ్యంలో కమ్మ వారు సైన్యాధ్యక్ష హోదా నుంచి పలు కీలక సైనిక పదవుల్లో ఉండేవారు. కాకతీయ సామ్రాజ్యం పతనం చెందిన తర్వాత కాకతీయ సేనానులు కమ్మ నాయకులైన ముసునూరి ప్రోలయ నాయకుడి నాయకత్వంలో తిరుగుబాటు చేసి ఓరుగల్లు స్వాధీనం చేసుకున్నారు. సంక్లిష్టమైన దశాబ్దాల్లో  ముసునూరి నాయకులు ఓరుగల్లు రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించారు. దక్షిణ భారతదేశంలో హైందవ రాజవంశాలు పట్టు సంపాదించేందుకు అవకాశం కల్పించారు.  కమ్మ కులస్తులు  ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకున్న తర్వాత ఓరుగల్లు పేరును, ఓరుగల్లు తోరణం వంటి చిహ్నాలను తమ కుల సంఘాలు, కాలనీలు, ప్రదేశాలకు ఔన్నత్య సూచకంగా ఉపయోగించుకుంటున్నారు. ముసునూరి నాయకుల రాజ్యం పతనం తర్వాత విజయనగర సామ్రాజ్యం సైనిక విభాగంలో సామంత రాజులుగా కమ్మవారు ఉన్నారు.  విజయనగర సామ్రాజ్య విస్తరణలో భాగంగా నేటి తమిళనాడు ప్రాంతాలకు సైనికులు,  సైన్యాధ్యక్షులుగా పలు హోదాల్లో కమ్మ వారు వెళ్ళారు. అమరావతి కేంద్రంగా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పాలించారు. ఆయన హయాంలోనే మంగళగిరిలోని గాలిగోపురం నిర్మించారు. 

  గణనీయమైన సంఖ్యలో  తమిళనాడు ప్రాంతాల్లో స్థిరపడ్డ వీరు  అక్కడ వ్యవసాయ భూములను, కొత్తగా అడవులను కొట్టి సాగులోకి తెచ్చారు. హైదరాబాద్ సంస్థానాన్ని నిజాంలు పరిపాలిస్తున్న కాలంలో స్థానిక రాజకీయ సంతులన కోసం, రెవెన్యూ వృద్ధి కోసం కృష్ణా డెల్టా నుంచి వలస వచ్చిన కమ్మవారిని నిజాం సాగర్ ప్రాజెక్టు లబ్ధి ప్రాంతాల్లో ఉదారంగా భూములు, రెవెన్యూ హోదాలు ఇచ్చాడు. ఈ ప్రాంతాల్లో కూడా కమ్మవారు స్థిరపడి వ్యవసాయం చేశారు.  భూ సంస్కరణల ద్వారా, రైతాంగ పోరాటాల ద్వారా గ్రామాల్లో నివసించని భూస్వాములు, బ్రాహ్మణుల భూములు  గ్రామీణ రైతులైన మరికొందరు కమ్మవారికి దక్కాయి. వ్యవసాయ వలసల్లో కింది స్థాయి కమ్మ వ్యవసాయదారులు కృష్ణా డెల్టాలోని కొద్ది భూములను అమ్ముకుని తెలంగాణ, రాయలసీమల్లోని సాగునీటి సౌకర్యం లేని భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి, బోరు బావుల ద్వారా సాకులోకి తీసుకువచ్చారు. ఆ విధంగా కమ్మ వారు ఏ ప్రాంతానికి వెళ్లినా కష్టపడి, వ్యవసాయంలో వారికి ఉన్న ప్రావీణ్యం ద్వారా అక్కడి భూములను సాకులోకి తీసుకువచ్చి వారు ఆర్థికంగా లాభపడేవారు. ఆయా ప్రాంతాలు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు కారకులయ్యేవారు. అన్ని అంశాలలో మహిళది కూడా కీలక పాత్రగా ఉంటుంది.   నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు, కెసి కెనాల్, తుంగభద్ర, పెన్న నదుల ఆయకట్టుల్లో  మధ్య స్థాయి, సంపన్న కమ్మ వ్యవసాయదారులు విస్తారంగా భూములు కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన చిన్న కమతాలు కలిగిన కమ్మ కుటుంబాలు తుంగభద్ర ప్రాజెక్టు పరిధిలో, మంచి నీటివసతి కలిగిన చవకైన భూములు కొనుగోలు చేసి వలస వెళ్ళి  పెద్ద వ్యవసాయదారులుగా అభివృద్ధి చెందారు.

కమ్మ వారు 20వ శతాబ్ది రెండవ అర్థభాగం నుంచి పలు రంగాల్లో వ్యాపార, ఉద్యోగ హోదాల్లో రాణిస్తున్నా, పలు కుటుంబాల ఆర్థిక కేంద్రం వ్యవసాయం నుంచి తరలిపోయినా కృష్ణా డెల్టాలోని భూములను పూర్తిగా అమ్ముకోలేదు. పలువురు ఇతర వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాల కారణంగా స్వయంగా వ్యవసాయం చేసే పరిస్థితి లేకున్నా, ఇతర ప్రాంతాలకు వెళ్లినా ఇక్కడి ఈ భూములను అమ్ముకోలేదు.  కౌలుకు ఇచ్చి భూములపై తమ యాజమాన్యాన్ని కొనసాగిస్తూ రావడం ప్రత్యేక అంశంగా చెప్పుకోవచ్చు. భూమి విలువ, భూమి ప్రాధాన్యత తెలిసిన విజ్ఞులుగా గుర్తింపు పొందారు. 

వాసిరెడ్డి, శాయపనేని, పెమ్మసాని, రావెళ్ళ, యార్లగడ్డ, సూర్యదేవర వంటి కమ్మ వారి వంశాలు సంస్థానాలను పరిపాలించాయి. ఆధునిక యుగంలో  ఎన్టీఆర్ రాకతో రాజకీయ రంగంలో  వీరు బాగా రాణించారు. ఎన్టీఆర్ రాజకీయంగా ఓ ఊపు తెచ్చారు.   రాజకీయాలలో ఓ పట్టు సాధించారు. అందుకు ఉదాహరణగా తొమ్మిది సార్లు, ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడుని చెప్పుకోవచ్చు.  ఏపీలో 175 మంది ఎమ్మెల్యేలలో  35 మంది ఎమ్మెల్యేలతో  కమ్మ కులం టాప్ లో ఉంది. 

1960, 70 దశకంలో అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా  వెళ్లిన కమ్మవారు దేశానికి పేరు తెచ్చారు. వ్యాపారలలో గుర్తింపు పొందారు. తిరిగి వచ్చిన వారు వైద్యంలోనూ, ఇతర వ్యాపారాలలోనూ అత్యున్నత స్థాయికి ఎదిగారు. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ... తదితర ప్రాంతాలలో కమ్మ సామాజిక వర్గం వారి ఆస్పత్రులే ఎక్కువగా ఉన్నాయి.  జనాభా శాతం తక్కువైనా  సమాజంలో ప్రాధాన్యత కలిగిన వర్గంగా  కమ్మవారు కొనసాగడానికి వారంతా  దోహదపడ్డారు. 


- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914



No comments:

Post a Comment

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...