విజయవాడ : వెటరన్ జర్నలిస్టులకు పెన్షన్ మంజూరు చేయమని ఏపీ వెటరన్ జర్నలిస్టుల యూనియన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఈరోజు వెటరన్ జర్నలిస్టులు సమావేశంమై పలు తీర్మానాలు చేశారు. ప్రధానంగా పెన్షన్, హెల్త్ కార్డుల గురించి చర్చించారు. వెటరన్ జర్నలిస్టులు వెంకటరత్నం, ఎంవీ రామారావు, శిరందాసు నాగార్జున రావు మాట్లాడుతూ, దేశంలో 16 రాష్ట్రాల్లో జర్నలిస్టులకు గౌరవ పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. మన రాష్ట్రంలో కూడా కనీసం 20 ఏళ్ల సర్వీసు ఉండి, 60 ఏళ్లు నిండిన, అక్రిడేషన్ కలిగిన వెటరన్ జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అక్రిడేషన్ కలిగిన వెటరన్ జర్నలిస్టులు రాష్ట్రంలో 400 మందికి మించి ఉండరని తెలిపారు. కనీసం రూ.20 వేలు పెన్షన్ ఇవ్వాలని వారు కోరారు. ఇది ప్రభుత్వానికి పెద్ద భారం కాదన్నారు. 365 రోజులు,24 గంటలు పనిచేసిన 60 ఏళ్లు నిండిన వెటరన్ జర్నలిస్టులు ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పారు. అనేక మంది చాలా దయనీయమైన స్థితిలో బతుకుతున్నట్లు తెలిపారు. వారికి ఏ విధమైన ఆదాయ మార్గంలేక అనేక అవస్థలు పడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిలాగా పనిచేసిన వెటరన్ జర్నలిస్టులను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
అలాగే, వృద్ధాప్యంలో వెటరన్ జర్నలిస్టులు అనేక ఆరోగ్య సమస్యలతో బాధలు పడుతున్నట్లు తెలిపారు. అనేక మంది సీనియర్ జర్నలిస్టులు సమయానికి వైద్యం అందక ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. పక్కన తెలంగాణతో సహా అనేక రాష్ట్రాలలో ప్రభుత్వ, కార్పోరేట్ ఆస్పత్రులతో సహా క్యాష్ లెస్ వైద్యంతోపాటు మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారని, ఆ విధంగా మన రాష్ట్రంలో వైద్యం అందించేందుకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. అలాగే, ప్రభుత్వం రూ.10 లక్షల జీవితా బీమా కల్పించాని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులకు గౌరవ పెన్షన్ కర్నాటక రూ.15వేలు, హర్యాణా, రూ.15వేలు, తమిళనాడు రూ.8వేలు, యూపీ రూ.8వేలు, మహారాష్ట్ర - రూ.10వేలు, మణిపూర్ రూ.10వేలు, పంజాబ్ రూ.12వేలు, అస్సాం రూ.8వేలు, గోవా రూ.8,500, కేరళ రూ.6వేలు నెలనెలా ఫించన్ ఇస్తున్నట్లు వివరించారు. సమావేశంలో జి.చంద్రశేఖర్, ఆజాద్, స్వాతి, మారుతీ మోహన్ తదితరులు మాట్లాడారు. అనంతరం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్దకు వెళ్లి వెటరన్ జర్నలిస్టులకు పెన్షన్ మంజూరు చేయమని కోరుతూ ఒక వినతి పత్రం ఇచ్చారు.
ఏపీ వెటరన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గం
విజయవాడ ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన ఏపీ వెటరన్ జర్నలిస్ట్ యూనియన్ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తిరుపతికి చెందిన టి.జనార్దన్ అధ్యక్షులుగా, గుంటూరుకు చెందిన గుంటూరు చంద్రశేఖర్ జనరల్ సెక్రటరీ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా తిరుపతికి చెందిన నరేంద్రరెడ్డి, అమరావతికి చెందిన జి.రామారావు, అనంతపురానికి చెందిన ఆజాద్, విజయవాడకు చెందిన కె.వెంకటరత్నం ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శులుగా అనంతపురానికి చెందిన వి.చంద్రశేఖర్, విజయవాడకు చెందిన స్వాతి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా పట్నాయక్(శ్రీకాకుళం), జియన్ రావు(అమలాపురం), ఎల్ ప్రసాద్(గుడివాడ), గణపతిరావు(విజయవాడ), జయరామిరెడ్ఢి(సత్యసాయి జిల్లా), శివరాంజనేయులు(అనంతపురం), తిమ్మప్ప (సత్యసాయి జిల్లా), మారుతీ మోహన్(అనంతపురం), సిహెచ్ వీఎన్ శర్మ( విజయవాడ), వేగి రామచంద్రరావు(విశాఖ) కోశాధికారిగా యం. వి.రామారావు ఎన్నికయ్యారు.
No comments:
Post a Comment