రెండున్నర గంటలు ప్రేక్షకులను కట్టిపడేసిన నాటకం
స్టేజీ నాటకానికి ఆధునిక హంగులు అద్దారు. నాటకంను ప్రదర్శించే తీరులో నూతన పోకడలకు ప్రాధాన్యత ఇచ్చారు. రికార్డ్ చేసిన నాటకాన్ని 30 మంది కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. భాష, భావం, సంగీతం, నృత్యాలతో బౌద్ధాన్ని స్టేజీపై ఆవిష్కరించారు. ఎలక్ట్రానిక్ మీడియా ఆవహించిన ఈ రోజుల్లో వందల మంది ప్రేక్షకులను కదలకుండా రెండున్నర గంటలు కట్టిపడేసింది. నాటకాన్ని చూసినవారందరికీ ఓ కొత్త అనుభూతిని కలిగించింది. అదే ‘బుద్ధునితో నా(అంబేద్కర్) ప్రయాణం’ అనే నృత్యరూప నాటకం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన బుద్ధుడు ఆయన ధర్మం పుస్తకం ఆధారంగా ఈ నాటకాన్ని రాశారు. ఆ నాటి సామాజిక పరిస్థితులను, గౌతముడు బుద్ధుడిగా మారిన తీరు, బుద్ధుని బోధనల సారంతో బౌద్ధం-అంబేద్కరిజంని ఆవిష్కరించారు. బౌద్ధానికి, బుద్ధునికి, జీవితానికి సంబంధించిన అనేక ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు లభిస్తాయి. అంబేద్కర్ కలిగిన సందేహాలు ఎలా నివృత్తి అయ్యాయో, మనకి కూడా నివృత్తి అవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జ్ఞనోదయం అవుతుంది. ఇక ఆచరించడం అనేది మనపైనే ఆధారపడి ఉంటుంది. అతి సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో ఎక్కవ భాగం వాడుక భాషలో ఈ దృశ్యరూపకాన్ని అద్వితీయంగా రూపొందించారు. కొన్ని దృశ్యాలు చాలా ప్రత్యేకంగా ప్రదర్శించారు. వాటిలో గౌతముడు బుద్ధుడిగా మారిన సన్నివేశం చూపరులను బాగా ఆకట్టుకుంది. వేదికపై ఒకేసారి మూడు సన్నివేశాలు కనిపిస్తాయి. రికార్డ్ చేసిన నాటకం అయినా, ప్రేక్షకులు గమనించలేనంగా నటీనటులు అందరూ పెదాల కదలికను ప్రదర్శించారు. రికార్డ్ చేసిన నాటకం అయినందునే నిర్ణయించిన ప్రకారం 2.20 గంటలకు ముగుస్తుంది.
బుద్ధుడి పాత్రధారి చాలా అందంగా ఉన్నారు. చక్కటి ముఖవర్చస్సు. బుద్ధుడిలోని ఆ శాంతం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, నడక, నమ్రత, స్థిత ప్రజ్ఞత, మరణాన్ని జయించిన తేజస్సు ఆ నటుడిలో మూర్తీభవించింది. ఆయన మాటతీరు, అభినయం అద్వితీయం. నాటకం ఆద్యంతం, స్టేజీపై లైట్లు ఆఫ్ చేసిన సమయంలో కూడా ఆ నటుడి నటన ఒకేతీరుగా ఉండటం ప్రత్యేకం. అంబేద్కర్ పాత్రధారి కూడా చాలా చక్కగా నటించారు. ఆయన నడవడి, మాటతీరు, సందేహాలు వ్యక్తం చేసే విధానం బాగా ఆకట్టుకున్నాయి. బుద్ధుడు, అంబేద్కర్ ఇద్దరి వస్త్రధారణ బాగుంది. నాటకం మొత్తాన్ని మోసిన ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు మొత్తం ఆరుగురు నృత్య కార్మికులు, శ్రామికులు, కళాకారుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారు నాటకం మొత్తం శ్రమించారు. వారు అలుపెరుగకుండా, చెమటలు కక్కుతూ, ప్రేక్షకుల ఆసక్తి తగ్గకుండా నృత్యం చేశారు. కథంగా వారే నడిపారు. దాదాపు రెండు గంటలు వారు నృత్యం చేయడంతోపాటు వివిధ రకాల పాత్రలు కూడా పోషించడం విశేషం.
మైనస్ పాయింట్లు
నాటకం ఇతివృత్తం, ప్రదర్శన తీరు ఎంత అద్బుతంగా ఉన్నప్పటికీ క్లైమాక్స్‌లో హిందు మతాన్ని విమర్శించడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. మతం ఏదైనా(ఏదైనా) మత్తు మందులాంటిదే. అందులో సందేహంలేదు. అలాంటప్పుడు ఒక్క హిందు మతాన్నే విమర్శించడం సరైన ఆలోచన కాదని నాకు అనిపించింది. అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్నే ఎందుకు స్వీకరించారు.? అది మరో అంశం. అంబేద్కరిస్టులలో అత్యధిక మంది క్రైస్తవులు లేక ఆ మతానికి చెందిన కుటుంబాల నుంచి వచ్చినవారే. ఇది మరో పెద్ద అంశం. వాటిజోలికి నేను వెళ్లడంలేదు. సమాజానికి ఎంతో ఉత్తమమైన, విలువైన సందేశాలను అందించిన, బుద్ధుని బోధనలను అత్యంత ఆసక్తికరంగా చూపించి, వినిపించి, చివరకు హిందు మతాన్ని విమర్శించిన తీరు అసలు బాగోలేదు. ఉత్తమ బోధనలతో శిఖర స్థాయికి వెళ్లిన ఆలోచనలు చివరి అయిదు నిమిషాలలో ఒక్కసారిగా దిగజారినట్లనిపించింది. ఈ సమాజానికి ఈ నాటకం అవసరం చాలా ఉంది. బౌద్ధం, అంబేద్కర్ భావజాలంతోపాటు ప్రపంచ మానవ జాతికి కావలసిన అనేక అంశాలను అత్యంత సులువుగా అర్థం చేసుకునే విధంగా నాటకంని ప్రదర్శించారు. అందువల్ల, నాటక రచయిత, ప్రదర్శకులు ఈ విషయాన్ని తప్పక ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇక ముందు ముందు ప్రదర్శనలలో మార్పులు చేస్తే మంచిదని నా అభిప్రాయం. నాటకంలో భాష 90 శాతం వ్యవహారికమే వాడారు. ఓ పది శాతం మాత్రం గ్రాంథికం వాడారు. దానిని కూడా వ్యవహారికంలోకి మార్చవలసిన అవసరం ఉందనిపించింది.
విజయవాడ మొగల్రాజ్ పురం సిద్దార్థ కాలేజీ ఆడిటోరియంలో జూలై 22 మంగళవారం రాత్రి బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్ధ కళాపీఠం, కామ్రేడ్ జీఆర్‌కే - పోలవరపు సాంస్కృతిక సమితి వారి సంయుక్త సహకారంతో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు ఈ నాటకాన్ని ప్రదర్శించారు. వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా వందల మంది నాటకం చూసేందుకు వచ్చారు. వారిలో కమ్యూనిస్టు పార్టీలకు చెందిన వారితోపాటు ప్రగతిశీలవాదులు, ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు. కదలకుండా కూర్చొని చూశారు. ఓ నాటకం పట్ల ప్రజలు ఇంతటి ఆసక్తికనపరచడం, వారి ఆలోచనల స్థాయికి తగ్గకుండా నాటకాన్ని ప్రదర్శించడం గమనార్హం.సంతోషం.
మరో మైనస్ పాయింట్
ముందుగా ప్రకటించిన ప్రకారం నాటకంని ప్రారంభించలేదు. గంట ఆలస్యంగా నాటకాన్ని మొదలు పెట్టారు. నా దృష్టిలో ఇది క్షమార్హం కాదు. ఎందుకో వివరిస్తాను. బుద్ధుడు - అంబేద్కర్ లను ఉన్నతమైన వ్యక్తులుగా ప్రపంచం గుర్తించింది. తెలుగు నేలపై సామాజిక, రాజకీయ, తాత్విక కోణాలను స్పృశిస్తూ, వారిద్దరి గురించి, వాళ్ళు సమాజం కోసం పడిన తపన గురించి, సమాజానికి వారు చూపించిన సార్వకాలికమైన సత్యాలను, వారి జీవితాల్లో జరిగిన పలు సంఘటనలను సంగీత, సాహిత్య సమ్మేళనంతో నిండిన గొప్ప కళారూపంగా, అత్యంత ఆధునిక సాంకేతిక, సౌండ్ అండ్ లైటింగ్ విధానాలతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసే విధంగా నాటకంని ప్రదర్శిస్తున్నట్లు రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా ప్రచారం చేశారు. చేస్తున్నారు. ప్రదర్శిస్తున్నారు. బౌద్ధులు, బౌద్దాభిమానులు, అంబేద్కరిస్టులు, వామపక్ష వాదులు, అభ్యుదయ వాదులు, సామాజిక మార్పును కాంక్షించే ప్రగతిశీలు అందరినీ ఈ నాటకం పేరుతో కూడకడుతున్నారు. ఇది చాలా మంచి పరిణాం. ఇప్పటికే రెండు రాష్ట్రాలలో మంచి గుర్తింపు పొందారు. దానిని దృష్టిలో పెట్టుకుని దూర ప్రాంతాల నుంచి కార్లు, బస్సులు, టూవీలర్ల పై వందల సంఖ్యలో ప్రేక్షకులు వచ్చారు. సమాజంలో ఓ విప్లవాత్మకమైన మార్పు రావాలన్న దసాశయంతో ఈ నాటకంని ప్రదర్శిస్తున్నారు. అందువల్ల ఒక్క క్షణం కూడా ఆలస్యం జరగకుండా సమయపాలన పాటించవలసిన అవసరం నిర్వాహకులకు ఉంది.
-శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914