‘మంగళగిరి 2.0’ పుస్తక సమీక్ష
చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, చేనేత, స్వర్ణకార వృత్తుల పరంగా, రాజకీయంగా, సామాజికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన పట్టణం గుంటూరు జిల్లాలోని మంగళగిరి. విజయనగర సామ్రాజ్యంలోనే మంగళగిరి ఓ పట్టణంగా గుర్తింపు పొందింది. వినియోగదారుల ఉద్యమకారుడు, విశ్రాంత రైల్వే ఉద్యోగి, న్యాయవాది మాదిరాజు గోవర్థన రావు తను పుట్టిపెరిగిన ఊరిపై ఉన్న అభిమానంతో 70 ఏళ్ల వయసులో ఎన్నో గ్రంథాలను అధ్యయనం చేసి, చరిత్రకారులను కలిసి సుదీర్ఘ పరిశోధన చేసి ‘మంగళగిరి 2.0’ పుస్తకం రాశారు. తన ఊరనే మమకారంతో పూనుకోవడం వల్లే ఇది సాధ్యమైంది. 36 పుస్తకాలు రాసిన అనుభవం ఉండటం వల్ల అన్ని అంశాలను సమగ్రంగా రాశారు. మంగళగిరి అంటే సాధారణంగా అందరికీ గుర్తుకు వచ్చేవి చేనేత, బంగారు వస్తువుల తయారీ, శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, 11 అంతస్తుల ఆలయ గాలిగోపురం, కొండ శిఖరాన గండాలయ దీపం... వాటన్నిటి గురించి ఫొటోలతో సహా వివరంగా రాశారు. చేనేత, బంగారు వృత్తుల పరంగా మంగళగిరి ఓ నైపుణ్యాల గని. చేనేత వస్త్రాలకు, బంగారు నగల తయారీకి మంగళగిరి ఎంత ప్రసిద్ధి చెందిందో, ఆధ్యాత్మికంగా శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి కూడా చారిత్రకంగా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మంగళగిరి చేనేత వస్త్రాలు దేశవిదేశాలకు ఎలా ఎగుమతి అవుతాయో, దేశ విదేశీ భక్తులు అలా శ్రీలక్ష్మీనరసింహ స్వామిని, పానకాల స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడి వస్తుంటారు. ఆ విధంగా పర్యాట కేంద్రంగా కూడా మంగళగిరి ప్రసిద్ధి చెందింది. అత్యంత సన్నని పోగు(దారం)లకు రంగులు అద్దడానికి, పడుగులు తయారు చేయడానికి, వివిధ రకాల వస్త్రాలను చేతితో నేయడానికి ఎంతో నైపుణ్యత కావాలి. అలాగే, వివిధ రకాల బంగారు ఆభరణాలను మెరుపులతో ఆకర్షణీయంగా తయారు చేయడానికి ఆ రంగంలో అత్యంత నిపుణులై ఉండాలి. ఈ రకమైన నైపుణ్యం గల కళాకారులు చేనేత రంగంలో గానీ, స్వర్ణకార వృత్తిలో గానీ మంగళగిరిలో దాదాపు 25వేల మందికి పైగా ఉన్నారు. అందువల్లే ప్రభుత్వం ఇక్కడ చేనేత, గోల్డ్ హబ్‌లు ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఇక్కడ చేనేత కార్మికులు అన్నా, స్వర్ణకారులు అన్నా అత్యధిక మంది పద్మశాలీ సామాజిక వర్గానికి చెందినవారే ఉంటారు. ముస్లింలు, వైశ్యులు, యాదవులు, మాదిగలు, మాలలు కూడా గణనీయంగా ఉన్నప్పటికీ అత్యధిక మంది పద్మశాలీ సామాజిక వర్గం వారే ఉంటారు. అయితే, పూర్వ కాలంలో కుబేరులుగా వైశ్య సామాజిక వర్గానికి చెందిన ‘పారేపల్లి’వారు ఉండేవారు. సహజంగా వ్యాపార రంగంలో వారిదే పైచేయిగా ఉంటుంది. చేనేత రంగానికి ప్రసిద్ధి చెందిన ఈ నగరంలో 1970 దశకంలో దాదాపు 10 వేల మగ్గాలు ఉండేవి. ప్రతి వీధిలోనూ మగ్గాలు ఉండేవి. కాల క్రమంలో పవర్ లూమ్ పోటీకి చేనేత రంగం తట్టుకుని నిలబడటం కష్టమైపోయింది. ఈ నేపథ్యంలో చేనేత కార్మిక కుటుంబాలు స్వర్ణకార వృత్తివైపు మళ్లారు. దాంతో వారు ఆర్థికంగా కూడ నిలదొక్కుకున్నారు. దాదాపు 15 వేల మంది బంగారపు పనివారు ఇక్కడ ఉన్నారు. చేనేత, స్వర్ణకార వృత్తిలో నిపుణులతోపాటు రచయితలు, విద్య, క్రీడలు, శాస్త్రసాంకేతిక రంగాలలో కూడా అత్యంత ప్రావీణ్యత కలిగినవారు ఉన్నారు. అలాగే, ఆది నుంచి వ్యాపారం, విద్య సంస్థలు ... తదితరాలతోపాటు సినిమా ధియేటర్లు కూడా ఈ సామాజిక వర్గం ఆధీనంలోనే ఉన్నాయి.
రాజకీయంగా కూడా పద్మశాలీ సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ. మంగళగిరికి చెందిన గోలి వీరాంజనేయులు, మురుగుడు హనుమంతరావు రెండుసార్లు, కాండ్రు కమల శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. హనుమంతరావు మంత్రిగా ఆప్కో చైర్మన్ కూడా చేశారు. దామర్ల రమాకాంత రావు, మురుగుడు హనుమంతరావు శాసనమండలి సభ్యులుగా ఎన్నికయ్యారు. మంగళగిరి శాసనసభా నియోజకవర్గం కలిసిన తెనాలి లోక్ సభ స్థానం నుంచి కూడా ఒకసారి పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన ఊర్వశి బూదాటి శారద గెలిచారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా మంగళగిరి నుంచి దామర్ల రమాకాంత రావు, కాండ్రు కమల, తమ్మిశెట్టి జానకీదేవి నియమితులయ్యారు. వీరు ముగ్గురూ ఆ సామాజిక వర్గం వారే. మంగళగిరి మునిసిపల్ చైర్మన్లు అందరూ కూడా చేనేత సామాజిక వర్గాలకు చెందినవారే గెలిచారు.
ఒక రకంగా మంగళగిరి చరిత్ర అంటే ఆ సామాజిక వర్గంతో ముడిపడి ఉంటుంది. చివరికి దేవుడి సంబరాలు కూడా వారితోనే ముడిపడి ఉంటాయి. 1915లో తమ హక్కులకు ఆటంకం కలిగినప్పుడు పద్మశాలీయులు కోర్టు వెళ్లి తమ హక్కలను సాధించుకున్నారు. పద్మశాలీయులు ‘సిరికి పుట్టింటి వారు-హరికి అత్తింటివారు’ అనేది ఆనవాయితీగా వస్తున్న ఆచారం. అలాగే, స్థానిక పద్మశాలీయులు దేవాలయంలో స్వామివారి కళ్యాణం సందర్భంగా మెట్టెలు, మంగళసూత్రాలు, తలంబ్రాలు, మధుపర్కాలు, ఉత్తర జందెం సమర్పించే ఆచారం కొనసాగుతోంది. అప్పటి దేవస్థానం ధర్మకర్త ఆ ఆనవాయితీకి విరుద్ధంగా వ్యవహరించారు. దాంతో, ఈ అంశం కోర్టు వరకు వెళ్లింది. అప్పటి మంగళగిరి దేవస్థాన ఆచార్యులు శ్రీకందాళ రంగాచార్యులు గుంటూరు అడిషనల్ జిల్లా మున్సిఫ్ కోర్టులో పద్మశాలీయులకు మద్దతుగా పురాణేతిహాసాల సారాంశాన్ని న్యాయమూర్తికి వివరించారు. ఆ వాదనలను అంగీకరించిన కోర్టు పద్మశాలీయులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి ఎటువంటి వివాదంలేకుండా ఆ ఆచారం అలాగే కొనసాగుతోంది. ఈ అంశాన్ని రచయిత చారిత్రక ఆధారాలు, కోర్టు తీర్పులతో సహా ఈ పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నారు.
చరిత్రకు అందినప్పటి నుంచి పరిశీలిస్తే, శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, ఆనంద గోత్రజులు, విష్ణుకుండినులు,చాళుక్యులు, విజయనగర సామ్రాజ్యం, గోల్కొండ కుతుబ్ షాహీలు, ఫ్రెంచ్ వారు, ఆంగ్లేయుల పాలన కింద మంగళగిరి ఉండేది. 1950-58 మధ్య కాలంలో మంగళగిరి ప్రాంతం మిద్దె హద్దుగా ఇద్దరి పరిపాలనలో కొనసాగింది. చెన్నై-కోల్‌కత 16వ నెంబర్ జాతీయ రహదారిపై గుంటూరు-విజయవాడ నగరాల మధ్యన ఉన్న మంగళగిరి చారిత్రకంగా కూడా ప్రసిద్ధి చెందిన నగరం. విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఇక్కడి నుంచే వలస వెళ్లారు. విజయనగర రాజుల కాలంలోనే మంగళగిరిని పట్టణంగా పరిగణించేవారు. రాష్ట్రంలో అత్యంత ఎత్తయిన 157 అడుగులు, 11 అంతస్తుల శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి గాలిగోపురాన్ని 1807-09 కాలంలో అప్పటి ధరణికోట ప్రాంత జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు నిర్మించారు. తిరునాళ రథంపై గాంధీజీ ఫొటో వివాదం జరిగింది. క్రైస్తవం స్వీకరించిన మొదటి బ్రాహ్మణుడు మంగళగిరి వాడే. స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత కూడా ఇది రాజకీయ చైతన్యం కలిగినటువంటి గడ్డ. మొదట్లో ఇక్కడ కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువ. కాల క్రమంలో కమ్యూనిస్టులు ఇక్కడ మసకబారిపోయారు. మంగళగిరి ప్రజలు రాజకీయంగా ఎంత చైతన్యవంతులు అయినప్పటికీ, ఎన్ని విభేదాలు, గ్రూపులు ఉన్నప్పటికీ ఘర్షణలకు దిగేవారు కాదు. మహానటుడు ఎన్టీఆర్ ఇక్కడ ఉద్యోగం చేస్తే, ఆయన మనవడు నారా లోకేష్ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఆరితేరిన రాజకీయ నేతగా ఎదుగుతున్నారు. లోకేష్ 2019 ఎన్నికల్లో ఓడి, 2024 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో రికార్డు సృష్టించారు. పచారి షాపులో గుమస్తాగా పనిచేస్తూ చదువుకున్న శిరందాసు లక్ష్మీనారాయణ ఐఏఎస్ అధికారి అయ్యారు. పడుగులు చేస్తూ చదువుకున్న ఉడతా వెంకట బసవరావు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి తొలినాళ్లలో పాఠశాల విద్యను ఇక్కడే అభ్యసించారు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఎయిమ్స్ ఆస్పత్రిని ఇక్కడే నిర్మించారు. పైన రాసిన ప్రతి అంశాన్ని రచయిత గోవర్థన రావు దాదాపు ఏడాదిన్నరపాటు వివిధ గ్రంథాలను చదివి, చరిత్రకారులను కలిసి, చరిత్ర, శాసనాధారలతో ఈ పుస్తకం రాశారు. గ్రామ పంచాయతీ నుంచి పంచాయతీ, ఫిర్కా, సమతి(సమితి), తాలూకా, మండలం, నియోజకవర్గం, పురపాలక సంఘం, కార్పోరేషన్ వరకు మంగళగిరి ఎదిగిన క్రమాన్ని ఎంతో చక్కగా వివరించారు. మంగళగిరి చేనేత కేంద్రంగా ఎలా ఎదిగిది? నిజాం బోర్డ్ చీర అంటే ఏమిటి? మంగళూరులో కట్టవలసిన రైల్వే స్టేషన్ మంగళగిరిలో ఎలా కట్టారు? పవర్ లిఫ్టింగ్ కేంద్రంగా ఎలా ఎదిగింది?.. వంటి విషయాలను ఇందులో చాలా పొందుపరిచారు. 544 పేజీల ఈ పుస్తకంలో ఎన్నో ప్రత్యేకతలతోపాటు వింతలు, విశేషాలు, ఆసక్తికర అంశాలు చాలా ఉన్నాయి. ఇది మంగళగిరి చరిత్రే అయినా, దీనిని చదువుతుంటే, కాలానుగుణంగా తమ తమ గ్రామాలలో జరిగిన మార్పులు గుర్తుకు వస్తాయి. ఈ పుస్తకాన్ని ఇటీవలే మంగళగిరి శాసనసభ్యులు, విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు.
ఈ పుస్తకం ధర: రూ.490
కాపీలకు ఫోన్: 9440264336
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914
No comments:
Post a Comment