May 15, 2025

పిట్టల దొరగా గంజి వెంకయ్య


పిట్టల దొర వేషం వేయడంలో మంగళగిరిలో  గంజి వెంకయ్య( గంజి చిరంజీవి తండ్రి) గారు టాప్.  మా ఇంటి ఎదరే వారు ఉండేవారు. నేను మామయ్య అనేవాడిని.    ఆయన ఆ వేషంలో మాటలు చెప్పడం నేను ఒకటి రెండుసార్లు మాత్రమే చూశాను.  ఆయన పక్కా సీపీఐ.  ప్రజానాట్యమండలి కళాకారులు.   తర్వాత తర్వాత ఆయన రెండు మగ్గాల షెడ్లకు మేస్త్రిగా, ఆ తర్వాత వస్త్ర వ్యాపారంలో బిజీ అయిపోవడంతో  ఆ కళకు పూర్తిగా దూరమైపోయారు.  పిట్లల దొరగా ఆయన ఏం చెబుతారో రాసుకుందామని, దానిని రికార్డు చేయాలని దీపాల సాయిబాబా చాలా ప్రయత్నించారు. దీపాల సాయిబాబా అంటే ఒకప్పుడు గంజి వెంకయ్యగారి బిల్డింగ్(మగ్గాల షెడ్)లో నేత నేసేవారు. భార్గవపేటలో ఉండేవారు.  ఆ తర్వాత ఆయన నేతాజీ హోటల్, తర్వాత అదే  ఉడిపి హోటల్ వద్ద కిల్లీ షాపు నడిపారు. వయసులో పెద్ద అయినా, నాకు మంచి మిత్రులు. గంజి వెంకయ్య గారి వద్దకు ఓ రోజు టేప్ రికార్డర్ తీసుకుని సాయిబాబా , నేను వెళ్లాం.  పిట్టల దొరగా ఏం చెబుతారో చెప్పమని సాయిబాబా అడిగారు.   ‘‘విడిగా చెప్పలేను. ఫ్లోలో చెప్పుకుంటూ పోతాను. రికార్డు చేసుకో’’ అని చెప్పారు. అప్పటికే ఆయనకు చాలా కాలం గ్యాప్ వచ్చింది. మధ్యమధ్యలో ఆపుకుంటూ, గుర్తు తెచ్చుకుంటూ చాలా సేపు చెప్పినట్లు గుర్తు. అప్పుడు రికార్డు చేశారు. అది ఉందో లేదో తెలియదు. పిట్టల దొర వేషంలో ఆయన చెప్పడం చాలా సరదాగా ఉండేది. నవ్వు ఆపుకోలేకపోయేవారం. స్థానిక సమస్యల నుంచి అంతర్జాతీయ సమస్య వరకు అన్నిటికి పరిష్కారాలు చెప్పేవారు. ఆయన కమ్యూనిస్టు అయినందున రష్యా, అమెరికాతో సహా చాలా విషయాలు ప్రస్తావించేవారు.  ఆయన చెప్పే తీరు, ఆయన భాషా శైలి కూడా నవ్వు తెప్పించేవిధంగా ఉండేది.  మంగళగిరి బుద్ధవిహార్ అధ్యక్షులు రేఖా క‌ృష్ణార్జున రావు గారు వాట్సాప్ గ్రూపులో  ఓ పిట్టల దొర ఈ ఫొటో పెట్టడంతో  నాకు మా గంజి వెంకయ్య మామ గుర్తుకు వచ్చారు.      ఇటువంటి కళలను ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, కళా సంస్థలు రికార్డ్ చేయాలని,  ఆ తర్వాత నాకు అనిపించింది.

క‌ృష్ణార్జున రావు గారు పెట్టిన ఫొటో 



No comments:

Post a Comment

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...