May 2, 2025

ఎడిటోరియల్ పేజీ వ్యాస రచయితలకు గౌరవం

ఏపీ ఫెరా మాజీ చైర్మన్ డాక్టర్ రామనాధ్ వెలమాటి, ఎన్ఆర్ఐ శేషుల నుంచి మొమోంటో అందుకుంటున్న సీనియర్ జర్నలిస్ట్ శిరందాసు నాగార్జున రావు. పక్కన వరుసగా రేపటి కోసం ఎడిటర్ శాఖమూరి శివప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ మిక్కిలినేని శ్రీకాంత్, కాలం రైటర్ బొల్లాప్రగడ శ్రీదేవి.
-----------------------------------------------------------------------------------------------------------------

మేడే సాయంత్రం గుంటూరు LVR Club Convention Hallలో ‘రేపటి కోసం’ దినపత్రిక 7వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిధులు, వారి విలేకరులతోపాటు ఆ పత్రిక ఎడిటోరియల్ పేజీకి వ్యాసాలు రాసిన వారికి కూడా  మొమోంటోలు ఇచ్చి గౌరవించారు.  అదీ ఈ వార్షికోత్సవ ప్రత్యేకత.   ఈ వార్షికోత్సవంలో ముఖ్య అతిధులుగా మాజీ మంత్రి, శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర, శాసనసభ్యురాలు గల్లా మాధవి, ఏపీ ఫెరా మాజీ చైర్మన్ డాక్టర్ రామనాధ్ వెలమాటి, లెడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాల రావు,ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, ఎన్ఆర్ఐ శేషు హాజరయ్యారు. 

నా మొదటి వ్యాసం 1984లో తెలుగు విద్యార్థి మాస పత్రికలో అచ్చయింది. అప్పుడు వారు ఆ పత్రిక కాపీని మా ఇంటికి పోస్ట్ చేశారు. అదే ఏడాది నేను రాసిన మరో వ్యాసం ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ పేజీలో వచ్చింది.  వారు రూ.50 రూపాయలు ఎంఓ చేశారు. అలా కొందరు ఎంతోకొంత ఇచ్చేవారు. సాక్షి పెట్టిన కొత్తలో చాలా కాలం వ్యాసానికి రెండు వేల రూపాయలు ఇచ్చేవారు. ఇటీవల కాలంలో ఆ సాంప్రదాయం అంతా పోయింది.   ఒక్క ఈనాడు మాత్రమే అలా ఇస్తున్నట్లుంది.  నేను ఈనాడు తప్ప దాదాపు అన్ని పత్రికల ఎడిటోరియల్ పేజీలకు వ్యాసాలు రాస్తుంటాను. డబ్బు ఎవ్వరూ ఇవ్వడంలేదు. సూర్య వారు  కేవీఎస్ సుబ్రహ్మణ్యం గారు బాధ్యులుగా ఉన్నప్పుడు మాత్రం డబ్బు పంపారు. ఇటీవల కాలంలో విశాలాంధ్ర వారు వ్యాసం ప్రచురించిన కాపీని పోస్టులో పంపేవారు.  ఇలాంటి పరిస్థితుల్లో ‘రేపటి కోసం’ యాజమాన్యం వారు వ్యాసాలు రాసిన వారిని పిలిచి మరీ గౌరవించడం సంతోషంగా ఉంది. వ్యాస రచయితలను కూడా గౌరవించినందుకు ధన్యవాదాలు.  


ఈ పత్రికతో నాకు చాలా కాలం నుంచి అనుబంధం ఉంది. దీనిని రిటైర్డ్ డీఎస్పీ బొప్పన విజయకుమార్ గారు దీనిని మాస పత్రికగా ప్రారంభించారు. దీనిని చాలా కాలం కమిలిశ్రీ గారు చూసేవారు. వీరిద్దరూ నాకు మంచి మిత్రులే.   అప్పట్లో విజయకుమార్ గారు అడిగితే,  ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తారు? దాని వల్ల కలిగే ప్రయోజనాలు, ఆ హోదా కలిగిన రాష్ట్రాలకు సంబంధించి అధ్యయనం చేసి వరసగా కొన్ని వ్యాసాలు రాసి ఇచ్చాను. ప్రచురించారు.  విజయకుమార్ గారి ఆరోగ్యం దెబ్బతినడంతో  మిక్కిలినేని శ్రీకాంత్ గారు దానిని ఏడాది నుంచి పెద్ద ఎత్తున దినపత్రికగా తీసుకువస్తున్నారు. డిజటల్ ఎడిషన్‌తోపాటు  దాదాపు ఏడు జిల్లాల్లో ఇది ప్రింట్ ఎడిషన్‌గా కూడా వస్తోంది. ఇప్పుడు దీనికి ఎడిటర్ శాఖమూరి శివప్రసాద్ గారు, మరో బాధ్యులుగా గుంటూరు చంద్రశేఖర్‌గారు ఉన్నారు. వీరితోపాటు ఆ పత్రిక బ్యూరో చీఫ్ మల్లికార్జున రావు గారు, సచివాలయ రిపోర్టర్ మల్లికార్జున తదితరులు కూడా నాకు మంచి మిత్రులే. చంద్రశేఖర్‌ గారు నాకంటే చాలా సీనియర్.నేను విశాఖ సిటీ డెస్క్ ఇన్ చార్జిగా చేసే సమయంలో ఆయన ఎడిషన్ ఇన్ చార్జిగా ఉండేవారు. 

                                                                                                       - శిరందాసు నాగార్జున

No comments:

Post a Comment

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...