May 12, 2025

మంగళగిరిలోనే చేనేత, గోల్డ్ హబ్‌‌లు ఎందుకు?

మంగళగిరి 2.0 పుస్తక సమీక్ష


గుంటూరు జిల్లా మంగళగిరి గురించి మనం తెలుసుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి. మంగళగిరి అంటే  చేనేత పరిశ్రమ, బంగారు ఆభరణాలు, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, ఎత్తయిన గాలిగోపురం, తిరునాళ, కొండపైన పానకాల స్వామి, కొండ శిఖరాన గండాలయ దీపం.. అనేకం  గుర్తుకు వస్తాయి. క్రీస్తు పూర్వం 225 నాటికే ఉనికిలో ఉన్నట్లు ఆధారాలు ఉన్న  చారిత్రక ప్రసిద్ధిగాంచిన పట్టణం ఇది. ఆంధ్ర శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, ఆనందగోత్రిజులు,  విష్ణు కుండినులు, చాళుక్యులు, కాకతీయులు, ఢిల్లీ సుల్తానులు, రెడ్డి రాజులు, గజపతులు, శ్రీ కృష్ణదేవ రాయలు, కుతుబ్‌షాహీలు, ఆ తరువాత ఫ్రెంచ్, నిజాం, బ్రిటీష్ వారి పాలనలో మంగళగిరి ప్రాంతం ఉంది.  రాష్ట్రంలో అత్యంత ఎత్తయిన 157 అడుగులు, 11 అంతస్తుల శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయ గాలిగోపురాన్ని 1807-09 కాలంలో అప్పటి  ధరణికోట  జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు  నిర్మించారు. ధరణికోట జమిందారు మంగళగిరిలో ఇంత పెద్ద గాలిగోపురం కట్టడం ఏమిటి? ఇది మంగళగిరికి ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఇటువంటి మంగళగిరి చరిత్రని 36 రచనలు చేసిన, చేయితిరిగిన రచయిత, న్యాయవాది  మాదిరాజు గోవర్థన రావు  సుదీర్ఘ పరిశోధన చేసి ఎన్నో అంశాలను కూలంకషంగా వివరిస్తూ ‘మంగళగిరి 2.0’ అనే పేరుతో పుస్తకం రాశారు. ఇటీవలే ఈ పుస్తకాన్ని విద్య, ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ఇందులో మంగళగిరి గురించి చారిత్రకంగా, రాజకీయంగా, సామాజికంగా అనేక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. చెన్నై-కోల్‌కత 16వ నెంబర్ జాతీయ రహదారిపైన గుంటూరు-విజయవాడ నగరాల మధ్యన ఉన్న ఓ గ్రామం కాల క్రమంలో నగరంగా ఎదిగిన క్రమాన్ని రచయిత చాలా చక్కగా వివరించారు. ఇక్కడ అత్యంత నైపుణ్యం గల చేనేత కార్మికులు, చేయితిరిగిన స్వర్ణకారులు, విద్యావంతులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు, క్రీడాకారులు అనేక మంది ఉన్నారు. చేనేత, దాని అనుబంధ వృత్తులు, వ్యాపారాలు, స్వర్ణకారులు ఇక్కడ 25 వేల మందికి పైగా ఉన్నారు. ఒక్క స్వర్ణకారులే 15 వేల మంది వరకు ఉంటారు. అందువల్లే ప్రభుత్వం మంగళగిరిని చేనేత, గోల్డ్ హబ్‌‌లుగా తిర్చిదిద్దుతోంది.  మంగళగిరికి సంబంధించిన  ఎన్నో చారిత్రక అంశాలను ఆధారలతోసహా రచయిత ఇందులో పొందుపరిచారు. పురాణలు, ఇతిహాసాలు, చారిత్రక గ్రంథాలను అధ్యయనం చేయడంతోపాటు చరిత్రకారులను, ఇతర అనేక మందిని కలిసి ఎంతో శ్రమించి గోవర్థన్ ఈ పుస్తకం రాశారు. పుస్తకాలకు కాలం చెల్లిందనుకుంటున్న రోజుల్లో సొంత ఊరిపై మక్కువతో ఆయన వ్యయప్రయాసలకోర్చి దీనిని తీసుకువచ్చారు.  

 

చేనేతకు ప్రసిద్ధి చెందిన నగరం అయినందున, ఆ వృత్తి, దాని అనుబంధ వృత్తులు చేసేవారందరూ పద్మశాలీ సామాజిక వర్గానికి చెందినవారే ఉంటారు. అందువల్ల మంగళగిరిలో  అత్యధిక మంది పద్మశాలీయులు, ఇతర చేనేత ఆ సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారు. ఇక్కడి విద్య సంస్థలు, వ్యాపారాలు, సినిమా హాళ్ల యాజమాన్యం... వంటివి వారి చేతిలోనే ఉంటాయి. రాజకీయాలు కూడా వారి చుట్టూనే తిరుగుతుంటాయి. ఇక్కడ నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా పద్మశాలీయులే గెలిచారు. ఇప్పటి వరకు ఇద్దరే ఎమ్మెల్సీలు అయ్యారు.  ఆ  ఇద్దరూ వారే. టీటీడీ బోర్డు సభ్యులుగా మంగళగిరి నుంచి ముగ్గురికి అవకాశం వచ్చింది. ఆ ముగ్గురూ పద్మశాలీయులే. మునిసిపల్ చైర్మన్లు కూడా అందరూ చేనేత వర్గంవారే. రచయితలు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు.. కూడా వారే ఎక్కువగా ఉంటారు.  అలాగే, ఇక్కడి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణం సందర్బంగా ముఖ్యమైన తంతు వారే నిర్వహిస్తారు.  బ్రహ్మాత్సవాలలో  స్వామివారి కళ్యాణం సందర్భంగా మెట్టెలు, మంగళసూత్రాలు, తలంబ్రాలు, మధుపర్కాలు, ఉత్తర జందెం  స్థానిక పద్మశాలీయులే సమర్పించే ఆచారం అనాదిగా కొనసాగుతోంది. అయితే,  1915లో అప్పటి దేవస్థానం ధర్మకర్త ఆ ఆనవాయితీకి విరుద్ధంగా వ్యవహరిస్తే, పద్మశాలీయులు కోర్టుకు వెళ్లి తమ హక్కుని సాధించుకున్నారు. అప్పటి నుంచి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ  సాంప్రదాయం అలాగే కొనసాగుతోంది.  ఇక్కడి చేనేత కార్మికులు అత్యంత నైపుణ్యంతో  చేనేత వస్త్రాలను తయారు చేస్తారు.  మంగళగిరి చేనేత కేంద్రంగా ఎదగడం, ఇక్కడి రంగుల ప్రత్యేకతలు, చేనేత వర్గం వారే స్వర్ణకారులుగా మారిన క్రమం ఇందులో వివరించారు. అతి సన్నని దారాలతో చేనేత వస్త్రాలను తయారు చేసే ఓర్పు, నైపుణ్యం వారికి ఉన్నందున, ఆ పరిశ్రమ దెబ్బతిన్న సమయంలో అంతే ఓర్పు, నైపుణ్యంతో చేసే బంగారు వస్తువుల తయారీలో వారు బాగా రాణించారు.   మంగళగిరి రాజకీయంగా ఎంతో చైతన్యం కలిగిన నేల. ఎంతటి చైతన్యం ఉన్నా రాజకీయాలు శాంతియుతంగా నడపడం ఇక్కడి ప్రత్యేకత.  కాంగ్రెస్, జనసంఘ్, బీజేపీ, కమ్యూనీస్టులతోపాటు నాస్తిక, హేతువాద ఉద్యమాలు నడిచిన గడ్డ. ఇక్కడ ఒకప్పుడు కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువ. నాలుగు సార్లు వారే ఎమ్మెల్యేలుగా గెలిచారు.  వేములపల్లి శ్రీకృష్ణ  రెండు సార్లు గెలిచారు. విజయనగర సామ్రాజ్య వ్యవస్థాపకులైన హరిహరరాయలు, బుక్కరాయలు మంగళగిరి నుంచి వలస వెళ్లారు. మంగళగిరి కొండ, దేవాలయ విశిష్టత, ఆకలితో వచ్చిన అందరికీ 24X7-365 రోజులు భోజనం పెట్టిన  నిరతాన్నదాత్రి కైవారం బాలాంబ, మహానటుడు ఎన్టీఆర్ ఇక్కడ సబ్ రిజిస్ట్రార్‌ ఉద్యోగంలో చేరడం, ఆయన మనవడు లోకేష్  ఎమ్మెల్యేగా ఓడటం, గెలవడం, మెగాస్టార్ చిరంజీవి ఇక్కడ 2వ తరగతి  చదువుకోవడం, సీనీనటి జమున ఎన్నికలలో పోటీ చేయడం, రచయితలుగా, జర్నలిస్టులుగా కొలికపూడి బ్రదర్స్, శిరందాసు బ్రదర్స్ ఎదగడం, పూసపాటి నాగేశ్వరరావు, అందే నారాయణ స్వామి, ఏరోనాటికల్ ఇంజనీర్ నీలి రాజేంద్ర, రాయలసీమ యూనివర్సిటీ వీసీ ఉడతా వెంకట బసవ రావు వంటివారి గురించి,  మంగళగిరి రాజధానిలో భాగమైన తర్వాత ఐటీ పార్క్, ఎయిమ్స్‌ వంటివి   ఏర్పాటు కావడంతో ఏ విధంగా అభివృద్ధి చెందుతోంది... వంటి అన్ని అంశాలను ఆమూలాగ్రం  ఇందులో చోటు కల్పించారు.  మంగళగిరికి సంబంధించిన అన్ని అంశాలను 30 భాగాలు విభజించి,  544 పేజీలతో   సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో రచయిత గోవర్థన్ చక్కటి తెలుగులో  రాశారు. ఈ పుస్తకం చదివే పాఠకులకు తమ తమ గ్రామాలు అభివృద్ధి చెందిన క్రమం గుర్తుకు వస్తుంది. 


ఈ పుస్త‌కం వెల రూ.490

కాపీల‌కు ఫోన్: 9440264336

                                          - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

No comments:

Post a Comment

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...