మంగళగిరి 2.0 పుస్తక సమీక్ష
గుంటూరు జిల్లా మంగళగిరి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది చేనేత చీరలు, డ్రెస్ మెటీరియల్, శ్రీలక్ష్మీ నరశింహ స్వామితోపాటు 11 అంతస్తుల దేవాలయ గాలిగోపురం, కొండపైన పానకాల స్వామి. మంగళగిరి చరిత్రతోపాటు చేనేత పరిశ్రమ విస్తరించడానికి కారణాలు, రంగుల ప్రత్యేకత, దేవాలయ విశిష్టత, బంగారు ఆభరణాల తయారి వంటి అన్ని అంశాలతో ఈ నగరానికే చెందిన న్యాయవాది మాదిరాజు గోవర్థన రావు ‘మంగళగిరి 2.0’ అనే పుస్తకం రాశారు. ఈ రచయితే, 2004లో ‘మన మంగళగిరి’ పేరుతో 176 పేజీలు పుస్తకం రాశారు. ఇప్పుడు రాజధాని అమరావతి ముఖద్వారంగా ఉంటూ, అందులో భాగంగా ఎదిగిన మంగళగిరి గురించి సమగ్రంగా 544 పేజీలతో దీనిని రూపొందించారు.
మంగళగిరి అంటే చేనేత, చేనేత అంటే పద్మశాలీయులే. అందువల్ల ఈ పుస్తకంలో అత్యధిక మంది ప్రముఖుల పేర్లు పద్మశాలీయులవే ఉంటాయి. చేనేత పరిశ్రమ కొంత దెబ్బతిన్న సమయంలో ఆ పద్మశాలీయులే స్వర్ణకార వృత్తిని ఎంచుకున్నారు. ఇప్పుడు ఇక్కడ చేనేత కార్మికులను మించి స్వర్ణకారులు వేల సంఖ్యలో ఉన్నారు. బంగారు ఆభరణాల తయారీ పరిశ్రమ బాగా విస్తరించింది. ఇక్కడి చేనేత వస్త్రాలు దేశవిదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అలాగే, ఇక్కడ నైపుణ్యత గల స్వర్ణకారులు తయారుచేసే బంగారు ఆభరణాలు కూడా దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. అందువల్లే, ప్రభుత్వం కూడా మంగళగిరిని చేనేత హబ్, గోల్డ్ హబ్‌గా తీర్చిదిద్దే ప్రయత్నాలు మొదలుపెట్టింది. పురాణ, ఇతిహాస కాలం నుంచి సాంప్రదాయకంగా పద్మశాలీయులకు, దేవుడికి ఉన్న అనుబంధాన్ని కూడా రచయిత చారిత్రక ఆధారాలు, కోర్టు తీర్పులతో సహా ఈ పుస్తకంలో స్పష్టంగా వివరించారు. శాసనాల దగ్గర నుంచి పురాణ, చారిత్రక గ్రంథాలను పరిశీలించి, పరిశోధించి, చరిత్రకారులను కలిసి పుట్టిన ఊరిపై మమకారంతో ఎంతో శ్రమించి మంగళగిరికి సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించారు. శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, ఆనంద గోత్రజులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, విజయనగర సామ్రాజ్యం, గోల్కొండ కుతుబ్ షాహీలు, ఫ్రెంచ్ వారు, ఆంగ్లేయులు, స్వాతంత్య్రోద్యమం, మద్రాసు రాష్ట్రం, ఆంధ్రరాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌తో సహా అన్ని కాలాలలో మంగళగిరి ఎవరి పాలనలో ఎలా కొనసాగిందో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో చక్కగా వివరించారు. మంగళగిరిలో జరిగిన అనేక చారిత్రక సంఘటనలను అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అద్భుతంగా అందించారు. మంగళగిరికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. చిన్న గ్రామం నుంచి పంచాయతీ, సమితి, మండలం, తాలూకా, మునిసిపాల్టీ, నగరం వరకు మంగళగిరి ఎదిగిన తీరుని, ఆయా కాలాలలో ఇక్కడ జరిగిన అనేక ఆసక్తికర సంఘటనలను చక్కగా తెలిపారు.
విజయనగర సామ్రాజ్య స్థాపకులు హరిహరరాయలు, బుక్కరాయలు మంగళగిరి నుంచే వలస వెళ్లారు. పూర్వ కాలంలో కూడా మంగళగిరికి సమీపంలో అమరావతి, కంతేరు, విజయపురి, కొండపల్లి ప్రాంతాలు రాజధానులుగా ఉండేవి. క్రీస్తు పూర్వం 225 నాటికే ఉనికిలో ఉన్నట్లు ఆధారాలు ఉన్న చారిత్రక ప్రసిద్ధిగాంచిన పట్టణం ఇది. రాష్ట్రంలో అత్యంత ఎత్తయిన 157 అడుగులు, 11 అంతస్తుల శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి గాలిగోపురాన్ని 1807-09 కాలంలో అప్పటి ధరణికోట ప్రాంత జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు నిర్మించారు. గాలిలో ఠీవిగా నిలబడినట్లు కనిపించే ఈ గాలిగోపురం మంగళగిరి వారసత్వ సంపద. ఈ దేవాలయంలో మూలవిరాట్‌ని ద్వారప యుగంలో పాండవులు అరణ్యవాస కాలంలో ధర్మారాజు ప్రతిష్ఠించారని చెబుతాను. భారీ ఎత్తున జరిగే మంగళగిరి తిరునాళ్లకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుంది. దేశవిదేశీ యాత్రికులు ఈ ఆలయ సందర్శనకు వస్తుంటారు. నటసార్వభౌమ నందమూరి తారక రామారావు మొదట ఇక్కడే ఉద్యోగం చేశారు. మెగాస్టార్ చిరంజీవి (కొణిదెల శివప్రసాద్) ఇక్కడ కూడా చదివారు. అన్నపూర్ణగా పేరుపొందిన కైవారం బాలాంబ ఆకలితో వచ్చిన వారందరికీ భోజనం పెట్టారు. ఇక్కడి కోర్టులో ఓ జడ్జి ఒకే రోజు 111 క్రిమినల్ కేసులను పరిష్కరించి జాతీయ రికార్డు సృష్టించారు. 1972లోనే ఏపీఎస్పీ 6వ బెటాలియన్, 2018లో దక్షిణ భారతదేశంలోనే మొదటి ఎయిమ్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇలాంటి ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. ఇక్కడ మంచినీటి సమస్య వల్ల, దూరాన ఉన్న భావులలో నీరుతోడుకుని, మోసుకురావాలని ఒకప్పుడు మంగళగిరి అంటే ఆడపిల్లని ఇచ్చేవారు కాదు. లోతైన బావులలో నీరు తోడటానికి బక్కెట్‌కు కట్టే తాడు చాలా పొడవైనది వాడటం వల్ల, పొడవు గురించి చేప్పే సమయంలో ‘మంగళగిరి చాంతాడంత’ అనేవారు. చాంతాడు అంటే చేద+తాడు. ఇప్పడు ఆ సమస్యలేదులేండి. కృడష్ణానీరు వస్తోంది.
ఇక్కడ మొదటి నుంచి కాంగ్రెస్, కమ్మూనిస్టులు, బీజేపీ, జనసంఘ, తర్వాత బీజేపీ, భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం(యూసీసీఆర్‌ఐ–ఎంఎల్) పార్టీలు ఉన్నాయి. రాజకీయంగా చైతన్యవంతమైన గడ్డ ఇది. ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడ...’ అనే పాట రాసిని కమ్యూనిస్టు పోరాట యోధుడు వేములపల్లి శ్రీకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచిన నేల ఇది. ఇక్కడ ఆయా పార్టీలలో నేతల మధ్య విభేదాలు, గ్రూపులు ఉంటాయి. స్థానిక సంస్థల నుంచి లోక్ సభ వరకు ఎన్నికలలో అభ్యర్థులు పోటాపోటీగా నిలుస్తారు. అయితే, ఎవరూ హింసకు దిగరు. అదే మంగళగిరి ప్రత్యేకత. కృష్ణా జిల్లా మాన్యువల్ ప్రకటించిన గోర్డన్ మెకంజి కూడా చారిత్రకంగా యుద్ధాల మధ్య కూడా మంగళగిరిలో శాంతికి భంగం కలగకుండా ప్రశాంతత కొనసాడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంగళగిరికి సంబంధించి వివిధ అంశాలను సుదీర్ఘ పరిశోధన చేసి 30 భాగాలుగా విభజించి రచయిత రాశారు. పాలనాపరంగా, రాజకీయంగా, సామాజికంగా ఎన్నో ఆసక్తికర అంశాలు ఇందులో ఉన్నందున, మంగళగిరి వారితోపాటు ఇతరులు కూడా చదవదగిన పుస్తకం. వినియోగదారుల ఉద్యమకారుడైన విశ్రాంత రైల్వే ఉద్యోగి మాదిరాజు గోవర్థన రావు ప్రశాంతంగా జీవనం గడపవలసిన 70 ఏళ్ల వయసులో తను పుట్టిన గడ్డపై ఉన్న మక్కువతో సుదీర్ఘ పరిశోధన చేసి, పుస్తకాల చదువరులు తగ్గిన ఈ రోజుల్లో ఇంత ఖర్చుతో ఈ పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయం.
పుస్తకం పేరు : మంగళగిరి 2.0
వెల : రూ.490
కాపీలకు : 970198632
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914
No comments:
Post a Comment