May 5, 2025

బౌద్ధం విలసిల్లిన నేల

12న మంగళగిరిలో  2,569వ బుద్ధ జయంతి వేడుకలు


మానసిక ప్రశాంతత, మానవతా విలువలతో కూడిన ఉత్తమ పౌరుడిని తయారుచేయడమే బౌద్ధం ప్రధాన లక్షణం. క్రీస్తు పూర్వం 400 నుంచి 600 వరకు మంగళగిరి, అమరావతి ప్రాంతంలో బౌద్ధం విలసిల్లింది. కృష్ణానదీ తీరంలో బౌద్ధం పరిఢవిల్లింది.   పురాతన బౌద్ధ ఆరామాల ఆనవాళ్లు ఇప్పటికీ మంగళగిరి ప్రాంతం ఎర్రబాలెం కొండపై ఉన్నాయి. నిడమర్రులో బుద్ధుని విగ్రహాలు బయటపడ్డాయి. ఆరామాలు, విగ్రహాలకంటే బౌద్ధ భావజాలం ముఖ్యం. మన సమాజంలో వివిధ రూపాలలో బౌద్ధ భావజాలం అంతర్లీనంగా కొనసాగుతోంది. అందవల్లే పక్కన పల్నాడుకంటే ఈ ప్రాంతవాసులు శాంతికాముఖులుగా ఉంటారు.   ఈ ప్రాంతంలో నాస్తికులు, హేతువాదులు, కమ్యూనిస్టులు, మానవతావాదులు.. వంటి వారు కూడా బుద్ధుడి బోధనలకు ప్రాధాన్యత ఇచ్చారు. బౌద్ధం పరంగా ఈ ప్రాంత ప్రాధాన్యతను గుర్తించి  బౌద్ధ గురువు దలైలామా  2006లో అమరావతిలో పెద్ద ఎత్తున ‘కాలచక్ర’ ఉత్సవాలు నిర్వహించారు. బౌద్ధ భావజాలాన్ని ఔపోసన పట్టిన ఉత్తమ మానవుడు  రేఖా కృష్ణార్జున రావు 25 సంవత్సరాల క్రితం మంగళగిరిలో బుద్ధ విహార్‌ని ఏర్పాటు చేశారు. మంగళగిరి బుద్ధ విహార్‌ అధ్యక్షులుగా, ఆ భావజాలానికి దగ్గరగా ఉన్న వివిధ వర్గాలకు చెందిన అనేక మందిని సభ్యులుగా చేర్పించారు.  బుద్ధుని బోధనలకు విశేష ప్రాచుర్యం కల్పించారు. ఎంతో శ్రమకోర్చి, ఆర్థిక భారం భరిస్తూ ‘బుద్ధభూమి’ మాస పత్రికను దీర్ఘకాలంగా తీసుకువస్తున్నారు. మానవతా విలువలు కలిగిన శాంతియుత సమాజాన్ని సృష్టించాలన్నదే ఆ ఉత్తమ మానవుడు  కృష్ణార్జున రావు లక్ష్యం.  మంగళగిరి బుద్ధ విహార్ ఆధ్వర్యంలో బౌద్ధ అభిమానులను సమీకరించి, దేశంలోని బౌద్ధ కేంద్రాలను పర్యటిస్తుంటారు. బుద్ధ విహార్‌ ఆధ్వర్యంలో బుద్ధుని జన్మదిన వేడుకలు, బౌద్ధ బోధనలు, యోగా, బౌద్ధ భావజాలంపై అవగాహన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు.. వంటివి వందల సంఖ్యలో నిర్వహించారు.  మనవతావాది  కృష్ణార్జున రావు సారథ్యంలో బుద్ధ జయంతి(పూర్ణిమ) వేడుకలు 22 ఏళ్లపాటు ఘనంగా జరిగాయి. బౌద్ధంతోపాటు మానవ సంబంధాల విలువను ఆయన నుంచి నేర్చుకున్న అభ్యుదయ రచయిత, మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు, వేదిక ఇతర బాధ్యులు ఆ తర్వాత నుంచి బుద్ధ పూర్ణిమ వేడుకలను కొనసాగిస్తున్నారు.    రేఖా కృష్ణార్జున రావు అమూల్యమైన  సలహాలు, సూచనలు, సహాయ సహకారాలతో మానవతా వేదిక ఆధ్వర్యంలో ఈ ఏడాది  2,569వ బుద్ధ జయంతి వేడుకలు, మంగళగిరిలో బుద్ధపూర్ణిమ రజతోత్సవ వేడుకలు  ఘనంగా నిర్వహించతలపెట్టారు.  ఈ వేడుకలు ఈ నెల 12న  మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డులోని నన్నపనేని నాగేశ్వరరావుకు చెందిన రాయల్ ఏసీ మెగా ఫంక్షన్ హాలులో జరుగుతాయి. ఈ వేడుకలు నిర్వహిస్తున్న మంగళగిరి బుద్ధి విహార్, మానవతా వేదిక వారికి అభినందనలు. ఈ వేడుకలకు మానవతావాదులందరూ హాజరుకావలసిందిగా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాను. 


శిరందాసు నాగార్జున రావు, సీనియర్ జర్నలిస్ట్.


No comments:

Post a Comment

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...