May 19, 2025

మానవహక్కులు

మానవహక్కులు  అనేది ఒక దేశానికో, ఒక వర్గానికి ఒక జాతికో సంబందించిన సమస్య కాదు.మానవ హక్కులు ఉల్లంఘన అనేది మనందరికీ సంబందించిన విషయం.ప్రపంచంలో 1948 సం.లో  మానవహక్కుల రక్షణ కోసం చట్టం చేయబడినది.మన దేశంలో 1993 సంవత్సరం అమలులోకి వచ్చింది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2005 సంవత్సరం రాష్ట్ర మానవహక్కుల కమీషన్  ఏర్పడింది* . ప్రాథమిక హక్కుల ఉల్లంఘననే మానవ హక్కుల  అంటారు.

 పోలీసు వ్యవస్థ మనకి బ్రిటిషు వారి నుంచి సంక్రమించింది. మానవ హక్కులను గౌరవించాలన్న భావన పోలీసులకు లేదు. బ్రిటిష్ వారు మన స్వేచ్ఛను అణగదొక్కడనికి మాత్రమే  పోలీసు వ్యవస్థను ఉపయోగించేవారు. మన దేశంలో పోలీసు వ్యవస్థ ఇలాగే తయారయినది.

సంకెళ్ళు/బేడిలు*:-

 మనదేశంలో నిందితులకు బేడీలు వేయడం అతి మామూలు విషయం.  కానీ చట్టరీత్య నేరం. చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన వ్యక్తులు చట్టాన్ని చూసి అలాంటి చర్యలు చట్టబద్ధమైనవేనని మనలో చాలా మంది అనుకుంటారు. అలాంటిదే ముద్దాయిలకు, నేరస్తులకు సంకెళ్లు వేయడం లాంటివి. సంకెళ్లు వేసి నేరారోపణకు గురైన వ్యక్తులను ఊరేగించడం కూడా మనము చూస్తున్నాము. ప్రజలు ఆ విధంగా ఊరేగించాలని కోరుకుంటున్నారు కాబట్టి మేము ఆ విధముగా ఊరేగిస్తున్నాం అంటారు పోలీసులు.

ఎలాంటి ముద్దాయులకు సంకెళ్లు వేయరాదు

ముద్దాలుగా ఉండి  చికిత్స పొందుతున్న వారికి సంకెళ్లు వేయరాదు.  శిక్ష పడిన ఖైదీలకు,  విచారణలో  ఖైదీలకు,  జైల్లో ఉన్నపుడు కోర్టుకి తీసుకెళ్లేన్నప్పుడు, ఒక జైలు నుంచి మరో జైలుకు  తీసుకెళ్ళునప్పుడు, సంకెళ్లు( బంధనాలు)  వేయడానికి వీలు లేదు అని సుప్రీంకోర్టు  పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

పారిపోవడానికి  ప్రయత్నం చేస్తున్నాడని   ఆధారాలు  ఉంటే అలాంటి  వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచి  వ్రాతపూర్వకముగా  అనుమతి పొందాలి.  హింసాత్మక ప్రవృత్తి కలిగిన కేసుల్లో  ముద్దాయులకు సంకెళ్లు వేయమని  మేజిస్ట్రేట్ ఆదేశాలు జారిచేయవచ్చు.

 కోర్టుముందు హాజరు పరచిన  ముద్దాయిలకి వల్కనీ జ్యుడీషియల్ కస్టిడీకి పంపించిన లేక పోలీసు కస్టడీకి ఇచ్చిన   మేజిస్ట్రేట్ నుంచి ఆ విషయమై ప్రత్యేకమైన ఉత్తర్వులు ఉంటే తప్ప సంకెళ్లు ఎట్టి పరిస్థితుల్లో వేయరాదు.

వారెంట్ కేసుల్లో కూడా అరెస్టు చేయడానికి ప్రత్యేక అనుమతులు తీసుకొని సంకెళ్లు వేయాలి

ఎవరైనా వ్యక్తిని పోలీసులు వారెంట్ లేకుండా అరెస్టు చేసినప్పుడు  పై మార్గదర్శక సూత్రాల్ని ఆధారంగా చేసుకొని,అవసరమని భావించినప్పుడు మాత్రమే సంకెళ్లు వేయడానికి అవకాశం ఉంది. ఆరెస్టు ప్రదేశం నుంచి పోలీసు స్టేషన్ వరకు అక్కడి నుంచి మెజిస్ట్రేట్ వద్దకు తీసుకొని వెళ్లేంతవరకు మాత్రమే సంకెళ్లు వెయ్యాలి  మరల కూడా సంకెళ్లు వేయాలంటే మేజిస్ట్రేట్ అనుమతి పొందాలి.  ఈ విషయం అన్ని హోదాలో ఉన్న పోలీసు వారికి వర్తిస్తుంది.  ఒక వేళ సంకెళ్ళువేస్తే కోర్టుధిక్కరణ నేరమని సుప్రీంకోర్టు సిటీజన్స్ దేమోక్రసి V/s  స్టేట్ ఆఫ్ అస్సాం జార్జిమెంట్ 1995 సామ్ స్పష్టం చేసింది. కారణాలు లేకుండా మేజిస్ట్రేట్ అనుమతి పొందుకుండా సంకెళ్లు వేస్తే  పోలీసులతో పాటు మేజిస్ట్రేట్ కూడా శిక్షార్హుడు అవుతారు. నష్టపరిహారం కూడా వేయవచ్చు.

బేడీలు(సంకెళ్లు) వేస్తే  ఆర్టికల్స్ 14,19,21  విరుద్ధం.

అరెస్టు చేసినప్పుడు సంకెళ్లువేయవచ్చు అని ఏచట్టంలో పేర్కొనలేదు. 

అరెస్టు అంటే ఏమిటో చట్టంలో ఎక్కడ నిర్వహించలేదు. ఒక వ్యక్తిని  శారీరకంగా నిర్బంధించడం అతని కదికలను నిలుపుదల చేయడాన్ని అరెస్టు అంటారు. అయితే నేరం చేశాడని బలమైన ఆరోపణలు   ఉండాలి .అని సుప్రీంకోర్టు 1953లో స్పష్టం చేసింది.

అరెస్టు ఉద్దేశ్యం 2 రకాలు

1.అతనిపై ఉన్న క్రిమినల్ ఆరోపణలకు కోర్టుకు జవాబు చెప్పడానికి

2. అతను ఏదైనా నేరం చేయకుండా నిరోధించడానికి.

అరెస్టు శరీరాన్ని తాకడం ద్వారా నిర్బంధించడం ద్వారా  చేయవచ్చు,అయితే నిన్ను అరెస్టు చేస్తున్నామని మాటల ద్వారా చెప్పాల్సి ఉంటుంది.

సంకెళ్లు ఎప్పుడు వేస్తారో తెలుసుకుందాం

ఎవరినైనా అరెస్టు చేసినప్పుడు విచారణలో ఉన్న ముద్దాయిని  కోర్టుకు తీసుకెళ్ళునప్పుడు  సాధారణంగా సంకెళ్లు వేస్తారు. సంకెళ్లు సాధారణ పరిస్థితుల్లో వేయరాదు. అరెస్టు విషయంలో  అత్యవసరమైనప్పుడు మాత్రమే వేయాలని సుప్రింకోర్టు జోగిందర్ కుమార్ కేసులో స్పష్టంగా చెప్పింది.

అరెస్టు చేసిన వ్యక్తిని  ఆ వ్యక్తి కోరినప్పుడు అతని బంధువులనుగాని, న్యాయవాదిని గాని,  అతని ప్రయోజనాలని చూసే ఏ వ్యక్తినైనగాని అతను సంప్రదించే అవకాశాన్ని పోలీసులు కల్పించాలి.


కస్టిడీలో ఎవరిని చిత్రహించలు పెట్టారాదు, ఒకవేళ చిత్రహింసలకు గురిచేస్తే ఆర్టికల్ 21 ఉల్లంఘించినట్లే! 

కస్టిడి మరణం కన్న అతిహీమైన నేరం మరొక్కటిలేదు.  అలాంటి పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోమని సుప్రీంకోర్టు  ఆదేశాలు జారీ చేసింది.

అరెస్టు విషయంలో మార్గదర్శకాలు

1.అరెస్టుగాని, ఇంటరాగేషన్ గాని చేసినప్పుడు పోలీసు అధికారులు తమపేరు హోదాగల పేరు గల  ప్లేట్లను(గుర్తింపు) ధరించాలి.  అది ఖచ్చితంగా గుర్తించేందుకు వీలు ఉండాలి.అరెస్టు ఇంటరాగేషన్ పాల్గొన్న అధికారుల వివరాలు  ఈ రిజిస్ట్రర్ నందు నమోదు చేయాలి.

2.అరెస్టు చేస్తున్న అధికారి  అరెస్టు చేసినప్పుడు విధిగా అరెస్టు మెమో తయారు చేసి  దాని మీద సంతకాలు తీసుకోవాలి.  ఈ సంతకం చేసినవ్యక్తి ఆ వ్యక్తి  కుటుంబానికి చెందిన వ్యక్తి గాని, ఆ ప్రాంతంలో గౌరవప్రదమైన  వ్యక్తి అయిఉండాలి. 

3.అరెస్టు గురించి   ఆ వ్యక్తి  బంధవులకు గాని, స్నేహితులకు గాని, తన యోగక్షేమాలు పట్టించుకొనే వ్యక్తికిగాని తెలియపరచాలి.

4. అరెస్టు అయిన వ్యక్తి బంధువులు స్నేహితులు వేరే జిల్లా,రాష్ట్రంలో ఉన్నట్లేయితే  లీగల్ ఎయిడ్ సంస్థ ద్వారా  ఆ వ్యక్తులకు అందే విధముగా సంబంధిత పోలీసు స్టేషన్ కు సమాచారం ఇవ్వాలి.

5.అరెస్టుగాని,నిర్బంధంగానీ చేసిన వెంటనే ఆ విషయాన్ని తమ బంధువులకు  స్నేహితులకు తెలియజేకునే హక్కు పోలీసులు అరెస్టు అయిన వ్యక్తికి కల్పించాలి.

6.అరెస్టు సమాచారాన్ని ఎవరికి తెలియజేశారో ఆ వివరాలు ఏ పోలీసుస్టేషన్ కి ఏ అధికారికి తెలియజేశారో ఆ వివరాలు ఆ వ్యక్తిని ఎక్కడ నిర్బంధించారో అక్కడ ఉన్న డైరీలో  ఏ పోలీసు స్టేషన్లో  ఏ అధికారి పరిధిలో  ఉన్నాడో  నమోదు చేయాలి.

7.అరెస్టు అయిన వ్యక్తిని తప్పకుండా  శారీరక పరీక్షలు చెేయించాలి. అతని శరీరం మీద ఉన్న గాయాలను నమోదు చేయాలి మెమో తయారు చేసి సంతకాలు చూపించాలి. ఒక కాపీని అరెస్టు అయిన వ్యక్తికి ఇవ్వాలి. 

8.డిటెన్షన్ లోకి  48 గంటలలోపు  వైద్యపరీక్షలు పొందాలి.

9.మేజిస్ట్రేట్ కి సమాచారం ఇవ్వాలి, అన్ని మెమోలు అన్ని డాక్యుమెంట్లను మీద సమాచార నిమిత్తము మేజిస్ట్రేట్ కు పంపాలి.

10 న్యాయవాది సమక్షంలో  ఇంటరాగేషన్ చేయాలని   అరెస్టు అయినవ్యక్తి కోరితే అలానే చేయాలి.

11. ప్రతి  జిల్లాలోని, ప్రతి రాష్ట్రంలో ఉన్న పోలీసు కంట్రోల్ రూములకు అరెస్టు అయిన వివరాలు  నిర్బంధించిన స్థలాన్ని/ప్రదేశాన్ని స్పష్టంగా నోటీసుల బోర్టులో ఉంచాలి.

 పై మార్గదర్శకాలు ప్రతి పోలీసు అధికారి  పాటించి తీరాలి. పాటించకుంటే  శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి సంబంధిత హైకోర్టు ధిక్కార నేరం కింద చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మానవహక్కుల పరిధి

బానిస సమాజంలో మానవహక్కుల సమస్య కేవలం  జీవించే హక్కుకు సంబందించిన విషయం ఈ బానిస సంకెళ్లు తెగితే చాలు అని బానిసలు భావిస్తున్నారు.  బౌతికదాడులు,  చిత్రహింసలు గొడ్డు చాకిరి  వంశపారంపర్యంగా బానిసత్వం, బానిసత్వంపై పోరాటాలు, తిరుగుబాట్లు, ప్రతిఘటనలు భూస్వామ్యవ్యవస్థలో  వ్యవసాయ కూలీలు పోరాటాలు మానవహక్కుల ఉల్లంఘన కింద వస్తాయి.  

ఇంకో విధంగా చెప్పాలంటే  రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు  సహజంగా వచ్చిన హక్కులకు భంగం వాటిల్లేవిధముగా చేయడమే మానవహక్కులు ఉల్లంఘనగా పరిగణించవచ్చు.  పెట్టుబడిదారీ విధానం వచ్చేసరికి  పూర్తిగా మారిపోతుంది.

 జీవించే హక్కు కాకుండా  అనేక హక్కులు మానవహక్కుల పరిధిలోకి వస్తాయి . సమానత్వపు హక్కు, సమాన అవకాశాల హక్కు, దోపిడీ నుండి రక్షణపొందే హక్కు విద్య,ఉద్యోగాల్లో సమనహక్కు మొదలైనవి కూడా మానవహక్కుల కింద పరిగణిస్తారు. కులం, మతం,లింగం,ప్రాంతం, ప్రాతిపదికన వివక్షత చూపరాదు. అల్పసంఖ్యాక, మైనార్టీ తెగలు, జాతులకు చెందిన సాంస్కృతి సాంప్రదాయాలు భాష పరమైనవి కూడా మానవహక్కుల కింద పరిగణిస్తారు.  బాలలు, మహిళలు,వికలాంగులు హక్కులు కూడా మానవహక్కుల కిందకు వస్తాయి.                                       

సంకెళ్లువేయడానికి మార్గదర్శకాలు

22 డిసెంబర్1994 రోజున ప్రముఖ జర్నలిస్టు కులదీప్ నయ్యర్ సుప్రీంకోర్టుకు సిటిజన్స్ ఫర్ డేమోక్రసీ అనే సంస్థ అధ్యక్షతన ఒక హోదాలో ఒక ఉత్తరం రాశాడు  "నేను కొద్ది రోజుల క్రితం ఓ పేషంటుని చూడడానికి గౌహతిలోని ఒక ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాను, అక్కడ బేడిలతో ఉన్న ఏడుగురు టాడా నేరస్తులను చూసి భయభ్రాంతులకు లోనయ్యాను ఆ దవాఖానలో డెటెన్యూలని బంధించిన రూంకి సరి అయిన భద్రత ఉంది. బయట సాయుధులైన పోలీసులు కూడా ఉన్నారు,తాళం కూడా వేసి ఉంది. అది చూసి నేను వారితో మాట్లాడాను వాళ్లు తమకి కావాల్సిన మందులకి డబ్బులు కూడా తామే ఇస్తున్నాం అని చెప్పారు ఆవిధంగా చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు కోర్టునుంచి ఉన్నప్పటికీ అస్సాం ప్రభుత్వం ఎందుకు చేస్తుందో నాకు అర్థం కాలేదు. ఈ విషయం గురించి అస్సాం ముఖ్యమంత్రికి కూడా ఉత్తరం రాశాను, కానీ ఎలాంటి స్పందన లేదు అందుకని సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని ఈ ఉత్తరం ద్వారా కోరుతున్నాను.

ఈ ఉత్తరాన్ని ఆర్టికల్ 32 ప్రకారంగా రిట్ గా సుప్రీంకోర్టు స్వీకరించి ఛీఫ్ సెక్రటరీ, హోం సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది వాదనలు విని సుప్రీంకోర్టు సంకెళ్ళు ఎప్పుడు వేయాల్సి ఉంటుంది అనే విషయం గురించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

  "కేసులో అన్ని విషయాలను కూలంకషంగా పరిశీలించాం.అక్కడ బంధించిన ఏడుగురు డిటెన్యూలు తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశం లేదు.వారి యొక్క గత చరిత్ర తెలియదు, వారు హింసాత్మక చర్యలకు అలవాటుపడిన వ్యక్తులని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. వారు విచ్చిన్న శక్తులని, ఆయుధాలు అక్రమ సరఫరా చేశారని ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. అవసరమైన సంఖ్యలో డ్యూటీలో పోలీసులు ఉన్నారు వాళ్లకు సంకెళ్లు వేశారు అన్నది స్పష్టం.  చికిత్సకోసం ఉన్న వ్యక్తులకు ఆవిధంగా సంకెళ్లు వేయడం అమూల్యమైన చర్య మరొకటి లేదు. వాళ్లు పారిపోతారని ప్రభుత్వం భావిస్తే సెక్యూరిటీ గార్డుల సంఖ్యను పెంచాలి. అంతేకానీ ఈ విధంగా బందనాలతో కట్టివేయడం అమానుషమైన మరియు మానవ హక్కుల ఉల్లంఘన దాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ సమర్థించుకోవడానికి అవకాశం లేదు. అంతర్జాతీయం చట్టంలకు కూడా ఈ చర్య ఉల్లంఘనే.అందుకనీ ఆ డిటెన్యూలు ఇంకా దవాఖానాలో ఉంటే వారిని వెంటనే బంధవిముక్తులను చేయాలని ఆదేశిస్తూ ఉన్నాము. అంతేకాదు సంకెళ్ళు  శిక్ష పడిన ఖైదీలకు గాని, విచారణలో ఉన్న ఖైదీలకు గానీ, జైల్లో ఉన్నప్పుడు కోర్టుకు తీసుకు వెళ్తున్నప్పుడు గాని, జైలు నుంచి ఇంకో జైలుకు తీసుకు వెళ్తున్నప్పుడు గాని, మళ్లీ తిరిగి తీసుకు వస్తున్నప్పుడు గాని వేయకూడదని మేము శాసిస్తున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోలీసులకు గాని, జైలు అధికారులకి గానీ సంకెళ్ళు వేయమని ఆదేశించడానికి ఈ దేశంలో అధికారం లేదు.

 ఎవరైనా వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడని ఆధారాలు ఉన్నప్పుడు లేక ఆధీనం నుంచి పారిపోతారని కచ్చితంగా భావించినప్పుడు అలాంటి వ్యక్తిని సంబంధిత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి సంకెళ్లు వేయడానికి రాతపూర్వకమైన అనుమతి పొందాలి. అరుదైన కేసుల్లో హింసాత్మకమైన ప్రవృత్తి ఉన్నప్పుడు, పారిపోవడానికి అవకాశాలు ఉన్నప్పుడు, అపాయకరమైన వ్యక్తులని ఋజువు అనిపించినప్పుడు, వారు పారిపోకుండా ఉండడానికి ఎలాంటి ఇతరత్రా చర్యలు లేవని మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేయవచ్చు.    కోర్టు ముందు హాజరు పరిచిన ముద్దాయిలకు వాళ్ళని జుడిషియల్ కస్టడీకి పంపించిన లేక పోలీస్ కస్టడీకి ఇచ్చిన మెజిస్ట్రేట్ నుంచి ఆ విషయమై ప్రత్యేకమైన ఉత్తర్వులు ఉంటే తప్ప సంకెళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ వేయకూడదు.  అవసరమని భావించినప్పుడు మాత్రం సంకెళ్ళు వేయడానికి అవకాశం ఉంది. అది కూడా అరెస్టు చేసిన ప్రదేశం నుంచి పోలీస్ స్టేషన్ వరకు అక్కడినుండి మేజస్ట్రీట్ వద్దకు తీసికొని వెళ్ళి అంతవరకు మాత్రమే సంకెళ్ళు వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సంకెళ్లు వేయడం విషయంలో మెజిస్ట్రీట్ అనుమతి ఉంటే సంకెళ్లు వేయాలి. మేజిస్ట్రేట్ ఉత్తర్వులు తప్పని సరి  ఉండాలి. ఎవరికైనా ముద్దాయికి సహేతుకమైన కారణాలు ఉన్నప్పుడు మాత్రమే సంకెళ్లు వేయాల్సి ఉంటుంది అలా లేనప్పుడు తగు చర్యలు తీసుకోవడంలో విఫలం అయిన పై అధికారులు, మేజిస్ట్రేట్ కూడా శిక్షార్హులవుతారు. అలా సంకెళ్లు వేసినప్పుడు సాధారణంగా డిఎస్పి, ఎస్పీలు ఉండరు. ఆ విషయం తమకు తెలియదని ఆ సమయంలో మేము లేమని తప్పించుకోవడానికి కూడా వీలు లేదు. సంకెళ్లు వేయకుండా తగు జాగ్రత్తలు కిందిస్థాయి అధికారులకు తెలియజేయకపోవడం కూడా తప్పేనని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతేకాదు సంకెళ్ళతో ముద్దాయిలను హాజరుపరచినపుడు ఇలాంటి చర్య మెజెస్ట్రీట్ తీసుకోకపోవడం కూడా శిక్ష అర్హం అవుతుంది (1966 సుప్రీంకోర్టు  (క్రిమినల్) 612)

 సుప్రీంకోర్టు నిర్దేశించిన విధంగా విచారణలో ఉన్న ఖైదీలకు బేడీలు వేయడం సరైనది కాదు జుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు సంకెళ్లతో ఖైదీని హాజరుపరిచినపుడు తీసివేయమని ఆదేశించకపోవడం, ఆవిధంగా తెచ్చిన పోలీసు ఎస్కార్ట్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా తీవ్రమైన విషయమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మానవ హక్కులను పరిరక్షించాల్సిన జుడిషియల్ మెజిస్ట్రేట్ వాటిని పాటించకపోవడం చాలా విచారించదగ్గ విషయమనీ అయితే ఈ మేజిస్ట్రేట్ యువకుడు అయినందువల్ల భవిష్యత్తు చాలా ఉన్నందువల్ల ఎలాంటి షరతులు లేకుండా క్షమాపణ కోరినందుకు శిక్ష విధించడం లేదని సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టం చేసింది. అయితే తమ అసంతృప్తిని, అసమ్మతిని అతని వ్యక్తిగత రికార్డులలో నమోదు చేయాలని సంబంధిత హైకోర్టును ఆదేశించింది.  అదేవిధంగా ఈ కేసులో ఎస్పి డి.ఎస్.పి ఆ సంకెళ్ళు వేసినప్పుడు అక్కడ లేనందువల్ల ఆ విషయంలో వారికి ప్రత్యక్షంగా సంబంధం లేనందువల్ల వాళ్లని శిక్షించడం లేదుగా అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా తగు చర్యలు తీసుకోనందుకు తమ అసంతృప్తిని వాళ్ల వ్యక్తిగత రికార్డులలో నమోదు చేయాలని చీఫ్ సెక్రటరీ మధ్యప్రదేశ్ ని సుప్రీంకోర్టు ఆదేశించింది.         అంతేకాకుండా సంకెళ్లు వేయడానికి సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాల సూత్రాలను పోలీస్ మాన్యువల్లో పొందుపరచాలని ఆదేశించింది.

బేడీలు వేస్తే నష్ట పరిహారం?

నిలోలీ గుప్తా గౌహతి హైకోర్టు న్యాయవాది. మానవ హక్కుల సంస్థకు కన్వీనరు. మార్చి 2 1992 రోజు రాత్రి 11 గంటలకు పోలీసు ప్రత్యేక దళం అతన్ని అరెస్ట్ చేసి దగ్గర్లో ఉన్న లాకప్పులో బందించారు తెల్లవారి ఉదయం అతనికి బేడీలు వేసి మిస్సా జైలుకు బస్సులో తీసుకువెళ్లారు ఆయన బేడీలు తీయమని కోరాడు ఆ తరువాత బేడీలు వేయడం గుప్త ప్రశ్నించాడు.ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బేడీలు వేశామని పోలీసులు చెప్పారు. అతన్ని నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం  అరెస్టు చేశారు.  తనకు బేడీలులు వేసి అగౌరవపరిచారని తన గౌరవానికి భంగం కలిగించారని ప్రజల దృష్టిలో తను కించపరిచారని అందుకని సంబంధిత అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జైలు నుంచి గుప్తా ఉత్తరం పంపించాడు ఆ ఉత్తరాన్ని రిట్ గా స్వీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వానికి పోలీసు అధికారులకు నోటీసు జారీ చేశారు. సెక్యూరిటీ నిమిత్తం తప్పనిసరి పరిస్థితుల్లోనే బేడీలు వేయాల్సి వచ్చిందని అంతేకానీ ఉద్దేశపూర్వకంగా బేడీలు వేసింది కాదని ఒకవేళ అతని గౌరవానికి భంగం కలిగినట్లయితే సివిల్ కోర్టులో దావా చేసుకోవాలని అడ్వకేట్ జనరల్ వాదనలు చేశారు.   గుప్తాని అరెస్ట్ చేసినప్పుడు అతను అరెస్టుకు పూర్తిగా సహకరించాడని తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఎటువంటి ప్రతిఘటన చూపించలేదని ఉద్దేశపూర్వకంగా అతని గౌరవానికి భంగం కలిగించడానికి మాత్రమే బేడీలు వేశారని ఎలాంటి సహేతుక కారణం లేకుండా  బేడీలు వేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19,21 లకు విరుద్ధమని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని నష్టపరిహారం చెల్లించాలని తరపు న్యాయవాది వాదించారు.  ఇరువైపుల వాదనలు విన్న తరువాత హైకోర్టు  బేడీలు వేయడం న్యాయ సమ్మతం కాదని తీర్పుచెప్పింది. అరెస్ట్ సమయంలో ఎలాంటి  ప్రతిఘటనను చూపలేదని అందుకని జైలుకు బేడీలు వేసి తీసుకెళ్లడం ఏకపక్ష చర్య అని అలా చేయడం గుప్త గౌరవానికి భంగం కలిగించేదని దానివల్ల అతని ప్రతిష్ట ప్రజల దృష్టిలో దిగజారిందని రాజ్యాంగం ప్రసాదించిన 14,19,21 ఆర్టికల్లోని హక్కుల భంగం వాటిల్లిందని హైకోర్టు అభిప్రాయపడింది.  చట్టాన్ని అమలుచేసి మనిషికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత హైకోర్టు పైన ఉంది పోలీసుల అమానుష ప్రవర్తనను కోర్టు చూస్తూ ఊరుకోదని గుప్తాకు కలిగిన నష్టాన్ని ఎలాంటి పరిహారంతో పూరించలేమని అయితే నష్టపరిహారాన్ని డబ్బు రూపంలో ఇవ్వమని ఆదేశించడం తప్ప ఇతర చర్యలు కోర్టు దగ్గర ఏవీలేవని అందుకని అతనికి 15 వేల రూపాయలు నష్టపరిహారం ప్రతివాదులు మూడు నెలల్లో చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.

అరెస్ట్ చేయాలంటే సంకెళ్ళు తప్పనిసరిగా వేయాల్సి ఉంటుందా ??

అరెస్టు చేసినప్పుడు సంకెళ్ళు వేయాలని చట్టంలో ఎక్కడా పేర్కొనలేదు అరెస్టు అంటే ఏమిటి?

 అరెస్టు ఎలా చేస్తారు?

అరెస్టు అంటే ఏమిటో చట్టములో ఎక్కడ నిర్వహించలేదు. ఒక వ్యక్తిని శారీరకంగా నిర్బంధించడం అతని కదలికలను నిలుపుదల చేయడాన్ని అరెస్టు అంటారు. అయితే ఈ అరెస్ట్ ఏదైనా నేరం చేశాడని బలమైన ఆరోపణలు ఉన్నప్పుడు గాని లేక ఏదైనా ఖూని నేర స్వభావం ఉన్న నేరం చేసినప్పుడు మాత్రమే చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే అది అరెస్టు అవుతుంది (ఏ.ఐ.ఆర్ 1953 సుప్రీంకోర్టు 10).     అరెస్టు అంటే ఒక వ్యక్తి స్వేచ్ఛని నిలుపుదల చేయడం అది కోర్టు ఉత్తర్వుల వల్ల కావచ్చు లేక అతనిమీద ఆరోపించబడిన నేరానికి జవాబు చెప్పడానికి కావచ్చు అరెస్టు ఉద్దేశం రెండు రకాలుగా ఉంటుంది.

 1 అతనిపై ఉన్న క్రిమినల్ ఆరోపణలకు కోర్టులో జవాబు చెప్పడానికి అతను ఏదైనా నేరం చేయకుండా నిరోధించడానికి.అరెస్టు శరీరాన్ని తాకడం వారిని నిర్బంధించడం ద్వారా చేయవచ్చు. అయితే నిన్ను అరెస్ట్ చేస్తున్నాము అని మాటల ద్వారా చెప్పాల్సి ఉంటుంది. మాటల ద్వారా గాని చర్యలవల్ల గాని అతని ఒప్పుకున్నప్పుడు అరెస్టు పూర్తయినట్లు భావించబడుతుంది. అరెస్ట్ చేసే క్రమంలో అవసరమైన బలప్రయోగాన్ని ఉపయోగించవచ్చు. అయితే ఆ వ్యక్తి అరెస్టును నిరోధించినప్పుడు మాత్రమే. బలప్రయోగాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. జీవితఖైదుగా మరణశిక్ష విధించే నేరం చేసిన వ్యక్తుల అరెస్టులో అవసరమైతే చంపవచ్చు. అంతేకానీ సంకెళ్ళను వేయాలని ఎక్కడా పేర్కొనలేదు.

సంకెళ్లు ఎప్పుడు వేస్తారు

ఎవరినైనా అరెస్టు చేసినప్పుడు విచారణలో ఉన్న ముద్దాయిని కోర్టుకు తీసుకు వచ్చినప్పుడు సాధారణంగా సంకెళ్ళు వేస్తారు. సంకెళ్ళు అసాధారణ పరిస్థితుల్లో తప్ప మిగతా సమయాలలో వేయకూడదు అదేవిధంగా అరెస్టు అనేది కూడా అత్యవసరమైనప్పుడు మాత్రమే వేయాలని సుప్రీంకోర్టు ఓ కేసులో స్పష్టం చేసింది.  అరెస్టు చేసే  అధికారం ఉండడం ఒక ఎత్తు.దానికి గల కారణాలను చూపించడం మరో ఎత్తు.అధికారం ఉందని అరెస్టు చేయడం కాదు దానిని సమర్థించుకునేందుకు న్యాయబద్ధత కూడా ఉండాలి వ్యక్తిని అరెస్టు చేసి బంధించడం అనేది ఆ వ్యక్తి ప్రతిష్ట కి ఎంతో భంగం కలిగిస్తుంది కాబట్టి ఆరోపణ రాగానే అరెస్టు చేయడం కాకుండా వివేచనతో ఆలోచించి తగు కారణాలు ఉన్నప్పుడు మాత్రమే అరెస్టు చేయాలి. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడడంలో పోలీసుల బాధ్యత ఎంతో ఉంది. సంతృప్తికరమైన కారణాలు ఉన్నప్పుడు హీనమైన నేరాలకు పాల్పడినపుడు మాత్రమే అరెస్టు చేయాలి.


ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తి కోరినప్పుడు అతని బంధువులను కానీ, న్యాయవాదిని గాని, అతని ప్రయోజనాలని చూసే ఏ వ్యక్తినైనా గాని అతను సంప్రదించి అవకాశాన్ని పోలీసులు కల్పించాలి. ఈ హక్కులు అన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 21,11(1) లతో మిళితమై ఉన్నాయని, వాటిని అమలు చేయడానికి సుప్రీంకోర్టు ఈ సూత్రాన్ని తన తీర్పులో పేర్కొంది.  ఎవరినైనా అరెస్టు చేసినప్పుడు అతని కోరిక ప్రకారం అతని బంధువులనుగానీ స్నేహితులను గాని అతని యోగక్షేమాలు పట్టించుకునే అవకాశం ఉన్న ఏ వ్యక్తినైనా అతను మాట్లాడే అవకాశాన్ని సాధ్యమైనంత త్వరగా కల్పించాలి.ఆవ్యక్తిని పోలీస్ స్టేషన్ కి తెచ్చిన వెంటనే ఈ హక్కులని ఆ పోలీస్ అధికారి తెలియజేయాలి. ఈ విషయాన్ని అతనికి తెలియజేశామని ఆ వ్యక్తి కోరికమేరకు అతను కోరిన వ్యక్తులకు అరెస్ట్ సమాచారాన్ని తెలియజేశామని పోలీసు అధికారులు డైరిలో రాయలయును. ప్రతి వ్యక్తికి ఈ హక్కుల రక్షణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 22(1)ప్రసాదిస్తుంది.ఆ వ్యక్తిని ఏ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారో ఆ మేజిస్ట్రేట్ ఈ హక్కులు పోలీసులు అమలు చేశారా లేదా అన్న విషయాన్ని పరిశీలించాలి.ఈ ఆవశ్యకతని ప్రతి అరెస్టులో పోలీసులు పాటించాలి మాన్యువల్లో ఉన్న హక్కులకి ఇవి అదనం. ఈ ఆవశ్యకతలు సంపూర్ణమైనది కావు. అయినప్పటికీ వీటిని పోలీసులు పాటించాల్సిందిగా పోలీసు డైరెక్టర్ జనరల్స్ అధికారులకి డిపార్ట్మెంటల్ ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది అంతేకాక అరెస్ట్ చేయడానికి గల కారణాలను కూడా కేసు డైరీలలో తప్పనిసరిగా వ్రాయవలసి ఉంటుంది.


 మానవహక్కుల వర్గీకరణ         

1) స్వేచ్ఛగా  జీవించేహక్కు.              

2) భావప్రకటన హక్కు.                     

3) విద్యహక్కు.                                

4) తనకు ఇష్టమైన వృత్తి  వ్యాపారం చేసుకొనే హక్కు.                          

5)ఆరోగ్యవంతమైన ఆహార తీసుకొనే హక్కు.                                

6)స్వచ్ఛమైన గాలి,నీరు పొందే హక్కు  పర్యావరణ హక్కు.                              

 7)వయోవృద్ధులు హక్కులు.                   

8)మహిళ హక్కులు.                              

9)బాలల హక్కులు.....                   

10) ఖైదీల హక్కులు.....                     

11) శరణార్ధుల హక్కులు.               

 12)శారీరక,మనసికవైకల్యం గల వ్యక్తుల హక్కులు..                        

 13) పౌరసత్వం లేని వ్యక్తుల హక్కులు   

14)రాజకీయ పరమైన హక్కులు         

15)అల్పసంఖ్యాక తెగల,జాతుల, భాష మతల హక్కులు.                      

16) సామాజిక పరమైన హక్కులు.    

17) సాంస్కృతిక పరమైన హక్కులు.   

18) వివక్షత నుంచి రక్షణ పొందే హక్కు.       

19) వివిధ రకాలైన  దోపిడీ అణచివేత నుంచి రక్షణ పొందే హక్కు.      

20) మేదోసంపత్తి  హక్కులు.           

21) ట్రేడ్ మార్క కాపీరైట్స్ హక్కు.   

22)స్వేచ్ఛ సంచరించే హక్కు.   

ఈ మధ్యకాలంలో స్వలింగ సంపర్కం స్వేచ్ఛయుట శృగరం, వైవహికబందం లేకుండా స్క్హజీవనం చేయుట,లైంగిక స్వేచ్ఛ తదితర హక్కులు కూడా మానవహక్కుల కింద వస్తాయని సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చినది.

మనవాహక్కులు ఉల్లంఘన జరిగితే కేంద్రరాష్ట్ర కమిషన్లు ఎలా దరఖాస్తు చేసుకోవాలి

మీ హక్కులు భంగం వాటిల్లితే మొదట మీ సమీపంలోని పోలీసు స్టేషన్ నందు పిర్యాదు చేసుకోవాలి. వారు పాటించుకోకపోతే జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుకు దరఖాస్తు చేసుకోవాలి. వారి ద్వారా న్యాయం జరగకపోతే మానవహక్కుల కమిషన్ కు లెటర్ వ్రాసి మీరు పోలీసువారికి ఇచ్చుకున్న అర్జీలు జతపరచి మనవాహక్కులు కమిషన్ పోస్టు ద్వారా గాని లేక స్వయంగా గాని పిర్యాదు చేసుకోనవచ్చు. వారు  సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ద్వారా రిపోస్టు తెప్పించుకొని మానవహక్కుల జరిగిందని నిరూపితం అయితే వారి మీద కేసు నమోదు చేసి జరిమానా విదిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ మనవాహక్కులు కమిషన్ చిరునామా

Gruhakalpa Complex, M.J. Road, Opp: Gandhi Bhavan, Nampally, Hyderabad, Telangana 500001


జాతీయ మనవాహక్కుల కమీషన్ చిరునామా

GPO Complex, Manav Adhikar Bhawan,

 C  block, INA, New Delhi, Delhi 110023

May 18, 2025

విజయనగర సామ్రాజ్యంలో మంగళగిరి ఓ పట్టణం

 ‘మంగళగిరి 2.0’ పుస్తక సమీక్ష

చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, చేనేత, స్వర్ణకార వృత్తుల పరంగా, రాజకీయంగా, సామాజికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన పట్టణం గుంటూరు జిల్లాలోని మంగళగిరి. విజయనగర సామ్రాజ్యంలోనే మంగళగిరి ఓ పట్టణంగా గుర్తింపు పొందింది.   వినియోగదారుల ఉద్యమకారుడు, విశ్రాంత రైల్వే ఉద్యోగి, న్యాయవాది  మాదిరాజు గోవర్థన రావు తను పుట్టిపెరిగిన ఊరిపై ఉన్న అభిమానంతో 70 ఏళ్ల వయసులో ఎన్నో గ్రంథాలను అధ్యయనం చేసి, చరిత్రకారులను కలిసి  సుదీర్ఘ పరిశోధన చేసి  ‘మంగళగిరి 2.0’ పుస్తకం రాశారు. తన ఊరనే మమకారంతో పూనుకోవడం వల్లే ఇది సాధ్యమైంది. 36 పుస్తకాలు రాసిన అనుభవం ఉండటం వల్ల అన్ని అంశాలను సమగ్రంగా రాశారు. మంగళగిరి అంటే సాధారణంగా అందరికీ గుర్తుకు వచ్చేవి చేనేత, బంగారు వస్తువుల తయారీ, శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, 11 అంతస్తుల ఆలయ గాలిగోపురం,  కొండ శిఖరాన గండాలయ దీపం... వాటన్నిటి గురించి ఫొటోలతో సహా వివరంగా రాశారు. చేనేత, బంగారు వృత్తుల పరంగా  మంగళగిరి ఓ నైపుణ్యాల గని. చేనేత వస్త్రాలకు, బంగారు నగల తయారీకి మంగళగిరి ఎంత ప్రసిద్ధి చెందిందో, ఆధ్యాత్మికంగా శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి కూడా చారిత్రకంగా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మంగళగిరి చేనేత వస్త్రాలు దేశవిదేశాలకు ఎలా ఎగుమతి అవుతాయో, దేశ విదేశీ భక్తులు అలా శ్రీలక్ష్మీనరసింహ స్వామిని, పానకాల స్వామిని దర్శించుకోవడానికి  ఇక్కడి వస్తుంటారు. ఆ విధంగా పర్యాట కేంద్రంగా కూడా మంగళగిరి ప్రసిద్ధి చెందింది. అత్యంత సన్నని పోగు(దారం)లకు రంగులు అద్దడానికి, పడుగులు తయారు చేయడానికి, వివిధ రకాల  వస్త్రాలను చేతితో నేయడానికి ఎంతో నైపుణ్యత కావాలి. అలాగే, వివిధ రకాల బంగారు ఆభరణాలను మెరుపులతో ఆకర్షణీయంగా తయారు  చేయడానికి ఆ రంగంలో  అత్యంత నిపుణులై ఉండాలి. ఈ రకమైన నైపుణ్యం గల కళాకారులు చేనేత రంగంలో గానీ, స్వర్ణకార వృత్తిలో గానీ  మంగళగిరిలో దాదాపు 25వేల మందికి పైగా  ఉన్నారు.   అందువల్లే ప్రభుత్వం ఇక్కడ చేనేత, గోల్డ్ హబ్‌లు ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఇక్కడ చేనేత కార్మికులు అన్నా, స్వర్ణకారులు అన్నా అత్యధిక మంది పద్మశాలీ సామాజిక వర్గానికి చెందినవారే ఉంటారు. ముస్లింలు, వైశ్యులు, యాదవులు, మాదిగలు, మాలలు  కూడా గణనీయంగా ఉన్నప్పటికీ అత్యధిక మంది పద్మశాలీ సామాజిక వర్గం వారే ఉంటారు. అయితే, పూర్వ కాలంలో కుబేరులుగా వైశ్య సామాజిక వర్గానికి చెందిన ‘పారేపల్లి’వారు ఉండేవారు. సహజంగా వ్యాపార రంగంలో వారిదే పైచేయిగా ఉంటుంది. చేనేత రంగానికి ప్రసిద్ధి చెందిన ఈ నగరంలో 1970 దశకంలో దాదాపు 10 వేల మగ్గాలు ఉండేవి. ప్రతి వీధిలోనూ మగ్గాలు ఉండేవి. కాల క్రమంలో పవర్ లూమ్ పోటీకి చేనేత రంగం తట్టుకుని నిలబడటం కష్టమైపోయింది. ఈ నేపథ్యంలో చేనేత కార్మిక కుటుంబాలు స్వర్ణకార వృత్తివైపు మళ్లారు. దాంతో వారు ఆర్థికంగా కూడ నిలదొక్కుకున్నారు.  దాదాపు 15 వేల మంది బంగారపు పనివారు ఇక్కడ ఉన్నారు. చేనేత, స్వర్ణకార వ‌ృత్తిలో నిపుణులతోపాటు రచయితలు, విద్య, క్రీడలు, శాస్త్రసాంకేతిక రంగాలలో కూడా అత్యంత ప్రావీణ్యత కలిగినవారు ఉన్నారు. అలాగే, ఆది నుంచి వ్యాపారం, విద్య సంస్థలు ... తదితరాలతోపాటు  సినిమా ధియేటర్లు కూడా ఈ సామాజిక వర్గం ఆధీనంలోనే ఉన్నాయి. 

రాజకీయంగా కూడా పద్మశాలీ సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ. మంగళగిరికి చెందిన గోలి వీరాంజనేయులు, మురుగుడు హనుమంతరావు రెండుసార్లు, కాండ్రు కమల శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. హనుమంతరావు  మంత్రిగా ఆప్కో చైర్మన్ కూడా చేశారు. దామర్ల రమాకాంత రావు, మురుగుడు హనుమంతరావు శాసనమండలి సభ్యులుగా ఎన్నికయ్యారు.  మంగళగిరి శాసనసభా నియోజకవర్గం కలిసిన తెనాలి లోక్ సభ స్థానం నుంచి కూడా ఒకసారి పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన ఊర్వశి బూదాటి శారద గెలిచారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా మంగళగిరి నుంచి  దామర్ల రమాకాంత రావు, కాండ్రు కమల, తమ్మిశెట్టి జానకీదేవి నియమితులయ్యారు. వీరు ముగ్గురూ ఆ సామాజిక వర్గం వారే. మంగళగిరి మునిసిపల్ చైర్మన్లు అందరూ కూడా చేనేత సామాజిక వర్గాలకు చెందినవారే గెలిచారు. 

ఒక రకంగా మంగళగిరి చరిత్ర అంటే ఆ సామాజిక వర్గంతో ముడిపడి ఉంటుంది. చివరికి దేవుడి సంబరాలు కూడా వారితోనే ముడిపడి ఉంటాయి. 1915లో తమ హక్కులకు ఆటంకం కలిగినప్పుడు పద్మశాలీయులు కోర్టు వెళ్లి తమ హక్కలను సాధించుకున్నారు. పద్మశాలీయులు ‘సిరికి పుట్టింటి వారు-హరికి అత్తింటివారు’ అనేది ఆనవాయితీగా వస్తున్న ఆచారం. అలాగే,  స్థానిక పద్మశాలీయులు దేవాలయంలో స్వామివారి కళ్యాణం సందర్భంగా మెట్టెలు, మంగళసూత్రాలు, తలంబ్రాలు, మధుపర్కాలు, ఉత్తర జందెం సమర్పించే ఆచారం కొనసాగుతోంది. అప్పటి దేవస్థానం ధర్మకర్త ఆ ఆనవాయితీకి విరుద్ధంగా వ్యవహరించారు. దాంతో, ఈ అంశం కోర్టు వరకు వెళ్లింది. అప్పటి మంగళగిరి దేవస్థాన ఆచార్యులు శ్రీకందాళ రంగాచార్యులు గుంటూరు అడిషనల్ జిల్లా మున్సిఫ్  కోర్టులో పద్మశాలీయులకు మద్దతుగా పురాణేతిహాసాల సారాంశాన్ని న్యాయమూర్తికి వివరించారు. ఆ వాదనలను అంగీకరించిన కోర్టు పద్మశాలీయులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి ఎటువంటి వివాదంలేకుండా ఆ ఆచారం అలాగే కొనసాగుతోంది. ఈ అంశాన్ని రచయిత చారిత్రక ఆధారాలు, కోర్టు తీర్పులతో సహా  ఈ పుస్తకంలో   స్పష్టంగా పేర్కొన్నారు.  

చరిత్రకు అందినప్పటి నుంచి పరిశీలిస్తే,  శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, ఆనంద గోత్రజులు, విష్ణుకుండినులు,చాళుక్యులు, విజయనగర సామ్రాజ్యం, గోల్కొండ కుతుబ్ షాహీలు, ఫ్రెంచ్ వారు, ఆంగ్లేయుల పాలన కింద మంగళగిరి ఉండేది.  1950-58 మధ్య కాలంలో మంగళగిరి ప్రాంతం మిద్దె హద్దుగా ఇద్దరి పరిపాలనలో కొనసాగింది. చెన్నై-కోల్‌కత 16వ నెంబర్ జాతీయ రహదారిపై గుంటూరు-విజయవాడ నగరాల మధ్యన ఉన్న మంగళగిరి చారిత్రకంగా కూడా ప్రసిద్ధి చెందిన నగరం. విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఇక్కడి నుంచే వలస వెళ్లారు. విజయనగర రాజుల కాలంలోనే మంగళగిరిని పట్టణంగా పరిగణించేవారు.  రాష్ట్రంలో అత్యంత ఎత్తయిన 157 అడుగులు, 11 అంతస్తుల శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి గాలిగోపురాన్ని 1807-09 కాలంలో అప్పటి  ధరణికోట ప్రాంత జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు  నిర్మించారు. తిరునాళ రథంపై గాంధీజీ ఫొటో వివాదం జరిగింది. క్రైస్తవం స్వీకరించిన మొదటి బ్రాహ్మణుడు మంగళగిరి వాడే. స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత కూడా ఇది రాజకీయ చైతన్యం కలిగినటువంటి గడ్డ. మొదట్లో ఇక్కడ కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువ. కాల క్రమంలో  కమ్యూనిస్టులు ఇక్కడ మసకబారిపోయారు.  మంగళగిరి ప్రజలు రాజకీయంగా ఎంత చైతన్యవంతులు అయినప్పటికీ, ఎన్ని విభేదాలు, గ్రూపులు ఉన్నప్పటికీ ఘర్షణలకు దిగేవారు కాదు. మహానటుడు ఎన్టీఆర్ ఇక్కడ ఉద్యోగం చేస్తే, ఆయన మనవడు నారా లోకేష్ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఆరితేరిన రాజకీయ నేతగా ఎదుగుతున్నారు. లోకేష్ 2019 ఎన్నికల్లో ఓడి, 2024 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో రికార్డు సృష్టించారు. పచారి షాపులో గుమస్తాగా పనిచేస్తూ చదువుకున్న శిరందాసు లక్ష్మీనారాయణ ఐఏఎస్ అధికారి అయ్యారు.  పడుగులు చేస్తూ చదువుకున్న ఉడతా వెంకట బసవరావు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అయ్యారు.  మెగాస్టార్ చిరంజీవి తొలినాళ్లలో పాఠశాల విద్యను ఇక్కడే అభ్యసించారు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఎయిమ్స్ ఆస్పత్రిని ఇక్కడే నిర్మించారు.  పైన రాసిన ప్రతి అంశాన్ని రచయిత  గోవర్థన రావు   దాదాపు ఏడాదిన్నరపాటు వివిధ గ్రంథాలను చదివి, చరిత్రకారులను కలిసి, చరిత్ర, శాసనాధారలతో  ఈ పుస్తకం రాశారు. గ్రామ పంచాయతీ నుంచి పంచాయతీ, ఫిర్కా, సమతి(సమితి), తాలూకా, మండలం, నియోజకవర్గం, పురపాలక సంఘం, కార్పోరేషన్ వరకు మంగళగిరి ఎదిగిన క్రమాన్ని ఎంతో చక్కగా వివరించారు. మంగళగిరి చేనేత కేంద్రంగా ఎలా ఎదిగిది? నిజాం బోర్డ్ చీర అంటే ఏమిటి? మంగళూరులో కట్టవలసిన రైల్వే స్టేషన్ మంగళగిరిలో ఎలా కట్టారు? పవర్ లిఫ్టింగ్ కేంద్రంగా ఎలా ఎదిగింది?.. వంటి విషయాలను ఇందులో చాలా పొందుపరిచారు. 544 పేజీల ఈ పుస్తకంలో ఎన్నో  ప్రత్యేకతలతోపాటు వింతలు, విశేషాలు, ఆసక్తికర అంశాలు చాలా ఉన్నాయి. ఇది మంగళగిరి చరిత్రే అయినా, దీనిని చదువుతుంటే, కాలానుగుణంగా తమ తమ గ్రామాలలో జరిగిన మార్పులు గుర్తుకు వస్తాయి. ఈ పుస్తకాన్ని ఇటీవలే మంగళగిరి శాసనసభ్యులు, విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. 

ఈ పుస్తకం ధర: రూ.490

కాపీల‌కు ఫోన్: 9440264336

                                  

            - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

మంగళగిరిపై పరిశోధన గ్రంథం

మంగళగిరి 2.0 పుస్తక సమీక్ష

గుంటూరు జిల్లా మంగళగిరి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది  చేనేత చీరలు, డ్రెస్ మెటీరియల్, శ్రీలక్ష్మీ నరశింహ స్వామితోపాటు 11 అంతస్తుల దేవాలయ గాలిగోపురం, కొండపైన పానకాల స్వామి.  మంగళగిరి చరిత్రతోపాటు చేనేత పరిశ్రమ విస్తరించడానికి కారణాలు, రంగుల ప్రత్యేకత, దేవాలయ విశిష్టత, బంగారు ఆభరణాల తయారి వంటి అన్ని అంశాలతో  ఈ నగరానికే  చెందిన న్యాయవాది మాదిరాజు గోవర్థన రావు ‘మంగళగిరి 2.0’ అనే పుస్తకం రాశారు. ఈ రచయితే, 2004లో ‘మన మంగళగిరి’ పేరుతో 176 పేజీలు పుస్తకం రాశారు. ఇప్పుడు రాజధాని అమరావతి ముఖద్వారంగా ఉంటూ, అందులో భాగంగా ఎదిగిన మంగళగిరి గురించి సమగ్రంగా 544 పేజీలతో దీనిని రూపొందించారు. 

మంగళగిరి అంటే చేనేత, చేనేత అంటే పద్మశాలీయులే. అందువల్ల ఈ పుస్తకంలో అత్యధిక మంది ప్రముఖుల పేర్లు పద్మశాలీయులవే ఉంటాయి. చేనేత పరిశ్రమ కొంత దెబ్బతిన్న సమయంలో   ఆ పద్మశాలీయులే స్వర్ణకార వృత్తిని ఎంచుకున్నారు.  ఇప్పుడు ఇక్కడ చేనేత కార్మికులను మించి  స్వర్ణకారులు వేల సంఖ్యలో ఉన్నారు.  బంగారు ఆభరణాల తయారీ పరిశ్రమ బాగా  విస్తరించింది.  ఇక్కడి చేనేత వస్త్రాలు దేశవిదేశాలకు  ఎగుమతి అవుతున్నాయి. అలాగే, ఇక్కడ నైపుణ్యత గల స్వర్ణకారులు తయారుచేసే బంగారు ఆభరణాలు కూడా దేశంలోని  అన్ని రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.  అందువల్లే,  ప్రభుత్వం కూడా మంగళగిరిని చేనేత హబ్, గోల్డ్ హబ్‌గా తీర్చిదిద్దే ప్రయత్నాలు మొదలుపెట్టింది. పురాణ, ఇతిహాస కాలం నుంచి  సాంప్రదాయకంగా పద్మశాలీయులకు, దేవుడికి ఉన్న అనుబంధాన్ని కూడా రచయిత చారిత్రక ఆధారాలు, కోర్టు తీర్పులతో సహా  ఈ పుస్తకంలో   స్పష్టంగా వివరించారు. శాసనాల దగ్గర నుంచి పురాణ, చారిత్రక గ్రంథాలను  పరిశీలించి, పరిశోధించి, చరిత్రకారులను కలిసి పుట్టిన ఊరిపై మమకారంతో ఎంతో శ్రమించి మంగళగిరికి సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించారు. శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, ఆనంద గోత్రజులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, విజయనగర సామ్రాజ్యం, గోల్కొండ కుతుబ్ షాహీలు, ఫ్రెంచ్ వారు, ఆంగ్లేయులు,  స్వాతంత్య్రోద్యమం, మద్రాసు రాష్ట్రం, ఆంధ్రరాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌తో సహా అన్ని కాలాలలో మంగళగిరి ఎవరి పాలనలో ఎలా కొనసాగిందో  సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో చక్కగా వివరించారు. మంగళగిరిలో జరిగిన అనేక చారిత్రక సంఘటనలను అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అద్భుతంగా అందించారు. మంగళగిరికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. చిన్న గ్రామం నుంచి పంచాయతీ, సమితి, మండలం, తాలూకా, మునిసిపాల్టీ, నగరం వరకు మంగళగిరి ఎదిగిన తీరుని, ఆయా కాలాలలో ఇక్కడ జరిగిన అనేక ఆసక్తికర సంఘటనలను చక్కగా తెలిపారు. 

విజయనగర సామ్రాజ్య స్థాపకులు హరిహరరాయలు, బుక్కరాయలు మంగళగిరి నుంచే వలస వెళ్లారు.  పూర్వ కాలంలో కూడా మంగళగిరికి సమీపంలో అమరావతి, కంతేరు, విజయపురి, కొండపల్లి ప్రాంతాలు రాజధానులుగా ఉండేవి. క్రీస్తు పూర్వం 225 నాటికే ఉనికిలో ఉన్నట్లు ఆధారాలు ఉన్న  చారిత్రక ప్రసిద్ధిగాంచిన పట్టణం ఇది. రాష్ట్రంలో అత్యంత ఎత్తయిన 157 అడుగులు, 11 అంతస్తుల శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి గాలిగోపురాన్ని 1807-09 కాలంలో అప్పటి  ధరణికోట ప్రాంత జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు  నిర్మించారు. గాలిలో ఠీవిగా నిలబడినట్లు కనిపించే ఈ గాలిగోపురం మంగళగిరి వారసత్వ సంపద. ఈ దేవాలయంలో మూలవిరాట్‌ని ద్వారప యుగంలో పాండవులు అరణ్యవాస కాలంలో ధర్మారాజు ప్రతిష్ఠించారని చెబుతాను. భారీ ఎత్తున జరిగే మంగళగిరి తిరునాళ్లకు వందల ఏళ్ల చరిత్ర ఉంది.   రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుంది. దేశవిదేశీ యాత్రికులు ఈ ఆలయ సందర్శనకు వస్తుంటారు. నటసార్వభౌమ నందమూరి తారక రామారావు మొదట ఇక్కడే ఉద్యోగం చేశారు. మెగాస్టార్ చిరంజీవి (కొణిదెల శివప్రసాద్) ఇక్కడ కూడా చదివారు.  అన్నపూర్ణగా పేరుపొందిన కైవారం బాలాంబ ఆకలితో వచ్చిన వారందరికీ భోజనం పెట్టారు. ఇక్కడి కోర్టులో ఓ జడ్జి ఒకే రోజు 111 క్రిమినల్ కేసులను పరిష్కరించి జాతీయ రికార్డు సృష్టించారు. 1972లోనే   ఏపీఎస్పీ 6వ బెటాలియన్, 2018లో దక్షిణ భారతదేశంలోనే మొదటి ఎయిమ్స్‌ ఇక్కడ  ఏర్పాటు చేశారు. ఇలాంటి ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి.  ఇక్కడ మంచినీటి సమస్య వల్ల, దూరాన ఉన్న భావులలో నీరుతోడుకుని, మోసుకురావాలని  ఒకప్పుడు మంగళగిరి అంటే ఆడపిల్లని ఇచ్చేవారు కాదు. లోతైన బావులలో నీరు తోడటానికి బక్కెట్‌కు కట్టే తాడు చాలా పొడవైనది వాడటం వల్ల, పొడవు గురించి చేప్పే సమయంలో ‘మంగళగిరి చాంతాడంత’ అనేవారు. చాంతాడు అంటే చేద+తాడు. ఇప్పడు ఆ సమస్యలేదులేండి. కృడష్ణానీరు వస్తోంది. 

ఇక్కడ మొదటి నుంచి కాంగ్రెస్, కమ్మూనిస్టులు, బీజేపీ, జనసంఘ, తర్వాత బీజేపీ, భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం(యూసీసీఆర్‌ఐ–ఎంఎల్‌) పార్టీలు ఉన్నాయి. రాజకీయంగా చైతన్యవంతమైన గడ్డ ఇది. ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడ...’ అనే పాట రాసిని కమ్యూనిస్టు పోరాట యోధుడు వేములపల్లి శ్రీకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచిన నేల ఇది. ఇక్కడ ఆయా పార్టీలలో నేతల మధ్య విభేదాలు, గ్రూపులు ఉంటాయి. స్థానిక సంస్థల నుంచి లోక్ సభ వరకు ఎన్నికలలో  అభ్యర్థులు పోటాపోటీగా  నిలుస్తారు. అయితే, ఎవరూ హింసకు దిగరు. అదే మంగళగిరి ప్రత్యేకత.  కృష్ణా జిల్లా మాన్యువల్ ప్రకటించిన గోర్డన్ మెకంజి కూడా చారిత్రకంగా యుద్ధాల మధ్య కూడా మంగళగిరిలో శాంతికి భంగం కలగకుండా ప్రశాంతత కొనసాడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంగళగిరికి సంబంధించి వివిధ అంశాలను సుదీర్ఘ పరిశోధన చేసి 30 భాగాలుగా విభజించి రచయిత రాశారు. పాలనాపరంగా, రాజకీయంగా, సామాజికంగా ఎన్నో ఆసక్తికర అంశాలు ఇందులో ఉన్నందున, మంగళగిరి వారితోపాటు ఇతరులు కూడా చదవదగిన పుస్తకం. వినియోగదారుల ఉద్యమకారుడైన విశ్రాంత రైల్వే ఉద్యోగి మాదిరాజు గోవర్థన రావు  ప్రశాంతంగా జీవనం గడపవలసిన 70 ఏళ్ల వయసులో   తను పుట్టిన గడ్డపై ఉన్న మక్కువతో సుదీర్ఘ పరిశోధన చేసి, పుస్తకాల చదువరులు తగ్గిన ఈ రోజుల్లో  ఇంత ఖర్చుతో ఈ పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయం.  


పుస్తకం పేరు : మంగళగిరి 2.0

 వెల : రూ.490

కాపీల‌కు : 970198632

            - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914


May 15, 2025

పిట్టల దొరగా గంజి వెంకయ్య


పిట్టల దొర వేషం వేయడంలో మంగళగిరిలో  గంజి వెంకయ్య( గంజి చిరంజీవి తండ్రి) గారు టాప్.  మా ఇంటి ఎదరే వారు ఉండేవారు. నేను మామయ్య అనేవాడిని.    ఆయన ఆ వేషంలో మాటలు చెప్పడం నేను ఒకటి రెండుసార్లు మాత్రమే చూశాను.  ఆయన పక్కా సీపీఐ.  ప్రజానాట్యమండలి కళాకారులు.   తర్వాత తర్వాత ఆయన రెండు మగ్గాల షెడ్లకు మేస్త్రిగా, ఆ తర్వాత వస్త్ర వ్యాపారంలో బిజీ అయిపోవడంతో  ఆ కళకు పూర్తిగా దూరమైపోయారు.  పిట్లల దొరగా ఆయన ఏం చెబుతారో రాసుకుందామని, దానిని రికార్డు చేయాలని దీపాల సాయిబాబా చాలా ప్రయత్నించారు. దీపాల సాయిబాబా అంటే ఒకప్పుడు గంజి వెంకయ్యగారి బిల్డింగ్(మగ్గాల షెడ్)లో నేత నేసేవారు. భార్గవపేటలో ఉండేవారు.  ఆ తర్వాత ఆయన నేతాజీ హోటల్, తర్వాత అదే  ఉడిపి హోటల్ వద్ద కిల్లీ షాపు నడిపారు. వయసులో పెద్ద అయినా, నాకు మంచి మిత్రులు. గంజి వెంకయ్య గారి వద్దకు ఓ రోజు టేప్ రికార్డర్ తీసుకుని సాయిబాబా , నేను వెళ్లాం.  పిట్టల దొరగా ఏం చెబుతారో చెప్పమని సాయిబాబా అడిగారు.   ‘‘విడిగా చెప్పలేను. ఫ్లోలో చెప్పుకుంటూ పోతాను. రికార్డు చేసుకో’’ అని చెప్పారు. అప్పటికే ఆయనకు చాలా కాలం గ్యాప్ వచ్చింది. మధ్యమధ్యలో ఆపుకుంటూ, గుర్తు తెచ్చుకుంటూ చాలా సేపు చెప్పినట్లు గుర్తు. అప్పుడు రికార్డు చేశారు. అది ఉందో లేదో తెలియదు. పిట్టల దొర వేషంలో ఆయన చెప్పడం చాలా సరదాగా ఉండేది. నవ్వు ఆపుకోలేకపోయేవారం. స్థానిక సమస్యల నుంచి అంతర్జాతీయ సమస్య వరకు అన్నిటికి పరిష్కారాలు చెప్పేవారు. ఆయన కమ్యూనిస్టు అయినందున రష్యా, అమెరికాతో సహా చాలా విషయాలు ప్రస్తావించేవారు.  ఆయన చెప్పే తీరు, ఆయన భాషా శైలి కూడా నవ్వు తెప్పించేవిధంగా ఉండేది.  మంగళగిరి బుద్ధవిహార్ అధ్యక్షులు రేఖా క‌ృష్ణార్జున రావు గారు వాట్సాప్ గ్రూపులో  ఓ పిట్టల దొర ఈ ఫొటో పెట్టడంతో  నాకు మా గంజి వెంకయ్య మామ గుర్తుకు వచ్చారు.      ఇటువంటి కళలను ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, కళా సంస్థలు రికార్డ్ చేయాలని,  ఆ తర్వాత నాకు అనిపించింది.

క‌ృష్ణార్జున రావు గారు పెట్టిన ఫొటో 



May 12, 2025

మంగళగిరిలోనే చేనేత, గోల్డ్ హబ్‌‌లు ఎందుకు?

మంగళగిరి 2.0 పుస్తక సమీక్ష


గుంటూరు జిల్లా మంగళగిరి గురించి మనం తెలుసుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి. మంగళగిరి అంటే  చేనేత పరిశ్రమ, బంగారు ఆభరణాలు, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, ఎత్తయిన గాలిగోపురం, తిరునాళ, కొండపైన పానకాల స్వామి, కొండ శిఖరాన గండాలయ దీపం.. అనేకం  గుర్తుకు వస్తాయి. క్రీస్తు పూర్వం 225 నాటికే ఉనికిలో ఉన్నట్లు ఆధారాలు ఉన్న  చారిత్రక ప్రసిద్ధిగాంచిన పట్టణం ఇది. ఆంధ్ర శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, ఆనందగోత్రిజులు,  విష్ణు కుండినులు, చాళుక్యులు, కాకతీయులు, ఢిల్లీ సుల్తానులు, రెడ్డి రాజులు, గజపతులు, శ్రీ కృష్ణదేవ రాయలు, కుతుబ్‌షాహీలు, ఆ తరువాత ఫ్రెంచ్, నిజాం, బ్రిటీష్ వారి పాలనలో మంగళగిరి ప్రాంతం ఉంది.  రాష్ట్రంలో అత్యంత ఎత్తయిన 157 అడుగులు, 11 అంతస్తుల శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయ గాలిగోపురాన్ని 1807-09 కాలంలో అప్పటి  ధరణికోట  జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు  నిర్మించారు. ధరణికోట జమిందారు మంగళగిరిలో ఇంత పెద్ద గాలిగోపురం కట్టడం ఏమిటి? ఇది మంగళగిరికి ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఇటువంటి మంగళగిరి చరిత్రని 36 రచనలు చేసిన, చేయితిరిగిన రచయిత, న్యాయవాది  మాదిరాజు గోవర్థన రావు  సుదీర్ఘ పరిశోధన చేసి ఎన్నో అంశాలను కూలంకషంగా వివరిస్తూ ‘మంగళగిరి 2.0’ అనే పేరుతో పుస్తకం రాశారు. ఇటీవలే ఈ పుస్తకాన్ని విద్య, ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ఇందులో మంగళగిరి గురించి చారిత్రకంగా, రాజకీయంగా, సామాజికంగా అనేక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. చెన్నై-కోల్‌కత 16వ నెంబర్ జాతీయ రహదారిపైన గుంటూరు-విజయవాడ నగరాల మధ్యన ఉన్న ఓ గ్రామం కాల క్రమంలో నగరంగా ఎదిగిన క్రమాన్ని రచయిత చాలా చక్కగా వివరించారు. ఇక్కడ అత్యంత నైపుణ్యం గల చేనేత కార్మికులు, చేయితిరిగిన స్వర్ణకారులు, విద్యావంతులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు, క్రీడాకారులు అనేక మంది ఉన్నారు. చేనేత, దాని అనుబంధ వృత్తులు, వ్యాపారాలు, స్వర్ణకారులు ఇక్కడ 25 వేల మందికి పైగా ఉన్నారు. ఒక్క స్వర్ణకారులే 15 వేల మంది వరకు ఉంటారు. అందువల్లే ప్రభుత్వం మంగళగిరిని చేనేత, గోల్డ్ హబ్‌‌లుగా తిర్చిదిద్దుతోంది.  మంగళగిరికి సంబంధించిన  ఎన్నో చారిత్రక అంశాలను ఆధారలతోసహా రచయిత ఇందులో పొందుపరిచారు. పురాణలు, ఇతిహాసాలు, చారిత్రక గ్రంథాలను అధ్యయనం చేయడంతోపాటు చరిత్రకారులను, ఇతర అనేక మందిని కలిసి ఎంతో శ్రమించి గోవర్థన్ ఈ పుస్తకం రాశారు. పుస్తకాలకు కాలం చెల్లిందనుకుంటున్న రోజుల్లో సొంత ఊరిపై మక్కువతో ఆయన వ్యయప్రయాసలకోర్చి దీనిని తీసుకువచ్చారు.  

 

చేనేతకు ప్రసిద్ధి చెందిన నగరం అయినందున, ఆ వృత్తి, దాని అనుబంధ వృత్తులు చేసేవారందరూ పద్మశాలీ సామాజిక వర్గానికి చెందినవారే ఉంటారు. అందువల్ల మంగళగిరిలో  అత్యధిక మంది పద్మశాలీయులు, ఇతర చేనేత ఆ సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారు. ఇక్కడి విద్య సంస్థలు, వ్యాపారాలు, సినిమా హాళ్ల యాజమాన్యం... వంటివి వారి చేతిలోనే ఉంటాయి. రాజకీయాలు కూడా వారి చుట్టూనే తిరుగుతుంటాయి. ఇక్కడ నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా పద్మశాలీయులే గెలిచారు. ఇప్పటి వరకు ఇద్దరే ఎమ్మెల్సీలు అయ్యారు.  ఆ  ఇద్దరూ వారే. టీటీడీ బోర్డు సభ్యులుగా మంగళగిరి నుంచి ముగ్గురికి అవకాశం వచ్చింది. ఆ ముగ్గురూ పద్మశాలీయులే. మునిసిపల్ చైర్మన్లు కూడా అందరూ చేనేత వర్గంవారే. రచయితలు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు.. కూడా వారే ఎక్కువగా ఉంటారు.  అలాగే, ఇక్కడి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణం సందర్బంగా ముఖ్యమైన తంతు వారే నిర్వహిస్తారు.  బ్రహ్మాత్సవాలలో  స్వామివారి కళ్యాణం సందర్భంగా మెట్టెలు, మంగళసూత్రాలు, తలంబ్రాలు, మధుపర్కాలు, ఉత్తర జందెం  స్థానిక పద్మశాలీయులే సమర్పించే ఆచారం అనాదిగా కొనసాగుతోంది. అయితే,  1915లో అప్పటి దేవస్థానం ధర్మకర్త ఆ ఆనవాయితీకి విరుద్ధంగా వ్యవహరిస్తే, పద్మశాలీయులు కోర్టుకు వెళ్లి తమ హక్కుని సాధించుకున్నారు. అప్పటి నుంచి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ  సాంప్రదాయం అలాగే కొనసాగుతోంది.  ఇక్కడి చేనేత కార్మికులు అత్యంత నైపుణ్యంతో  చేనేత వస్త్రాలను తయారు చేస్తారు.  మంగళగిరి చేనేత కేంద్రంగా ఎదగడం, ఇక్కడి రంగుల ప్రత్యేకతలు, చేనేత వర్గం వారే స్వర్ణకారులుగా మారిన క్రమం ఇందులో వివరించారు. అతి సన్నని దారాలతో చేనేత వస్త్రాలను తయారు చేసే ఓర్పు, నైపుణ్యం వారికి ఉన్నందున, ఆ పరిశ్రమ దెబ్బతిన్న సమయంలో అంతే ఓర్పు, నైపుణ్యంతో చేసే బంగారు వస్తువుల తయారీలో వారు బాగా రాణించారు.   మంగళగిరి రాజకీయంగా ఎంతో చైతన్యం కలిగిన నేల. ఎంతటి చైతన్యం ఉన్నా రాజకీయాలు శాంతియుతంగా నడపడం ఇక్కడి ప్రత్యేకత.  కాంగ్రెస్, జనసంఘ్, బీజేపీ, కమ్యూనీస్టులతోపాటు నాస్తిక, హేతువాద ఉద్యమాలు నడిచిన గడ్డ. ఇక్కడ ఒకప్పుడు కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువ. నాలుగు సార్లు వారే ఎమ్మెల్యేలుగా గెలిచారు.  వేములపల్లి శ్రీకృష్ణ  రెండు సార్లు గెలిచారు. విజయనగర సామ్రాజ్య వ్యవస్థాపకులైన హరిహరరాయలు, బుక్కరాయలు మంగళగిరి నుంచి వలస వెళ్లారు. మంగళగిరి కొండ, దేవాలయ విశిష్టత, ఆకలితో వచ్చిన అందరికీ 24X7-365 రోజులు భోజనం పెట్టిన  నిరతాన్నదాత్రి కైవారం బాలాంబ, మహానటుడు ఎన్టీఆర్ ఇక్కడ సబ్ రిజిస్ట్రార్‌ ఉద్యోగంలో చేరడం, ఆయన మనవడు లోకేష్  ఎమ్మెల్యేగా ఓడటం, గెలవడం, మెగాస్టార్ చిరంజీవి ఇక్కడ 2వ తరగతి  చదువుకోవడం, సీనీనటి జమున ఎన్నికలలో పోటీ చేయడం, రచయితలుగా, జర్నలిస్టులుగా కొలికపూడి బ్రదర్స్, శిరందాసు బ్రదర్స్ ఎదగడం, పూసపాటి నాగేశ్వరరావు, అందే నారాయణ స్వామి, ఏరోనాటికల్ ఇంజనీర్ నీలి రాజేంద్ర, రాయలసీమ యూనివర్సిటీ వీసీ ఉడతా వెంకట బసవ రావు వంటివారి గురించి,  మంగళగిరి రాజధానిలో భాగమైన తర్వాత ఐటీ పార్క్, ఎయిమ్స్‌ వంటివి   ఏర్పాటు కావడంతో ఏ విధంగా అభివృద్ధి చెందుతోంది... వంటి అన్ని అంశాలను ఆమూలాగ్రం  ఇందులో చోటు కల్పించారు.  మంగళగిరికి సంబంధించిన అన్ని అంశాలను 30 భాగాలు విభజించి,  544 పేజీలతో   సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో రచయిత గోవర్థన్ చక్కటి తెలుగులో  రాశారు. ఈ పుస్తకం చదివే పాఠకులకు తమ తమ గ్రామాలు అభివృద్ధి చెందిన క్రమం గుర్తుకు వస్తుంది. 


ఈ పుస్త‌కం వెల రూ.490

కాపీల‌కు ఫోన్: 9440264336

                                          - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

May 11, 2025

తెలంగాణలో ఉద్యోగులు, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ ఆస్పత్రులు

తెలంగాణలో ఉద్యోగులు, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ ఆస్పత్రులు

Name of the Hospital                               mitra name                   contact number
Virinchi Hospital                                      Sriranganayakulu          8125549618
Medivision eye Hospital                         Sriranganayakulu             8125549618
Gleneagles (global) Hospital, Lakdikapul. TRIVENI 7729827915
Vasavi hospital                                         Sujala                             8019253712
Omega Hospital, Bnjarahills                     Naresh                         9440368472
Basavatarakam Hospital                             sai kiran                     9381901115
Apollo medical college                             Anitha                         7702225689
Apollo spectra HOSPITAL , Ameerpet     Siva                             9392713606
Wellness Hospital, Ameerpet                     Siva                             9392713606
Landmark Hospital                                 Swathi                            9700013046
Asterprime Hospital                                 Siva                                9392713606
SLG hospital                                             Vijaya                             9502734771
mamatha medical college Swami nayak 9000053526
Archana Hospital Hanuman naik 7893735490
Global eye Hospital Anusha 8184920245
Madhava Nursing home Devender 8106870135
kotagiri dental Hospital, secundrabad Devender 8106870135
AP super speciality Dental Hospital, Banjarahills Tarun 7396202297
Vascular care center, Somajiguda Mastan 9603607981
Anand eye Hospital Arunasri 9381221973
Pushphagiri eye Hospital Sirichandana 9703760068
kamineni Hospital,kingkoti Praveen 8179025959
Kamineni Hospital, LB nagar Divyapriya 9281068618
Kims BIBI Renova Hospital Kotaiah 7995707521
Century Renova Hospital Neelima 7780650432
Kamala tahalasemia Hospital Prabhuraj 9885187713
Mahaveer hospital Afjul begum 9160076663
MNJ cancer Hospital jakkiraiah 9959811024
Malla reddy Narayana Hospital padma 9087960841
Ramdev Rao Hospital Saba anjum 8801234223
Redcross Hospital Hemalatha 9866744618
Sri sri Holistic Hospital sulochala 9550888363
Prathima Hospital,KPHB Rajitha 9949321475
TX Hospital, uppal Manasa 6305661627
Durgabhai deshmuk Hospital Aparna 7995615451


May 5, 2025

బౌద్ధం విలసిల్లిన నేల

12న మంగళగిరిలో  2,569వ బుద్ధ జయంతి వేడుకలు


మానసిక ప్రశాంతత, మానవతా విలువలతో కూడిన ఉత్తమ పౌరుడిని తయారుచేయడమే బౌద్ధం ప్రధాన లక్షణం. క్రీస్తు పూర్వం 400 నుంచి 600 వరకు మంగళగిరి, అమరావతి ప్రాంతంలో బౌద్ధం విలసిల్లింది. కృష్ణానదీ తీరంలో బౌద్ధం పరిఢవిల్లింది.   పురాతన బౌద్ధ ఆరామాల ఆనవాళ్లు ఇప్పటికీ మంగళగిరి ప్రాంతం ఎర్రబాలెం కొండపై ఉన్నాయి. నిడమర్రులో బుద్ధుని విగ్రహాలు బయటపడ్డాయి. ఆరామాలు, విగ్రహాలకంటే బౌద్ధ భావజాలం ముఖ్యం. మన సమాజంలో వివిధ రూపాలలో బౌద్ధ భావజాలం అంతర్లీనంగా కొనసాగుతోంది. అందవల్లే పక్కన పల్నాడుకంటే ఈ ప్రాంతవాసులు శాంతికాముఖులుగా ఉంటారు.   ఈ ప్రాంతంలో నాస్తికులు, హేతువాదులు, కమ్యూనిస్టులు, మానవతావాదులు.. వంటి వారు కూడా బుద్ధుడి బోధనలకు ప్రాధాన్యత ఇచ్చారు. బౌద్ధం పరంగా ఈ ప్రాంత ప్రాధాన్యతను గుర్తించి  బౌద్ధ గురువు దలైలామా  2006లో అమరావతిలో పెద్ద ఎత్తున ‘కాలచక్ర’ ఉత్సవాలు నిర్వహించారు. బౌద్ధ భావజాలాన్ని ఔపోసన పట్టిన ఉత్తమ మానవుడు  రేఖా కృష్ణార్జున రావు 25 సంవత్సరాల క్రితం మంగళగిరిలో బుద్ధ విహార్‌ని ఏర్పాటు చేశారు. మంగళగిరి బుద్ధ విహార్‌ అధ్యక్షులుగా, ఆ భావజాలానికి దగ్గరగా ఉన్న వివిధ వర్గాలకు చెందిన అనేక మందిని సభ్యులుగా చేర్పించారు.  బుద్ధుని బోధనలకు విశేష ప్రాచుర్యం కల్పించారు. ఎంతో శ్రమకోర్చి, ఆర్థిక భారం భరిస్తూ ‘బుద్ధభూమి’ మాస పత్రికను దీర్ఘకాలంగా తీసుకువస్తున్నారు. మానవతా విలువలు కలిగిన శాంతియుత సమాజాన్ని సృష్టించాలన్నదే ఆ ఉత్తమ మానవుడు  కృష్ణార్జున రావు లక్ష్యం.  మంగళగిరి బుద్ధ విహార్ ఆధ్వర్యంలో బౌద్ధ అభిమానులను సమీకరించి, దేశంలోని బౌద్ధ కేంద్రాలను పర్యటిస్తుంటారు. బుద్ధ విహార్‌ ఆధ్వర్యంలో బుద్ధుని జన్మదిన వేడుకలు, బౌద్ధ బోధనలు, యోగా, బౌద్ధ భావజాలంపై అవగాహన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు.. వంటివి వందల సంఖ్యలో నిర్వహించారు.  మనవతావాది  కృష్ణార్జున రావు సారథ్యంలో బుద్ధ జయంతి(పూర్ణిమ) వేడుకలు 22 ఏళ్లపాటు ఘనంగా జరిగాయి. బౌద్ధంతోపాటు మానవ సంబంధాల విలువను ఆయన నుంచి నేర్చుకున్న అభ్యుదయ రచయిత, మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు, వేదిక ఇతర బాధ్యులు ఆ తర్వాత నుంచి బుద్ధ పూర్ణిమ వేడుకలను కొనసాగిస్తున్నారు.    రేఖా కృష్ణార్జున రావు అమూల్యమైన  సలహాలు, సూచనలు, సహాయ సహకారాలతో మానవతా వేదిక ఆధ్వర్యంలో ఈ ఏడాది  2,569వ బుద్ధ జయంతి వేడుకలు, మంగళగిరిలో బుద్ధపూర్ణిమ రజతోత్సవ వేడుకలు  ఘనంగా నిర్వహించతలపెట్టారు.  ఈ వేడుకలు ఈ నెల 12న  మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డులోని నన్నపనేని నాగేశ్వరరావుకు చెందిన రాయల్ ఏసీ మెగా ఫంక్షన్ హాలులో జరుగుతాయి. ఈ వేడుకలు నిర్వహిస్తున్న మంగళగిరి బుద్ధి విహార్, మానవతా వేదిక వారికి అభినందనలు. ఈ వేడుకలకు మానవతావాదులందరూ హాజరుకావలసిందిగా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాను. 


శిరందాసు నాగార్జున రావు, సీనియర్ జర్నలిస్ట్.


May 2, 2025

ఎడిటోరియల్ పేజీ వ్యాస రచయితలకు గౌరవం

ఏపీ ఫెరా మాజీ చైర్మన్ డాక్టర్ రామనాధ్ వెలమాటి, ఎన్ఆర్ఐ శేషుల నుంచి మొమోంటో అందుకుంటున్న సీనియర్ జర్నలిస్ట్ శిరందాసు నాగార్జున రావు. పక్కన వరుసగా రేపటి కోసం ఎడిటర్ శాఖమూరి శివప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ మిక్కిలినేని శ్రీకాంత్, కాలం రైటర్ బొల్లాప్రగడ శ్రీదేవి.
-----------------------------------------------------------------------------------------------------------------

మేడే సాయంత్రం గుంటూరు LVR Club Convention Hallలో ‘రేపటి కోసం’ దినపత్రిక 7వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిధులు, వారి విలేకరులతోపాటు ఆ పత్రిక ఎడిటోరియల్ పేజీకి వ్యాసాలు రాసిన వారికి కూడా  మొమోంటోలు ఇచ్చి గౌరవించారు.  అదీ ఈ వార్షికోత్సవ ప్రత్యేకత.   ఈ వార్షికోత్సవంలో ముఖ్య అతిధులుగా మాజీ మంత్రి, శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర, శాసనసభ్యురాలు గల్లా మాధవి, ఏపీ ఫెరా మాజీ చైర్మన్ డాక్టర్ రామనాధ్ వెలమాటి, లెడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాల రావు,ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, ఎన్ఆర్ఐ శేషు హాజరయ్యారు. 

నా మొదటి వ్యాసం 1984లో తెలుగు విద్యార్థి మాస పత్రికలో అచ్చయింది. అప్పుడు వారు ఆ పత్రిక కాపీని మా ఇంటికి పోస్ట్ చేశారు. అదే ఏడాది నేను రాసిన మరో వ్యాసం ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ పేజీలో వచ్చింది.  వారు రూ.50 రూపాయలు ఎంఓ చేశారు. అలా కొందరు ఎంతోకొంత ఇచ్చేవారు. సాక్షి పెట్టిన కొత్తలో చాలా కాలం వ్యాసానికి రెండు వేల రూపాయలు ఇచ్చేవారు. ఇటీవల కాలంలో ఆ సాంప్రదాయం అంతా పోయింది.   ఒక్క ఈనాడు మాత్రమే అలా ఇస్తున్నట్లుంది.  నేను ఈనాడు తప్ప దాదాపు అన్ని పత్రికల ఎడిటోరియల్ పేజీలకు వ్యాసాలు రాస్తుంటాను. డబ్బు ఎవ్వరూ ఇవ్వడంలేదు. సూర్య వారు  కేవీఎస్ సుబ్రహ్మణ్యం గారు బాధ్యులుగా ఉన్నప్పుడు మాత్రం డబ్బు పంపారు. ఇటీవల కాలంలో విశాలాంధ్ర వారు వ్యాసం ప్రచురించిన కాపీని పోస్టులో పంపేవారు.  ఇలాంటి పరిస్థితుల్లో ‘రేపటి కోసం’ యాజమాన్యం వారు వ్యాసాలు రాసిన వారిని పిలిచి మరీ గౌరవించడం సంతోషంగా ఉంది. వ్యాస రచయితలను కూడా గౌరవించినందుకు ధన్యవాదాలు.  


ఈ పత్రికతో నాకు చాలా కాలం నుంచి అనుబంధం ఉంది. దీనిని రిటైర్డ్ డీఎస్పీ బొప్పన విజయకుమార్ గారు దీనిని మాస పత్రికగా ప్రారంభించారు. దీనిని చాలా కాలం కమిలిశ్రీ గారు చూసేవారు. వీరిద్దరూ నాకు మంచి మిత్రులే.   అప్పట్లో విజయకుమార్ గారు అడిగితే,  ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తారు? దాని వల్ల కలిగే ప్రయోజనాలు, ఆ హోదా కలిగిన రాష్ట్రాలకు సంబంధించి అధ్యయనం చేసి వరసగా కొన్ని వ్యాసాలు రాసి ఇచ్చాను. ప్రచురించారు.  విజయకుమార్ గారి ఆరోగ్యం దెబ్బతినడంతో  మిక్కిలినేని శ్రీకాంత్ గారు దానిని ఏడాది నుంచి పెద్ద ఎత్తున దినపత్రికగా తీసుకువస్తున్నారు. డిజటల్ ఎడిషన్‌తోపాటు  దాదాపు ఏడు జిల్లాల్లో ఇది ప్రింట్ ఎడిషన్‌గా కూడా వస్తోంది. ఇప్పుడు దీనికి ఎడిటర్ శాఖమూరి శివప్రసాద్ గారు, మరో బాధ్యులుగా గుంటూరు చంద్రశేఖర్‌గారు ఉన్నారు. వీరితోపాటు ఆ పత్రిక బ్యూరో చీఫ్ మల్లికార్జున రావు గారు, సచివాలయ రిపోర్టర్ మల్లికార్జున తదితరులు కూడా నాకు మంచి మిత్రులే. చంద్రశేఖర్‌ గారు నాకంటే చాలా సీనియర్.నేను విశాఖ సిటీ డెస్క్ ఇన్ చార్జిగా చేసే సమయంలో ఆయన ఎడిషన్ ఇన్ చార్జిగా ఉండేవారు. 

                                                                                                       - శిరందాసు నాగార్జున

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...