Mar 29, 2025

పంచాంగశ్రావణం - పంచాంగ శ్రవణం

మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు-

ఈ ఉగాది సందర్భంగా, మాధ్యమాల్లో విరివిగా వినవస్తున్న/కనవస్తున్న మాట "షష్ఠగ్రహకూటమి" అనేది. ఆరు గ్రహాల కలయిక అనేది వారి భావం. కాని ఈ సందర్భంగా వాడవలసిన మాట "షట్" అని – ‘షట్’ అంటే ఆరు, ‘షష్ఠ’ అంటే ఆరవ అని అర్థాలు(సంఖ్యావాచకం-పూరణవాచకం). కనుక షష్ఠగ్రహకూటమి అంటే ఆరవ గ్రహ కూటమి అనే తప్పు అర్థం వస్తుంది . ఆరు గ్రహాల కలయిక అనే అర్థం రావాలంటే షట్ గ్రహ కూటమి - షడ్గ్రహ కూటమి అనాలి.  షట్చక్రవర్తులు, షట్ఛాస్త్రాలు/షట్శాస్త్రాలు అన్నట్లు. మరికొందరు షష్ఠికి బదులు షష్టి అని కూడా వాడుతున్నారు. దానికి 60 అని అర్థం. అది కూడా గమనీయమే. ఇక ప్రాచీనుల దృష్టిలో "షష్ఠగ్రహకూటమి" అనే సమాసం కూడా తప్పే, కాని ఆధునికులు దాన్ని ఆమోదిస్తున్నారు.

ఉగాది నాటి కర్తవ్యాల క్రమంలో అభ్యంగనస్నానం అంటుంటారు- ఇది అభ్యంగస్నానం మాత్రమే.

 మరోమాట- “పంచాంగశ్రవణం”. ఇది శ్రోత పరంగా చెప్పవలసిన మాట. వక్త పరంగా “పంచాంగశ్రావణం” అని చెప్పాలి. రెండుచోట్ల పంచాంగశ్రవణం అని వాడడం సమంజసం కాదు.  పత్రికలలో/టీవీలో- ‘‘ఫలానా వారు పంచాంగ శ్రవణం చేసారు/చేస్తారు’’  అని రాయడం/అనడం సరికాదు. శ్రవణం అంటే వినడం; శ్రావణం అంటే వినిపించడం. సిద్ధాంతి/పురోహితుడు చేసేది పంచాంగ శ్రావణం, శ్రోతలు చేసేది పంచాంగశ్రవణం.ఈ స్పష్టత తెలియనప్పుడు , వక్త పరంగా పంచాంగపఠనం, శ్రోత పరంగా పంచాంగశ్రవణం అని వాడుకోవచ్చు.

మన తరువాతి తరాలకు మనం అందించవలసిన వాటిలో  మంచిభా‌ష కూడా ఒకటి కదా! 

- డాక్టర్ పి.నాగమల్లీశ్వరరావు (తప్పొప్పుల కోశ కర్త)

No comments:

Post a Comment

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...