బంగారు కుటుంబం-మార్గదర్శి
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మదిలో మెదిలిన మరో కొత్త ఆలోచన జీరో పావర్టీ -P4 విధానం. ఇది మరో విప్లవాత్మక ఆలోచన. ఈ నెల 30వ తేదీ ‘విశ్వావసు’ తెలుగు సంవత్సరాది నాడు ప్రారంభించే ఈ విధానాన్ని సీఎం గేమ్‌ఛేంజర్‌గా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణ ఆంధ్ర@ 2047లో భాగంగా, వచ్చే ఐదేళ్లలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేస్తోంది. సామాజిక-ఆర్థికాభివృద్ధిలో సరికొత్త మార్పులకు ఈ పీ4(ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు, ప్రజల భాగస్వామ్యం) నాంది పలుకుతుంది. ఇది సమ్మిళిత వృద్ధి ద్వారా సమాజంలోని బలహీన వర్గాలను పైకి లేపడానికి నిరంతరంగా పనిచేసే ఓ ప్రక్రియ. సమాజంలోని పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఇది పనిచేస్తుంది.ఈ విధాన ప్రధాన లక్ష్యం సమాజజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10 శాతం మంది, అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేదలను దత్తత తీసుకుని, వారికి అండగా నిలిచి, వారిని పేదరికం నుండి పైకి తీసుకురావడం. వెనుకబడిన కుటుంబాల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు ‘ప్రభుత్వ , దాతల, ప్రజల భాగస్వామ్యంతో దీనిని రూపొందించారు. స్వర్ణ ఆంధ్రప్రదేశ్-2047 'పది సూత్రాల'లో ఒకటైన 'సున్నా పేదరికం' లక్ష్యాన్ని సాధించేందుకు, సమాజంలో ఆర్థిక అంతరాలను తగ్గించేందుకు, అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు (హెచ్‌ఎన్‌ఐలు), ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు భాగస్వాములు కావడానికి ఈ విధానం దోహదపడుతుంది. ఈ పథకంలో లబ్ధిదారులను 'బంగారు కుటుంబాలు' అని, సహాయం చేసే ఆర్థికంగా బలమైన వారిని 'మార్గదర్శి' అని పిలుస్తారు. ఈ పేర్లను ప్రజల సూచనల మేరకే ఖరారు చేశారు. ఆర్థికంగా అండగా నిలిచే 'మార్గదర్శి'లు తమకు తోచిన విధంగా నిధులతో పాటు, సమయం ఉన్నవారు ఆర్థిక విషయాల్లో సలహాలు, కెరీర్ గైడెన్స్, ఉద్యోగ అవకాశాలు, విద్యా ఖర్చులకు సహాయం లేదా వ్యాపారాలకు పెట్టుబడి వంటి సహాయం కూడా అందిస్తారు. ఈ విధానం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సాధికారత సాధిస్తుందని కూటమి ప్రభుత్వం విశ్వసిస్తోంది.ఈ విధానం అమలులో ప్రభుత్వం ఏ రకమైన ఆర్థిక సాయం చేయదు. బంగారు కుటుంబాలకు, మార్గదర్శులకు మధ్య సమన్వయ కర్తగా పని చేస్తుంది. ప్రభుత్వంలోని వివిధ శాఖలు సర్వేల ద్వారా పేద కుటుంబాలను గుర్తిస్తాయి.అర్హులైన కుటుంబాలు ఈ పథకంలో భాగమవుతాయి.ఈ విధానం సమర్థవంతంగా అమలు చేసేందుకు, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రియల్ టైమ్ డేటాని సేకరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే డిజిటల్ వేదిక నుంచి మార్గదర్శులు తాము సహాయం అందించే కుటుంబాలను ఎంచుకుంటారు. పీ4లో భాగంగా పేద కుటుంబాలకు విద్య, వైద్యం,ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం, మరుగుదొడ్లు, తాగునీటి కనెక్షన్లు, గ్యాస్ కనెక్షన్లు, నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు సౌర విద్యుత్ ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, హై-స్పీడ్ ఇంటర్నెట్ వంటి సౌకర్యాలను కల్పిస్తారు. ఈ విధానం ద్వారా మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు లబ్ధి చేరుకూరుతుందన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది.2029 నాటికి పేదరికం నిర్మూలించాలన్నదే ప్రభుత్వ సంకల్పం.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914
No comments:
Post a Comment