హిందూ, ముస్లిం, క్రైస్తవం... వంటి మతవాదనలే నా దృష్టిలో తప్పు. సమాజానికి హాని కలిగించనంత వరకు ప్రభుత్వం ఎవరి మత విశ్వాసాలను వారిని అనుసరించనివ్వాలి. మతం విషయంలో, ప్రార్థనా మందిరాలు, మత ట్రస్ట్ లు... వంటి విషయంలో ప్రభుత్వ జోక్యం సరైనది కాదు. సమాజానికి హాని కలగకుండా వాటిని పర్యవేక్షిస్తుండాలి. మత సంస్థలు, దేవాలయాలన నిర్వహణకు సంబంధించి ఒక కామన్ చట్టం చేయాలి. ప్రత్యేక చట్టాలు, హక్కులు ఉండకూడదు. మత విశ్వాసాలని వెసులుబాటు ఇవ్వడం సరైనది కాదు. రోడ్డు పక్కన ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు కట్టేస్తున్నారు. వారి మనోభావాలు దెబ్బతింటాయని అలా వదిలివేస్తామా? ఒక ప్రాంతంలో ఒక మతస్తులుంటే, వారి ఇళ్ల మధ్యలోకి వచ్చి ఇతర మతస్తులు ప్రార్థనా మందిరాలు కడుతున్నారు. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, హిందూ దేవాలయాలకు సంబంధించిన భూములు, ఆస్తులు ఇతరులకు పంచేస్తున్నారు. అది సమర్థనీయమా? మసీదులు, చర్చిల ఆస్తులు అలా పంచుతారా? అలా పంచితే సమర్థిస్తారా? ఓ హిందూ వృద్ధురాలు ఓ హిందూ దేవుడిపై విశ్వాసంతో తన నాలుగు ఎకరాల భూమిని హిందూ దేవాలయానికి దానం చేసింది. ఆ తర్వాత ఆ భూమిని ప్రభుత్వం పేదలకు పంచింది. ఆ ప్రాంతంలో ఏర్పడిన కాలనీకి ఆ హిందూ దేవుడి పేరు పెట్టారు. అందులో ఓ పేదవాడు అక్కడ మరో మతం ప్రార్థనా మందిరం కట్టాడు. విచిత్రం ఏమిటంటే, ఆ ప్రార్థనా మందిరం బోర్డుపైన ఆ కాలనీ పేరు కూడా రాయలేదు. ఎందుకంటే ఆ కాలనీ పేరు హిందు దేవుడిది. ఈ రకమైన భూమి పంపకాలను సమర్థిస్తారా? ఈ రకమైన వ్యవహారాలు ఎక్కడికి దారి తీస్తాయి? ఇటువంటి సందర్భాలలో హేతుబద్దత లేదా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. అందువల్ల మనం అందరినీ మనుషులుగా సంస్కరించాలి. ఏ మతాన్ని సమర్థించవలసిన పనిలేదు. మత ఛాందసవాదులను దారిలో పెట్టడానికి ఆ మతాలను కూడా సంస్కరించాలి.
భారతీయులందరూ సమానం. మతం ఆధారంగా ఎవరికీ హక్కులు, రిజర్వేషన్లు ఉండకూడదు. భారతీయులందికి ఒకే చట్టం వర్తించాలి. అందరికీ ఒకే రకమైన హక్కులు ఉండాలి. ఎవరికీ ప్రత్యేక హక్కులు ఉండకూడదు. పేదలందరికీ విద్య, వైద్యం (కులం, మతం ఏదైనా అనవసరం. భారతీయుడైతే చాలు) తప్పనిసరిగా ఉచితంగా అందివ్వాలి. అందరికీ ఉపాధి కల్పించాలి. సామాజికంగా అత్యంత వెనుకబడిన వారికి పదేళ్లు రిజర్వేషన్లు కల్పించి, వారు జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు, భారతీయులందరూ సమానంగా బతికేందుకు రాజ్యాంగంతో పదేళ్లు రిజర్వేషన్లు కల్పించారు. ఆ పదేళ్లని ఎన్నేళ్లు సాగదీశారు? ఇంకా ఎన్ని ఎళ్లు సాగదీస్తారు? అసమర్థ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఓట్ల కోసం సమాజం అభివృద్ధి చెందకుండా, దిగువ స్థాయి కులాలను, మైనార్టీలను ఎదగనివ్వకుండా వారి పబ్బం గడుపుకుంటూ వ్యవస్థలని సర్వనాశనం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే, మరో వెయ్యి ఏళ్లకు కూడా సమాజం అభివృద్ధి చెందదు. అసమానతలు తగ్గవు. సమాజం ఇంకా నీచమైన స్థాయికి దిగజారిపోతుంది. అత్యాచారం జరిగితే, దళిత బాలిక లేక మైనార్టీ బాలిక లేక ఎస్టీ బాలిక అని రాస్తున్నారు. ఈ సమాజానికి మనం ఏం నేర్పుతున్నాం. అత్యాచారం జరిగితే ఏ బాలికైనా ఒక్కటే. బాలికలందరికీ రక్షణ ఉండాలి. ఆ రకమైన కల్చర్ ని మనం మార్చాలి. ఈ విషయాలన్నీ లౌకిక వాదులకు, హేతువాదులకు, నాస్తికులకు, కమ్యూనిస్టులకు, ర్యాడికల్స్ కు తెలియదా? ఆ దిశగా వారు పోరాటం చేయాలి. కానీ, వారు ఒక్క హిందు మతాన్ని హిందువులను విమర్శిస్తూ, ఇతరులను వెనకేసుకొస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన విధానం. ఇది మతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతుంది. మార్క్స్ చెప్పిన ప్రకారం మతం ఏదైనా మత్తు మందే. అది హిందు లేదా ముస్లిం లేదా క్రైస్తవం... అటువంటప్పుడు మూఢంగా మతవిశ్వాసాలను నమ్మేవారిని ఎవరూ సమర్థించవలసి అవసరంలేదు. వారు మైనార్టీలని సమర్థించడం తప్పు. భారతీయులుగా వారికి అన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులను సమర్థించండి. ఆ హక్కుల కోసం పోరాడండి. ఎవరికైనా, ఏ మతం ద్వారానైనా, ఏ హక్కు ఉండకూడదు. భారతీయలందరికీ సమాన హక్కులు ఉండాలి. మతవాదుల దారి వేరు. కనీసం లౌకికవాదులైనా అందరినీ భారతీయులుగా గుర్తించి, గౌరవించాలి. అందరి హక్కుల కోసం పోరాడాలి.
భారతీయులకు పని చూపించండి, వాళ్లే బతుకుతారు. ఏ విధమైన రిజర్వేషన్లు కల్పించవలసిన అవసరంలేదు. ఒక్కటే దేశం, ఒక్కటే రాజ్యాంగం, ఒక్కటే చట్టం, అందరికీ ఒకే హక్కులు.. ఈ విధానం కావాలి. అన్ని రకాల చదువులు ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించాలి. చదువుకునే సమయంలో ఉచితంగా భోజనం పెట్టండి. ఆ తర్వాత వాడి బతుకు వాడే బతుకుతాడు. ఆ తర్వాత వాడంతట వాడు బతికే విధంగా మనం చదువులను సంస్కరించాలి. ఇంత చేసిన తర్వాత కూడా వారు ఉచితాల కోసం, రిజర్వేషన్ల కోసం ఎదురు చూశాడంటే, మన విద్యావ్యవస్థలోనే లోపం ఉన్నట్లు లెక్క. లౌకిక వాదులందరూ ఈ దిశగా ఆలోచన చేస్తే సమాజంలో కొంతవరకైనా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది.
No comments:
Post a Comment