Mar 24, 2025

తాడిప్రకాష్‌కు కేఎన్‌వై పతంజలి సాహితీ పురస్కారం


      ఈ ఏడాది కేఎన్‌వై పతంజలి సాహితీ పురస్కారానికి సీనియర్ జర్నలిస్ట్ తాడి ప్రకాష్ ఎంపికయ్యారు. విజయనగరంలోని కె.ఎన్.వై.పతంజలి సాంస్కృతిక వేదిక ఈ పుస్కారాన్ని ప్రకటించింది. ఈ నెల 29వ తేదీ శనివారం సాయంత్రం విజయనగరం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈ పురస్కారాన్ని తాడి ప్రకాష్‌కు అందజేస్తారు. ఈ పురస్కారానికి ప్రకాష్ నూటికి నూరు శాతం అర్హులు. ఈ సందర్భంగా ప్రకాష్ గారికి అభినందనలు.

నేను ఇద్దరి సారధ్యంలో పని చేశాను. ఇద్దరూ ఇద్దరే. కలాన్ని వాడటంలో, బాధితుల పక్షం నిలబడటంతో వారు దిట్టలు. వారి రాత, రాత శైలి అద్భుతం.

ఈ సందర్భంగా కేఎన్‌వై పతంజలి గారి గురించి ఓ మాట. సాక్షి ప్రారంభంలో 2008లో పతంజలి గారు దానికి ఎడిటర్‌గా ఉండేవారు.  నేను న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూపులో చెన్నైలో చీఫ్ కంటెంట్ ఎడిటర్‌గా చేస్తూ, సాక్షిలో చీఫ్ సబ్ ఎడిటర్‌గా చేరాను. అప్పుడు, సబ్ ఎడిటర్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగాయి. ఆ సమయంలో  ఇతర పత్రికలో పని చేసే బక్కపలచగా ఉండే  ఓ సబ్ ఎడిటర్ ఇంటర్వ్యూకి వచ్చి, సెలక్ట్ అయ్యారు. అతను అపాయింట్‌మెంట్ ఆర్డర్ తీసుకుని అప్పటి సాక్షి  ఎడిటర్  పతంజలి గారి వద్దకు వెళ్లి పరిచయం చేసుకున్నారు. పతంజలి గారు అతని గురించి, అతను చేస్తున్న పని గురించి అడిగి,   చివర్లో  ‘‘ఏంటయ్యా మరీ ఇంత సన్నగా ఉన్నావు?’’ అని అడిగారు. ఆ సబ్ ఎడిటర్ వెంటనే, ‘‘మీరిచ్చే జీతాలకు ఇంతకంటే ఇంకా ఎలా ఉంటామండి?’’ అని ఎదురు ప్రశ్నవేశారు. పతంజలి గారు వెంటనే అతని చేతిలోని అపాయింట్ మెంట్ ఆర్డర్ తీసుకుని, దాని మీద ఉన్న జీతానికి మరో వెయ్యి రూపాయలు కలిపారు. దటీజ్ పతంజలి. ఆ సబ్ ఎడిటర్ ఇప్పటికీ సాక్షిలోనే పని చేస్తున్నారు. 

తాడి ప్రకాష్ గారి గురించి ఒక్క మాట. నేను ఆంధ్రభూమి విజయవాడ ఎడిషన్‌లో 1989లో ట్రైనీ సబ్ ఎడిటర్‌గా పని చేసే సమయంలో ఆయన న్యూస్ ఎడిటర్‌గా ఉండేవారు. ఎంతటి వార్తనైనా చదివిన వెంటనే అదిరిపోయే సూపర్ లీడ్ రాసేవారు. మనసుకి హత్తుకునే విధంగా రాస్తారు. ఆయన పనితనం ప్రత్యక్షంగా చూడవలసిందే, చదవవలసిందే. చెప్పడం సాధ్యంకాదు. 

ఒకసారి స్టాఫ్ ఫొటోగ్రాఫర్  ఓ కుటుంబం వీధిన పడిన ఫొటో ఒకటి తీసుకువచ్చారు. అతను ఫొటో నేపథ్యం చెప్పారు.  దానికి ప్రకాష్ గారు రెండంటే రెండు నిమిషాల్లో  అదిరిపోయే రైటప్ రాశారు. ఆ ఫొటోలో, ఆ కుటుంబం ఉన్న దీనస్థితి మొత్తాన్ని రెండే రెండు లైన్లలో అర్థవంతంగా రాశారు. అంతేకాదు, ఆ ఫొటోని ఆరోజు బేనర్‌గా వాడారు. ఇలాంటివి చాలా చేశారు. 

ఇక్కడ మరో విషయం. అప్పుడు ఎడిటర్‌గా ఏబీకే ప్రసాద్ గారు ఉండేవారు. నేను కొత్త, ట్రైనీ, ఎడిటోరియల్ డెస్క్‌లో పోస్టులు, హోదాల గురించి కూడా నాకు సరిగా తెలియదు. అక్కడే ఎడిటర్‌గా ఏబీకే ప్రసాద్ గారు ఉన్నా, ప్రకాష్‌ గారిని చూసి ఎప్పటికైనా నేను ప్రకాష్ గారి అంతటి న్యూస్ ఎడిటర్‌ని కావాలని అనుకున్నాను. ఎడిటర్‌ని కావాలని మాత్రం అనుకోలేదు.

అంటే, ప్రకాష్ గారి రాత తీరు నాపై ఎంతటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.  చివరికి పతంజలి గారు ఎడిటర్‌గా పని చేసిన సాక్షిలోనే, ఆ తర్వాత న్యూస్ ఎడిటర్‌ని అయ్యాను. ఆ రోజు నాకు ప్రకాష్ గారు గుర్తుకు వచ్చారు.  కానీ, రాయడంలో ప్రకాష్ గారి అంతటి వాడిని మాత్రం కాలేకపోయాను.

                                                                                                            - శిరందాసు నాగార్జున 






 

No comments:

Post a Comment

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...