May 2, 2025

ఎడిటోరియల్ పేజీ వ్యాస రచయితలకు గౌరవం

ఏపీ ఫెరా మాజీ చైర్మన్ డాక్టర్ రామనాధ్ వెలమాటి, ఎన్ఆర్ఐ శేషుల నుంచి మొమోంటో అందుకుంటున్న సీనియర్ జర్నలిస్ట్ శిరందాసు నాగార్జున రావు. పక్కన వరుసగా రేపటి కోసం ఎడిటర్ శాఖమూరి శివప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ మిక్కిలినేని శ్రీకాంత్, కాలం రైటర్ బొల్లాప్రగడ శ్రీదేవి.
-----------------------------------------------------------------------------------------------------------------

మేడే సాయంత్రం గుంటూరు LVR Club Convention Hallలో ‘రేపటి కోసం’ దినపత్రిక 7వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిధులు, వారి విలేకరులతోపాటు ఆ పత్రిక ఎడిటోరియల్ పేజీకి వ్యాసాలు రాసిన వారికి కూడా  మొమోంటోలు ఇచ్చి గౌరవించారు.  అదీ ఈ వార్షికోత్సవ ప్రత్యేకత.   ఈ వార్షికోత్సవంలో ముఖ్య అతిధులుగా మాజీ మంత్రి, శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర, శాసనసభ్యురాలు గల్లా మాధవి, ఏపీ ఫెరా మాజీ చైర్మన్ డాక్టర్ రామనాధ్ వెలమాటి, లెడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాల రావు,ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, ఎన్ఆర్ఐ శేషు హాజరయ్యారు. 

నా మొదటి వ్యాసం 1984లో తెలుగు విద్యార్థి మాస పత్రికలో అచ్చయింది. అప్పుడు వారు ఆ పత్రిక కాపీని మా ఇంటికి పోస్ట్ చేశారు. అదే ఏడాది నేను రాసిన మరో వ్యాసం ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ పేజీలో వచ్చింది.  వారు రూ.50 రూపాయలు ఎంఓ చేశారు. అలా కొందరు ఎంతోకొంత ఇచ్చేవారు. సాక్షి పెట్టిన కొత్తలో చాలా కాలం వ్యాసానికి రెండు వేల రూపాయలు ఇచ్చేవారు. ఇటీవల కాలంలో ఆ సాంప్రదాయం అంతా పోయింది.   ఒక్క ఈనాడు మాత్రమే అలా ఇస్తున్నట్లుంది.  నేను ఈనాడు తప్ప దాదాపు అన్ని పత్రికల ఎడిటోరియల్ పేజీలకు వ్యాసాలు రాస్తుంటాను. డబ్బు ఎవ్వరూ ఇవ్వడంలేదు. సూర్య వారు  కేవీఎస్ సుబ్రహ్మణ్యం గారు బాధ్యులుగా ఉన్నప్పుడు మాత్రం డబ్బు పంపారు. ఇటీవల కాలంలో విశాలాంధ్ర వారు వ్యాసం ప్రచురించిన కాపీని పోస్టులో పంపేవారు.  ఇలాంటి పరిస్థితుల్లో ‘రేపటి కోసం’ యాజమాన్యం వారు వ్యాసాలు రాసిన వారిని పిలిచి మరీ గౌరవించడం సంతోషంగా ఉంది. వ్యాస రచయితలను కూడా గౌరవించినందుకు ధన్యవాదాలు.  


ఈ పత్రికతో నాకు చాలా కాలం నుంచి అనుబంధం ఉంది. దీనిని రిటైర్డ్ డీఎస్పీ బొప్పన విజయకుమార్ గారు దీనిని మాస పత్రికగా ప్రారంభించారు. దీనిని చాలా కాలం కమిలిశ్రీ గారు చూసేవారు. వీరిద్దరూ నాకు మంచి మిత్రులే.   అప్పట్లో విజయకుమార్ గారు అడిగితే,  ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తారు? దాని వల్ల కలిగే ప్రయోజనాలు, ఆ హోదా కలిగిన రాష్ట్రాలకు సంబంధించి అధ్యయనం చేసి వరసగా కొన్ని వ్యాసాలు రాసి ఇచ్చాను. ప్రచురించారు.  విజయకుమార్ గారి ఆరోగ్యం దెబ్బతినడంతో  మిక్కిలినేని శ్రీకాంత్ గారు దానిని ఏడాది నుంచి పెద్ద ఎత్తున దినపత్రికగా తీసుకువస్తున్నారు. డిజటల్ ఎడిషన్‌తోపాటు  దాదాపు ఏడు జిల్లాల్లో ఇది ప్రింట్ ఎడిషన్‌గా కూడా వస్తోంది. ఇప్పుడు దీనికి ఎడిటర్ శాఖమూరి శివప్రసాద్ గారు, మరో బాధ్యులుగా గుంటూరు చంద్రశేఖర్‌గారు ఉన్నారు. వీరితోపాటు ఆ పత్రిక బ్యూరో చీఫ్ మల్లికార్జున రావు గారు, సచివాలయ రిపోర్టర్ మల్లికార్జున తదితరులు కూడా నాకు మంచి మిత్రులే. చంద్రశేఖర్‌ గారు నాకంటే చాలా సీనియర్.నేను విశాఖ సిటీ డెస్క్ ఇన్ చార్జిగా చేసే సమయంలో ఆయన ఎడిషన్ ఇన్ చార్జిగా ఉండేవారు. 

                                                                                                       - శిరందాసు నాగార్జున

Apr 28, 2025

యుద్ధం అంటే వినాశనమే

ఇస్కఫ్ 20 రాష్ట్ర మహాసభల్లో వక్తల పిలుపు

మదనపల్లి:  మత అసహనం, యుద్ధోన్మాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇస్కఫ్ 20 వ మహాసభ పిలుపు ఇచ్చింది. ఇస్కఫ్, ఆంధ్ర ప్రదేశ్, 20వ మహాసభ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఏప్రిల్ 26, 27 తేదీల్లో ఉత్సాహపూరిత  వాతావరణంలో ఘనంగా జరిగింది. ఏ కారణం చేత అయినా యుద్ధం ఎక్కడ వచ్చినా అది వినాశనానికి దారి తీస్తుందని ఇస్కఫ్ మహాసభ స్పష్టం చేసింది. ప్రపంచ మానవాళికి ఫాసిజం ప్రధాన శత్రువు అని భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం (ఇస్కఫ్) స్పష్టం చేసింది.  రాష్ట్ర అధ్యక్షులు టి ఎస్ సుకుమారన్ అధ్యక్షతన జరిగిన ప్రారంభ సమావేశంలో ముందుగా పెహాల్గావ్ ఉగ్ర దాడిలో అసువులు బాసిన వారికి మహాసభ రెండు నిముషాల మౌనం పాటించి నివాళి అర్పించింది. అనంతరం ఇస్కఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి బిజయ్ కుమార్ పదిహారి ప్రారంభోపన్యాసం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మానవాళి తీవ్రమైన సంక్షోభాల మధ్య జీవిస్తున్నట్టు పదిహారి పేర్కొన్నారు. ఆధిపత్యం కోసం అగ్రరాజ్యాలు యుద్ధ ఉన్మాదాన్ని పెంచుతున్నాయని విమర్శించారు. ఇందులో భాగమే పలస్తీనాపై ఇజ్రాయిల్ దాడి అని గుర్తు చేశారు. భారత దేశంపైన కూడా ఉగ్రదాడి జరిగిందని, అగ్రదేశాలు తమ ఆయుధ వ్యాపారాల కోసం ఉద్రిక్తతలను పెంచుతున్నాయని, అగ్ర రాజ్యాలే ఆయుధాలు అమ్ముతున్నాయని విమర్శించారు. యుద్ధం అనేది మానవాళి వినాశనానికి దారి తీయగలదని ఆందోళన వ్యక్తం చేశారు. మరో వైపు ఫాసిజం జడలు విప్పుతున్నదని  ఆందోళన వ్యక్తం చేశారు. అది మానవాళికి ప్రధాన శత్రువని బిజయ్ కుమార్ పదిహారి పేర్కొన్నారు. హిట్లర్ ఫాసిజానికి వ్యతిరేకంగా నిలబడ్డ నేతల నుంచి  స్ఫూర్తి పొంది పని చేయవలసి ఉన్నదని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రానున్న ఆగస్టు 30 న ఫిడేల్ క్యాస్త్రో జయంతిని దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నట్టు పదిహారి  తెలిపారు. ఇప్పుడు వివిధ దేశాల మధ్య సంబంధాలు బలహీన పడుతున్నాయని, ఈ క్రమంలో ప్రజల మధ్య స్నేహ సంబంధాలను పెంచడం ద్వారానే మానవ సంబంధాలు బలపడుతాయని పేర్కొన్నారు. ఇందుకోసం ఇస్కఫ్ దశాబ్దాలుగా పని చేస్తున్నదని, మరింత చైతన్యవంతంగా పని చేద్దామని పిలుపునిచ్చారు. భారతదేశానికీ అన్ని ప్రపంచ దేశాల ప్రజాలతో స్నేహ, శాంతి పూర్వక సంబంధాల మెరుగు పరచడం ఇస్కఫ్ ఆశయమని స్పష్టం చేశారు.


ఈ మహాసభల్లో పాల్గొనడానికి చెన్నై నుండి ప్రత్యేక అతిధిగా విచ్చేసిన డిప్యూటీ కౌన్సిల్ జనరల్ ఆఫ్ రష్యా సెర్జెయ్ అజారోవ్ సందేశమిచ్చారు. రష్యా -భారతదేశం మధ్య సహకార సంబంధాలకి చాలా విస్తారమైన అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం భారతదేశంతో కలసి పని చేయాలనీ  తాము కోరుకుంటున్నామని చెప్పారు. ఇది పరివర్తన కాలమని, అన్న రంగాల్లో కొత్త శక్తులు  ఉద్భవిస్తున్నాయని, వాటిని నిజమైన అభివృద్ధి కోసం వినియోగించుకోవాలని కోరారు. రష్యా, భారతీయ సంబంధాల విషయంలో రష్యా అధ్యక్షుడు వి. పుతిన్ అంచనాలు చాలా ఉన్నతంగా ఉన్నాయని తెలిపారు. భారతదేశం రష్యాకు దశాబ్దాలు సహజ భాగస్వామి అని, మిత్రదేశంగా ప్రత్యేకమైన సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇరు దేశాల మాధ్య ఉన్న సంబంధాలు పరస్పర ఆర్థిక ప్రయోజనాలకు చెందినవి కాదని పేర్కొన్నారు. నమ్మకం, స్నేహంతో కూడిన గొప్ప దీర్ఘకాలిక సంబంధం అని పేర్కొన్నారు. భారత సమాజం అభివృద్ధికి సోవియట్ కాలం నుంచి ఇప్పటికీ రష్యా పూర్తి అండగా ఉందని తెలిపారు. డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు భారత సామర్థ్యాన్ని,  సాంకేతిక పురోగతిని పెంచడంలో కీలకపాత్ర పోషించాయని చెప్పారు. ఇరుదేశాల ప్రజల మధ్య, ప్రభుత్వాల మధ్య సంస్కృతిక, క్రీడలు, కళా సంబంధాలు బలంగా ఉన్నాయని చెప్పారు. ఇందులో భాగంగానే అనేక సంవత్సరాల నుండి భారతీయ నిపుణులు రష్యాలో శిక్షణ పొందారని తెలిపారు. భారత దేశం సార్వభౌమాధికారంతో స్వతంత్ర రాజ్యంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన సాంకేతిక ప్రోత్సాహాన్ని రష్యా నిత్యం అందిస్తూనే ఉన్నదని తెలిపారు. విద్యకు సంబంధించి చాలా ఉన్నతమైన మేళవింపు ఉన్నదని పేర్కొన్నారు. ఈ చర్యలు స్వయం విశ్వాసాన్ని ప్రోత్సహించడం, దేశ ప్రజలకు ఆర్థిక వ్యవస్థలో రాణించగల శక్తిని అవకాశాలను, అందిస్తాయని పేర్కొన్నారు. భారత్ ఒక శక్తివంతమైన దేశంగా వెలుగొందాలని తాము అభిలషిస్తున్నామని పేర్కొన్నారు. రెండు దేశాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కలిసి పని చేస్తూ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే చర్యలకు మార్గం సుగమం చేసుకుందామని పిలుపునిచ్చారు.

ఇస్కఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగితాల రాజశేఖర్ కార్యదర్శి నివేదికను ప్రవేశ పెట్టారు. గత మూడేళ్లలో ఇస్కఫ్ కృషిని వివరించారు. దేశంలో పేట్రేగిపోతున్న మత ఉన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేయడం ఇస్కఫ్ బాధ్యత అని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో గడచిన 19 వ మహాసభ నెల్లూరులో జరిగిన నాటి నించి చేపట్టిన కార్యకలాపాలను వివరించారు.  శాంతి, సంస్కృతీ, ప్రజా కళల గురించి మాట్లాడటానికి ముందు మన దేశంలో మతోన్మాద ప్రమాదం గురించి, మత సామరస్యం పాటించాల్సిన అవసరం గురించి వారం క్రితం జరిగిన దుస్సంఘటన గురించి రాజశేఖర్ చెప్పారు.  2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం జిల్లాలో బైసారన్ అనే ప్రసిద్ధ పర్వత పర్యాటక ప్రదేశంలో జరిగిన ఉగ్రదాడిలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని 26 మంది అమాయక ప్రజలను హత్య చేశారు, ఇంకా పలువురు గాయపడ్డారు. ఈ అమానుష ఉగ్రదాడిని ఇస్కఫ్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.  మృతుల కుటుంబాలకు ఈ రకమైన దాడులు కాశ్మీరి ప్రజల ప్రజాతంత్ర ఆకాంక్షలకు ఏ విధంగా తోడ్పాటుగా ఉండవని, ఏ మతానికీ మేలు చేయవున్నారు. ముఖ్యంగా ఈ దాడిని ఖండిస్తూ కాశ్మీర్ ప్రజలు, ముఖ్యంగా ముస్లింలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన తీరు కూడా మనం గమనించాలని అన్నారు.  కేంద్ర ప్రభుత్వం గతంలో ఆర్టికల్ 370, 35ఎ రద్దు చేస్తే మౌలిక సమస్యలు పోతాయని ప్రకటించినప్పటికీ  ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని ఈ ఘటన నిరూపించిందని అన్నారు. ఈ దురంతం పైన సమగ్ర న్యాయ విచారణ అవసరమని,  పౌర సమాజం పని చేసే అవకాశం కల్పించటం, ఇస్కఫ్ లాంటి సంస్థలు చేస్తున్న కృషికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం వుందని రాజశేఖర్ చెప్పారు. మతాన్ని, సంస్కృతి ని కలాగాపులగం చేసి జనాలను మభ్యపెట్టాలని చూస్తున్న శక్తుల నిజ స్వరూపాన్ని చర్చకు పెట్టి సమాజానికి ఒక దిశానిర్దేశం చేయడం మనందరం కర్తవ్యంగా స్వీకరించాలని ఇస్కఫ్ ఉప ప్రధాన కార్యదర్శి సనపల నరసింహులు కోరారు. ఈ సమావేశంలో సిపిఐ అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి యల్ నరసింహులు, ఎస్ కె యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యలు వెంకటరెడ్డి తదితరులు సందేశం ఇచ్చారు. ఈ సమావేశానికి ఇస్కఫ్ ఉప ప్రధాన కార్యదర్శి ఎస్ నరసింహులు, తమిళనాడు ఇస్కఫ్ నేత భాస్కరన్, ఇస్కఫ్, తెలంగాణ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ , ఇస్కఫ్ 20వ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్ష కార్యదర్సులు జి.వీ.శివకుమార్, తుంగా శ్రీధర్ రావు, ఇస్కఫ్, తిరుపతి నాయకుడు   రామచంద్రయ్య, ఇస్కఫ్, కడప జిల్లా సీనియర్ నాయకులు డాక్టర్ తక్కోలు మాచిరెడ్డి, డాక్టర్ పి.సంజీవమ్మ, ఇస్కఫ్, గుంటూరు జిల్లా సీనియర్ నాయకులు బొల్లిముంత కృష్ణ, సి హెచ్ శ్రీదేవి, ఇస్కఫ్ కోశాధికారి కె.సత్యాంజనేయ, అనకాపల్లి నేత M. మాధవరావు, కృష్ణాజిల్లా నుంచి ఆర్. పిచ్చయ్య, బుద్ధవరపు వెంకట్రావు, మోతుకూరి అరుణ్, దోనేపూడి సూరిబాబు,  యువజన సమాఖ్య జాతీయ నేత నక్కి లెనిన్ బాబు, జర్నలిస్టు  సి.ఎన్.క్షేత్రపాల్ రెడ్డి, సిపిఐ మదనపల్లి కార్యదర్శి మురళి, నెల్లూరు జిల్లా నించి రమేష్, వి. రామచంద్ర మూర్తి, అనంతపూర్ నుంచి వసంతబాబు, పలనాడు జిల్లా నుంచి చెన్నకేశవరావు, ఏలూరు జిల్లా నుంచి కడుపు కన్నయ్య, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి లక్ష్మి గణపతి  తదితరులు హాజరయ్యారు.

ఆలోచింపజేసిన పాట

ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కళాకారులు ఆలపించిన పాటలు మహాసభ ప్రతినిధులను అలోచింపచేసాయి. ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి చిన్నం పెంచలయ్య, ఆర్ పిచ్చయ్య, గుర్రప్ప, చారులత, నాగరాజుల బృందం సమాజాన్ని విచ్చిన్నం చేస్తున్న వివిధ ప్రతీఘాత శక్తుల నుంచి, యుద్దోన్మాదం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న అశాంతి నుండి మానవాళిని రక్షించు కోవాలని, స్నేహ సంబందాలను మెరుగు పర్చుకోవలసిన ఆవశ్యకతను చెప్పే గీతాలను ఆలపించి సభికులను ఉత్తేజ పరిచారు. తెనాలికి చెందిన బెజ్జంకి నాగమణి ఆలపించిన కొండేపూడి లక్ష్మీనారాయణ రచించిన పాట "పాడరా  ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా, పాడరా మన తెలుగుదేశపు భవ్య చరితల దివ్యగీతం" పాటకు ప్రతినిధుల నుంచి మంచి స్పందన వచ్చింది.

సభకు హాజరైన వివిధ జిల్లాల ప్రతినిధులు తమ జిల్లాల్లో జరిపిన కార్యకలాపాలను వివరించారు.  మహాసభల మొదటిరోజు సాయంత్రం కాశ్మీర్ పర్యాటకుల మృతులకు సంతాపంగా ఇస్కఫ్, సిపిఐ, అన్నమయ్య జిల్లా సంయుక్తంగా కొవ్వొత్తుల ర్యాలీ జరిపాయి. మహాసభ ప్రాంగణం నుంచి మదనపల్లి బస్టాండ్ దగ్గర వున్న డాక్టర్ అంబెడ్కర్ విగ్రహం సర్కిల్ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. తర్వాత జరిగిన సభలో సిపిఐ, అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి.ఎల్. నరసింహులు, బిజయ్ కుమార్ పదిహరి, కాగితాల రాజశేఖర్ ప్రసంగించారు. 

మహాసభల రెండవ రోజు ఇస్కఫ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా మహాసభ ఎన్నుకుంది. టి. ఎస్. సుకుమారన్, ఆచార్య వి. బాలమోహన్ దాస్, బొల్లిముంత కృష్ణ అధ్యక్ష వర్గంగా, కాగితాల రాజశేఖర్ అధ్యక్షునిగా, ఎస్. నరసింహులు, తుంగ శ్రీధర్ రావు ప్రధాన కార్యదర్శులుగా, ఉప ప్రధాన కార్యదర్శిగా ఎం. M. మాధవరావు,  రాష్ట్ర కార్యదర్శులుగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన కూన అజైబాబు,  నెల్లూరు జిల్లాకు చెందిన ఎస్.వి. రమేష్ బాబు,  గుంటూరు జిల్లాకు చెందిన కాగితాల నిర్మల ఎన్నిక అయ్యారు. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణాజిల్లా ల మహాసభ పూర్తీ అయిన తర్వాత ఈ జిల్లాలకు రాష్ట్ర కార్యదర్శి పదవులు రిజర్వు చేయడమైనది. ఇస్కఫ్ రాష్ట్ర కోశాధికారిగా సత్యాంజనేయ, ప్రచార కార్యదర్శిగా మదనపల్లికి చెందిన జి.వి. శివకుమార్ ఎన్నిక అయ్యారు.

‘కాఫీవిత్ రజా హుస్సేన్’ సాహిత్య ఎపిసోడ్స్ 2000 పూర్తి

 

మంగళగిరి:   ఫేస్‌బుక్‌లో ధారావాహికంగా రాస్తున్న ప్రముఖ జర్నలిస్ట్, కవి, రచయిత, విశ్రాంత అగ్రికల్చర్ మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అబ్దుల్ రజా హుస్సేన్  సాహితీ కాలమ్ ‘కాఫీ విత్’  2000 ఎపి సోడ్‌లు  దాటిన సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆదివారం రాత్రి అభినందన సభ జరిగింది. పాత మంగళగిరిలోని పొట్లాబత్తుని వెంకటేశ్వరరావు కళానిలయంలో (లక్ష్మీ శారీస్ మిద్దె పైన) విశ్వశాంతి కళాపరిషత్ కన్వీనర్ పొట్లాబత్తుని లక్ష్మణరావు  ఆధ్వర్యంలో  ‘ ఓ కప్పుకాఫీ..నాలుగు మంచి మాటలు అంతే’’ అని ఈ కార్యక్రమం నిర్వహించారు. ఫేస్ బుక్ మాధ్యమంగా తెలుగు సాహితీ లోకానికి కాఫీ విత్ శీర్షికతో 2000 సాహితీ, కళా విమర్శలు అందించడం ఓ అరుదైన రికార్డ్. రజా హుస్సేన్ స్వగ్రామంలో ఆయన మిత్రులు, సహా ఉద్యోగులు, శిష్యులు, సాహిత్య అభిమానుల సమక్షంలో ఈ సభ జరగడం విశేషం. ప్రముఖ అభ్యుదయ కవి, మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు అధ్యక్షత వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార చీఫ్ కమిషనర్ షేక్ బాషా మాట్లాడుతూ, జర్నలిజంలో రజా హుస్సేన్ తనకు మార్గదర్శి అన్నారు.

వార్తలు ఎలా రాయాలో తాను రజాహుస్సేన్ దగ్గరే నేర్చుకున్నానని చెప్పారు. ఒక వార్తను అందరూ రాస్తారు గానీ, ఇన్  సైడ్ విశేషాలను కూడా సేకరించి వార్తలను ఆసక్తికరంగా ప్రజెంట్ చేయడంలో రజా హుస్సేన్ దిట్ట అన్నారు. ఆ రోజుల్లో రజా హుస్సేన్ వార్తలు సంచలనం కలిగించాయని తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీలో కమ్యూనిస్టు ప్రతినిధులు లేని లోటు కొట్టొచ్చినట్టు కనబడుతోందని ఆయన చెప్పారు. కాఫీవిత్ శీర్షికలో  2000 కవితలను విశ్లేషించడం   సాహిత్య చరిత్రలోనే సరికొత్త రికార్డని, ఈ శీర్షిక వల్ల ఎందరో కొత్తకవులను సాహితీలోకానికి పరిచయం చేసిన ఘనత రజా హుస్సేన్ కే దక్కుతుందని అభ్యుదయకవి గోలి మధు అన్నారు. ఒక్క ఏడాదిలో వెయ్యి ఎపిసోడ్లు రాయడం చిన్న విషయంకాదని, అదీ సెల్ ఫోన్లోనే టైప్ చేసి పోస్ట్ చేస్తుండటం విశేషమన్నారు.  రజా హుస్సేన్  సరళమైన భాషలో రాసిన సాహిత్యం ద్వారా ప్రజా హుస్సేన్ ఖ్యాతి పొందారన్నారు.  బోధి రేఖా కృష్ణార్జునరావు మాట్లాడుతూ, రజా హుస్సేన్ ది కులమతాలకు అతీతతమైన వ్యక్తిత్వమన్నారు. ఎందరో కవులను, రచయితలను అన్వేషించి వారందరినీ కాఫీవిత్ శీర్షికలో ప్రస్తావించారన్నారు. ఇప్పుడు ‘కళల సిరి.. మంగళగిరి’ అనే పుస్తకాన్ని తెస్తున్నారని తెలిపారు. 

మే నెల 12న మంగళగిరి రాయల్ కన్వెన్షన్ హాలులో  జరగబోయే బుద్ధపూర్ణమ సభలో  ఆ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్టు చెప్పారు.  పొట్లాబత్తుని లక్ష్మణరావు మాట్లాడుతూ…రజా హుస్సేన్ వల్ల మంగళగిరిలో సాహితీ పరిమళాలు వ్యాపిస్తున్నాయని, ఆయన సరళమైన శైలికి చదివించే గొప్ప గుణముందన్నారు. మంగళగిరిలోని తనలాంటి కళాకారులెందరినో ఈ శీర్షికద్వారా సాహితీలోకానికి పరిచయంచేసిన ఘనతరజాహుస్సేన్ కే దక్కుతుందన్నారు.గాయకులు, కమ్యూనిస్టు నాయకులు కంచర్ల కాశయ్యమాట్లాడుతూ.. రజాహుస్సేన్ వల్ల  తాను లోకానికి తెలిశానన్నారు. మట్టిలో మాణిక్యాలనుగుర్తించి, సానబట్టి సాహితీలోకానికి పరిచయం చేయడం చిన్నవిషయం కాదన్నారు. గాయకుడు అల్లక తాతారావు మాట్లాడుతూ… భక్తి పాటలు పాడుకునే తనకు కాఫీవిత్ ద్వారా సాహితీలోకంలో కొత్తజీవితాన్ని ప్రసాదించారని రజాహుస్సేన్ కు కృతజ్ఞతలు తెలిపారు. విశ్రాంత చరిత్రోపన్యాసకులు ఆళ్ల  వెంటక స్వామి మాట్లాడుతూ,  రజాహుస్సేన్ డిగ్రీకళాశాలలో తన కొలీగ్ అన్నారు. కష్టేఫలి అన్నట్లు తన కష్టంతో అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకున్న రజాహుస్సేన్ కృషీవలుడని అన్నారు. తన చదువుకు తగ్గట్టు కృషినికొనసాగించడమే రజాహుస్సేన్ విజయరహస్యమన్నారు.


సీనియర్ పాత్రికేయుడు, రజా హుస్సేన్ శిష్యుడు శిరందాసు నాగార్జున మాట్లాడుతూ,  మంగళగిరి వీటీజేఎం డిగ్రీ కాలేజీలో  రజా హుస్సేన్ తెలుగు అధ్యాపకులుగా పని చేసే సమయంలో తను, తన భార్య ఇద్దరం ఆయన శిష్యులమని  తెలిపారు.  రాతలో సరళత ఆయన రచనల్లో కనిపిస్తుందన్నారు. సాహితీ లోకలంలో ఎదుగుతున్నవారిని గుర్తించి, వారిని వెలుగులోకి తేవడం రజాహుస్సేన్ దిట్ట అన్నారు. అలాగే, సాహిత్యాన్ని, కేంద్ర సాహిత్య అకాడమీ తీరుని, రాష్ట్ర ఉగాది పురస్కారాల గ్రహీతల ఎంపిక తీరుని నిర్మోహమాటంగా తీవ్ర స్థాయిలో విమర్శించారని గుర్తు చేశారు.  మంగళగిరి టైమ్స్ పాత్రికేయుడు అవ్వారు శ్రీనివాసరావు మాట్లాడుతూ రజా హుస్సేన్ ను తాను అన్నయ్య అంటూ పిలుస్తానని చెప్పారు. తనకుఆయన మార్గదర్శి అన్నారు.


కౌతరపు ప్రసాద్ మాట్లాడుతూ రజాహుస్సేన్ మెత్తగా రాసినా,  లోతైన విశ్లేషణ చేస్తారన్నారు.తనను అభినందించిన అందరికీ రజా హుస్సేన్  కృతజ్ఞతలు తెలిపారు.  తాను పుట్టిపెరిగిన ఊళ్ళో, ఇలా 40 యేళ్ళ తర్వాత మళ్ళీ మిత్రులతో కలిసి కాఫీతో ఆనందం పంచుకోవడం కిక్కెక్కించే విషయమన్నారు. మంగళగిరి తనకు జన్మనివ్వడమే కాకుండా, బతకడానికి నాలుగు అక్షరాలు కూడా నేర్పిందని చెప్పారు.  ఇక్కడే చదువుకొని, ఇక్కడి  డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పనిచేసే అవకాశం కల్పించిందన్నారు. ఎన్ని జన్మలెత్తి  తాను పుట్టినూరు రుణం తీర్చుకోగలను! అని కృతజ్ఞతలు తెలిపారు. ఫేస్‌బుక్‌లో  గత 10 సంవత్సరాలుగా వేలాది వ్యాసాలు, ఆర్టికల్స్ రాశానన్నారు. అంతకు ముందు  శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ గౌరవాధ్యక్షులు జొన్నాధుల బాబూ శివప్రసాద్ శాలువతో రజా హుస్సేన్ సన్మానించారు. 


యునెస్కో క్లబ్స్ అండ్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ సమన్వయకర్త రామనాధం పరమేశ్వర రావు రజా హుస్సేన్‌కు మహాత్మా గాంధీ బొమ్మ ఉన్న నాణెం బహూకరించారు. అంతకు ముందు పొట్లాబత్తుని లక్ష్మణరావు, కంచర్ల కాశయ్య, అల్లక తాతారావు, కౌతరపు  కవిత, భూపతి,  బాలకృష్ణ, రామచంద్రరావు,   పాటలు పాడి,   ఇవటూరి ప్రసాదరావు ఓ పద్యం పాడి సభికులను అలరించారు.  కాఫీతోపాటు భోజన ఏర్పాటు కూడా చేసిన సభ నిర్వాహకులు పొట్లాబత్తుని లక్ష్మణరావు సభలో ముగింపు మాటలు చెప్పారు.

Apr 26, 2025

మహామహుల మేధో నిలయం- ఆంధ్రవిశ్వవిద్యాలయం

అక్షర క్రమంలో ద్వితీయమైనా, అద్భుతమైన ఆవిష్కరణతో అద్వితీయ ప్రతిభా పాటవాలకు ఆలవాలం ఆంధ్రవిశ్వవిద్యాలయం. సాంస్కృతిక రాజధాని గాను, కళల కాణాచి గాను ప్రపంచపు దృష్టిని ఆకర్షించిన విశాఖ నగర సిగలో ఆణిముత్యం గా విరాజిల్లుతున్న విద్యల కోవెల ఆంధ్రవిశ్వవిద్యాలయం అంటే అతిశయోక్తి కాదేమో!

ఎందరో మేధావుల్ని ప్రపంచానికి అందించిన సర్వ శాస్త్రాల సమాహారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మణిహారం.. వాస్తవానికి విశ్వవిద్యాలయమని వ్యవహరించాల్సి వున్నా, కళలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న సంకల్పమే విశ్వవిద్యాలయాన్ని 'విశ్వకళా పరిషత్తు'గా మలచడం వెనుక గొప్ప నేపధ్యమే ఉంది.. వ్యవస్థాపక ఉపకులపతి సర్ కట్టమంచి రామలింగారెడ్డికి సాహిత్యం, సంగీతం, లలితకళ లంటే ఎక్కువ మక్కువ. 'ముసలమ్మ మరణం' వంటి సంచలన నవల సీ ఆర్ రెడ్డి కలం నుంచి ఉద్భవించిన రచనే.. వసుధా రచయిత కావడం, కళల పట్ల ఉత్తమాభిరుచి ఉండడం వల్ల విశ్వకళాపరిషత్తుగా పేరును ఖరారు చేశారు.. ఇందుకు ఎందరో కవులు, కళాకారుల సూచనలు, సలహాలు కూడా స్వీకరించారు. పేరుకు తగ్గట్టుగానే తొలి విభాగం 'తెలుగు' కావడం ఎందరో ప్రశంసలు అందుకుంది..భాషాసంయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో తెలుగు విభాగం మరింత విశిష్టత సంతరించుకుంది.. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, కవికోకిల గుర్రం జాషువా, ఆధునిక జాషువా గా ప్రసిద్ధి గాంచిన పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్, ప్రముఖ భాషావేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణ మూర్తి, ఆచార్య దోణప్ప,ఆచార్య ఎస్వీ జోగారావు తదితర ఉద్దండులు తెలుగు విభాగం ప్రసాదించిన ప్రముఖులే కావడం విశేషం..
ఇక శాస్త్ర సాంకేతిక రంగాలలో విశ్వవిఖ్యాతి గాంచిన ఎందరో శాస్త్రవేత్తలు ఆంధ్ర కళామతల్లి బడిలో చదివి,ఒడిలో పెరిగిన వారే.. వారిలో ప్రొఫెసర్ సూరి భగవంతం (ఫిజిక్స్ ), ఆచార్య జ్ణానానంద (న్యూక్లియర్ ఫిజిక్స్) ఆచార్య సీ. మహదేవన్ (జియోలజీ) ఆచార్య టీ ఆర్ శేషాద్రి (కెమిస్ట్రీ),ఆచార్య బీ. రామచంద్రరావు( స్పెస్ఫిజిక్స్),ఆచార్య సీ ఎస్ రావు (స్టాటిస్టిక్స్),ఆచార్య సి.వీ. రామన్,(ఫిజిక్స్) ఆచార్య ఆర్. రంగదామరావు (మెటీరియాలజీ),ఆచార్య రామనాధం వంటి దిగ్గజ శాస్త్రవేత్తలు ప్రపంచ స్థాయిలో రాణించారు.. ఆయా రంగాలలో అనేక ఆవిష్కరణలు చేసి ఆంధ్ర విశ్వకళామతల్లి ఖ్యాతిని దశ దిశలా విస్తరింపచేశారు.. నోబెల్ ,భట్నాగర్ అవార్డులతో సహా ఎన్నెన్నో రివార్డులు కైవసం చేసుకున్నారు.. ఉపగ్రహ ప్రయోగాల వ్యవస్థ (ఇస్స్రో )లోను మన శాస్త్రవేత్తలు ఉన్నారంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఔన్నత్యాన్ని కొలిచేందుకు సాధనాలే లేవని చెప్పవచ్చు.. దేశ సమాచార వ్యవస్థకు కేంద్రబిందువు గా పరిగణించే 'నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్'(నిక్ నెట్, న్యూఢిల్లీ)లోను డజన్ల సంఖ్యలో ఆంధ్రవిశ్వవిద్యాలయంలో చదివిన శాస్త్రవేత్తలు ఉండడం గర్వకారణమే కదా.. వీరితో పాటు పాలనా పరంగానూ ఎందరో మేధావుల్ని అందించిన ఘనత ఆంధ్రవిశ్వవిద్యాలయానిదే.. ఇక్కడ చదివిన ఎందరో ఆచార్యులు దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లుగా వెళ్లడం సర్వ సాధారణ విషయంగా మారింది.. ఐ ఐ టీ లతో పాటు అనేక కేంద్రీయ విద్యాలయాలకు సైతం ఉప కులపతులుగా నియామకం కావడం సంతోషించాల్సిన విశేషమే మరి..వీరితో పాటు ఎందరో ఐ ఏ ఎస్ లు, ఐ పీ ఎస్ అధికారులు సైతం ఇక్కడ చదివి, తమ పదవుల్లో రాణించడం చెప్పుకోదగ్గ అంశమే..
కళలకు రూపం-కళాకాంతుల'విశ్వరూపం'
దేశంలోనే తొలిసారిగా విశ్వవిద్యాలయ స్థాయిలో 'రంగస్థల'(థియేటర్ ఆర్ట్స్), విభాగం ప్రారంభమయింది ఇక్కడే.. నటన, దర్శకత్వం లో డిప్లొమా కోర్సులు నిర్వహించిన ఘనత శ్రీ కే వీ గోపాలస్వామి గారిదే.. వారి పేరుతోనే ఆరుబయలు రంగస్థల వేదిక (ఓపెన్ ఎయిర్ థియేటర్)ను ఏర్పాటు చేశారు.. ఆ వేదిక మీద ప్రదర్సన చేయడం ఒక మహదవకాశంగా భావించేవారు.. కానీ అది ఒకప్పటి మాట.. ఇప్పడు దాని స్వరూపమే మార్చేశారు.. అదనపు హంగుల పేరుతో లేనిపోని రంగులు అద్ది ప్రదర్శనకు ఉపయోగించే వీలు లేకుండా చేయడం శోచనీయం.. సంగీతం, నృత్య విభాగాలు కూడా ఆంధ్రవిశ్వకళాపరిషత్తు సొంతం.. ఆచార్య పద్మశ్రీ నేదునూరి కృష్ణ మూర్తి వంటి కళాస్రష్టల నేతృత్వంలో ఏర్పాటైన సంగీత విభాగం ఆరు కచేరీలు,నృత్య విభాగం మూడు ఆరంగేట్రాలతో విలసిల్లు తున్నాయి..ఇక ఆంధ్రవిశ్వకళాపరిషత్తుకు మరో మణిమకుటం 'లలిత కళల'(ఫైన్ ఆర్ట్స్) విభాగం.. ప్రపంచస్థాయి చిత్రకారుల్ని రూపొందించిన విభాగం ఇది..భారత పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహం రూపశిల్పి ఈ విభాగపు ఆచార్యుడు, దివంగత రవిశంకర్ పట్నాయక్.. అది మనకు గర్వకారణమే కదా..
ఘన చరిత్రలో తనకంటూ ఎన్నో పేజీలను లిఖించుకున్న ఆంద్రావిశ్వకళామ తల్లి రాజకీయ ప్రముఖులకు సైతం జన్మ నిచ్చింది.. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, ప్రస్తుత ఒడిశా గవర్నర్ ఆచార్య కంభంపాటి హరిబాబు, రాజ్యసభ మాజీ సభ్యులు, విశ్వహిందీ పరిషత్తు అధ్యక్షులు పద్మ విభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ ,శ్రీ స్టాలిన్ ,ఉత్తమపార్లమెంటెరియన్లుగా పేరు గడించిన ఎంవీఎస్ మూర్తి, కింజరాపు యర్రం నాయుడు పాటు మంత్రులు, శాసనసభ, శాసనమండలి సభ్యులు ఇంకా ఎందరో ఇక్కడ రాజకీయ ఓనమాలు నేర్చిన వారే..
మహామహులకు జన్మనిచ్చిన మన 'న్యాయ కళాశాల'
1945సంవత్సరం లో పురుడు పోసుకున్న న్యాయకళాశాల దేశానికి ఎందరో న్యాయమూర్తులను మన దేశ న్యాయవ్యవస్థ కు అందించింది. కొందరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు గాను, ఇంకొందరు హైకోర్టు న్యాయమూర్తులు గాను గొప్ప సేవలందించారు.. భారత దేశ ఎన్నికల సంఘానికి చీఫ్ కమీషనర్ గా విధులు నిర్వహించి, ఆ రాజ్యాంగ పదవికే వన్నె తెచ్చారు జీ వీ జీ కృష్ణ మూర్తి.. వారు చదివిందీ మన న్యాయకళాశాలలొనే.. 'బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 'చైర్మన్ గా సేవలందించిన దివంగత డీ వీ సుబ్బారావు ఈ చదువుల తల్లి ముద్దుబిడ్డడే.. అంతేకాదు, 'అంతర్జాతీయ లా కమీషన్' సభ్యులు గా ప్రపంచ గుర్తింపు పొందిన పి. ఎస్. రావు కూడా మన లా కళాశాల పూర్వ విద్యార్ధే.. ప్రతిష్టాత్మక భారత దేశపు పార్లమెంట్ లోని లోక్ సభ స్పీకర్ (సభాపతి )గా రాణించిన దివంగత జీ ఎం సీ బాలయోగి సైతం ఇక్కడ చదివి అంత పెద్ద స్థాయికి ఎదిగిన ఆణిముత్యమే.. ఇంకా జస్టిస్ కే. రామస్వామి, జస్టీస్ అమరేశ్వరి, జస్టిస్ ఐ. పాండురంగారావు, జస్టిస్ ఎన్డీ పట్నాయక్, జస్టిస్ పీ. రామకృష్ణ రావ్, ..ఇంకా మరెందరో న్యాయ నిపుణులు, న్యాయ మూర్తులు ఈ చదువుల తల్లి ఒడిలో పెరిగి పెద్దయిన వారే..
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం,వ్యావహారిక భాషా ఉద్యమం తో పాటు అనేక ఉద్యమాలకు పురుడు పోసిన రణక్షేత్రం ఆంధ్రవిశ్వవిద్యాలయం..మహోన్నత ఆశయాలు, మహత్తర లక్ష్యాలతో తొలి విశ్వవిద్యాలయంగా ఆరంభమై, అంచలంచలుగా ఎదిగి నూరేళ్ళ సంబరాలకు ఉవ్విళ్లూరుతున్న చదువుల తల్లి వందేళ్ల పండుగ ఆరంభోత్సవానికి ఛాన్సలర్ హోదాలో గవర్నర్ ని కానీ, రాష్ట్రాధినేత ముఖ్యమంత్రిని కానీ, కనీసం విద్యాశాఖ మంత్రిని కానీ ఒప్పించి, రప్పించలేకపోవడం వెలితిగానే భావించాలి..ఇంత గొప్ప చదువుల తల్లి సంబరాలను ఇలా సాదా ,సీదాగా నిర్వహించదలచడం వర్సిటీ వైభవాన్ని విస్మరించడం గా పరిగణించాలని అభిమానులు వాపోవడం సమంజసమని గ్రహించాలి..ఎట్టకేలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య మధునామూర్తి ముఖ్య అతిథిగా రావడం కొంతలో కొంతైనా ఊరటనిచ్చే అంశం..
కొసమెరుపు: వివిధ రంగాలలో ప్రావీణ్యం కనబరిచిన ప్రసిద్ధులను 'కళాప్రపూర్ణ'(గౌరవ డాక్టరేట్)తో సత్కరించటం యూనివర్సిటీ సాంప్రదాయం గా వస్తోంది.. ఈ కోవలో 'వేయిపడగల' విశ్వనాధ సత్యనారాయణ గారికి కళాప్రపూర్ణ ఇచ్చిన చాలా కాలానికి గుర్రం జాషువా గారికి కూడా ప్రదానం చేశారట.. ఓసారి పూర్వ విద్యార్థుల సమావేశానికి ఈ ఇద్దరు ప్రముఖులు హాజరయ్యారు.. విశ్వనాధ మాట్లాడుతూ "ఈ మధ్య కాలంలో గుర్రాలు, గాడిదలకు కళాప్రపూర్ణ లు ఇస్తున్నారు" అని వెటకరించారట! దానికి గుర్రం జాషువా గారు "అవును!నిజమే!సుమీ గాడిదలకు ముందుగా ఇచ్చి గుర్రాలకు తరువాత ఇవ్వడం అపచారమే కదా" అని దీటుగా చమత్కరించారట !! మేధావులు ఢీ కొంటే ఇలానే ఉంటుంది మరి!!
(ఏప్రిల్16, ఆంధ్రవిశ్వకళాపరిషత్తు వందేళ్ల పండుగ ఆరంభ సూచకంగా)
ఆచార్య పీటా బాబీ వర్ధన్,
జర్నలిజం విభాగపు పూర్వాధి పతి & డీన్
మీడియా విశ్లేషకులు,ఆంధ్ర విద్యాలయం.

Apr 24, 2025

100 సంవత్సరాల్లో బంగారం ధరలు

1925 నుండి 2025 వరకు 100 సంవత్సరాలలో  10 గ్రాముల బంగారం మార్కెట్ ధరలు 








సంవత్సరం  రూపాయలు 

1925.        18.75

1926.        18.43

1927.        18.37

1928.        18.37

1929.        18.43

1930.        18.05

1931.        18.18

1932.        23.06

1933.        25.05

1934.        28.81

1935.        30.81

1936.        29.81

1937.        30.18

1938.        29.93

1939.        31.75

1940.        36.05

1941.        37.43

1942.        44.05

1943.        51.05

1944.        52.93

1945.        62.00

1946.        83.87

1947.        88.62

1948.        95.87

1949.        96.18

1950.        97.18

1951.        98.00

1952.        76.81

1953.        73.00

1954.        77.00

1955.        79.00

1956.        90.00

1957.      ‌  90.00

1958.     ‌   95.00

1959.      102.00  

1960.      111.00

1961.      119.00

1962.      119.00

1963.        97.00

1964.        63.00

1965.        72.00

1966.        84.00

1967.      102.00

1968.      162.00

1969.      176.00

1970.      184.00

1971.      193.00

1972.      202.00

1973.      278.00

1974.      506.00

1975.      540.00

1976.      572.00

1977.      576.00

1978.      685.00

1979.      937.00

1980.    1330.00

1981.    1700.00

1982.    1645.00

1983.    1800.00

1984.    1970.00

1985.    2130.00

1986.    2140.00

1987.    2570.00

1988.    3130.00

1989.    3140.00

1990.    3200.00

1991.    3466.00

1992.    4334.00

1993.    4140.00

1994.    4598.00

1995.    4680.00

1996.    5160.00

1997.    4725.00

1998.    4045.00

1999.    4680.00

2000.    4400.00

2001.    4300.00

2002.    5000.00

2003.    5600.00

2004.    5850.00

2005.    7000.00

2006.    8400.00

2007.  10800.00

2008.  12500.00

2009.  14500.00

2010.  18500.00

2011.  26400.00

2012.  29500.00

2013.  29600.00

2014.  28734.00

2015.  26845.00

2016.  29560.00

2017.  29920.00

2018.  31730.00

2019.  36080.00

2020.  48480.00

2021.  50000.00

2022.  53000.00

2023.  60000.00

2024.  80000.00

2025.  1,00,000 

తేదీ.21.04.2025న 10 గ్రాముల బంగారం ధర అక్షరాల లక్ష రూపాయలకు చేరింది.

Apr 23, 2025

‘మన మంగళగిరి 2.0’ పరిచయం


మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి  చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ్యులు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ‘మన మంగళగిరి 2.0’లో మంగళగిరి చరిత్రను  సమగ్రంగా రాసినట్లు రచయిత గోవర్థన్ మంగళవారం స్థానిక జర్నలిస్టులకు వివరించారు. స్థానిక విలేకరులకు ఆయన ఈ పుస్తకాన్ని అందజేశారు. మంగళగిరి చరిత్ర అధ్యయనంలో దిట్ట అయిన  గోవర్థన్ గతంలో కూడా ‘మన మంగళగిరి’ అనే పేరుతో ఒక పుస్తకం రాశారు. ఈసారి 546 పేజీలతో, మంగళగిరిలోని అన్ని రంగాల  సమగ్ర సమాచారంతో  దీనిని తీసుకువచ్చారు. ఈ పుస్తకంలోని సమాచార సేకరణ కోసం ఆయన ఎంతో శ్రమించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వానపల్లి బ్రహ్మనాయుడు, సీనియర్ జర్నలిస్ట్ కొలికపూడి రూఫస్ తదితరులు పాల్గొన్నారు. 

Apr 20, 2025

తెలుగు జాతి గర్వించదగిన నేత చంద్రబాబు


ప్రపంచంలో వస్తున్న మార్పులను ముందుగానే గమనించగలిగిన దిట్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సాంకేతిక విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి  తెలుగు యువత ప్రపంచం నలుచరుగులా విస్తరించడానికి అవకాశం కల్పించిన దార్శనికుడు.  చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో ఖర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ దంపతులకు 1950, ఏప్రిల్ 20న జన్మించిన చంద్రబాబు నాయుడు యూరప్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు తన 75వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. నారావారి పల్లెకు  పొరుగునే ఉన్న శేషాపురంలో చంద్రబాబు ప్రాథమిక విద్యాభ్యాసం, చంద్రగిరిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు.  శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి 1972లో బి.ఏ., 1974లో ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పూర్తి చేశారు. చిన్నతనంలో ఆరు కిలోమీటర్ల దూరం కాలినడకన పాఠశలకు వెళ్లిన మధ్యతరగతి జీవితపు అనుభవాలను మూటగట్టుకున్న ఓ మామూలు కుర్రాడు రాష్టానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టారు. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగే క్రమంలో  చంద్రబాబు ఎన్నో సంక్షోభాలు, మరెన్నో సంఘర్షణలు, సవాళ్లు ఎదుర్కొన్నారు.  

1977లో  పులిచెర్ల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 47 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నారు.  28 ఏళ్ల వయసులోనే  చంద్రబాబు  1978 ఫిబ్రవరి 25న జరిగిన ఎన్నికల్లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ విజయం సాధించారు. 1978 మార్చి 15న ఎమ్మెల్యేగా తొలిసారి ప్రమాణస్వీకారం చేసిన ఆయన, రెండేళ్లకే 1980 అక్టోబర్ 11న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ, పురావస్తు శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ రకంగా ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు, నవ్యాంధ్రలో రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదిగారు.  41 ఏళ్లుగా వరుసగా అసెంబ్లీలో ఉన్నారు. ఎవరికీ లేని రికార్డు ఆయనకు ఉంది.  1981, సెప్టెంబర్ 10న   ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకోవడంతో ఆయన దశ ఉజ్వలంగా వెలిగిపోతోంది.  ఎన్టీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రెండు వారాలకు 1983 జనవరి 23న  చంద్రబాబు దంపతులకు  లోకేష్ జన్మించారు. 

1984 మే 27న ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వంలో కర్షక పరిషత్ చైర్మన్‌గా నియామితులయ్యారు. 1985లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1989లో ఎన్టీఆర్ స్వయంగా  ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబుకు బాధ్యతలు అప్పగించారు. చంద్రబాబు నాయుడు ఓ పక్క రాజకీయ నాయకుడిగా పార్టీని చక్కదిద్దుతూ, మరో పక్క 1992లో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌ను స్థాపించారు. 1995 ఆగస్టు సంక్షోభం నుంచి తెలుగుదేశం పార్టీని కాపాడారు. 1995 సెప్టెంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1996లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కేంద్రంలో మొదటిసారిగా కాంగ్రెస్‌, బీజేపీలు లేని తృతీయ ఫ్రంట్‌ (యునైటెడ్ ఫ్రంట్) చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆ విధంగా ఆయన జాతీయ స్థాయి నాయకునిగా ఎదిగిపోయారు.  రెండు కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటులో, ముగ్గురు ప్రధానుల ఎంపికలో, ఇద్దరు రాష్ట్రపతుల ఎంపిక విషయంలో చంద్రబాబు  దేశ రాజకీయాల్లో  అత్యంత కీల పాత్ర  పోషించారు. 

1997 మార్చిలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులలో ఒకరైన బిల్ గేట్స్‌తో భేటీ అయ్యారు. 1999 ఫిబ్రవరి 28న హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించారు.  ఆ విధంగా తన ఆలోచనల ద్వారా ప్రపంచ వ్యాపార, ఐటీ దిగ్గజాలను ఆకర్షించే స్థాయికి ఎదిగారు. 1998 మార్చి 19న చంద్రబాబు జాతీయ కన్వీనర్‌గా ఎన్డీఏ ఏర్పాటైంది. 

1999 జనవరి 26లో ‘ఆంధ్రప్రదేశ్ విజన్: 2020’ పేరుతో చంద్రబాబు విడుదల చేసిన దార్శనిక పత్రం ఫలితమే సైబరాబాద్ ఏర్పాటు. ఆ తర్వాత హైదరాబాద్ ముఖచిత్రం మారిపోయింది.  1999 అక్టోబర్ 25న చంద్రబాబు అధ్యక్షతన స్వర్ణాంధ్రప్రదేశ్ నినాదంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. దాంతో, ఆయన రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2003 అక్టోబరు 1న తిరుపతి బ్రహ్మొత్సవాలకు వెళ్ళే సమయంలో అలిపిరి వద్ద నక్సలైట్లు క్లేమోర్ మైన్లు పేల్చి చంద్రబాబు నాయుడిపై హత్యాప్రయత్నం చేశారు. కానీ, అదృష్టవశాత్తూ చంద్రబాబు ఆ ప్రమాదం నుండి గాయాలతో బయటపడ్డాడు.

2014లో రాష్ర్టం విడిపోయిన తర్వాత, నవ్యాంధ్రలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ జనసేనలను కలుపుకుని ఘనవిజయం సాధించారు. 2014 జూన్‌ 8న  ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మైదానంలో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2015 మార్చి 30న దేశంలో మొదటి నదుల అనుసంధాన ప్రాజెక్టు 'పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు'కు శంకుస్థాపన చేశారు. 2015 సెప్టెంబర్ 17న  కృష్ణా - గోదావరి నదుల పవిత్ర సంగమం జరిగింది. 2015 అక్టోబరు 22న  ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.  పాలనలో భరోసాకు మరో పేరు, దార్శనికత కలిగిన ప్రజానేత, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన చంద్రబాబు నాయకత్వంలో 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించింది. దాంతో చంద్రబాబు నాలుగవసారి ముఖ్యమంత్రి అయ్యారు. అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ, పేదరికం లేని సమాజ నిర్మాణంలో భాగం పీ4 విధానాన్ని ప్రకటించి విజయవంతంగా కొనసాగిస్తున్నారు. 

పరిపాలనా దక్షతతో అనేక సంస్కరణ తీసుకువచ్చిన చంద్రబాబు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ నేతగా పేరుఘడించారు. 1998లో అమెరికాలోని ఇల్లినాయిస్ గవర్నర్ జిమ్ ఎడ్గార్ చంద్రబాబు గౌరవార్ధం సెప్టెంబర్ 24వ తేదీని 'నాయుడు డే'గా ప్రకటించారు.   ఇండియా టుడే వార్తా సంస్థ చంద్రబాబును 'ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం'గా పేర్కొంది. ఎకనామిక్ టైం వార్తా సంస్థ 'బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్'గా ప్రకటించింది.  అమెరికాకు చెందిన ఒరాకిల్ కార్పొరేషన్ మాస పత్రిక 'ప్రాఫిట్' చంద్రబాబును 'హిడెన్ సెవెన్ వర్కింగ్ వండర్స్‌లో ఒకరు' అని పేర్కొంది. బీబీసీ కూడా 'సైబర్ సావీ చీఫ్ మినిస్టర్' అంది. సిఎన్ఎన్ వార్త సంస్థ ‘సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అని పేర్కంది.  టైమ్ ఆసియా సంస్థ 'సౌత్ ఆసియన్ ఆఫ్ ది ఇయర్ 1999' అవార్డును చంద్రబాబుకు ప్రకటించింది. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, సింగపూర్ మాజీ ప్రధాని గో చోక్ టోంగ్... తదితరులు భారతదేశానికి వచ్చినప్పుడు తమ షెడ్యూల్‌లో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి చంద్రబాబు నాయుడుతో సమావేశమవడాన్ని తప్పనిసరి చేసుకుంటారు.  

2003 జూన్ 26న ‘ప్రజాస్వామ్యంలో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఈ-పరిపాలన’ అనే అంశాలపై ఐక్యరాజ్యసమితిలో చంద్రబాబు ప్రసంగించారు. తెలుగువారు గర్వించదగ్గ ఇంతటి మహానేత చంద్రబాబు నాయుడు  “అదృష్టాన్ని నేనెప్పుడూ నమ్ముకోలేదు. నా కష్టాన్నే నమ్ముకున్నాను” అని స్పష్టంగా చెప్పారు. అదే మనకు ఆదర్శం కావాలని ఆశిస్తూ, నారా చంద్రబాబు నాయుడుకు 75వ జన్మదిన శుభాకాంక్షలు.

- శిరందాసు నాగార్జు, సీనియర్ జర్నలిస్ట్- 9440222914