
నటనలో పట్టున్న గానగంధర్వుడు
వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీత్యా ఆయన నటుడు, గాయకుడు.. వెరసి కళలపట్ల మక్కువ ఎక్కువగా ఉన్న వామపక్ష భావజాలం ఉన్న కళాకారుడు. నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడే ఆయన వేదికనెక్కారు. ఆయనే మంగళగిరి గానగంధర్వుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి పొట్లాబత్తుని లక్ష్మణరావు.
గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన చేనేత, ప్రజానాట్యమండలి కళాకారుడు, కడలూరి డిటెన్యూ, ప్రముఖ కమ్యూనిస్టు పొట్లాబత్తుని వెంకటేశ్వరరావు- తల్లి మహాలక్ష్మి దంపతులకు లక్ష్మణరావు 1956 ఆగస్టు 19న జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. తండ్రి వెంకటేశ్వరరావు కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొని కడలూరు సెంట్రల్ జైలులో డిటెన్యూగా ఉన్నారు. తండ్రి లక్షణాలే బాల్యం నుంచి లక్ష్మణరావు పుణికిపుచ్చుకున్నారు. వృత్తి, ప్రవృత్తి అన్నీ తండ్రి లక్షణాలే. అయితే, ఈయన స్వయంకృషితో చేనేత కళాకారుడి నుంచి మాస్టర్ వీవర్(చేనేత మగ్గాలు నేయించే యజమాని)గా, ఆ తర్వాత చేనేత వస్త్ర వ్యాపారిగా ఎదిగి ఆర్థికంగా స్థిరపడ్డారు. ఆయన సామాజికంగా, ఆర్థికంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఓ గొప్ప మానవతావాది. మంచి స్నేహశీలి. పాత మంగళగిరిలోని జీఆర్(గంజి రామాంజనేయులు) స్కూల్‌లో ప్రాథమిక విద్యతో లక్ష్మణరావు చదువు ముగిసింది. అక్కడ నుంచి జీవితాన్ని చదవడం మొదలుపెట్టారు. మంగళగిరి మెయిన్ బజారు గుర్రబ్బళ్ల సెంటర్‌లోని వింజమూరి వెంకటరత్నం చిల్లర కొట్టుతో అతని సంపాదనపర్వం మొదలైంది. అప్పటి నుంచే మంగళగిరిలోని అన్నివర్గాల ప్రజలతో, పెద్దలతో పరిచయాలు మొదలయ్యాయి. ఆ చిల్లర కొట్లో కొద్దికాలం మాత్రమే పనిచేశారు. 11 ఏళ్లకే చేనేత మగ్గం గుంటలోకి దిగారు. అది మొదలు దాదాపు 30 ఏళ్లు చేనేత కళాకారుడిగా జీవించారు. 1976 మార్చి 5న లక్ష్మణరావు-లక్ష్మిని వివాహం చేసుకున్నారు.
1988 నుంచి చేనేత మగ్గాలు నేయించడం ప్రారంభించారు. రెండేళ్లు గడిచింది. ఎదుగుబొదుగులేదు. 1990లో లక్ష్మణరావు అమ్మ మహాలక్ష్మి తండ్రి ఆత్మకూరు గ్రామానికి చెందిన చిట్టెల అంకయ్య వ్యాపార వృద్ధి కోసం రూ.10వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఆ పెట్టుబడితో వ్యాపారం వృద్ధి చేయడంపై దృష్టిసారించారు. రెండు చేనేత మగ్గాలతో మొదలుపెట్టిన చేనేత వ్యాపారం రెండు నెలల్లో 20 మగ్గాలకు చేరింది. అక్కడి నుంచి మాస్టర్ వీవర్‌గా ఎదుగుతూ వచ్చారు. నేడు 400 మగ్గాలు నేయిస్తున్నారు. మంగళగిరిలో ఆయనకు చేనేత షెడ్లు ఉన్నాయి. సొంత షెడ్లలోని మగ్గాలతోపాటు మంగళగిరి, భట్టిప్రోలు, ఐలవరం, తెనాలి, పెడన, చేబ్రోలు, మచిలీపట్నం వంటి చోట్ల కూడా ఆయన చీరలు నేయిస్తుంటారు. నీతి, నిజాయితీ, నమ్మకం, ఇతరులకు సహాయపడటం వంటి లక్షణాలు ఆయన జీవన శైలిలోనే ఉన్నాయి. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదగడానికి అవి ఆయనకు ఉపయోగపడ్డాయి. చేనేత వస్త్రాల రంగు, నైపుణ్యంగల వస్త్రాల తయారీకి మంగళగిరి ప్రసిద్ధి. దానికితోడు ఆయన స్వయంగా చేనేత కళాకారుడు కావడంతో చేనేత వస్త్రాల తయారీలో రంగులు, డిజైన్ల రూపకల్పనలో ఆధునిక పోకడలుపోతూ మాస్టర్ వీవర్‌గా మంచి గుర్తింపు పొందగలిగారు. 1992లో చేనేత వస్త్రాలయం
‘లక్మ్షీశారీస్’ని ప్రారంభించారు. మొదట రిటైల్ వ్యాపారం ప్రారంభించి, తర్వాత హోల్ సేల్ వ్యాపారం కూడా మొదలుపెట్టారు. కొడుకు శ్రీకాంత్ ఆయనకు అన్ని విధాల చేదోడువాదోడుగా ఉండటంతో వ్యాపారవేత్తగా కూడా లక్ష్మణరావు దూసుకుపోతున్నారు. మంగళగిరిలో ప్రముఖ వ్యాపార సంస్థగా ఎదిగిన ‘లక్మ్షీశారీస్’కి రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలలో కూడా మంచి పేరుంది. దాంతో వారి వ్యాపారం రూ.4 కోట్ల టర్నోవర్‌కు చేరింది. అటు చేనేత వృత్తిలో, ఇటు రిటైల్, హోల్ సేల్ వ్యాపారంలో లక్ష్మణరావు దాదాపు వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
వృత్తి రీత్యా చేనేత కళాకారుడైన లక్ష్మణరావు ప్రవృత్తి రీత్యా నటుడు, గాయకుడు, రేడియో కళాకారుడు. దానికి తోడు తండ్రి వెంకటేశ్వరరావు ప్రముఖ కమ్యూనిస్టు పార్టీ నేత, ఆ ఉద్యమంలో పాల్గొని కడలూరి డిటెన్యూగా జైలుకు కూడా వెళ్లారు. ఆయన కూడా ప్రజానాట్యమండలి కళాకారుడు. అప్పట్లో మిక్కిలినేని వంటి హేమాహేమీలతో ఆయన నటించారు. ఆయన వామపక్ష భావజాలం, రంగస్థల నటన లక్ష్మణరావుకు బాగా వంటబట్టాయి. అయితే, తండ్రిని మించిన తనయుడుగా వృత్తి పరంగా, ప్రవృత్తి పరంగా, ఆర్థికంగా ఎదిగారు. నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడే వేదికనెక్కిన ఘనత లక్ష్మణరావుకు ఉంది. ‘మా భూమి’ నాటకంలో ప్రముఖ సినిమా నటుడు మిక్కిలినేని రాధాకృష్ణ నటించిన పాత్రకు కొడుకుగా 5 నెలల వయసులోనే లక్ష్మణరావుని తండ్రి స్టేజీ ఎక్కించారు. తల్లిదండ్రులు ఎత్తుకుని ఆడించే దృశ్యంలో కనిపించారు. ఆ తర్వాత పదేళ్ల వయసు నుంచి నటించడం మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల ప్రదర్శనలు ఇచ్చారు. ఒక్క ‘భూ భాగోతం’ నృత్య నాటిక ఒక్కటే 500 ప్రదర్శనలు ఇచ్చారు. గంభీరమైన స్వరంతో భావాన్ని ప్రకటిస్తారు. స్వరంలో మాధుర్యం, గంభీరం రెండూ పలికిస్తారు. గానం కూడా అంతే మధురంగా, వినసొంపుగా ఆలపిస్తారు. మంచంమీద మనిషి, ఎవరు కారణం?, వెలుగొచ్చింది, ఆంజనేయరెడ్డి చరిత్ర, అడ్రెస్ లేని మనుషులు, శ్రీముఖ వ్యాఘ్రం, కనువిప్పు, తిరుగు టపా, వంద నోటు, క్షీరసాగర మథనం... వంటి అనేక నాటకాలు, నాటికలలో నటించారు. ఆయన నటించిన ప్రతి నాటిక 40 నుంచి 50 సార్లు ప్రదర్శించారు. శ్రీముఖ వ్యాఘ్రం నాటికలో సినీనటి అన్నపూర్ణ(ఉమ), లక్ష్మణరావు భార్యాభర్తలుగా నటించారు.
1979 నుంచి 2012 వరకు రేడియో ఆర్టిస్ట్‌గా అనేక నాటికలలో నటించారు. పాటలు పాడారు. ముఖ్యంగా నాటక రంగంలో దర్శకత్వం, రచన, నటన.. వంటి విషయాలలో లక్ష్మణరావుకు మంగళగిరికి చెందిన అందె నరసింహారావు, కట్టా నాగేశ్వరరావు, కట్టా అంజిబాబు, గట్టెం నరసింహమూర్తి, భాస్కరరావు, కున్నెర్ల బుజ్జి, బొడ్డు విద్యాసాగర్, కొంగతి సాంబశివరావు, గోలి సీతారామయ్య, సందుపట్ల భూపతి... వంటివారు సహకారం అందించారు.
వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ లక్ష్మణరావుకు కళలంటే ప్రాణం. పదేళ్ల క్రితం ప్రారంభించిన విశ్వశాంతి కళాపరిషత్ వ్యవస్థాపక కన్వీనర్ కూడా అయిన పొట్లాబత్తుని లక్ష్మణరావు నేటి తరానికి సాంస్కృతిక, కళల ఆవశ్యకతను తెలియపరిచేందుకు తండ్రి కడలూరి డిటెన్యూ, ప్రజాకళాకారుడు, కీర్తిశేషులు పొట్లాబత్తుని వెంకటేశ్వరరావు పేరిట పాత మంగళగిరి బైపాస్ రోడ్డు పక్కన లక్ష్మీశారీస్ భవనంపైన దాదాపు పదేళ్ల క్రితం ‘పొట్లాబత్తుని వెంకటేశ్వరరావు కళానిలయం’ను ప్రారంభించారు. కళలు, సాహిత్యం సామాజిక చైతన్యానికి ఉత్తమ సాధనాలుగా ఆయన భావిస్తారు. కళ కళ కోసం కాదు- కళ ప్రజల కోసం. గానం కాసు కోసం, కీర్తి కోసం కాకూడదన్నది ఆయన నినాదం, లక్ష్యం. మంగళగిరి నగరంలో సాంస్కృతిక పునర్ వైభవాన్ని చాటేందుకు ఈ కళానిలయంను సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు ఉచితంగా ఇస్తారు. ప్రజా కళాకారుడైన లక్ష్మణరావు నగరంలో జరిగే అన్ని సాంస్కృతిక కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, ఆయా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ యువతను ప్రోత్సహిస్తుంటారు. మంగళగిరి బుద్ధ విహార్ వ్యవస్థాపక సభ్యులైన లక్ష్మణరావు కళల ద్వారా సామాజిక చైతన్యం తీసుకువచ్చేందుకు విశేషంగా కృషి చేస్తుంటారు. రాజకీయంగా కూడా లక్ష్మణరావు చురుకుగా వ్యవహరిస్తుంటారు. టీడీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆ పార్టీ ముఖ్య కార్యక్రమాలలో పాల్గొంటుంటారు. ఆగస్టు 19న లక్ష్మణరావు 70వ జన్మదిన వేడుకలు ఆయన మిత్రులు ఘనంగా నిర్వహించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పొట్లాబత్తుని లక్మణరావు కళాసేవను ఇలాగే కొనసాగిస్తారని ఆశిద్దాం.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914
No comments:
Post a Comment