నేడు చేనేత దినోత్సవం
జాతీయోద్యమంలో చేనేత రంగం కీలక పాత్ర పోషించింది. జాతీయ నాయకులు విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపు ఇవ్వడంతో 1905, ఆగస్టు 7న కోల్‌కతాలో విదేశీ వస్త్రాలను దగ్ధం చేశారు. ఆ సంఘటన ఉద్యమానికి ఊపు తెచ్చింది. దాంతో చేనేత చిహ్నమైన రాట్నానికి జాతీయోద్యమ జెండాలో స్థానం కల్పించారు. నూలు వడకడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టారు. మహాత్మా గాంధీ తకిలి అనే కదురు ద్వారా దూదితో నూలు వడుకుతుండేవారు. ఆ విధంగా చేనేత చిహ్నం జాతీయోద్యమానికి ప్రతీకగా నిలిచింది. విదేశీ వస్త్రాలను తొలిసారి దగ్ధం చేసిన ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవం(నేషనల్ హ్యాండ్‌లూమ్-డే)గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం 2015లో నిర్ణయించింది. అప్పటి నుంచి జాతీయ స్థాయిలో చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చల్లని చూపు చేనేత రంగంపై పడింది. ఈ ప్రభుత్వం చేనేత వృత్తిని గౌరవించడంతోపాటు చేనేత కార్మికుల చిందించే శ్వేదాన్ని గుర్తించింది. వారికి మద్దతు పలుకుతూ, వారి జీవనాన్ని మెరుగు పరచడం కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. చేనేత కుటుంబాలలో వెలుగు నింపుతోంది. చేనేతకు పూర్వ వైభవం వస్తోంది. చేనేత మగ్గం మోతలు మోగుతాయి. ప్రభుత్వం చేనేతకు ఊతం ఇస్తే, అది ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. ప్రభుత్వ చర్యల వల్ల చేనేత రంగం అభివృద్ధి చెందడంతోపాటు చేనేత కుటుంబాలకు, అలాగే చేనేత అనుబంధ రంగాలలో ఇతరులకూ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. చేనేత ఉత్పత్తులు పెరిగి, ఎగుమతులు పెరిగి ఈ రంగం కూడా సంపదని సృష్టిస్తుంది. చేనేత కార్మికులకు ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తారు. ఈ పథకం ప్రకారం చేనేత మగ్గం ఉన్న కుటుంబానికి 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం. మర మగ్గం ఉన్న కుటుంబానికి 500 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం. ఈ ఉచిత విద్యుత్ పథకం కోసం ప్రభుత్వం రూ.125 కోట్ల వ్యయం భరించనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 50 వేల చేనేత మగ్గాలు ఉన్న కుటుంబాలు, 15 వేల మర మగ్గాలు ఉన్న కుటుంబాలు లబ్ధి పొందుతాయి. మగ్గానికి ఉచిత విద్యుత్ ఇవ్వడం అంటే చేనేత కార్మికుడి కష్టానికి గౌరవం ఇవ్వడమే. అలాగే, చేనేత కార్మికులకు ఇచ్చే వీవర్ పెన్షన్‌ని నెలకు రూ.4వేలకు పెంచారు. చేనేత వస్త్రాల అమ్మకంపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న 5 శాతం జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. చేనేత కార్మికుల కోసం రూ.5 కోట్లతో త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయాలని కూడా సీఎం నిర్ణయించారు. చేనేత కుటుంబాలు ఎక్కువగా ఉన్న మంగళగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎన్నికవడం కూడా చేనేత వర్గాలకు కలిసి వచ్చింది. మంత్రి నారా లోకేష్ చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. చేనేతను ప్రపంచస్థాయికి తీసుకెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఈరోజు మంగళగిరి ఆటోనగర్‌లోని వీవర్‌శాలలో జరిగే జాతీయ చేనేత దినోత్సవంలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. అంటే, ఈ ప్రభుత్వం చేనేతకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914
No comments:
Post a Comment