Jan 2, 2017

ఇక దృష్టంతా ఆ జిల్లాలపైనే


·       వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
·       వెనుకబడిన రంగాల గుర్తింపు
·       శాస్త్రీయ దృక్ఫధంతో తగిన కసరత్తు

అభివృద్ధిలో రాష్ట్రంలో  వెనుకబడిన  జిల్లాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి(ఎస్ జీడిపి-స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్) వృద్ధి రేటు గత సంవత్సరం (2015-16) 10.99 శాతం, ఈ ఏడాది అర్ధ సంవత్సరంలో 12.23 శాతం సాధించి దేశంలో అగ్రభాగాన నిలిచింది. అయినప్పటికీ  రాబోయే 5 ఏళ్లలో 15 శాతం వృద్ధి రేటు కొనసాగించాలన్నది ప్రభుత్వం లక్ష్యం. ఈ ఏడాది కూడా నిర్ధేశించుకున్న 15.23 శాతం వృద్ధి రేటును సాధించాలన్న  పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఇందు కోసం తలసరి ఆదాయం, జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీడీపీ- గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్షన్) తక్కువగా వున్న జిల్లాలపై ఇక పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం విజయవాడలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో స్పష్టం చేశారు.
తలసరి అదాయం, జిల్లా స్థూల ఉత్పత్తిలో చివరనున్న శ్రీకాకుళం
జిల్లా స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం రెండింటిలో శ్రీకాకుళం జిల్లా వెనకబడి చివరి స్థానంలో ఉంది. వ్యవసాయం, పారిశ్రామిక రంగాలలో కూడా ఈ జిల్లా చివరి స్థానంలోనే ఉంది.  గత సంవత్సరం సరాసరి తలసరి ఆదాయం రూ.1,07,532  ఉండగా విశాఖ జిల్లా రూ. 1,40,593 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది.   శ్రీకాకుళం జిల్లా రూ.74,638 లతో చివరి స్థానం(13)లో ఉంది. రూ.86,223 తో విజయనగరం జిల్లా 12వ స్థానంలో, రూ.88,308తో కర్నూలు జిల్లా 11వ స్థానంలో, రూ.98,084తో అనంతపురం జిల్లా 10వ స్థానంలో, రూ.91,888తో కడప జిల్లా 9వ స్థానంలో, రూ.1,00,443తో చిత్తూరు జిల్లా 8వ స్థానంలో ఉన్నాయి.
గత సంవత్సరం రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ. 6,03,376 కోట్లతో వృద్ధి రేటు 10.99 శాతం సాధించడం జరిగింది. జిల్లా స్థూల ఉత్పత్తితో కృష్ణా జిల్లా రూ.72,219 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా,  శ్రీకాకుళం రూ.22,707 కోట్లతో చివరి స్థానం(13)లో ఉంది. విజయనగరం జిల్లా రూ.22,924 కోట్లతో 12వ స్థానంలో, కడప జిల్లా రూ.29,826 కోట్లతో 11వ స్థానంలో, నెల్లూరు జిల్లా రూ.38,793 కోట్లతో 10వ స్థానంలో, కర్నూలు జిల్లా రూ. 39,876 కోట్లతో 9వ స్థానంలో, ప్రకాశం జిల్లా రూ. 40,732 కోట్లతో 8వ స్థానంలో ఉన్నాయి.
శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలు పారిశ్రామికంగా వరుసగా చివరి ఆరు స్థానాలలో ఉన్నాయి. ఈ జిల్లాలన్నీ ఏ ఏ రంగాలలో, ఎందుకు వెనుకబడి ఉన్నాయో అధ్యయనం చేసి, ఆ రంగాలలో ఆయా జిల్లాలు అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందింస్తోంది. వృద్ధి, అభివృద్ధి సమాంతరంగా సాధించడానికి శాస్త్రీయ దృక్ఫధంతో తగిన కసరత్తు జరుగుతోంది. సుస్థిర వృద్ధి లక్ష్యాలు, సమాజ అభివృద్ధికి పది లక్ష్యాలు, ప్రతిభా కొలమాన సూచికలు, ఉత్తమ పాలనా పద్దతులు, అంతర్జాతీయ కొలమానాలు తదితర అంశాల ఆధారంగా ప్రభుత్వ శాఖలు ముందుకు వెళ్లుతున్నాయి. 15 శాతం చొప్పున 15 ఏళ్ల పాటు వృద్ధి రేటు  కొనసాగితే రాష్ట్రానికి తిరుగుండదు. ఈ ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలు, అనుసరిస్తున్న పథకాలు, ఆచరణలో ఆర్థిక రంగంలో సాధించిన విజయాలను పరిశీలిస్తే భవిష్యత్ లో రాష్ట్రం స్థిరమైన అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది.

రొయ్యల సాగులో లాభాల పంట

        ఆంధ్రప్రదేశ్ లో మత్స్య పరిశ్రమ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఉత్పత్తిలోనూ, ఉపాధి అవకాశాల కల్పనలోనూ ఈ రంగం మంచి ఫలితాలను సాధిస్తోంది. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో ఏపీ దేశంలో అగ్రగామిగా నిలిచింది. మంచినీటి చేపలు, ఉప్పునీటి (బ్రేకింగ్ వాటర్) రొయ్యలు, వనమి రొయ్యల ఉత్పత్తిలో ఏపీదే అగ్రస్థానం.  రాష్ట్రంలో రెండంకెల స్థిరమైన వృద్ధి రేటును సాధించేందుకు మత్స్య పరిశ్రమను ప్రధాన వృద్ధి కారకం (గ్రోత్ ఇంజన్)గా ఏపీ ప్రభుత్వం గుర్తించింది. అదేవిధంగా ఏడాదికేడాది వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతోంది.  
 అర్ధ సంవత్సరంలో 47.57 శాతం వృద్ధి రేటు నమోదు
         ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంఘం వారు 2011-12 ధరల ఆధారంగా ఏపీలో చేపలు, రొయ్యల స్థూల ఉత్పత్తిని లెక్కకడతారు. ఆ వివరాల ప్రకారం 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.17,621 కోట్ల ఉత్పత్తితో 13.56 శాతం వృద్ధి రేటు నమోదుకాగా, 2015 -16లో  రూ.23,397 కోట్ల విలువైన 23.52 లక్షల టన్నుల ఉత్పత్తితో 32.78 శాతం వృద్ధి రేటు సాధించింది. దాంతో ఈ ఏడాది (2016-17) ఉత్పత్తి లక్ష్యాన్ని రూ.30,440 కోట్లు (26.40 లక్షల టన్నులు)గా, అర్ధ సంవత్సరం లక్ష్యాన్ని రూ. రూ.16,430 కోట్లుగా  ప్రభుత్వం నిర్ధేశించింది. ఈ అర్ధ సంవత్సరం (ఏప్రిల్-సెప్టెంబర్)లో లక్ష్యానికి మించి రూ. 17,578 కోట్ల ఉత్పత్తి జరిగింది. గత ఏడాది జరిగిన అర్ధ సంవత్సరం ఉత్పత్తి రూ.12,329 కోట్లతో పోల్చితే 42.57 శాతం వృద్ధి రేటు సాధించడం జరిగింది. ఈ అర్ధ సంవత్సరంలో రాష్ట్రంలో ఏ రంగంలోనూ ఇంత వృద్ధి రేటు నమోదు కాలేదు. జాతీయ స్థాయిలో కూడా ఈ రంగంలో 5.26 శాతం మాత్రమే వృద్ధి రేటు నమోదైంది.
 విదేశీ మారకద్రవ్యంలో కీలక పాత్ర
           విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెట్టడంలో ఈ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోంది. మన దేశం నుంచి 75 దేశాలకు చేపలు ఎగుమతి అవుతున్నాయి.  2014-15లో దేశం నుంచి ఎగుమతి అయిన సముద్ర ఉత్పత్తుల విలువ రూ.35 వేల కోట్లు కాగా, రాష్ట్రం నుంచి ఎగుమతి అయిన వాటి విలువ దాదాపు 16 వేల కోట్ల రూపాయలు. దేశం నుంచి ఎగుమతి అయ్యే మత్స్య ఉత్పత్తులలో ఏపీ నుంచి 45 శాతం ఎగుమతి అవుతున్నాయి. వనమిరకం రొయ్యలు ఏపీ నుంచే అత్యధికంగా 70 శాతం వరకు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.  ఇచ్చాపురం నుంచి తడ వరకు 9 జిల్లాలలో 974 కిలో మీటర్ల సముద్రతీరం ఉండటంతో సముద్ర ఉత్పత్తులలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ, దేశ మత్స్య పరిశ్రమ రాజధానిగా ఏపీ వెలుగొందుతోంది.
 5 ఏళ్లలో వంద శాతం వృద్ధి లక్ష్యం
         వచ్చే అయిదేళ్లలో ఆక్వా ఉత్పత్తులను వంద శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. చేపలు, రొయ్యల చెరువుల సాగుదార్లకు  అనేక రాయితీలు ఇస్తోంది. మత్స్య శాఖకు సంబంధించిన ఉత్పత్తులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో ప్రభుత్వం నూతన మత్స్య విధానం ప్రకటించింది.  అసైన్డ్ భూముల్లో కూడా రైతులు రొయ్యలు, చేపల చెరువులను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది.  మత్స్య శాఖ  బడ్జెట్ అంచనాలను కూడా ప్రభుత్వం పెంచింది. గత సంవత్సరం బడ్జెట్ అంచనా రూ.187.19 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేశారు. ఈ ఏడాది (2016-17) ప్రణాళిక, ప్రణాళికేతర బడ్జెట్  అంచనాలను రూ.339 కోట్లకు పెంచారు. రైతులకు నాణ్యమైన చేప పిల్లలను అందించాలన్న లక్ష్యంతో గుంటూరు జిల్లా బాపట్లలో రూ.20 కోట్లతో హేచరీ ఏర్పాటు చేస్తున్నారు. జాలర్ల సంక్షేమానికి కూడా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. గత సంవత్సరం వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు భృతిగా రూ.2 వేలు ఇచ్చారు. దానిని ఈ ఏడాది రూ.4వేలకు  పెంచారు. ఈ పథకం ద్వారా 60 వేల 500 మంది ప్రయోజనం పొందుతున్నారు.

          
10.65 లక్షల మంది ఉపాధి
  రాష్ట్రంలో మత్స్య శాఖ ద్వారా 10.65 లక్షల మంది ఉపాధి లభిస్తోంది. మత్స్య సంబంధమైన శాస్త్రీయ పరిశోధనలు,అధ్యయనాలకు ఊతం ఇచ్చే విధంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రభుత్వం ఆక్వా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏపీలో  అపారంగా ఉన్న సముద్ర తీరాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని, సముద్ర ఉత్పత్తులు పెరగడానికి, మత్స్య పరిశ్రమ అభివృద్ధికి, ఎగుమతుల పెరుగుదలకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది.  అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన ఉత్పత్తులు సాధించడం, మందుల వాడకంలో జాగ్రత్తలు పాటించడం, మత్స్య ఉత్పత్తుల ప్రాసెసింగ్ కు సంబంధించి ఏపీ ప్రభుత్వం అనేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. ఫలితాలను సాధిస్తోంది. ప్రభుత్వం ప్రోత్సాహం వల్ల సముద్ర ఉత్పత్తులు పెరగటమే కాకుండా, ఎక్కువ మందికి ఉపాధి కూడా లభించే అవకాశం ఉంది.
 n శిరందాసు నాగార్జున, - 9440222914
    
      02.01.2017 సోమవారం ఎడిటోరియల్ పేజీ

స్మార్ట్ గ్రామాలే లక్ష్యం


ü గ్రామీణాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి
ü 20 ప్రమాణాల నిర్ధేశన
ü ఎన్ఆర్ఇజీఏ పథకం కింద 9,16,295 పనులు పూర్తి
ü రూ.9,695 కోట్ల వ్యయం
ü పలు ప్రోత్సహాకాల ప్రకటన

           స్మార్ట్ గ్రామాలే లక్ష్యంగా ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిపై దృష్టి పెట్టింది. గ్రామాలు అన్ని విధాలా అభివృద్ధి చెందడంతోపాటు సకల సదుపాయాలు గ్రామాలకు అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పలు ప్రణాళికలు సిద్ధం చేసింది. పంచాయతీరాజ్, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలతోపాటు ప్రధాన శాఖలను అనుసంధానం చేసుకుంటూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఇజీఏ) కింద రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం(2016-17)లో అనేక లక్షల పనులు చేపట్టి పూర్తి చేశారు. శాస్త్ర సాంకేతిక ఫలాలను అందిపుచ్చుకుంటూ పేదరికం, ఆర్థిక అసమానతలు లేని, ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన గ్రామాలను రూపొందించడమే స్మార్ట్ గ్రామాల లక్ష్యం. స్మార్ట్ గ్రామానికి 20 ప్రమాణాలను నిర్ధేశించుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గ్రామంలో అందరికీ మరుగుదొడ్డి, సురక్షిత తాగునీరు, నిరంతర విద్యుత్ సదుపాయాలతో కూడిన ఇళ్లు ఉండేలా చేస్తోంది. ప్రతి కుటుంబానికి తగిన జీవనోపాధి అవకాశాలు కల్పిస్తోంది. స్వయం సహాయక సంఘ సభ్యులు, గ్రామీణ యువకులు బ్యాంకులు, మార్కెట్లతో అనుసంధానం కావడానికి వారికి నైపుణ్యతో కూడిన శిక్షణ ఇస్తున్నారు. బహిరంగ మల విసర్జన లేకుండా ఓ ఉద్యమమే  చేపట్టారు.  ఘన, ద్రవ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించే ఏర్పాటు చేస్తున్నారు. మాతా, శిశు మరణాలు తగ్గించడానికి తగిన వైద్యసేవలు అందిస్తున్నారు. నూరు శాతం ఆస్పత్రి ప్రసవాలు సాధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 12వ తరగతి వరకు బాల బాలికలు బడి మానివేయకుండా చదువు కొనసాగించేలా చర్యలు తీసుకున్నారు. అంగన్ వాడీ కేంద్రాలు, పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయం, ఆరోగ్య కేంద్రం, ఇతర ప్రభుత్వ భవనాలలో త్రాగునీరు, మరుగుదొడ్డి, విద్యుత్ సౌకర్యాలను అందుబాటులో ఉంచుతున్నారు. 9 సంవత్సరాల లోపు పిల్లలలో పౌష్టికాహారం లోపంలేకుండా చేస్తున్నారు. బాల్య వివాహాలు చేయకుండా ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు. అన్ని వ్యవసాయ నేలలలో భూసార పరీక్షలు నిర్వహించి, ప్రతి రైతుకు భూసార కార్డులు అందజేస్తున్నారు. ప్రతి గ్రామీణ కుటుంబానికి ఒక బ్యాంకు ఖాతా తెరిచేలా చర్యలు చేపట్టారు. ప్రజా భాగస్వామ్యంతో ప్రతి గ్రామంలో సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించారు. గ్రామాల సరిహద్దులలో పచ్చని మొక్కలు నాటి, చెట్లను పెంచే ఏర్పాట్లు చేశారు. నీటి సంరక్షణకై నీటి నిల్వ నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రతి  గ్రామంలో సమాచార కేంద్రాన్ని, ఒక కంప్యూటర్ ల్యాబ్ ని , మీ-సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. టెలిఫోన్, ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పిస్తున్నారు. మూడింట రెండువంతుల హాజరుతో ఏడాదికి నాలుగు సార్లు వార్డు సభలను, గ్రామ సభలను నిర్వహించాలని నిర్ణయించారు. ఫిర్యాదులు సత్వర పరిష్కారానికి తగు వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ సక్రమంగా సమకూరిన గ్రామాన్ని స్మార్ట్ గ్రామంగా ప్రకటిస్తారు.

ఎన్ఆర్ఇజీఏ పథకం కింద 9,16,295 పనులు పూర్తి
             స్మార్ట్ గ్రామాలను రూపొందించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఇజీఏ పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటోంది. ఈ పథకం కింద రాష్ట్రంలో 84,76,242 మందికి జాబ్ కార్డులు జారీ చేశారు. ఈ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్ నుంచి మార్చి వరకు)లో కనీసం వంద రోజులు పని కల్పించాలి. స్త్రీ, పురుషులకు సమాన వేతనం ఇవ్వడం ఈ ప్రథకం ప్రత్యేకత. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 13,104 గ్రామాలు, 47,638 నివాస ప్రాంతాలలో  పనులు చేపట్టారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.9,695 కోట్ల అంచనా వ్యయంతో ఎన్ఆర్ఇజీఏ పథకం కింద చేపట్టిన 9,16,295 పనులను ఈ నెల 14వ తేదీ నాటికి పూర్తి చేశారు.  రూ.15,778 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన  6,90,511 పనులు జరుగుతూ ఉన్నాయి.
          గ్రామ పంచాయతీ నిధులకు గ్రామీణ ఉపాధి హామీ నిధులు కూడా తోడుకావడంతో గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా  పంచాయతీ కార్యాలయాలు నిర్మిస్తున్నారు. వాడవాడలా చంద్రన్న బాటలు వేశారు. అంగన్ వాడీ భవనాల నిర్మాణం, పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచడం, గ్రామాల పచ్చదనం, నర్సరీల పెంపకం, వర్మీ కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటు, స్మశానాల పునరుద్ధరణ వంటి పనులు చేపట్టారు. రాష్ట్రంలోని గ్రామాలన్నింటినీ స్మార్ట్ గ్రామాలుగా రూపొందించాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. అభివృద్ధి పనులు ముమ్మరంగా జరిగేందుకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసి, బహిరంగ మలవిసర్జన రహితంగా ప్రకటించిన గ్రామ పంచాయతీకి రూ.5 లక్షలు ఇస్తారు. వంద పంట సంజీవనులు(ఫారం ఫాండ్) పూర్తి చేసిన గ్రామానికి రూ.4 లక్షలు ఇస్తారు. అన్ని ఇళ్లకు ఇంకుడు గుంతలు పూర్తి చేస్తే రూ.2 లక్షలు ఇస్తారు. ఈ విధంగా అనేక రకాల ప్రోత్సాహకాలు ప్రభుత్వం ఇస్తోంది. అన్ని అంశాలు పూర్తి చేసిన గ్రామ పంచాయతీకి గరిష్టంగా రూ.22 లక్షలు, జిల్లాకు రూ.11 కోట్ల వరకు ప్రోత్సాహకాలు ఇస్తారు. ఇదే క్రమంలో ముమ్మరంగా పనులు జరిగితే రాష్ట్రంలోని పంచాయతీలన్నీ త్వరలోనే స్మార్ట్ గ్రామాలుగా అభివృద్ధి చెందుతాయి.

రాష్ట్రంలో 27 లక్షల రూపే కార్డుల జారీ


ü విజయనగరం జిల్లాలో అత్యధిక కార్డుల జారీ
ü క్యాష్ లెస్ లావాదేవీలు ముమ్మరం
ü గ్రామీణులకు క్యాష్ లెస్ లావాదేవీలలో శిక్షణ
ü విశాఖ జిల్లాలో అత్యధికమందికి శిక్షణ
ü 5291 గ్రామ పంచాయితీలలో బ్యాంక్ మిత్ర సేవలు

              రాష్ట్రంలో క్యాష్ లెస్ లావాదేవీలు ముమ్మరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది.  పెద్ద నోట్ల చలామణిపై తీవ్రమైన ఆంక్షలు, కొత్త నోట్ల కొరత వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు వేలల్లో ఈ-పాస్ (పీఓఎస్- పాయింట్ ఆఫ్ సేల్) మిషన్లు సరఫరా చేస్తున్నారు. లక్షల్లో రూపే కార్డులు పంపిణీ చేస్తున్నారు. రూ.1000, రూ.500 నోట్లపై ఆంక్షలు విధించిన నవంబర్ 8 నుంచి అన్ని ప్రాంతాలలో నగదురహిత లావా దేవీలు పెరిగిపోయాయి. రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పడికప్పుడు ఈ వ్యవహారలన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు. రిజర్వు బ్యాంకు అధికారులతో మాట్లాడి కొత్త నోట్లు రాష్ట్రానికి తెప్పించారు. అలాగే ఈ-పాస్ మిషన్లు, రూపే కార్డుల పంపిణీ గురించి తెలుసుకుంటూ సంబంధిత అధికారులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ప్రజలు, ముఖ్యంగా గ్రామీణులు ఇబ్బందులు పడకూడదని ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది.
           దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక చర్యలు తీసుకుంది. ఈ నెల 19వ తేదీ వరకు రాష్ట్రంలోని 13 జిల్లాలలో 27,41,244 రూపే కార్డులు జారీ చేశారు. ఇవి ఏటీఎం కార్డులు లాంటివే. అయితే ఇవి దానికంటే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటాయి. వీటీని ఇటు ఏటీఎంలలోనూ, అటు గ్రామీణ ప్రాంతాలలోని సీఎస్పీ(కస్టమర్ సర్వీస్ పాయింట్), బ్యాంకు మిత్రల వద్ద ఉండే మైక్రో మిషన్లలో కూడా ఉపయోగించవచ్చు. ప్రధానమంత్రి జన్ ధన్ ఖాతా ప్రారంభించిన వారందరికీ రూపే కార్డులు ఇస్తున్నారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే విజయనగరం జిల్లాలో అత్యధికంగా 4,49,587 కార్డులు జారీ చేశారు. 4,01,309 కార్డుల జారీతో కృష్టా జిల్లాలో ఆ తరువాతి స్థానంలో ఉంది. అనంతపురం జిల్లాలో 2,17,882 కార్డులు, చిత్తూరు జిల్లాలో 1,34,987, తూర్పుగోదావరి జిల్లాలో 1,82,511, గుంటూరు జిల్లాలో 1,87,298, కడప జిల్లాలో 1,85,500, కర్నూలు జిల్లాలో 1,78,877, ప్రకాశంలో 2,05,688, నెల్లూరు జిల్లాలో 1,41,475, శ్రీకుళం జిల్లాలో 1,60,964, విశాఖపట్నం జిల్లాలో 1,45,150, పశ్చిమగోదావరి జిల్లాలో 1,50,016 కార్డులు జారీ చేశారు.

గ్రామీణులకు క్యాష్ లెస్ లావాదేవీలలో శిక్షణ
            రాష్ట్రంలోని పేదలకు, గ్రామీణులకు క్యాష్ లెస్  లావాదేవీలలో ప్రభుత్వం శిక్షణ ఇప్పిస్తోంది. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఇజీఏ) సిబ్బంది, విద్యార్థులు వారికి తెలియజేస్తున్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 84,47,960 కుటుంబాలకు జాబ్ కార్డులు జారీ చేశారు. 80,10,722 మంది మాత్రమే చురుకుగా పనులలో పాల్గొంటున్నారు. వారిలో 33,98,046 మందికి క్యాష్ లెస్ లావాదేవీలలో శిక్షణ ఇచ్చినట్లు ఉపాధి హామీ పథకం ప్రాజెక్ట్ మేనేజర్ చెప్పారు. జిల్లాలవారీగా పరిశీలిస్తే విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 6,40,000 మందికి శిక్షణ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 3,75,923 మందికి, తూర్పుగోదావరి జిల్లాలో 3,47.921 మందికి, విజయనగరం జిల్లాలో 3,46,470 మందికి శిక్షణ ఇచ్చారు. మిగిలిన వాటిలో అనంతపురం జిల్లాలో 2,57,864 మందికి, చిత్తూరు జిల్లాలో 2,62,230 మందికి, గుంటూరు జిల్లాలో 74,560 మిందికి, కడప జిల్లాలో 1,80,982 మందికి, కృష్ణా జిల్లాలో 2,87,820 మందికి, కర్నూలు జిల్లాలో 1,78,877 మందికి, ప్రకాశం జిల్లాలో 4,753 మందికి, నెల్లూరు జిల్లాలో 2,18,341 మందికి, శ్రీకాకుళం జిల్లాలో 2,22,305

మందికి క్యాష్ లెస్ లావాదేవీలలో శిక్షణ ఇచ్చారు.
          నెట్ కనెక్టివిటీ ఉన్న అన్ని గ్రామాలలో ఈ-పాస్ మిషన్లు, సీఎస్పీ, బ్యాంకు మిత్ర సెంటర్ల ద్వారా క్యాష్ లెస్ లావాదేవీలు జరుగుతున్నాయి. అన్ని చోట్ల రూపే కార్డులను ఉపయోగించవచ్చు. రాష్ట్రంలో 13,104 గ్రామాలు ఉన్నాయి. అయితే  ఆరు వందల గ్రామాలలో మాత్రమే నెట్ కనెట్టివిటీ లేదు. అటువంటి గ్రామాలలో  సీఎస్పీ, బ్యాంకు మిత్ర సెంటర్ల ద్వారా ఆధార్ బయోమీటర్, ఐరిస్ లు సరిచూసుకొని క్యాష్ లెస్ లావాదేవీలు జరుపుతున్నారు. అన్ని గ్రామ పంచాయతీలలో బ్యాంకు సేవలు అందే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బ్యాంకు బ్రాంచ్ లు లేని 5291 గ్రామ పంచాయితీలలో బ్యాంకు మిత్రలు చురుకుగా తమ సేవలందిస్తున్నారు. మిగిలిన గ్రామాలలో కూడా బ్యాంకు మిత్ర సేవలు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్యాంకు ఖాతాలు లేని వారికి ఖాతాలను తెరుస్తున్నారు. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాలలో కూడా క్యాష్ లెస్ లావాదేవీలు ఎక్కువగా జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
21.12.2016

భూ సమీకరణ చర్యలు వేగవంతం


·       కలెక్టర్లకు ఆదేశాలు
·       మచిలీపట్నం పోర్టుకు భూ సమీకరణ
·       భావనపాడు పోర్ట్ భూ సేకరణ

     రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులు, పలు రకాల అభివృద్ధి పనుల కోసం త్వరితగతిన భూమిని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోర్టులు, రోడ్లు, జల మార్గాలు, బీచ్ కారిడార్ తదితరాలకు నిర్ణయించిన ప్రకారం  భూ సమీకరణ జరపాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆయా జిల్లాల్లో భూముల ధరలు, స్థానిక పరిస్థితుల ఆధారంగా భూ సమీకరణ లేక భూ సేకరణ చేస్తారు. ఈ భూ సమీకరణ ప్రక్రియ కోసం రెవెన్యూ, సర్వే సిబ్బందిని కేటాయించి, వారిని రిలీవ్ చేయాలని అందరు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. మచిలీపట్నం పోర్టుకు సంబంధించి భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్)కు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు.ఏ భూ సమీకరణ పనులు వేగవంతం చేశారు. త్వరలోనే ఆయన భూమిని సమీకరించి ప్రభుత్వానికి అప్పగించే అవకాశం ఉంది. రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరకు అనుసరించిన పద్దతులనే  పోర్టు నిర్మాణానికి సమీకరించే భూముల విషయంలో కూడా అనుసరిస్తున్నారు. ఇందు కోసం పట్టా భూములు 14 వేల ఎకరాలు, ప్రభుత్వ భూమి  5200 ఎకరాలను సమీకరిస్తారు. పోర్టు నిర్మాణ పనులను 2017లో పార్రంభించి, 2018 నాటికి పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పోర్ట్ మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి కన్సెల్టెంట్ ని నియమించే ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

భావనపాడు పోర్టు: శ్రీకాకుళం జిల్లా భావనపాడు గ్రీన్ ఫీల్డ్ పోర్టు కోసం 2050 ఎకరాల భూ సేకరణను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంతబొమ్మాళి మండలం భావనపాడు, మర్రిపాడు, దేవునల్తాడ గ్రామాల పరిధిలో ఈ భూమిని సేకరిస్తారు. ఆ మేరకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కు ప్రభుత్వం తగిన సూచనలు, సలహాలు కూడా ఇచ్చింది.  ఈ పోర్టు నిర్మాణ టెండర్ ని అంతర్జాతీయంగా పేరుపొందిన ప్రముఖ నౌకా నిర్మాణ సంస్థ అదానీ కంపెనీ దక్కిచ్చుకుంది. అందువల్ల భూసేకరణ జరిగిన వెంటనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

అంతర్గత జల మార్గం: రాష్ట్రంలో అంతర్గత జల మార్గాన్ని అభివృద్ధి చేసి, జల రవాణాకు ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోడ్లపై ట్రాఫిక్‌ను తగ్గించడంతోపాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ సామగ్రిని తరలించేందుకు జల రవాణా ఉపయోగపడుతుంది. కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు బకింగ్‌హామ్ కెనాల్‌ను పునరుద్ధరించి కాలువలు, నదులను అనుసంధానం చేసుకుంటూ ఈ జల మార్గం రూపకల్పన చేశారు.  ఇందులో భాగంగా ఇటు కృష్ణా, అటు గోదావరి నదుల మధ్య భూ సేకరణకు సంబంధించి ఇప్పటికే సర్వే పూర్తి చేశారు.   ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో అంతర్గత జల మార్గం కోసం భూమిని గుర్తించారు. ఆ భూమిని సేకరించడాన్ని  వేగవంతం చేశారు.  ఇన్‌ల్యాండ్‌ వాటర్‌ వేస్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో 74 కిలోమీటర్ల పొడవునా ఏలూరు కాలువను ఆధునీకరిస్తారు. నిడదవోలుఏలూరు మధ్య ప్రధాన కాలువను వెడల్పు చేసి ఓడల ద్వారా సరుకుల రవాణా చేసేందుకు వీలుగా 35 గ్రామాలు, ఏలూరు, తాడేపల్లిగూడెంలలో భూసేకరణ  చేపడుతున్నారు.

బీచ్ కారిడార్:  పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు కాగల బీచ్ కారిడార్ ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి విజయనగరం జిల్లా భోగాపురం వరకు బీచ్ కారిడార్ గా అభివృద్ధి చేయనున్నారు.  ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో గుర్తించవలసి ఉంది. ఈ బాధ్యతలను ఆయా కలెక్టర్లకు అప్పగించారు. కాకినాడ నుంచి భోగాపురం వరకు 170 నుంచి 180 కిలోమీటర్ల  గ్రీన్ ఫీల్డ్ బీచ్ రోడ్డును కూడా నిర్మిస్తారు.

లాజిస్టిక్స్ పార్కులు: విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నంలలో లాజిస్టిక్స్ పార్కులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖలో 98 ఎకరాల్లో, కాకినాడలో 89 ఎకరాల్లో, కృష్ణపట్నంలో 142 ఎకరాల్లో ఈ పార్కులను నెలకొల్పుతారు. రెండేళ్లలో వీటిని ప్రారంభిస్తారు.

పారిశ్రామిక ప్రగతి 9.98 శాతం


·       ప్రణాళికా శాఖ అర్థ సంవత్సరం గణాంకాలు
·       ఖనిజాలు, సహజ వాయువు 87.50 శాతం వృద్ధి
·       మైనింగ్ విభాగంలో అధిక శాతం నమోదు


         ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు మెండుగా ఉండి, రాష్ట్రాభివృద్ధికి దోహదపడే పారిశ్రామిక రంగం గడచిన అర్థ సంవత్సరంలో స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు 9.98 శాతం సాధించింది. పారిశ్రమల స్థాపనకు, పెట్టుబడులను ఆహ్వానించడానికి, పారిశ్రామిక వృద్ధి రేటు పెంచేందుకు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం  అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. దాంతో ఈ రంగంలో ఫలితాలు కనిపిస్తున్నాయి.  సామాజిక, ఆర్ధికాభివృద్ధికి  దోహదపడేవాటిలో పారిశ్రామిక రంగం అత్యంత ముఖ్యమైనదిగా ప్రభుత్వం గుర్తించింది. పరిశ్రమల స్థాపన జరిగితే ఉత్పత్తి పెరగడంతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తోంది. దాంతో 2014-15 ఆర్థిక సంవత్సరంలో 5.25 శాతం ఉన్న పారిశ్రామిక వృద్ధి రేటు, 2015-16 నాటికి 11.1 శాతం నమోదై రెండంకెల వృద్ధి రేటు సాధించి.
   రాష్ట్ర ప్రణాళికా శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం  ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అర్థ సంవత్సరంలో రాష్ట్రంలో పారిశ్రామిక  ఉత్పత్తి రూ.63,229 కోట్లతో  9.98 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఈ గణాంకాలను 2011-12 ధరల ఆధారంగా రాష్ట్ర ప్రణాళికా శాఖ రూపొందించింది. గత ఏడాది అర్థ సంవత్సరం ఇదే కాలంలో జరిగిన ఉత్పత్తి రూ. 57,490 కోట్లు.  ఈ ఏడాది మొదటి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో రూ.32,022 కోట్లతో 10.49 శాతం వృద్ధి రేటు సాధించగా, రెండవ త్రైమాసికం(జూలై-సెప్టెంబర్)లో 31,207 కోట్లతో 9.46 శాతం వృద్ధి రేటు నమోదైంది. జాతీయ స్థాయిలో అర్థ సంవత్సరంలో పారిశ్రామిక రంగం  5.60 శాతం వృద్ధి రేటు మాత్రమే సాధించింది.

మైనింగ్ లో 12.20 శాతం వృద్ధి రేటు
           పారిశ్రామిక రంగంలోని వివిధ విభాగాలను పరిశీలించినట్లైతే  మైనింగ్, క్వారీల్లో రూ. 5,750 కోట్ల ఉత్పత్తి జరిగి 12.20 శాతం వృద్ధి రేటు నమోదైంది. మొదటి త్రైమాసికంలో రూ. 2,838 కోట్లతో 12.35 శాతం, రెండవ త్రైమాసికంలో రూ.2,912 కోట్లతో 12.05 వృద్ధి రేటు నమోదైంది. ఖనిజాల ఉత్పత్తి పెరగడం వల్ల ఈ విభాగంలో వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఖనిజాలు, సహజవాయువు ఉత్పత్తి పెరుగుదల అద్వితీయంగా పెరిగి, 87.50 శాతం వృద్ధి రేటు నమోదైంది. అలాగే గ్రావెల్, కలర్ గ్రానైట్ ఉత్పత్తి కూడా బాగా పెరిగింది. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా విభాగాలు రూ.9,125 కోట్లతో 11.70 శాతం వృద్ధి రేటు సాధించింది. మొదటి త్రైమాసికంలో రూ. 4,454 కోట్లతో 10.01 శాతం, రెండవ త్రైమాసికంలో రూ. 4,671 కోట్లతో 13.36 శాతం వృద్ధి రేటు నమోదైంది.  విద్యుత్ ఉత్పత్తులు పెరగడంతో ఈ వృద్ధి సాధ్యమైంది.

           ఉత్పత్తి విభాగం రూ.25,798 కోట్లతో 10.20 శాతం వృద్ధి శాతం సాధించింది. మొదటి త్రైమాసికంలో రూ. 12,941 కోట్లతో 10.83 శాతం, రెండవ త్రైమాసికంలో రూ. 12,857 కోట్లతో 9.57 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఈ విభాగంలో  ప్రైవేట్ కార్పోరేట్ రంగం 11.90 శాతం వృద్ధి రేటు సాధించింది.  నిర్మాణ విభాగం రూ.22,556 కోట్లతో 8.52 శాతం వృద్ధి రేటు సాధించాయి. మొదటి త్రైమాసికంలో రూ. 11,789 కోట్లతో 9.87 శాతం, రెండవ త్రైమాసికంలో రూ.10,767 కోట్లతో 7.08 శాతం వృద్ధి రేటు నమోదైంది. మొత్తంగా చూస్తే నిర్మాణ రంగంలో వృద్ధి రేటు తక్కువగా ఉంది.

        పెట్టుబడులు రాబట్టడానికి పారిశ్రామిక ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల వేగవంతంగా పారిశ్రామికీకరణ జరుగుతోంది. దాంతో రాష్ట్రంలో  ఉత్పత్తి, ఉత్పాదకతతోపాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం మేరకు 2022 నాటికి దేశంలోని మూడు అగ్ర రాష్ట్రాలలో ఏపీ ఒకటిగా నిలవడం ఖాయం.

ఫిన్ టెక్ సిటీగా విశాఖ అభివృద్ధి

·       పెట్టుబడులు పెట్టడానికి బహుళజాతి కంపెనీల ఆసక్తి
·       పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు

         విశాఖ నగరాన్ని ఫిన్ టెక్(ఫైనాన్షియల్ టెక్నాలజీ) సిటీగా అభివృద్ధి కానుంది. ఈ సిటీకి కావలసిన అన్ని రకాల రోడ్డు, వాటర్, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు, అనువైన వాతావరణం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 19న రుషికొండ సైబర్ వ్యాలీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫిన్ టెక్ టవర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రభుత్వం కల్పించే రాయితీలు, ప్రోత్సహకాలు, కొత్త కంపెనీల స్థాపనకు వీలుగా విధానాల సడలింపు, సౌకర్యాల వల్ల ఇప్పటికే పలు సంస్థలు పెట్టబడులు పెట్టాయి. తమ బ్రాంచ్ లను ప్రారంభించాయి. ఇంకా అనేక బహుళజాతి కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. దాంతో రాష్ట్రంలోని యువతకు వేల ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.
       ఇటలీకి చెందిన పార్టీటు42 ఇన్నొవేషన్స్ రీసెర్చ్ ల్యాబ్ సహకారంతో సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ విశాఖలో తమ బ్రాంచ్ ని స్థాపించనుంది. ఎలక్ట్రానిక్స్, ఉత్పత్తి రంగంలో లీడింగ్ లో ఉన్న తైవాన్ పెట్టుబడులు పెట్టడానికి భారత్ ఉత్తమమైనదిగా భావిస్తోంది. ఇండియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్(ఐఈఎస్ఏ) ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో తైవాన్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేశారు. అనేక ఫిన్ టెక్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి.
         విశాఖ ఫిన్ టెక్ టవర్ లో పలు సంస్థలు ప్రారంభమైయ్యాయి.  పేటీఎంలో 200 మంది ఉద్యోగం చేస్తున్నారు. జీఎంఎస్ స్టాఫ్ట్ వేర్ లో వంద మంది ఉద్యోగులు ఉన్నారు. మరో నాలుగు కొత్త కంపెనీలలో 60 మంది పని చేస్తున్నారు. విశాఖ వీఐపీ రోడ్డులోని డిజైనేటెడ్ టెక్నాలజీ పార్క్(డీటీపీ)లో జిగాకామ్, స్పిండర్ సాఫ్ట్ ఎల్ఎల్ సీ, మైలాస్ టెక్నాలజీ, బీ సెక్యూర్, వీఎస్ టీ, అవని సాఫ్ట్ వేర్, సీజీఎస్ ఐటీ టెక్నాలజీ మొత్తం 7 కంపెనీలను స్థాపించారు. వీటిలో 526 మందికి ఉపాధి లభిస్తోంది. టెక్ మహేంద్ర డీటీపీ బిల్డింగ్ లోని మూడు కంపెనీలలో మొత్తం 230 మందికి ఉపాధి లభించింది.

ఐటీ కంపెనీలు: విశాఖలోని వీఐపీ రోడ్డులో 35 వేల చదరపు అడుగులు వివిధ ఐటీ కంపెనీ కార్యాలయాలకు కేటాయించారు. ఉడా కాంప్లెక్స్ లో 24 వేల చదరపు అడుగులు కేటాయించారు. ఇక్కడ తుది దశ పనులు జరుగుతున్నాయి. విప్రో బిల్డింగ్ లో 2,12,000 చదరపు అడుగులలో విప్రో సంస్థ వచ్చే ఏడాది మార్చి నాటికి  స్వాధీనంలోకి తీసుకుంటుంది. వారు సెజ్(ప్రత్యేక ఆర్థిక మండలి)గా మార్పు చేయాలని దరకాస్తు చేయనున్నారు. హిల్-2 (ప్రైవేట్-మహతి) లో 65 వేల అడుగుల కార్యాలయాల స్థలం ఖాళీగా ఉంది. హిల్-3 (ఇంక్యుబేషన్ టవర్)లో నూతన కంపెనీలను ప్రారంభించారు. ఈ కంపెనీల స్వాధీనంలో 6500 చదరపు అడుగులు ఉంది. మిగిలిన  చదరపు అడుగులు ఖాళీగా ఉన్నాయి. హిల్-3(మిలినియం) భవనం నిర్మాణంలో ఉంది. ఇక్కడ రెండు లక్షల అడుగుల ఎవరికీ కేటాయించలేదు. దీని నిర్మాణం వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి అవుతుంది. ఇక్కడ కూడా కార్యాలయాలు ప్రారంభిస్తే మరిన్ని ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.