Jul 6, 2018


 ఎస్ఎస్సీ అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల
10 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ : మంత్రి గంటా శ్రీనివాసరావు

·       52.42 శాతం ఉత్తీర్ణత
·       85.43 శాతం ఉత్తీర్ణతతో ప్రకాశం జిల్లా ఫస్ట్
·       16.53 శాతంతో చివరి స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా

              సచివాలయం, జూలై 6: ఎస్ఎస్సీ అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్ష-2018 ఫలితాలను విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు శుక్రవారం ఉదయం సచివాలయం 4వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన ఛాంబర్ లో విడుదల చేశారు. ఫలితాల సీడీని మీడియాకు అందజేశారు. సీడీ పాస్ వర్డ్ POLAVARAM గా పేర్కొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరీక్షలు జూన్ 11 నుంచి 25 వరకు జరిగినట్లు తెలిపారు. 29, 30తేదీలలో రెండు రోజులు స్పాట్ వాల్యూషన్ నిర్వహించినట్లు చెప్పారు. ఈ పరీక్షలకు మొత్తం 35,147 మంది హాజరు కాగా, 18,424 మంది ఉత్తీర్ణులైనట్లు వివరించారు. ఉత్తీర్ణత శాతం 52.42 శాతంగా పేర్కొన్నారు. గత ఏడాది 71.37 శాతం ఉత్తీర్ణులయ్యారని,  ఉత్తీర్ణత ఫలితాలు ఈ ఏడాది 18.95 శాతం  తగ్గినట్లు చెప్పారు.
బాలురు 18,440 మంది హాజరుకాగా, 9,679 మంది, బాలికలు 16,707 మంది హాజరు కాగా 8745 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. బాలురు 52.49 శాతం, బాలికలు 52.34 శాతం మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. బాలికలకంటే బాలురు 0.15 శాతం ఎక్కువ ఉత్తీర్ణలైనట్లు తెలిపారు. ఫలితాలను WWW.BSEAP.ORG వెబ్ సైట్ లో చూసుకోవచ్చని చెప్పారు.
          అత్యధిక 85.43 శాతం ఉత్తీర్ణతతో ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 16.53 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా చివరి స్థానంలో ఉన్నట్లు చెప్పారు. గత సాధారణ పరీక్షా ఫలితాల్లో కూడా ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో నిలిచిన విషయం గుర్తు చేశారు.   తూర్పుగోదావరి జిల్లాలో 83.39 శాతం, అనంతపురం జిల్లాలో 82.65 శాతం, వైఎస్ఆర్ కడప జిల్లాలో 81.85 శాతం, గుంటూరు జిల్లాలో 80.84 శాతం, చిత్తూరు జిల్లాలో 75.49 శాతం, విజయనగరం జిల్లాలో 65.27 శాతం, కృష్ణా జిల్లాలో 59.60 శాతం, విశాఖ జిల్లాలో 57.64 శాతం, కర్నూలు జిల్లాలో 58.71 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 53.92 శాతం, నెల్లూరు జిల్లాలో 41.03 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు వివరించారు. ఫలితాలు ప్రచురించిన 7 రోజుల లోపల సబ్జెక్ట్ కు రూ.500 లు చెల్లించి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేయించుకోవచ్చని మంత్రి తెలిపారు. రీవెరిఫికేషన్ తోపాటు మార్కులు వేసిన జవాబు పత్రాలు కావాలంటే వెయ్యి రూపాయలు చెల్లించాలన్నారు.  ఉత్తీర్ణులయినవారికి, కానివారికి 15 రోజుల లోపల సర్టిఫికెట్లు అందజేస్తారని చెప్పారు.

10 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్
           డీఎస్సీ నోటిఫికేషన్ 10 రోజుల్లో జారీ చేస్తామని మంత్రి చెప్పారు. ఇంతకు ముందు ఈ నెల 6న జారీ చేయాలని అనుకున్నామని, చిన్నచిన్న అవాంతరాల వల్ల ఇవ్వలేకపోయామన్నారు. ఆర్థిక శాఖ లేవనెత్తిన అభ్యంతరాలను, ఆ శాఖ చేసిన సూచనల ప్రకారం పరిష్కరిస్తామన్నారు. ఎన్సీటీఈ మార్గదర్శక సూత్రాల్లో కూడా కొన్ని మార్పులు చేసిన నేపధ్యంలో అన్ని అంశాలను చర్చించి వారం, పది రోజుల్లో ఒక నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఉపాధ్యాయ పోస్టులు ఏమీ పెరగవని, గతంలో ప్రకటించిన విధంగా 10,351 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని చెప్పారు. ప్రత్యేక డీఎస్సీ ద్వారా సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖలలో పోస్టులు భర్తీ చేస్తారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఫర్నీచర్ వంటి మౌలిక సదుపాయల కల్పనకు సంబంధించిన టెండర్లు ఎక్కువ కోట్ చేసినందున జాప్యం జరిగినట్లు తెలిపారు. తాను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత విద్యా పరంగా రాష్ట్రం 17వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎగబాకినట్లు తెలిపారు. గణితంలో మొదటి స్థానంలో నిలిచినట్లు మంత్రి గంటా చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

Jul 4, 2018


నిరుపేద‌ల సొంత ఇంటి క‌ల‌ల సాకారం

మంత్రి కాలవ శ్రీనివాసులు
Ø నేడు 3 లక్షల సామూహిక గృహప్రవేశాలు
Ø రాష్ట్రమంతటా పండుగ వాతావరణం
Ø 2019 మార్చికి ప‌ది ల‌క్షల ఇళ్లు లక్ష్యం
Ø 2022 నాటికి  ప్రతి కుటుంబానికి గృహ‌ వ‌స‌తి

                    సచివాలయం, జూలై 4: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రంలోని నిరుపేద‌ల సొంత ఇంటి క‌ల‌లు సాకారం అవుతున్నట్లు గ్రామీణ గృహ నిర్మాణ శాఖ, సమాచార, పౌరసంబంధాల శాఖల  మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో బుధవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 5వ తేదీ గురువారం ఒకే రోజు రాష్ట్రంలో మూడు లక్షల మంది పేదలు తమ సొంత ఇళ్లలోకి గృహప్రవేశాలు జరిపే మహోన్నత కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్టం అంతటా పండుగ వాతావరణం నెలకొంటుదన్నారు.  రాష్ట్ర చరిత్రలో ఇదొక అద్వితీయ ఘట్టంగా ఆయన పేర్కొన్నారు.  ఆర్థిక ఇబ్బందులను అదిగమిస్తూ పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. యూనిట్ ధరను రూ.70 వేల నుంచి లక్షా 50వేల రూపాయలకు పెంచినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పీఎంఏవై, ఎన్టీఆర్ గృహ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.2.5 లక్షలు సబ్జిడీగా అందజేస్తాయని చెప్పారు.  విజ‌య‌వాడ‌లోని ఇందిరా గాంధి స్టేడియంలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. దీనిని రాష్ట్రంలో ఓ ఉత్సవంగా, నూత‌న గృహ‌ప్రవేశాలు చేసిన కుటుంబాల జీవితాల్లో చిర‌కాలం గుర్తుండిపోయేలా నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీలు, 9 నోటిఫైడ్ మున్సిపాలిటీల పరిధిలోని 2093 వార్డుల్లోనూ, 12,767 గ్రామ పంచాయతీల్లో మూడు లక్షల గృహప్రవేశాలను ఏకకాలంలో నిర్వహిస్తున్నట్లు వివరించారు.  గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 2 లక్షల 71 వేల ఇళ్లు, పట్టణాల్లో 24,145 ఇళ్ళను ప్రారంభించ‌నున్నామని చెప్పారు.  ఒక్క నియోజకవర్గం తప్ప రాష్ట్రం నలుచెరుగులా 174 నియోజకవర్గాల్లో సామూహిక గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.  హూదూద్ తుఫాన్  బాధితులకు సంబంధించిన 5,118 ఇళ్ళు కూడా ఇదే కార్యక్రమంలో ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో తొలివిడ‌త ల‌క్ష సామూహిక గృహ‌ప్రవేశాల కార్యక్రమాన్ని గ‌త ఏడాది అక్టోబ‌రు 2న విజ‌య‌వంతంగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు.  ఇప్పుడు ఒకేసారి మూడు ల‌క్షల గృహ‌ప్రవేశాల‌ను నిర్వహించడం ఓ రికార్డుగా పేర్కొన్నారు. కుటుంబ ఆదాయంతోపాటు శాశ్విత గృహ వసతి కలిగి ఉండటం అభివృద్ధికి కొలమానంగా భావిస్తారన్నారు. దేశంలో మొదటిసారిగా పేదవారికి పక్కా ఇళ్లు సమకూర్చిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు.
        2019 మార్చి నాటికి రాష్ట్రంలో ప‌ది ల‌క్షల ప‌క్కా గృహాల‌ను ఎన్టీఆర్ గృహ‌నిర్మాణ ప‌థ‌కం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించాల‌ని సీఎం నిర్దేశించారని చెప్పారు.  ల‌క్ష్యాన్ని చేరుకొనే దిశ‌గా గృహ‌నిర్మాణాన్ని వేగ‌వంతం చేసినట్లు తెలిపారు.  2017 ఏప్రిల్ నుండి 2018 మార్చి వ‌ర‌కు ఏడాది వ్యవ‌ధిలో రికార్డు స్థాయిలో రూ.3,787 కోట్లు ఖ‌ర్చుచేసి 3.15 ల‌క్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేసినట్లు వివరించారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా పారదర్శికంగా చెల్లింపులు చేస్తున్నట్లు తెలిపారు. నగదు లావాదేవీలు లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకే నగదు జమ అవుతుందన్నారు. ఇల్లు కట్టకుండా బిల్లు తీసుకునే విధానం ఇక్కడ కుదరదని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో సామాన్యుడికి ప్లాన్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు.
                 2022 నాటికి  రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి గృహ‌వ‌స‌తి క‌ల్పించాల‌ని ఏపీ ప్రభుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.  ఎన్టీఆర్ గృహ‌నిర్మాణ ప‌థ‌కం కింద రాష్ట్రంలో రూ.19 వేల కోట్లతో 13 లక్షల ప‌క్కా ఇళ్లను  గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించాల‌ని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప‌థ‌కం కింద ఒక్కో కుటుంబానికి రూ.1.50 లక్షల‌ పూర్తి రాయితీతో ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తోందన్నారు. 2015 నుండి గ‌త నాలుగేళ్ల కాలంలో ఈ ప‌థ‌కం ద్వారా రాష్ట్రంలో  8.34 ల‌క్షల ఇళ్ల నిర్మాణానికి ప‌రిపాల‌న అనుమ‌తులు మంజూరు చేయ‌గా, ఇందులో 6.47 ల‌క్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభ‌మ‌యినట్లు తెలిపారు. నాలుగేళ్లలో ఈ ప‌థ‌కం కింద 4.00 ల‌క్షల ఇళ్లను పూర్తిచేసినట్లు చెప్పారు. ఎన్టీఆర్ గృహ‌నిర్మాణ ప‌థ‌కంతో సహా ఇత‌ర ప‌థ‌కాల‌ను క‌లుపుకొని రాష్ట్రంలో నాలుగేళ్ల కాలంలో రూ.6,203 కోట్లతో 5.80 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసినట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణంలో ల‌బ్దిదారుల‌కు ఎలాంటి స‌మ‌స్యలు ఎదురుకాకుండా గృహ‌నిర్మాణ శాఖ చేప‌ట్టిన చ‌ర్యలు స‌త్ఫలితాలిస్తున్నాయన్నారు. అవినీతికి తావులేని విధంగా ల‌బ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే నిధులు జ‌మ‌చేయ‌డం, ఇళ్లను జియో ట్యాగింగ్‌, ఆధార్ ద్వారా అనుసంధానించ‌డం, సిమెంటు త‌దిత‌ర ఇంటి నిర్మాణ సామాగ్రి స‌ర‌స‌మైన ధ‌ర‌ల్లోనే ల‌బ్దిదారుల‌కు అందుబాటులో వుండేలా ఏర్పాట్లు చేయ‌డం, ఇళ్ల నిర్మాణానికి అవ‌స‌ర‌మైన సాంకేతిక స‌హాయాన్ని  గృహ‌నిర్మాణ శాఖ ద్వారా అందించ‌డం వంటి చ‌ర్యల కార‌ణంగా ఇళ్ల నిర్మాణం వేగవంతమయినట్లు మంత్రి కాలవ చెప్పారు.

సంచార క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ని ప్రారంభించిన సీఎం
                సచివాలయం, జూలై 4: మణిపాల్ ఆస్పత్రివారు సంచార క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన బస్ (ఆంకాలజీ బస్)ని సచివాలయం 1వ బ్లాక్ వద్ద బుధవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కార్పోరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా విజయవాడ మణిపాల్ ఆస్పత్రివారు దీనిని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత ప్రజలను క్యాన్సర్ నుంచి రక్షించడానికి, క్యాన్సర్ ని ముందస్తుగా కనుగొనడానికి ఇది ఉపయోగపడుతుంది. నోటి, గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ కనుగొనడానికి ఇది సహాయపడుతుంది. ఈ బస్ లో నోటి పరీక్షలు, రొమ్ము స్క్రీనింగ్, మోగ్రఫీ, పాప్ స్మియర్, బయాప్సి, ల్యాబ్ పరీక్షలు అందుబాటులో ఉంటాయి. డాక్లర్లు, శిక్షణ పొందిన నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉంటారు.
           ఆంకాలజీ బస్ ప్రారంభించిన సందర్భంగా మణిపాల్ ఆస్పత్రి విజయవాడ యూనిట్ హెడ్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ క్యాన్సర్ అధిక ముప్పుకలిగిన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లోని 9,930 గ్రామాల్లోకి ఈ బస్సు వెళుతుందని చెప్పారు. ఈ మధ్య కాలంలో స్త్రీలలో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్, పురుషలలో నోటి క్యాన్సర్ ఎక్కువగా ఉంటుదని తెలిపారు. అందరూ ముందస్తు పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు క్యాన్సర్ వ్యాధి పరీక్షలు ఇప్పుడు అందుబాటులోకి తేగలిగామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ధర్మేంద్ర, రామకృష్ణ, మాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Jul 3, 2018


అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ-పంట యాప్
అధికారులను ఆదేశించిన సీఎస్ అనీల్ చంద్ర పునేఠ

           సచివాలయం, జూలై 3: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ-పంట యాప్ ని రూపొందించమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనీల్ చంద్ర పునేఠ సంబంధిత అధికారులను ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తు సీఎస్ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం ఆయన వ్యవసాయ అధికారులతో సమావేశమై ఈ-పంట మొబైల్ యాప్ అప్లికేషన్ ని అభివృద్ధి చేసిన విధానాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రెవెన్యూ శాఖ సహకారంతో గ్రామ స్థాయిలో సాగు భూమి, సాగులో లేని భూమి, సర్వే నెంబర్, భూముల వివరాలు, మిశ్రమ పంటలు, పంటల ఫొటోలు,  ఉద్యానవన పంటలతో సహా అన్ని పంటలకు సంబంధించిన వివరాలను అందులో పొందుపరచాలని చెప్పారు. చార్ట్ లో ఉన్న అన్ని కాలమ్స్ పూర్తి చేయాలన్నారు.

                వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో సర్వే నెంబర్ తో సహా పంటల వివరాలు యాప్ లో పొందుపరుస్తున్నట్లు చెప్పారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎస్ కు వివరించారు. భూములు, పంటల వివరాలు, సర్వే నెంబర్ తోపాటు పట్టాదారు పేరు మొదలైన వివరాలు ఇస్తున్నట్లు తెలిపారు. అందులో  మొత్తం 31 కాలమ్స్ ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 4 లక్షల ఎకరాలలో కూరగాయలు, 70 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలు పండిస్తున్నట్లు వివరించారు. గ్రామానికి, సర్వే నెంబర్ భూమికి ఉన్న దూరాన్ని, మార్గం మ్యాప్ ని  కూడా చూపించే విధంగా యాప్ అప్లికేషన్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. యాప్ లో వివరాలు సమగ్రంగా ఉండే విధంగా అనీల్ చంద్ర పునేఠ కొన్ని సలహాలు ఇచ్చారు. పొలానికి నెంబర్ కూడా ఇవ్వమని సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ డి.మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నగరాల అభివృద్ధిపై సింగపూర్ బృందంతో సీఎస్ చర్చలు
           సచివాలయం, జూలై 3: రాష్ట్రంలోని నగరాలను విద్య, వైద్య, ఆదాయ పరంగా అభివృద్ధి చేసే అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనీల్ చంద్ర పునేఠ సింగపూర్  బృందంతో చర్చలు జరిపారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తు సీఎస్ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం సింగపూర్ బృందం సీఎస్ తో సమావేశమైంది. అమరావతి, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి తదితర నగరాలను అన్ని విధాల దేశంలోని ప్రధాన నగరాల సరసన చేరేవిధంగా అభివృద్ధి చేయడానికి సహకరిస్తామని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, లీకాన్ ఏవ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, ఆసియా కాంపిటేటివ్ నెస్ ఇన్ స్టిట్యూట్ కో డైరెక్టర్  అసోసియేట్ ప్రొఫెసర్ తాన్ ఖీ జియాప్ చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరుని ఆయన ప్రశంసించారు.
            ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం సీనియర్ ఐఏఎస్ అధికారులు 4 బృందాలుగా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లో శిక్షణ పొందారు. ఆ అంశాల గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 8, 9 తేదీల్లో  సింగపూర్‌లో పర్యటిస్తారు. 9వ తేదీన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లో జరిగే సదస్సులో ఆయన కీలక ఉపన్యాసం ఇస్తారు. సీఎం పర్యటన, అక్కడ జరిగే ఎంఓయుల గురించి చర్చించారు. ఈ సమావేశంలో సింగపూర్ ప్రతినిధి బృందంలోని రిసెర్చ్ అసిస్టెంట్లు సిగ్యాసా శర్మ, మేనేజర్, కో డైరెక్టర్ ప్రత్యేక సహాయకులు లిమ్ తావో ఓఏ, యాప్ క్సిన్ ఇ, ప్లానింగ్ శాఖ సెక్రటరీ సంజయ్ గుప్త తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 4న అల్లూరి జయంతి ఉత్సవాలు

           సచివాలయం,జూలై 3: ఈ ఏడాది కూడా ఈ నెల 4న ప్రభుత్వ ఆధ్వర్యంలో అల్లూరి సీతరామరాజు జయంతి ఉత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి మంగవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల అధిపతులు, జిల్లా కలెక్టర్లు  బుధవారం ఈ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆ ఉత్తర్వులలో కోరారు. ఇందుకు అయ్యే ఖర్చుని సంబంధిత బడ్జెట్ నుంచి వినియోగించాలని  పేర్కొన్నారు.

Jul 2, 2018


11న గడ్కరీ పోలవరం ప్రాజెక్ట్ సందర్శన

మంత్రి దేవినేని ఉమ
Ø పోలవరం ప్రాజెక్ట్ పనులు 56 శాతం పూర్తి
Ø 66వ సారి సీఎం వర్చువల్ సమీక్ష
              సచివాలయం, జులై 2: కేంద్ర రోడ్డు రవానా, జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 11న పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శిస్తారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. ప్రపంచంలోనే రెండవ అతి పెద్దదయిన  పోలవరం ప్రాజెక్ట్ ని నిర్ణయించిన సమయంలో పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పటి వరకు 56 శాతం పూర్తయినట్లు ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం  66వ సారి  వర్చువల్ సమీక్ష నిర్వహించారు. ఆ తరువాత మంత్రి ఉమామహేశ్వరరావు సచివాలయం 4వ బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో సాయంత్రం మీడియాతో మాట్లాడారు.  ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్ల నిర్మాణం సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. హెడ్ వర్క్స్ 42.16 శాతం, డ్యామ్ ప్రధాన ప్యాకేజీ పనులు 40.65 శాతం, తవ్వకం పనులు 75.80 శాతం, కాంక్రీట్ పనులు 28.40 శాతం, రేడియల్ గేట్ల పనులు 61.30 శాతం, వంద శాతం డయాఫ్రామ వాల్ పనులు,  జెట్ గ్రౌంటింగ్ పనులు 90.70 శాతం పూర్తి అయినట్లు వివరించారు. కుడి ప్రధాన కాలువ పనులు 90 శాతం,  ఎడమ ప్రధాన కాలువ పనులు 61.67 శాతం, అనుసందాన ప్యాకేజీ పనులు 58.32 శాతం పూర్తి అయినట్లు చెప్పారు. 1396.6 మీటర్ల డయాఫ్రం వాల్ కాంక్రీట్ పనులు పనులు రికార్డు టైమ్ లో పూర్తి  చేసినట్లు తెలిపారు. దిగువ కాపర్ డ్యామ్ పనులు వచ్చే సోమవారానికి పూర్తి అవుతాయన్నారు.
                పోలవరంని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించిన తరువాత రూ.8662 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూ.6727 కోట్లు రీఇంబర్స్ చేసిందని, ఇంకా రూ.1935 కోట్లు రావలసి ఉందన్నారు. జూన్ చివరినాటికి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.300 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్ట్ కు సంబంధించిన బిల్లులను పోలవరం డెవలప్ మెంట్ అథారిటీకి పంపినట్లు మంత్రి ఉమ చెప్పారు.