Nov 12, 2016

ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా

·       రాష్ట్రంలో 1,18,55,366 కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు
·       ఖాతా వాడుకలో ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం
·       2019 నాటికి వంద శాతం ఆధార్ తో అనుసంధానం
·       రాష్ట్ర వ్యాప్త అనుసంధానిత వ్యవస్థ
·       పీఎంజేడీవై పథకం కింద దేశంలో 25.45 కోట్లు, రాష్ట్రంలో 79,10,585 ఖాతాలు

         రాష్ట్రంలో 2019 నాటికి ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా ఉండి, అది వాడుకలో ఉండేలా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. చాలా కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు ఉన్నా అందులో లావాదేవీలు జరగడంలేదు.  బ్యాంకు ఖాతా తెరవడమే కాకుండా, అది చలామణిలో ఉండాలని కూడా సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ విజన్-2029లో ప్రభుత్వం పేర్కొంది. రుణాలు, పొదుపు, సబ్బిడీలు, జీవిత బీమా, ప్రమాద బీమా, స్కాలర్ షిప్స్, పెన్షన్, ప్రభుత్వ ఆర్థిక సాయం, రాయితీలు, రైతులకు పంట రుణాలు, డ్వాక్రా గ్రూపు రుణాలు, ఉపాధి హామీ పథకం కింద వేతనాలు, పేదలు ఇతర మార్గాలలో లబ్ధిపొందడానికి బ్యాంకు ఖాతాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలావరకు ఆర్థిక సాయాన్ని బ్యాంకు ఖాతాల ద్వారానే చెల్లిస్తోంది. అయితే బ్యాంకు ఖాతాలు లేక అనేక మంది లబ్దిపొందలేకపోతున్నారు. కొందరికి బ్యాంకు ఖాతాలున్నా వాడుకలోలేవు. అందువల్ల బ్యాంకు ఖాతా ద్వారా పొందే ప్రయోజనాలను ప్రజలలో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పథకాలు, రాయితీలు పేదలకు, నిజమైన లబ్ధిదారులకు అందజేయడంలో బ్యాంకు ఖాతాల వల్ల పారదర్శకతకు తావుంటుంది. 2011 జన గణన ప్రకారం దేశంలో ఉన్న ప్రతి 5 కుటుంబాలలో మూడు కుటుంబాలకు  మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. అంటే దేశంలో దాదాపు 40 శాతం కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు లేవు. బ్యాంకింగ్ వ్యవస్థకు వారు పూర్తిగా దూరంగా ఉన్నారు. దాంతో ప్రతి కుటుంబం బ్యాంకు ఖాతా కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం దేశంలో 2011-14 మధ్య బ్యాంకు ఖాతాలు 35 శాతం నుంచి 53 శాతానికి పెరిగాయి. ఈ మూడేళ్ల కాలంలో 17.5 కోట్ల మంది కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిచారని ఆ నివేదికలో పేర్కొన్నారు.

   దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా లక్ష్యంగా కేంద్రప్రభుత్వం 2014 ఆగస్ట్ 28న ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) పథకం ప్రారంభించింది. ఇది మంచి ఫలితాలనిచ్చింది. దేశం మొత్తంమీద అయిదు నెలల్లోనే ఈ పథకం కింద 11.5 కోట్ల మంది బ్యాంకు ఖాతాలను తెరిచారు. ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కు ఎక్కింది. ఈ నెల 2వ తేదీ  వరకు దేశంలో ఈ పథకం కింద మొత్తం 25.45 కోట్ల ఖాతాలు తెరిచారు. ఆంధ్రప్రదేశ్ లో 79,10,585 ఖాతాలు తెరిచారు. వాటిలో గ్రామీణ ప్రాంత ఖాతాలు 44,81,387 ఉండగా, పట్టణ ప్రాంత ఖాతాలు 34,29,198 ఉన్నాయి. మొత్తంలో 61,31,892 ఖాతాలకు ఆధార్ నెంబర్ ను అనుసంధానం చేశారు.  పీఎంజేడీవై నివేదిక ప్రకారం రాష్ట్రంలో 1,18,55,366 కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య కచ్చితంగా తెలియదు. ప్రజాసాధికార సర్వే పూర్తి అయితే తెలుస్తుంది. కొన్ని కుటుంబాలలో ఉన్న సభ్యులందరికీ ఖాతాలు ఉంటున్నాయి. ఒక్కో సభ్యునికి రెండు మూడు ఖాతాలు కూడా ఉంటున్నాయి. ఒక్క ఖాతా కూడా లేని కుటుంబాలు కూడా ఉన్నాయి.  పీఎంజేడీవై పథకానికి ఇటు ప్రజల నుంచి, అటు బ్యాంకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి ఇది తోడ్పడుతుంది. ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా అందించడంలో జేఏఎం(జన్ ధన్, ఆధార్, మొబైల్) కీలక పాత్ర పోషిస్తుంది.
రాష్ట్ర వ్యాప్త అనుసంధానిత వ్యవస్థ
           భవిష్యత్ లో రాష్ట్రం అన్ని  రంగాలలో అభివృద్ధి సాధించడానికి ప్రభుత్వం విజన్-2029 ముసాయిదా పత్రాన్ని రూపొందించింది.   సమ్మిళిత అభివృద్ధికి దోహదపడేవాటిలో అందరికి తప్పనిసరిగా కావలసిన 12 కనీస అవసరాలను ప్రభుత్వం గుర్తించింది. బ్యాంకు ఖాతా ప్రాధాన్యతను గుర్తించి వాటిలో దీనిని కూడా చేర్చింది. సత్వర పారదర్శక పాలనకు ఉపయోగపడే పరివర్తన వ్యూహాలు, మెరుగైన జీవనానికి అవకాశాలలో కూడా దీనిని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను రూపొందించి, వాటిని సమగ్రంగా, సమర్థవంతంగా నిజమైన లబ్ధిదారులకు అందజేయడానికి, పారదర్శకతకు అనువైన ఒక రాష్ట్ర వ్యాప్త అనుసంధానిత వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ-ప్రగతి సాంకేతిక సహకారంతో సమర్థవంతంగా సేవలు అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనికోసం మొదటి దశలో ప్రభుత్వం రూ.2,398 కోట్లు పెట్టుబడి పెడుతుంది.
        బ్యాంకు ఖాతాతో ఆధార్ నెంబర్, మొబైల్ తో సమన్వయం
        బ్యాంకు ఖాతాతో ఆధార్ నెంబర్ ను మొబైల్ నెంబర్ తో సమన్వయం చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడానికి వీలవుతుంది. నగదు బదిలీ పథకానికి కూడా ఈ ఖాతాలు తప్పనిసరి. అవినీతికి తావులేకుండా ప్రభుత్వ సహాయం నేరుగా లబ్దిదారుని ఖతాలో చేరిపోతుంది. ప్రజాధనానికి భద్రత చేకూరుతుంది. ఈ-ప్రగతిలో భాగంగా బ్యాంకు ఖాతాలను తప్పనిసరి చేశారు. 2019 నాటికి ఆధార్ తో అనుసంధానమైన జన్ ధన్ బ్యాంకు ఖాతాలు వంద శాతం కుటుంబాలు కలిగి ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. మారుమూల గ్రామాలలో కూడా జాతీయ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు తమ బ్యాంచ్ లను ప్రారంభించడంతో అందరూ బ్యాంకు ఖాతాలు తెరవడం సులభమైంది. ప్రభుత్వ చర్యలతో ప్రజలలో అవగాహన పెరగడం,  బ్యాంకుల చొరవ వల్ల నిర్ణీత సమయానికంటే ముందుగానే లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంది. 

Nov 10, 2016

మెరైన్ ఎగుమతుల్లో ఏపీ నెంబర్ 1

             
§  ఏపీ నుంచి రూ. 9,328 కోట్ల విలువైన ఎగుమతులు
§  అధిక భాగం రొయ్యలే!
§  విశాఖ నుంచి 1,28,718 టన్నుల ఎగుమతి 
§కృష్ణపట్నం నుంచి 38,412 టన్నుల ఎగుమతి
§  ఎక్కవగా అమెరికాకు ఎగుమతి
§  రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో మెరైన్ రంగం కీలకం
§  ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో అధిక లాభం
§  మెరైన్ బోర్డు ఏర్పాటుయత్నం
  
  మెరైన్ ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోకెల్లా అత్యున్నత స్థానంలో ఉంది. కేంద్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని  మెరైన్ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపీఈడీఏ) తాజా లెక్కల ప్రకారం 2015-16 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 9,45,892 మెట్రిక్ టన్నుల మెరైన్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి.  రూ.30,420.83 కోట్ల ఆదాయం లభించింది. ఎగుమతి అయినవాటిలో ఎక్కువ భాగం రొయ్యలు, చేపలు ఉన్నాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 5.6 బిలియన్ల అమెరికన్ డాలర్ల ఆదాయం వస్తుందని ఎంపిఈడిఎ అంచనా. సముద్ర ఉత్పత్తులు భారత ఆర్ధిక వ్యవస్థకు గొప్ప వరం. మన దేశంలో 8,129 కిలో మీటర్ల సుదీర్ఘమైన తీరప్రాంతం ఉంది. 9 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్న ఈ తీర ప్రాంతంలో  దాదాపు 31 లక్షల టన్నుల సముద్ర ఉత్పత్తులకు అవకాశం ఉంది.
        రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి తడ వరకు 9 జిల్లాలలో 974 కిలో మీటర్ల సముద్రతీర ప్రాంతం ఉంది. సముద్రం ఉత్పత్తులను పెంచుకోవడానికి అవకాశం మెండుగా ఉంది. ఈ రంగం ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉంది.  2015-16లో ఏపీ నుంచి రూ. 9,328 కోట్ల విలువైన 1,67,130 టన్నుల మెరైన్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి.  వీటిలో 98,553 టన్నులు ఒక్క అమెరికాకే ఎగుమతి అయ్యాయి. సముద్ర ఉత్పత్తుల మొత్తం  ఎగుమతులలో  అత్యధిక భాగం 1,58.100 టన్నులు రొయ్యలే ఉన్నాయి. విశాఖపట్నంలో రిజిస్టర్ అయిన సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులు 61 మంది ఉన్నారు. 2015 -16లో విశాఖపట్నం ఓడ రేవు నుంచి రూ. 7,161 కోట్ల విలువైన 1,28,718 టన్నుల మెరైన్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. అంతకు ముందు సంవత్సరం 1,15,672 టన్నులు ఎగుమతి అయ్యాయి. 11.28 శాతం వృద్ధి కనిపించింది.  దేశంలో మెరైన్ కార్గోలను  పంపే మేజర్ పోర్టులలో విశాఖపట్నం పోర్ట్ ఒకటి.  కృష్ణపట్నం నుంచి రూ.2,167 కోట్ల విలువైన 38,412 టన్నుల మెరైన్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. అంతకు ముందు సంవత్సరం 30,690 టన్నులు ఎగుమతి అయ్యాయి. 25.16 శాతం అధికంగా ఎగుమతులయ్యాయి. ఈ లెక్కల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక అభివృద్ధికి సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు కీలకం కానున్నాయి.   

       వనామీ, బ్లాక్ టైగర్ వంటి అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్నటువంటి విభిన్న వెరైటీల రొయ్యల ఎగుమతులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.  ఆక్వా రంగంలో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఆధునిక పద్దతులను అమలు చేయడం ద్వారా ఈ ఏడాది నుంచి ఆదాయాన్ని మరింత పెంచుకొనే వ్యూహరచన చేసింది.  గత నెలలో మూడు రోజుల పాటు విశాఖపట్నంలో జరిగిన 20వ అంతర్జాతీయ సముద్ర ఉత్పత్తుల ప్రదర్శన కూడా ఈ రంగంలో నాణ్యమైన ఉత్పత్తులు, ఎగుమతులు పెరగడానికి దోహదపడుతుంది. ఈ ప్రదర్శనలో దేశవిదేశాలకు చెందిన మూడు వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. 300 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన ద్వారా రాష్ట్రంలోని వ్యాపారులు, రైతులు సముద్ర ఉత్పత్తుల దిగుబడిని పెంచడంలో అనుసరించే ఆధునిక పద్దతులను, ప్రొసెసింగ్, రవాణా, ఎగుమతులలో మెళకువలను తెలుసుకున్నారు. ఈ ప్రదర్శన ద్వారా రాష్ట్రం దేశవిదేశీ పెట్టుబడులను కూడా ఆకర్షించగలిగింది.
      భారత్ సముద్ర ఉత్పత్తులు ఎక్కువగా అమెరికా దిగుమతి చేసుకుంటుంది. అమెరికాకి దిగుమతి అయ్యే సముద్ర ఉత్పత్తుల్లో భారత్ వాటా 28.46 శాతం.  గడచిన ఏదాడి 1,53,695 టన్నుల సముద్ర ఉత్పత్తులు అమెరికా ఇక్కడి నుంచి దిగుమతి చేసుకుంది. ఆగ్నేయాసియా దేశాలు 24.59 శాతం ఉత్పత్తులను ఇక్కడ నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. యూరోపియన్ యూనియన్ దేశాలు 20.71 శాతం, జపాన్ 8.61 శాతం, మధ్య ఆసియ 5.90 శాతం, చైనా 4.71 శాతం, ఇతర దేశాలు 7.03 శాతం సముద్ర ఉత్పత్తులను భారత దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి.
          
ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
            ఆక్వా రైతులకు మంచి లాభాలు తెచ్చి పెట్టె వాటిలో ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు ప్రధానమైనవి. ప్రస్తుతం రాష్ట్రంలోని ఆక్వా రైతులు తమ ఉత్పత్తులను చెన్నై లేదా విశాఖపట్నం నుంచి మాత్రమే ఎగుమతి చేస్తున్నారు. రవాణాకు ఆరు గంటలకు పైగా సమయం పట్టడం వల్ల ఉత్పత్తుల నాణ్యతపై దాని ప్రభావం పడుతోంది. మెరైన్ ఉత్పత్తులను యురోపియన్ యూనియన్ ప్రమాణాల ప్రకారం శుద్ధి చేయాలి. మన దేశం నుంచి దాదాపు వంద దేశాలు మెరైన్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయి. వారు నాణ్యత ప్రమాణాలపై ఎక్కువ దృష్టి పెడతారు. ఆక్వా ఉత్పత్తులకు విలువ మరింత పెరగాలంటే ప్రాసెసింగ్ యూనిట్లు ఉపకరిస్తాయి. ఉత్పత్తి భారీగా  ఉన్నప్పుడు రైతులు వాటిని తక్కువ ధరకే అమ్మకోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అటువంటి సమయంలో ప్రాసెసింగ్ యూనిట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. మంచి ధర లభించే అవకాశం ఉంటుంది. సముద్ర ఉత్పత్తులు (చేపలు, రొయ్యలు) లభ్యమయ్యే ప్రాంతాల్లో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ల వల్ల పర్యావరణానికి ముప్పు ఉండదన్న అభిప్రాయం కొందరిలో ఉంది. అయితే అది వాస్తవం కాదు. అలాంటి ప్రమాదం ఏమీ లేదని  రాష్ర కాలుష్య నియంత్రణ మండలి స్పష్టం చేసింది. ఈ యూనిట్లు ఆరెంజ్ కేటగిరీ కింద వస్తాయి.  అందువల్ల వీటి నుంచి చాలా తక్కువ కాలుష్యం వెలువడుతుంది. శుద్ధి తర్వాత విడుదలయ్యే జలాలు పంటల సాగుకు కూడా ఉపయోగించుకోవచ్చు.

 మెరైన్ బోర్డు ఏర్పాటుకు ప్రయత్నాలు

           రాష్ట్రంలో మెరైన్ బోర్డు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో మాత్రమే ఇటువంటి బోర్డు ఉంది.  ఆ రాష్ట్రంలో 720 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. 1996లో మహారాష్ట్ర ప్రభుత్వం మారిటైమ్ బోర్డును ఏర్పాటు చేసింది. ఏపీలో మెరైన్ బోర్డు ఏర్పాటైతే సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉంటుంది.  సముద్రతీర ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన,  ఓడరేవుల నిర్వహణ, వాటి అభివృద్ధి, హార్బర్సలో ట్రాఫిక్ నియంత్రణ, సముద్ర జలాలకు సంబంధించిన వ్యవహారాలను ఈ బోర్డు చూసుకుంటుంటుంది.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రష్యా పర్యటనలో రాష్ట్రంలో మెరైన్ రంగం అభివృద్ధికి దోహదపడే చర్చలు జరిగాయి. మెరైన్ రంగంలో ఏపికి సంపూర్ణ సహాయ సహకారాలు అందజేసేందుకు  రష్యాకు చెందిన యునైటెడ్‌ షిప్‌బిల్డింగ్‌ కార్పొరేషన్‌ తన సంసిద్ధత తెలిపింది. 

బహుముఖ వ్యూహాలతో ఏపీ అభివృద్ధి

·       మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు 12.26 శాతం
·       వ్యవసాయ రంగంలో 22.96 శాతం వృద్ధి
·     మత్స్య పరిశ్రమలో 34.14 శాతం వృద్ధి
·       రికార్డు స్థాయిలో 349.54 శాతం పెరిగిన రొయ్యల ఉత్పత్తి

         సమర్థవంతమైన పాలన, ఆర్థిక వృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బహుముఖ వ్యూహాలు ఫలిస్తున్నాయి. పాలన వేగవంతం చేసేందుకు ప్రారంభించిన ఏడు మిషన్లు (ప్రాధమిక రంగం, సామాజిక సాధికారిత, పరిజ్ఞాన నైపుణ్యాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పారిశ్రమలు, మౌలికసదుపాయాలు, సేవల రంగం), ఐదు గ్రిడ్లు (గ్యాస్, వాటర్, ఫైబర్, రోడ్, పవర్) మరో ఐదు (నీరు-చెట్టు, బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది, పేదరికంపై గెలుపు, పరిశుభ్ర-ప్రజారోగ్యం) ప్రచార కార్యక్రమాలు నిర్ణీత వ్యవధిలో నిర్ధేశించిన లక్ష్యాలు చేరుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మొదటి త్రైమాసిక (ఏప్రిల్-జూలై) రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్ డీఫీ) రూ.1,10,583 కోట్లు లక్ష్యం కాగా, రూ. రూ.1,07,099 కోట్లు నమోదైంది. అంటే 97 శాతం లక్ష్యానికి చేరుకోగలిగింది.

           రాష్ట్ర ప్రణాళికా శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో రాష్ట్రం స్థూల ఉత్పత్తి (జిఎస్ డిపి) వృద్ధి రేటు 10.99 శాతం సాధించి దేశంలోనే అగ్రభాగాన నిలిచింది. దేశ సగటు వృద్ధి రేటు 7.57 శాతం కంటే 3.42 శాతం అధికంగా సాధించింది. ఈ ఏడాది 15.91 శాతం వృద్ధి రేటు సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో జీఏవీ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్) 12.26 శాతం వృద్ధి రేటు సాధించింది. గత సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీఏవీ రూ.95,403 కోట్లు ఉండగా, ఈ ఏడాది అదే కాలంలో రూ.1,07,099 కోట్లు నమోదైంది. వ్యవసాయం, దాని అనుబంధ రంగంలో 22.96 శాతం, పరిశ్రమల రంగంలో 10.49 శాతం, సేవల రంగం 10.16 శాతం వృద్ధి రేటు నమోదయ్యాయి. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో గత ఏడాది మొదటి త్రైమాసికంలో జీఏవీ రూ.14,898 కోట్లు కాగా, ఈ ఏడాది అదే కాలంలో 18,319 కోట్లుగా లెక్క తేలింది.
 జాతీయ స్థాయిలో 7.30 శాతం వృద్ధి
       కేంద్ర గణాంక కార్యాలయం విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో జాతీయ స్థాయిలో  జీఏవీ రూ.27,38,318తో 7.30 శాతం వృద్ధి రేటు నమోదైంది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో 1.80 శాతం, పరిశ్రమల రంగంలో 6.03 శాతం, సేవల రంగంలో 9.53 శాతం వృద్ధి రేటుగా లెక్క తేలింది. 
మత్స్య పరిశ్రమ వృద్ధి రేటు 34.14
      రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాలను పరిశీలిస్తే ప్రధాన వృద్ధి కారకం (గ్రోత్ ఇంజన్)గా ప్రభుత్వం గుర్తించిన మత్స్య పరిశ్రమ అత్యధికంగా 34.14 శాతం వృద్ధిరేటు సాధించి అగ్రభాగాన నిలిచింది. మంచి నీటి రొయ్యల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 349.54 శాతం పెరిగింది.  లైవ్ స్టాక్ (పశువులు, గొర్రెలు, మేకల పెంపకం) రంగంలో 14.67 శాతం వృద్ధి రేటు నమోదైంది. అలాగే పాల ఉత్పత్తిలో 14.24 శాతం, మాంసం ఉత్పత్తిలో 12.68 శాతం, గుడ్ల ఉత్పత్తిలో 14.95 శాతం పెరుగుదల కనిపించింది.


           రాష్ట్రంలో సరాసరి తలసరి ఆదాయం గత ఏడాదే లక్ష రూపాయలు దాటి రికార్డు సృష్టించింది. పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలో ఏపీ  మొదటి స్థానానికి ఎగబాకింది. విద్యుత్ రంగంలో లోటు నుంచి మిగులుకు చేరింది. 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ అందిస్తూ రికార్డు నెలకొల్పింది. అన్ని రంగాలలో సమ్మిళిత వృద్ధితో స్థిరమైన రెండంకెల వృద్ధి సాధించాలన్నది ప్రభుత్వ ధ్యేయం. ఆ దిశగా అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రణాళికలు ఆచరణలో అద్వితీయమైన విజయాలు సాధిస్తున్నాయి. ఈ క్రమంలో 2022 నాటికి దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన మూడు రాష్ట్రాలలో ఒకటిగా ఏపీని నిలపాలన్న ప్రభుత్వ లక్ష్యం తప్పక నెరవేరుతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం అవసరంలేదు. 

అమరావతి మెడలో నవ నగర మణిహారం



       ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి,  మండలాలలోని 25 రెవెన్యూ గ్రామల(29 గ్రామాలు)పరిధిలో 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎక్కడ ఏమి నిర్మించాలనేది ఈ మాస్టర్ ప్లాన్ లో పొందుపరిచారు. చారిత్రకంగా నాగరికత వెలసిల్లిన ప్రాంతాలు, నగరాలు అన్నీ నది ఒడ్డునే ఉన్నాయి. ఇప్పుడు మనకు నది ఒడ్డున ఇంతటి విశాల నగర నిర్మాణం జరగడం ఆంధ్రుల అదృష్టం.  అమరావతి మహానగరంలో అంతర్భాగంగా 9 నగరాలు నిర్మిస్తారు. అమరావతి లోపల చుట్టూ ఈ నవ నగరాలు ఓ మణిహారంలా ఉంటాయి. క్రమశిక్షణకు, పారదర్శకమైన పాలనలో పేరుగాంచిన సింగపూర్ ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ ను రూపొందించి గత మే నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉచితంగా అందజేసింది. ప్రపంచ శ్రేణి నగరంగా అభివృద్ధి చేయడానికి అనువుగా దీనిని తయారు చేశారు. రాజధాని అంటే కేవలం  పరిపాలనకే పరిమితం కాకుండా ఆర్థిక, సామాజిక, విద్య, వైద్యం, పరిశోధన, పర్యాటకం, ఆతిథ్యం, కళలు, సాంస్కృతిక, వాణిజ్య, సాంకేతిక కార్యకలాపాలకు ముఖ్య కేంద్రంగా నిలవాలన్నది సీఎం చంద్రబాబు నాయుడి ఆకాంక్ష. ఇవన్నీ వస్తే ఉపాధి అవకాశాలు వాటంతట అవే వస్తాయి.
      వాస్తవానికి  విభజన జరగడంతో రాష్ట్రం అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఇంకా ఎదుర్కొంటూనే ఉంది.  అయినా రాజధాని నిర్మించుకోవడం రాష్ట్రం తక్షణ కర్తవ్యం. ప్రణాళిక ప్రకారం రాజధాని నిర్మించుకునే అవకాశం కొద్ది మందికి మాత్రమే వస్తుంది. అటువంటి అవకాశం మనకు వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ఆధునికంగా నిర్మించిన నగరాల సరసన నిలిచేవిధంగా దీనిని నిర్మించతలంచారు చంద్రబాబు నాయుడు. అందుకే దేశంలోనే కాకుండా  ప్రపంచంలోని అనేక ప్రముఖ నగరాలను సందర్శించి, అక్కడి కట్టడాలను పరిశీలించారు. మన దేశంలోని గాంధీనగర్, జైపూర్, నయారాయ్ పూర్, ఛండీగఢ్, అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసి, ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రా, బ్రెజిల్ లోని బ్రాసిలియా, మలేషియాలోని పుత్రజయ, కిజకిస్తాన్ రాజధాని ఆస్థానా వంటి నగరాలను సీఎం స్వయంగా సందర్శించారు. అక్కడి కట్టడాలను వీక్షించారు. ఈ నగర ప్లాన్లను అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించారు. వీటిలో కొన్ని వాటర్ ఫ్రంట్ నగరాలు, మరికొన్ని గ్రీన్ ఫీల్డ్ ప్లాన్డ్ నగరాలు ఉన్నాయి. ఆయా నగరాలలో కార్యకలాపాలను, ప్లాన్లను పరిశీలించిన తరువాత అమరావతి మహానగరంలో అంతర్భాగంగా 9 నగరాలుగా నిర్మించాలని నిర్ణయించారు. 1.ప్రభుత్వ పరిపాలన నగరం 2. న్యాయ నగరం 3. ఆర్థిక నగరం 4.విజ్ఞాన నగరం 5.ఎలక్ట్రానిక్స్ నగరం 6. ఆరోగ్య నగరం 7. ఆటల నగరం 8. మీడియా నగరం 9.పర్యాటక నగరం. దేశ,విదేశాలలో పలు నగరాలను చూసి, వాటి స్ఫూర్తితో ఈ విధంగా ప్రత్యేక నగరాలు నిర్మించాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. అంతేకాకుండా కట్టడాలన్నీ మన సంస్కృతి ప్రతిబింభించే విధంగా ఉండాలన్న అభిప్రాయంతో ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆయా రంగాలకు సంబంధించిన అత్యంత ఆధునిక వసతులతోపాటు విద్య, వైద్యం, సాంకేతిక, రవాణా సౌకర్యాలన్నీ ఈ నగరాలలో అందుబాటులో ఉంటాయి. వివిధ అంశాలకు సంబంధించి 9 నగరాలు నిర్మించినప్పటికీ అన్ని నగరాలలో ఆయా అంశాలు అందుబాటులో ఉంటాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. విశాలమైన రోడ్లు, వాటిలో సైకిల్ ట్రాక్ లు,  పచ్చదనం పరిచినట్లు పచ్చికబయళ్లు, పూల మొక్కలు, చల్లదనాన్ని ఇచ్చే చెట్లు, ఫౌంటెన్లు.... ఇలా అందమైన ఓ సుందర నగరం ఏర్పడుతుంది.  ఈ నగరాలను కలుపుతూ మెట్రో రైలు మార్గం నిర్మిస్తారు.


         ప్రస్తుతానికి సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ అందించినప్పటికీ, ఈ 9 నగరాలలో నిర్మించే భవనాలకు సంబంధించిన ప్లాన్లను ఆమోదించవలసి ఉంది. ఆయా భవనాల ఆకృతులు రూపొందించవలసిందిగా అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ ను ప్రభుత్వం కోరింది. మలేషియాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హ్యారిస్ గ్రూప్ కంపెనీల’ చైర్మన్ హ్యారిస్  అమరావతి రాజధానిలో వివిధ భవనాల కోసం రూపొందించిన ఆకృతులను గత నెలలో సీఎం చంద్రబాబు నాయుడుకు  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. వివిధ దేశాలలో పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన అనుభం ఉన్న ఈ సంస్థ  రాజధానిలో నిర్మించే ట్విన్ టవర్స్ కు సంబంధించి పలు నమూనాలు చూపించింది.  ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, చరిత్ర, కళలు, బౌద్ధిజం.. మొదలైన అంశాలు ప్రతిబింబించేవిధంగా వాటిని రూపొందించారు. అయితే సీఎం వాటిని ఖరారు చేయలేదు. మరి కొందరు అంతర్జాతీయ ఆర్టిటెక్ట్ లు రూపొందించిన ప్లాన్లను కూడా చూసి, ఉత్తమమైన వాటిని ఎంపిక చేయాలన్న ఆలోచనతో సీఎం ఉన్నారు. ప్లాన్లు ఖరారైన తరువాత, నగరాల నిర్మాణానికి ప్రభుత్వం  టెండర్లను పిలుస్తుంది. ఇప్పటికే రాజధానిలో కొన్ని రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. మరికొన్ని రోడ్ల నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవనున్నట్లు సీఆర్డీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ చెప్పారు. రోడ్ల నిర్మాణం జరిగి, భవనాల నిర్మాణం కూడా మొదలైతే ఈ ప్రాంతంలోని స్థలాలకు మంచి ధరలు వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చి, ఫ్లాట్లు పొందిన రైతులు లాభపడే అవకాశం ఉంది. ఇదంతా జరగడానికి రెండు మూడేళ్ల సమయం పడుతుందని జైన్ చెప్పారు. 
   విజయవాడ, గుంటూరుల నుంచే కాకుండా రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి కూడా అమరావతికి అనుసంధానం చేస్తూ ఆరు లైన్ల రోడ్లు నిర్మిస్తారు.  రాజధాని అమరావతి అభివృద్ధి కోసం సింగపూర్, జపాన్, చైనా, రష్యా, యునైటెడ్ కింగ్ డమ్ తదితర దేశాలతోనూ, అంతర్జాతీయ వ్యాపార సంస్థలతోనూ వాణిజ్యం, పెట్టుబడులు, ఉమ్మడి సంస్థలు, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రణాళికలు, స్మార్ట్ నగరాలు, సంప్రదాయేతర ఇంధన వనరులు, విద్య, వైద్యం, పర్యావరణం, రవాణా వ్యవస్థలు, సామాజిక సంక్షేమం మొదలైన రంగాలలో పరస్పర సహకారం కొరకు ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఇంకా చేసుకుంటూనే ఉంది. ఈ 9 నగరాల నిర్మాణం పూర్తి అయితే మహాఅద్భుతంగా అమరావతి మహానగరం రూపుదిద్దుకుంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరంలేదు. 

Sep 7, 2014

రామ్ గోపాల్ వర్మకు తిక్క: ఒక పరిశీలన


              రామ్ గోపాల్ వర్మ పరిచయం అక్కరలేని సంచలన సినిమా దర్శకుడు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తలకెక్కుతుంటారు. అటు సినిమా గురించి గానీ, ఇతర అంశాల గురించి గానీ ఏదో ఒక వ్యాఖ్య చేసి వివాదాలు సృష్టిస్తుంటారు.రాజకీయ నాయకుల గురించి, అదీ చాలా వింతగా  మాట్లాడతారు. మత విశ్వాసాలపై మాట్లాడి వారి మనోభావాలు నొప్పిస్తారు.కొన్ని కొన్ని సందర్భాలలో అందరిలో ఆలోచనలు రేకెత్తిస్తారు.  వివాదాలు లేకపోతే అతనికి నిద్రపట్టదేమో. తన సినిమా టైటిల్ ద్వారానే రాము సంచలనం సృష్టిస్తారు. తన ప్రచారం ద్వారా ఆ సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి రేకెత్తిస్తారు. సినిమా చూసేందుకు థియేటర్కు రప్పిస్తారు. విరుద్ధ భావాలతో విశిష్ట లక్షణాలు ఉన్న వ్యక్తి రాము. అతనికి జీవితంలో  రెండే ముఖ్యమైన విషయాలు. ఒకటి సినిమా, రెండు మగువ.సినిమాకు సంబంధించి కీర్తి శిఖరం అందుకున్నారు. మగువకు సంబంధించి కూడా సుఖ శిఖరం అందుకొనే ఉంటారు. మగువేగా మగవాడికి మధుర భావన అనేది అందరికీ తెలిసిందే. రాము కూడా అంతే. తను చేసే పనిలోనే(సినిమా - మగువ) ఆనందాన్ని పొందుతాడు. అవే అతని ప్రపంచం.  చీకు - చింతా - దిగులు - నిరుత్సాహం...వంటివి రాము దరికి రావు. అయితే రాము కూడా బాధపడతారు - ఏడుస్తారు - నవ్వుతారు - నవ్విస్తారు. తన సినిమాల ద్వారా నరకం కూడా చూపిస్తారు. తన ప్రపంచం సినిమా. అతని ఆలోచనలు సినిమా. అతని శ్వాస సినిమా. వృత్తి పరంగా అతనికి సినిమా తప్ప మరొకటిలేదు. అవసరంలేదు. మరో ఆలోచన చేయరు. యాడ్ ఫిల్మ్ తీయమని అడిగినా, ఎందుకు సినిమా తీస్తానని చెబుతారు.  రాము ఓ వ్యాపారికి కూడా వ్యాపారం నేర్పగలరు. యాడ్ సంస్థకు కూడా మతులుపోగొట్టే కొత్తకొత్త  ఆలోచనలు ఇస్తారు.  తన లక్ష్యసాధనలో ఎంతటి మేధావినైనా బురిడీకొట్టించగలరు. స్థిత ప్రజ్ఞుడు.
  
                  రాముకి తిక్క ఉందా? తనకి తిక్క ఉందని ఆయన చెప్పుకుంటారు. అదివేరే విషయం. అతనికి తిక్క ఉంటే అతనిని నమ్మి నిర్మాతలు కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేస్తారు?  సినీ నటులు, ఇతర సాంకేతిక నిపుణులు అతనితో కలసి ఎలా పనిచేస్తారు? టాలీవుడ్లోనే కాకుండా, బాలీవుడ్లో కూడా అగ్రాసనానికి ఎలా చేరుకోగలిగారు? అయినా ఆయన లక్షణాలు ఒకసారి పరిశీలిద్దాం.

                ఎవరు ఎన్ని అనుకున్నా భారతీయ సినిమా చరిత్రలో అతనితో పోల్చగల దర్శకులు లేరు. అటు బాలీవుడ్లో గానీ, ఇటు టాలీవుడ్లోగాని మనం గొప్ప దర్శకులుగా భావించే వారికి ఉండే ప్రతిభా సామర్థ్యాలతోపాటు ఇతనికి చాలా అదనపు అర్హతలు, తెలివితేటలు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నాయి. కథ- కథనం -  సంగీతం- చిత్రీకరణలో కొత్తదనం - ఆధునిక సాంకేతికతను ఆసాంతం వాడుకునే సమర్ధత ఉన్నాయి. కొత్త కొత్త ఆలోచనలు - కొత్తపోకడలు - ఎటువంటి ఆలోచనలకైనా చిత్ర రూపం ఇవ్వగల సత్తా, సామర్ధ్యం ఉంది. మన దర్శకులలో ఒక్కొక్కరు ఒక్కో అంశంలో ప్రతిభావంతులుగా చెప్పుకుంటాం. కథల ఎంపిక- కథనం- సంగీతం- అపురూపమైన కొత్త అందాల(హీరోయిన్లు)ను తెరకు పరిచయం చేయడం- హీరోయిన్లో ఉంటే అందాన్ని వివిధ భంగిమలలో అద్భుతంగా చూపించడం...ఇటువంటి అంశాలలో ఒక్కొక్కరికి ఒక్కోదాంట్లో ప్రావీణ్యత ఉంటుంది. రామ్ గోపాల్ వర్మలో వీటన్నిటితోపాటు ఫొటోగ్రఫీ, ఇతర సాంకేతిక పరిజ్ఞానంలో కూడా అవగాహన, అనుభవం ఉంది. ప్రతి సినిమాలో రాము ముద్ర ఉంటుంది. కొత్తకొత్త కథలతో, కొత్త ఆలోచనలతో చిత్రాలు తీస్తున్నారు. వీటికి తోడు ఏ దర్శకునికీ లేనంత ప్రచార సామర్ధ్యం రాముకి ఉంది.అది అతని ప్రత్యేకత. గతంలో ఏ దర్శకుడూ ప్రచారానికి సంబంధించి ఇంతటి ప్రావీణ్యాన్ని ప్రదర్శించలేదు.

                              సినిమాలు సమాజాన్ని మార్చవనేది అతని ఖఛ్చితమైన అభిప్రాయం. అందుకే సామాజిక ప్రయోజనం కోసం తాను సినిమాలు తీయను అని చెబుతారు. అతనితో కొద్ది సేపు మాట్లాడిన తరువాత చాలా మందికి తాము తెలుసుకోవలసింది చాలా ఉన్నదన్న విషయం తెలుస్తుంది. లేకపోతే అటువంటి అభిప్రాయానికి వస్తారు. జడత్వం గల మనిషిలోనైనా ఆలోచనలు పుట్టించగల ఘటికుడు. ప్రతిమనిషిలో విభిన్న కోణాలు ఉన్నట్లే రాములో కూడా ఉన్నాయి.  అతని పేరే రామ్ గోపాల్. అక్కడే రెండు ధృక్పదాలు - అలాగే అతని ఆలోచనా విధానం - నడవడి - ప్రవర్తన - వ్యవహర శైలి - మాటల తీరు....భిన్నంగానే ఉంటాయి. అయితే అతనేంటో అతనికి తెలుసు. అతనికి ఏం కావాలో తెలుసు. ఏం చేస్తున్నాడో తెలుసు. ఏం చేయాలో తెలుసు. జీవితం పట్ల స్పష్టత ఉంది.సినిమా నిర్మాణం పట్ల సంపూర్ణ అంకిత భావం ఉంది.  ప్రతి విషయంలో అతనికి ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. అవి ఎదుటి వారికి నచ్చవచ్చు. నచ్చకపోవచ్చు. అది వేరే విషయం.  అతనికీ చదువు, సభ్యత, సంస్కారం ఉన్నాయి. మంచీచెడు తెలుసు. అందరిలాగానే భావోద్వేగాలు ఉన్నాయి. తల్లిదండ్రులను ప్రేమిస్తారు. గౌరవిస్తారు. అభిమానిస్తారు. వారికి అండగా ఉంటారు. అతనికీ స్నేహితులు ఉన్నారు. ప్రియురాలు కూడా ఉండేది. చదువుకునే వయసులో ప్రేమలో  పడ్డారు. పుట్టి పెరిగిన ఊళ్లంటే అభిమానం. దేశం పట్ల గౌరవం ఉంది.  అతనికి మంచి చేసిన వారిని, సహాయం చేసిన వారిని జీవితాంతం గుర్తుంచుకుంటారు. అతనూ సహాయం చేస్తారు.

               రాముకి ఆత్మవిశ్వాసం మెండుగా ఉంది.  అతని ఆలోచనలు, సాధించిన విజయాలే అతనిలోని విశ్వాసాన్ని పెంచుతున్నాయి. అతనికి ధైర్యం కూడా ఎక్కువే. కష్టపడే స్వభావం. తనకు నచ్చిన పని(సినిమా)ని శ్రమ అనుకోరు. బద్ధకం - సొల్లుకబుర్లు అతనికి అసలు నచ్చవు. పనిలోనే సంతృప్తి, ఆనందం  పొందుతారు. ప్రపంచ సినిమా రంగాన్ని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకు పోతుంటారు. అటువంటి ఆలోచనలతో తన వద్దకు వచ్చినవారిని కూడా స్వాగతిస్తారు. తను ఏవిధంగా అప్పటికి భిన్నమైన ఆలోచనతో సినిమా రంగానికి వచ్చారో, ఆ విధంగా వచ్చిన ప్రతివారిని ప్రోత్సహిస్తారు. సహకరిస్తారు. సహాయపడతారు. అండగా నిలుస్తారు.  అతనికి ముసుగు(మాస్క్)లేదు. తన అభిప్రాయాలు - ఆలోచనలు బయటకు చెప్పడానికి జంకడు. ఏ విషయాన్నైనా ఎంతవరకైనా, ఎంత లోతుగానైనా ఆలోచించగలరు. ఆ ఆలోచనను బహిరంగంగా చెప్పగల ధైర్యం ఉన్నవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ఓ ప్రపంచ పౌరుడు(ఇది చాలా విస్తృతార్ధం. ఓ మతానికో, ఓ సంస్కృతికో, ఓ కులానికో, ఓ కుటుంబానికో చెందినవాడు కాదు.  ప్రపంచంలో వివిధ సంస్కృతులు - వివిధ ఇజాలు-వివిధ ధృక్పదాలు ఉన్నాయి. ఈ విశాల విశ్వంలో అతనిదో ఇజం.) అతనిలో ఎన్ని ప్రత్యేకతలు, ఎన్ని వ్యతిరేక అంశాలు ఉన్నప్పటికీ భారతీయ సంస్కృతీ సంప్రదాయాల ప్రభావం అతనిపై ఉంటుంది.  అతను ముక్కు సూటిగా మాట్లడతారు. అలాగే వెళతారు.

            అందరూ అనుకుంటున్నట్లుగా రాములో ఎన్ని వ్యతిరేక అంశాలు ఉన్నప్పటికీ అతనికి కోపం రావడం తక్కువ. పనిలో కూడా ఎవరినీ తిట్టరు. విసుక్కోరు. కోప్పడరు. ఏ పనైనా తనకు కావలసిన విధంగా వారు చేయకపోతే ఇక అంతే. ఏమీ అనకుండా వారిని వదిలేస్తారు. ఎవరినీ శత్రువులుగా భావించరు. ఒకరిని మోసం చేయాలన్న ఉద్దేశం అతనికి ఉండదు. ఒకరికి హాని తలపెట్టాన్న ఆలోచన కూడా రాదు. ఆయాచితంగా డబ్బు రావాలని కోరుకోరు. కష్టపడి సంపాదించాలనే స్వభావం అతనిది. ఎవరినీ కష్టపెట్టాలని గానీ, నష్టపరచాలని గానీ అనుకోరు.  అయితే తన పనులను చక్కబెట్టుకోవడానికి, తన లక్ష్యాలను చేరుకోవడానికి అబద్దాలు ఆడతారు. నాటకీయంగా వ్యవహరిస్తారు. లౌక్యంగా మాట్లాడతారు. అంతేగానీ తన లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం మరొకరిని మోసం చేసే స్వభావం మాత్రం అతనికిలేదు. స్వయం కృషి, టాలెంట్తో ముందుకు పోవడమే అతనికి తెలుసు.

        సాధారణంగా ఇటువంటి లక్షణాలు ఉన్నవారికి లౌక్యం తెలియదు. రాముకు లౌక్యం బాగా తెలుసు. అదే అతని విజయానికి మూలం. రాముకి లౌక్యం ఏమిటని మీరు అనుకోవచ్చు. అతను ఈ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అతని దగ్గరకు నిర్మాతలు వస్తున్నారు. ప్రారంభంలో అతను ఎన్నో అబద్దాలు చెప్పి- నాటకీయంగా వ్యవహరించి - లౌక్యం ప్రదర్శించి విజయం సాధించారు. ఈ స్థాయికి ఎదిగారు. ఇప్పుడు కూడా అతని దగ్గర లౌక్యంలేకపోతే ఇలా కొనసాగలేరు.
  
                 ప్రపంచంలో ఏ దర్శకుడికి ఆపాదించనన్ని లక్షణాలను భారతీయ ప్రేక్షకులు రామ్ గోపాల్ వర్మకు ఆపాదించారు. తిక్క- చపలచిత్తం - మూర్ఖుడు - అసాంఘీక శక్తి - మేథావి - క్రియేటివ్ డైరెక్టర్ - జీనియస్ - స్వేచ్ఛాజీవి -- తలతిక్క- పబ్లిసిటీ స్టంట్ -  అజ్ఞాని - స్త్రీలంటే గౌరవంలేదు - నైతిక విలువలు లేనివాడు - హింసాత్మక చిత్రాలు తీసేవాడు - అట్టర్ ఫ్లాప్ చిత్రాలు తీసి అటు నిర్మాతలను నష్టపరుస్తూ, పరమ చెత్త సినిమాలతో ఇటు ప్రేక్షకులను హింసిస్తున్నాడు -  మొండివాడు - పొగరుబోతు - తెలివితక్కువ వాడు - నాస్తికుడు-స్వార్ధపరుడు - ఉన్మాధి - అహంభావి - చంచల స్వభావుడు - నిజాయితీలేనివాడు - వింత మనిషి - తెలివైన మూర్ఖుడు - పబ్లిసిటీ పిచ్చోడు - చిత్రమైన వ్యక్తి -  సూపర్బ్ డైరెక్టర్ - దర్శక నక్షత్రం - సత్తా ఉన్నదర్శకుడు - వాస్తవాలకు చిత్ర రూపం ఇచ్చే అద్భుత దర్శకుడు - చిత్ర నిర్మాణంలో కొత్తపుంతలు తొక్కిన గొప్ప దర్శకుడు - రెటమతం - పెద్దల పట్ల గౌరవంలేదు - మంచీమర్యాద తెలియదు - సభ్యతలేదు - గర్వం - వెటకారం ఎక్కువ - సమాజం పట్ల బాధ్యతలేదు - భార్యను వదిలేశాడు - ప్రేమానుబంధాలు తెలియదు - సమాజాన్ని నాశనం చేసే చిత్రాలు నిర్మిస్తాడు- అన్నీ కాపీ సినిమాలే- అతని సినిమాలలో హింస, రౌడీయిజం, గూండాయిజం, మాఫియా, అండర్ వరల్డ్... ఇవే ఉంటాయి- దెయ్యాలు - భూతాలు - ప్రేక్షకులను భయపెట్టే చిత్రాలు తీస్తాడు - ఒకటి బంపర్ హిట్ కొడితే, నాలుగు ఫ్లాపులు - ఏది మాట్లాడినా పబ్లిసిటీ కోసమే - సినిమా వ్యాపారం కోసం తిక్కతిక్కగా మాట్లాడి ప్రేక్షకులను ఆకర్షించడం - చెత్త సినిమాలు తీసి జనంమీద రుద్దడం - జీవితం పట్ల ఒక దృక్పధం లేదు.....ఇలా ఎవరికి తోచిన విధంగా వారు అనేక చిత్రవిచిత్రమైన లక్షణాలు అతనికి ఆపాదించారు.

             అతనూ తక్కువేం కాదు అదే స్థాయిలో తిక్కతిక్కగా, అడ్డదిడ్డంగా, ఆలోచనలు రేకెత్తించే విధంగా, వీడెవడ్రా బాబూ అనుకునేట్లుగా, నేనింతే, నా ఇష్టం- నాకోసమే సినిమాలు తీసుకుంటా- నా ఇష్టం వచ్చినట్లు తీస్తా - నాకు తోచింది తీస్తా - చూడాలనుకున్నవారు చూస్తారు - వద్దనుకున్నవారు చూడరు.- నాకు ఏ సమయంలో ఏది అనిపిస్తే అది తీస్తా - క్లిక్ అయితే క్లిక్, ఫ్లాప్ అయితే ఫ్లాప్ - కాపీ కొడుతూనే ఉంటా- కాపీ కొట్టి ఇంజనీరింగ్ పాసయ్యా - అనేక సినిమాలు కాపీ కొట్టి హిట్లు సాధించా - నా చావు నేను చస్తాను - నా సినిమా చూడండి అని నేను చెప్పడంలేదు. ...ఇలా మాట్లాడుతుంటారు.  మీడియా వారు సదుద్దేశంలో అడిగిన ప్రశ్నలకు సరిగానే సమాధానం చెబుతారు. అతని చేత ఏదో చెప్పించడానికి ప్రయత్నిస్తే మాత్రం కావాలని తిక్కతిక్కగా, అడ్డదిడ్డంగా సమాధానాలు చెబుతాడు. తిక్క ప్రశ్నలకు తిక్క సమాధానాలు, మంచి ప్రశ్నలకు మంచి సమాధానాలు ఇస్తుంటారు. కావాలని పనిగట్టుకొని ఏ ఒక్కరిని  విమర్శించరు. పేరు పెట్టి ఒకరి గురించి మాట్లాడే సమయంలో ఒక స్థాయిని మించి విమర్శించరు. సందర్భం వచ్చినప్పుడు తన అభిప్రాయం ధైర్యంగా చెబుతారు. అయితే కొన్ని కొన్ని సందర్భాలలో దూకుడుగా మాట్లాడతారు. అవతలవారిని బాధపెడుతుంటారు. తనకు తన అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉందని మాత్రమే అనుకుంటారు. ఆ అభిప్రాయం అవతలివారి మనసు నొప్పించకూడదు అనే విషయం మరచిపోతారు. ఎదుటి వారి మనోభావాలను గౌరవించాలనే అంశం వదిలివేస్తారు. అటువంటి సందర్భాలలో వివాదం కొని తెచ్చుకుంటారు.



అతని ప్రపంచం సినిమా - తను అనుకున్న సినిమా తీస్తారు- మనసు పెట్టి పనిచేస్తారు. తన సినిమా సక్సెస్కి పొంగిపోవడం - ఫ్లాప్కు కుంగిపోవడం అనేది ఉండదు.  రెండిటికి ఒకే రకంగా పని చేస్తారు. ఒకే రకంగా ఆలోచన చేస్తారు.  సినిమా ఫ్లాప్ అయితే తను ఫెయిల్ అయినట్లుగా భావించరు. ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందా అని ఆలోచన చేస్తారు. అదే అతని ప్రత్యేకత. ఎంత గొప్ప సినిమాలు తీశారో అంత చెత్త సినిమాలు కూడా తీశారు. అయితే ఏదైనా అతని సొంతం, అతని ఆలోచనల నుంచి పుట్టినదే. రాము ఎవరి మాట వినరు. తన ఇష్టం వచ్చిన విధంగా సినిమాలు తీస్తారు. నచ్చిన విధంగా జీవిస్తారు. అదే అతని స్టైల్.
  
వేరు వేరు రాములు

సినిమా ప్రపంచం రాము, మీడియా ముందు కనిపించే రాము, కుటుంబంలో రాము వేరువేరుగా ఉంటారు. సినిమా రంగంలో తనకు కావలసిన పనుల కోసం చాలా కలుపుగోలుగా వ్యవహరిస్తుంటారు. తనకు కావలసిన నటన, షాట్, సంగీతం, దృశ్యం... రాబట్టుకోవడం కోసం చాలా తెలివిగా, చనువుగా, నొప్పించకుండా సూచనలు ఇస్తుంటారు.  మీడియాను వాడుకోవడంలో రాము దిట్ట. చిక్కడు-దొరకడు పద్ధతిలో సమాధానాలు చెబుతుంటారు. అతనిని ఇంటర్వ్యూ చేయడం కూడా కష్టమే. ఎటువంటి ప్రశ్నకైనా తెలివిగా సమాధానం చెబుతారు. ఒక్కోసారి తర్కాన్ని  కూడా చొప్పిస్తుంటారు. పబ్లిసిటీలో భాగం కానివ్వండి, అతని స్వభావం కానివ్వండి తన సినిమా కథను గానీ, సన్నివేశాలను గానీ, దృశ్యాల చిత్రీకరణను గానీ, సంగీతాన్ని కానీ  ఎవరి దగ్గర నుంచి,  ఎక్కడ నుంచి, ఎలా కాపీ కొట్టింది సవివరంగా, స్పష్టంగా చెబుతారు. కాపీ కొట్టడం, అనుసరించడం  తనకు కావలసిన విధంగా మలుచుకున్నట్లు కూడా వివరిస్తారు. శంకరాభరణం ఒరిజినల్ - శివ కాపీ అని చెబుతారు. అదే అతని నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. తల్లిదండ్రులు అంటే అపారమైన గౌరవం, అభిమానం, ప్రేమ ఉన్నాయి. తమ్ముడు, చెల్లెలిపై  కూడా ప్రేమాభిమానాలు ఉన్నాయి. కుటుంబంలో కూడా ఏదైనా నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తారు. తన మాట వినకపోతే వదిలివేస్తారు. తను చెప్పినది ఎదుటివాళ్లు వినాలనే స్వభావంకాదు.

పెళ్లి - విడాకులు

ఇది పూర్తిగా వ్యక్తిగతం. ప్రముఖ వ్యక్తి అయినందున ప్రస్తావించడం సహజం. మేథావులు, శాస్త్రవేత్తలు, మితిమీరిన తెలివితేటలు, విజ్ఞానం గలవారు, తమ వృత్తిలో అపర నైపుణ్యం గలవారు వైవాహిక జీవితంలో విఫలమవుతుంటారు. ఇటువంటి వారిలో ఎక్కువ మంది భార్యలను పట్టించుకోకపోవడం వల్ల వారికి భర్తపై విరక్తి కలగడమో,  వైవాహిక జీవితంపై విరక్తి కలగడమో లేక అసలు జీవితంపైనే విరక్తికలగడమో జరుగుతుంటుంది. దాంపత్య జీవితం పదికాలాలపాటు సుఖవంతంగా కొనసాగాలంటే పరస్పర అవగాహన - ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించడం - ఒకరినొకరు అర్ధం చేసుకోవడం(ఒకరినొకరు భరించడం అని కూడా అంటారు) ముఖ్యం. తనను భరించినప్పటికీ, తను భరించడానికి సిద్దంగా ఉండి ఉండకపోవచ్చు.  వేధించడం, హింసించడం, అసంతృప్తితో జీవించడం కంటే పరస్పర అంగీకారంతో విడిపోవడం ఉత్తమం. రాము అదే చేశారు.

రాము ప్రత్యేకతలు:

v  రాము తన జీవితంలో అత్యంత ఇష్టపడే  వ్యక్తి  తండ్రి కృష్ణంరాజు. తండ్రి అంటే భయం లేదు. అభిమానం, అత్యంత గౌరవం. 

v   అతనిని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తులు  బ్రూస్లీ, అయాన్ ర్యాండ్, నీషే, మిత్రుడు సత్యేంద్ర

v  శ్రీదేవి అంటే అతనికి అత్యంత ఇష్టం. ఆరాధనా భావం.

v  అతనికి ఈర్ష్యాద్వేషాలు లేవు.

v  రాముని ఎవరైనా శత్రువులుగా భావించవచ్చునేమోగానీ, రాము ఎవరినీ శత్రువుగా భావించరు.

v  తనకు నచ్చని వారిని దూరంగా ఉంచుతారు లేకపోతే ఆయనే  దూరంగా ఉంటారు.

v  ఎదుటి మనిషిలో టాలెంట్ని గుర్తించడంలో  ఘటికుడు.. ప్రోత్సహించడంలో కూడా ముందుంటారు.

v సినిమాకు సంబంధించిన 24 రంగాలలో వందల మంది కొత్తవారిని పరిచయం చేశారు. ప్రోత్సహించారు.  * తనకు అసిస్టెంట్లుగా పనిచేసినవారికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించి మరీ సినిమాలు నిర్మించారు.

v  సినిమా ప్రమోషన్కు నటీనటులు ఎవరూ అవసరంలేదు. అతనొక్కడే చాలు.

v  తనకు మాట్లాడే స్వేచ్ఛ ఉందని, ఎదుటివారిని హర్ట్ చేస్తుంటారు.

v  పబ్లిసిటీ టెక్నిక్లో భాగంగా రెటమతంగా మాట్లాడతారు. వాస్తవాలనే కాస్త పొగరుగా చెబుతారు. టాలెంట్ ఉన్నవారికి పొగరు ఉండటం సహజం. కొత్త ఆలోచనలు రేకెత్తించేవిధంగా చర్చిస్తుంటారు.

v  విపరీతంగా పుస్తకాలు చదువుతారు. అయితే ఎవరినీ గుడ్డిగా అనుసరించరు.

v  ప్రతి విషయంలోనూ అతనికి ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. జీవితం పట్ల స్పష్టత ఉంది. అతను అతనులానే ప్రవర్తిస్తారు.

v  అతనికి అవార్డులపై ఆసక్తిలేదు.

v  డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వరు.అంటే కనీస అవసరాలకు సరిపోను ఉంటే చాలనుకుంటారు.

v  నైతిక విలువలు పాటిస్తారు.

v  సినిమాను తన ఇష్టం వచ్చినట్లే తీస్తారు. కమర్షియల్గా ఆలోచించరు. ఆ సినిమా హిట్ అనేది ఆ నిర్మాత అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. తను మాత్రం అన్ని చిత్రాలు మనసుపెట్టే తీస్తారు.

రామ్ గోపాల్ వర్మపై పిహెచ్ డిలు చేసే అవకాశం

భవిష్యత్లో రామ్ గోపాల్ వర్మపై దేశంలో యూనివర్సిటీ లేక యూనివర్సీటీలలో పిహెచ్డిలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సినిమా - జర్నలిజం - సైకాలజీ - యాడ్స్ - కామర్స్ - హిస్టరీ...వంటి డిపార్ట్మెంట్లలో పిహెచ్డి చేయడానికి వీలుంది. సినిమా విభాగంలో అయితే 'సినిమా మేకింగ్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ, జర్నలిజంలో అయితే 'మీడియాను వాడుకోవడంలో వర్మ దిట్ట',  సైకాలజీలో అయితే 'వైరుధ్య భావాల రామ్ గోపాల్ వర్మ', యాడ్స్లో అయితే 'సినిమా ప్రమోషన్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ' కామర్స్లో అయితే 'సినిమా బిజినెస్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ'  హిస్టరీలో అయితే 'హిస్టరీ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ'....ఇలా వర్మకు సంబంధించి అనేక అంశాలపై పరిశోధనలు చేయవచ్చు.
ఇదంతా చదివిన తరువాత కూడా రామ్ గోపాల్ వర్మకు తిక్క ఉందని అనుకుంటున్నారా?

                                                                            శిరందాసు నాగార్జున -    9440222914 

                                                         Sep 07, 2014, 10:04 IST