Aug 19, 2024

ఇది ఓ జీవితం.. ఓ కవితా సముద్రం

శైలజామిత్ర ‘జన్మించడమే కవిత్వం’ పుస్తక సమీక్ష


‘జన్మించడమే కవిత్వం’ ఓ జీవితం. ఓ కవితా సముద్రం. దీన్ని సమీక్షించాలంటే భాష, భావం లోతులకు వెళ్లాలి. వెళతాం.  ఒక్క మాటలో చెప్పాలంటే శైలజా మిత్ర భాషతో అడుకున్నారు. ‘‘నా జీవితం సాహిత్యంలో ఉందా? లేక సాహిత్యం నా జీవితంలో ఉందా?’’ అనే సందిగ్ధంలో పడతానన్నారు ఆమె. అయితే, రెండూ కలిపిన జీవితం ఆమెది. 

   ‘నా ప్రయాణం చందమామ కై’ అనే కవితలో శైలజామిత్ర తన జీవిత,30 ఏళ్ల కవితా ప్రయాణాన్ని అంతా చొప్పించేశారు. భూమి అంటేనే బోరుకొట్టడం-శూన్య ముహూర్తం చూసి ఇల్లు మొదలుపెట్టడం-ఒంటిరిగానైనా సంతోషంగా నివసించడం- నిర్మలమైన నవ్వులు- నిర్బంధమే లేనితనం - గడిచిన బాల్యం - భావాల విహంగంమై గగన తలాన్ని చుట్టడం- ప్రతి అనుభూతి నేనే అవడం - అలసటలేని అరణ్యం - అంతిమపోరాటం - అక్షరమై నిలిచిపోవడం...ఇదంతా ఒకే కవితలో అల్లేశారు. ఒక జీవిత ప్రయాణ అనుభవాలన్నీ ఇందులో ఉన్నాయి. ‘‘కవిత్వం నాకు తెలిసినంతవరకు ఒక సజీవ ప్రక్రియ’’ అని ముందే చెప్పారు. అలాగే రాశారు. ఓ మనిషి, ముఖ్యంగా ఓ స్త్రీ జీవితమంతా శైలజామిత్ర కవిత్వంలో ఉంది. 

‘‘ఇప్పటికీ నా అణువణువులో అమ్మ లాలిపాట వినిపిస్తుంటే

నా బిడ్డకు డబ్బు కోసం ఈ అమ్మ పోరుబాట కనిపిస్తోంది’’ రెండు లైన్లలో నాటి తల్లికి, నేటి తల్లికి తేడా చాలా స్పష్టంగా చెప్పేశారు. ఇందులో ఓ గ్రంథం రాసేటంతని నిగూఢ అర్థం దాగుంది. ఇదే అసలైన సిసలకైన అద్బుతమైన అందరికీ అర్థమైయ్యే కవిత్వం.


అమ్మానాన్న-ఉదయం-మధ్యాహ్నం-సాయంత్రం-రాత్రి- ఈ మధ్యలో వచ్చే స్వార్థం- అబద్ధం-ఆకలి-అన్యాయం-ప్రేమ-కోపం- ఒంటరితనం -కన్నీరు -ఆనందం -ఆత్మీయత-అనురాగం-ఆశలు-నవ్వులు -ఆశయాలు-చీకటి-వెలుగు..ఇదే మనజీవితం. అదే శైలజామిత్ర కవిత్వం. మరణం ఏ ఒక్కరి ఆస్తి కాదు. వాహ్! ఇందులో ఎంత భావం ఉందో!!

అంతస్తులను బట్టి అనుబంధాలు..ప్రేమేలేని వింత బంధాలు.. ఎంత కాదన్నా అల్లుకున్న బంధాలు.. ఎంత కొత్త యుద్ధమైనా ఫలితాలన్నీ పాతవే.. క్షణికావేశాల మధ్య గడ్డ కడుతున్న పాషాణ హృదయాలు.. కాలం గమనానుసారం సాగిపోవడం. ఎందరో వ్యక్తలు, మనస్తత్వాలతో నడవడం.. తెల్లవారితే వెళ్లిపోయే రాత్రి. ‘పగ’లతో రగిలిపోయే పగలు.. ఇలా సాగుతుంది శైలజా మిత్ర కవిత్వం. 

కవిత్వంతోపాటు ఈ పుస్తకంలో 2004లో బెంగళూరు సాహిత్య అకాడమి వారు ఇచ్చిన ట్రావెల్ గ్రాంట్ ద్వారా శైలజా మిత్ర  సాహితీ ప్రయాణ విశేషాలు ఓ బోనస్. గొప్ప గొప్ప తమిళ రచయితలు, కవులను, సాహితీవేత్తలను ఆమె స్వయంగా కలిశారు. వారి గురించి, వారి సాహిత్యం గురించి చాలా చాలా చక్కగా శైలజా మిత్ర తనదైన శైలిలో వివరించారు. ఆమె సాహితీ ప్రయాణం తప్పక తెలుసుకోవాలి. ఆమె తన ప్రయాణంలో ఓ పబ్లిషర్, ఓ నటుడు, ఓ ఉపాధ్యాయుడు, ఓ ఉపాధ్యాయురాలు, ఓ బ్యాంక్ ఆఫీసర్, ఓ ఐఏఎస్ ఆఫీసర్, ఓ పబ్లిషర్, ఓ విలేకరి, ఓ అనువాదకుడు, ఓ రాజకీయ నాయకురాలు, ఓ స్క్రీన్ ప్లే రైటర్, ఓ ఎలక్ట్రానికి మీడియా న్యూస్ ఎడిటర్, ఓ ఎలక్ట్రానికి మీడియా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, ఓ ఆస్పత్రి సూపరింటెండెంట్, ఓ తత్వవేత్త, ఓ ప్రభుత్వ ఉద్యోగి .....ని కలిశారు. వీరంతా తమిళ ప్రజల మనసు దోచుకుని ఎన్నో అవార్డులు అందుకున్న ప్రముఖ సాహితీవేత్తలే.  శైలజా మిత్ర ఒక్కొక్కరిని కలిసినప్పటి అనుభవాలు తప్పక తెలుసుకోవాలి. నడుస్తున్న చరిత్ర అది. ఆ విధంగా ఆమె తమిళ సాహితీవేత్తల హృదయాన్ని మన ముందు పెట్టారు.

                                                                                                            - శిరందాసు నాగార్జున 

కవిత్వం : జన్మించడమే కవిత్వం

కవయిత్రి : శైలజా మిత్ర

పేజీలు : 214

వెల : రూ.175

ప్రతులకు : 9705972222

ప్రముఖ పుస్తక కేంద్రాలు

 09.08.2024


No comments:

Post a Comment

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...