భారతదేశ వారసత్వ సంపద చేనేత. జాతీయోద్యమంలో చేనేత కీలక పాత్ర పోషించింది. ఉద్యమంలో భాగంగా జాతీయ నేతలు విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపు ఇచ్చారు. 1905, ఆగస్టు 7న కోల్ కతాలో విదేశీ వస్త్రాలను దగ్ధం చేశారు. ఆ తరువాత చేనేత చిహ్నం రాట్నాన్ని జాతీయోద్యమ జెండాలో చేర్చారు. తకిలి అనే కదురు ద్వారా దూదితో నూలు వడకడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టారు. మహాత్మా గాంధీ చర్ఖాతో నూలు వడుకుతుండేవారు. అలా చేనేత వృత్తి చిహ్నం జాతీయోద్యమానికి ప్రతీకగా నిలిచింది. అలా చేనేత వృత్తి చిహ్నం జాతీయోద్యమానికి ప్రతీక అయింది. విదేశీ వస్త్రాలను దగ్ధం చేసి జాతీయోధ్యమానికి ఓ ఊపు తెచ్చిన ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా జరపాలని చేనేత కార్మికులు కోరుతూ వచ్చారు. జాతీయ స్థాయిలో చేనేత పరిశ్రమ ప్రాధాన్యతను గుర్తించి చివరకు 2015వ సంవత్సరంలో ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవం (నేషనల్ హ్యాండ్‌లూమ్-డే)గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి నుంచి ఆగస్టు 7న అధికారికంగా దేశవ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
ఇక చేనేత సహకార సంఘాల విషయానికి వస్తే రాష్ట్రంలో 950 వరకు సంఘాలు ఉన్నాయి. వీటిలో బోగస్ సంఘాలు అనేకం ఉన్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల నిజమైన చేనేత కార్మికులు కాకుండా ఈ బోగస్ సంఘాలు ఏర్పాటు చేసినవారు నాబార్డు రుణాలు, ప్రభుత్వ రాయితీలు పొందడం ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. వాటిని వదిలేసినా, మిగిలిన నిజమైన సంఘాలకు ప్రభుత్వం నుంచి, ఆప్కో నుంచి రావలసిన బకాయిలు ఎన్నో ఏళ్లుగా పేరుకుపోతున్నాయి.
కేరళ, తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు కొంతవరకు చేనేత రంగంపై శ్రద్ధ చూపుతున్నాయి. ముఖ్యంగా కేరళలో చేనేత కార్మికులకు అనేక సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ సహకార సంఘాల వ్యవస్థ పఠిష్టంగా ఉంది. అక్కడి చేనేత కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు ఉన్నాయి. మహిళా చేనేత కార్మికులకు ప్రత్యేక సదుపాయాలు, సౌకర్యాలు ఉన్నాయి. మన ప్రభుత్వంలోని చేనేత నాయకులు అక్కడి సౌకర్యాలను అధ్యయనం చేసి, ఇక్కడ అమలు చేయవలసిన అవసరం ఉంది. తెలంగాణలో చేనేత మిత్ర పథకం కింద నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. బతకమ్మ చీరలను చేనేత రంగం నుంచే తీసుకుంటారు. చేనేత పార్కుల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అన్ని రంగాల్లో దళారీ వ్యవస్థ వేళ్లూనుకుపోయిన సమాజం మనది. ఇంటెల్లపాది రాత్రి పగలు శ్రమించే చేనేత కార్మిక కుటుంబాలకు తగిన కూలి గిట్టదు. ప్రభుత్వాలు వారికి కావలసిన మార్కెటింగ్ వ్యవస్థను రూపొందించలేకపోతున్నాయి.
చేనేత కార్మికులకు, వినియోగదారునికి మధ్య ఉండే దళారీ వ్యవస్థను తొలగించి ‘వీవర్ టు కస్టమర్’ విధానం ద్వారా అటు నేతన్నలకు, ఇటు వినియోగదారులకు ఉపయోపడే వ్యవస్థను రూపొందించాలని చేనేత కార్మిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. చేనేత వస్త్రాలను అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మింత్ర,స్నాప్డీల్ వంటి ఆన్ లైన్ మార్కెట్ లో ఉంచాలని వారు కోరుతున్నారు. అలా నేరుగా చేనేత కార్మికుడే వ్యాపారం చేయడం ఇప్పుడున్న నిబంధనల ప్రకారం సాధ్యం కాదు. ఎందుకంటే జీఎస్టీ నెంబర్ లేనిదే ఆన్ లైన్ లో అమ్మడం వీలుకాదు. అందువల్ల ప్రభుత్వం ప్రత్యేక మార్కెటింగ్ వ్యవస్థను రూపొందించవలసి ఉంది.
చేనేత సహకార సంఘాల ద్వారా మార్కెటింగ్ జరగడానికి నూతన పద్దతులను అవలంభించవలసి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చేనేత ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. ఆ విధంగా ఆన్ లైన్ ద్వారా అన్ని దేశాలలో మార్కెట్ చేసే అవకాశం ఉంది.ఈ విషయంలో ప్రభుత్వం చేనేత సహకార సంఘాలకు ప్రాధాన్యత ఇచ్చి, సహకరించవలసిన అవసరం ఉంది.
చేనేత వస్త్రాల ఉత్పత్తికి కావలసిన ముడి పదార్థాలు పత్తి ఉత్పత్తి నుంచి ఇతర అన్ని వనరులు ఇక్కడ పుష్కలంగా లభిస్తాయి. నైపుణ్యత కలిగిన శ్రామికులు ఉన్నారు. నిర్వహణ, సాంకేతికత రెండింటిలోనూ అధిక శిక్షణ పొందిన మానవశక్తి ఉంది. అందువల్ల ప్రభుత్వాలు తగిన ప్రణాళికలు రూపొందిస్తే చేనేత కార్మికుల బతుకులు బాగుపడటమే గాక ఎగుమతుల ద్వారా దేశం ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. అందువల్ల చేనేత పరిశ్రమ అభివృద్ధికి ప్రతి సంవత్సరం బడ్జెట్ లో నిధులు కేటాయించవలసిన అవసరాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించవలసిన అవసరం ఉంది.
.- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914
No comments:
Post a Comment