అమరావతికి నిధులకు కొరతలేదు - నిర్మాణంలో వేగం
రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతికి మళ్లీ కొత్త కళ వచ్చింది. అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరిగిపోతున్నాయి. గత ప్రభుత్వం అయిదేళ్లపాటు మూలనపడేసిన అమరావతి నిర్మాణ పనులను ఈ ప్రభుత్వం కసితో అత్యంత వేగంగా పూర్తిచేయడానికి పూనుకుంది. అమరావతికి సంబంధించి ఈ నాలుగు నెలల్లో తీసుకున్న చర్యలే అందుకు నిదర్శనం. ఏపీకి ఏకైక రాజధినిగా అమరావతి ఖాయమైపోయింది. ఇక్కడే రాజధాని నిర్మించాలని భూములిచ్చిన రైతుల ఆశలు కూడా నెరవేరినట్లైంది. మూడేళ్లలో రాజధాని పనులు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అదే లక్ష్యంతో చంద్రబాబు, ఆయన మంత్రి వర్గం, అధికారులు చకచకా చర్యలు చేపట్టారు. పనులు ప్రారంభించారు. ముళ్ల కంపలు పెరిగి ఓ చిన్నపాటి అడివిలా తయారైన అమరావతి ప్రాంత్రాన్ని రాత్రి పగలు జేసీబీలతో పనులు చేయించి నెల రోజుల్లో శుభ్రం చేశారు. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రూ.15 వేల కోట్లు రుణం ఇవ్వడానికి అంగీకరించింది. ఆ రుణాన్ని కేంద్ర ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది. అంతేకాకుండా, హౌసింగ్, అర్బన్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్(హడ్కో) రూ.11 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. రాజధాని నిర్మాణానికి ఇంకా అనేక సంస్థలు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కృష్ణానది ఒడ్డున, గుంటూరు - విజయవాడ మధ్య ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు 2014 సెప్టెంబర్ 4న నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రకటించారు. అమరావతి నిర్మాణానికి 2015 జూన్ 6న తాళ్లాయపాలెం వద్ద చంద్రబాబు భూమి పూజ చేశారు. 2015 అక్టోబరు 22న ఉద్దండరాయునిపాలెం వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అమరావతి నగరానికి ఫైనల్ మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ కు చెందిన సర్బనా జురాంగ్ సింగపూర్ సంస్థ 2016 ఫిబ్రవరిలో సిద్ధం చేసింది. ఇందులో 9 నగరాలు, 27 టౌన్ షిప్ లు ఉంటాయి. బ్రిటన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ సంస్థ పరిపాలనా నగరంతోపాటు హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ ఐకానిక్ భవనాలను డిజైన్ చేసింది. ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండా, రైతులు కూడా లాభపడే విధంగా రాజధాని నిర్మాణం కోసం 28,538 మంది రైతుల నుంచి 34,395.50 ఎకరాలు సమీకరించడం ఓ ప్రపంచ రికార్డ్. ఆ క్రెడిట్ ఒక్క చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. 217.23 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో ప్రపంచ స్థాయి మహానగరం నిర్మించాలన్నది చంద్రబాబు లక్ష్యం. సీఆర్డీఏ అప్పట్లో విడుదల చేసిన శ్వేత పత్రం ప్రకారం రాజధాని మొదటి దశ నిర్మాణ వ్యయం రూ.52,837 కోట్లు. రూ.41,678 కోట్ల విలువైన పనులు గ్రౌండ్ అయ్యాయి. రూ.5,674 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లింది. అయితే, అంచనా వ్యయం ప్రస్తుతం రూ.60 వేల కోట్లకు చేరింది.
అప్పటి టీడీపీ ప్రభుత్వంలోనే శాసనసభ, శాసనమండలి భవనం, సచివాలయ భవనాలు, హైకోర్టు భవనం నిర్మించారు. అలాగే, రాజధానిలోని 29 గ్రామాలలో ఇళ్లు లేని పేదలందరికీ దాదాపు 5 వేల ఫ్లాట్లతో అపార్ట్ మెంట్లు, కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి చేశారు.రోడ్లు, విద్యుత్, టెలికం... వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. ఏడు నెలల వ్యవధిలోనే 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తాత్కాలిక సచివాలయం, శాసనసభ భవనాల నిర్మాణం పూర్తి చేసి పరిపాలన, శాసనసభ సమావేశాలు ప్రారంభించడం ద్వారా అప్పటి టీడీపీ ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, న్యాయమూర్తులు, కేంద్ర సర్వీస్, ఐఏఎస్, గజిటెడ్ అధికారులు, ఇతర ఉద్యోగుల గృహ సముదాయాలు 3,840 ప్లాట్లు, సీడ్ యాక్సెస్ రోడ్డుతోపాటు 320 కిలోమీటర్ల పొడవైన 34 ప్రధాన రహదారులు నిర్మాణ దశలో ఆగిపోయాయి. వాటిలో కొన్ని దాదాపు 70 - 80 శాతం పూర్తి అయ్యాయి. రూ.41,678 కోట్ల విలువైన పనులు గ్రౌండ్ అయ్యాయి. ప్రభుత్వం రూ.5,674 కోట్లు చెల్లించింది. 1280 కిలో మీటర్ల లేఔట్లలో రోడ్లు, డ్రైనేజీల పనులు కూడా నిలిచిపోయాయి.
2019లో వైసీపీ ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి నిర్మాణ పనులన్నిటిని నిలిపివేసింది. మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చింది. దాంతో ఏపీకి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో, రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఉద్యమించారు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని ఆందోళనకు దిగారు. ధర్నాలు, పాదయాత్రలు చేశారు. వారికి రాష్ట్ర ప్రజానికం కూడా మద్దతు పలికారు. బీజేపీ, జనసేన భాగస్వామ్యంతో మళ్లీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడటంతో అర్థంతరంగా ఆగిపోయిన నిర్మాణాలన్నీటిని జెట్ స్పీడ్ తో పున:ప్రారంభిస్తున్నారు. ఈ నెల 19న చివరి దశలో ఉన్న సీఆర్డీఏ భవన నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. వివిధ దశలలో ఉన్న పనులకు డిసెంబరులో టెండర్లు పిలుస్తారు. జనవరిలో పనులు మొదలుపెడతారు.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914
No comments:
Post a Comment