Jul 7, 2019

కొత్త ప్రభుత్వంలో సంచలనాలు


v పాలనలో నూతన అధ్యాయం
v సాహసోపేతంగా, వేగంగా నిర్ణయాలు
v అన్ని శాఖల్లో విప్లవాత్మక మార్పులు
v రైతులకు అత్యంత ప్రాధాన్యత

         నూతన ప్రభుత్వం అనేక సంచలనాలకు తెరతీసింది. నిర్ణయాలు చాలా వేగంగా జరిగిపోతున్నాయి.  అన్ని శాఖలలో సమూల మార్పులు చేస్తోంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి, ప్రజలకు ఇచ్చిన హామీలను సాధ్యమైనంత త్వరగా నెరవేర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అవినీతిపై ఉక్కు పాదం మోపాలని నిర్ణయించింది. అవినీతికి తావులేని పాలన అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రధాన ధ్యేయం. అందులో భాగంగా అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే ఇంటికి పంపుతానని మంత్రులను కూడా హెచ్చరించారు. ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీటవేసింది.
ముఖ్యంగా రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న రైతుల సమస్యలన్నిటినీ ఒకేసారి పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ‘రైతు ప్రభుత్వం’ అనే ముద్ర వేసుకోవాలన్న తపనతో ఉంది.  ప్రజలు ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలిపేవిధంగా నూతన సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎవరూ ఊహించని విధంగా అత్యంత వేగంగా తన నిర్ణయాలను ప్రకటిస్తున్నారు. ఆయన తీసుకునే కీలక నిర్ణయాలు చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజునే వృద్ధాప్య పెన్షన్ పెంచుతూ తొలి సంతకం చేశారు.  రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్ వాడీ వర్కర్లు, పోలీసులు, హోం గార్డులు, రిసోర్స్ పర్సన్స్, తల్లులు, పిల్లలు, పేదలకు ఇంటి స్థలాలు, గృహ నిర్మాణం, నూతన ఇసుక పాలసీ, విద్యా, సహకార రంగ సంస్కరణలు, గ్రామ వాలంటీర్ల నియామకం, అగ్రిగోల్డ్ బాధితులు, నాణ్యమైన బియ్యం పంపిణీ, ఆస్పత్రులలో సౌకర్యాల మెరుగు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ... వంటి కోట్ల మందికి ప్రయోజనం కలిగించే పలు కీలక నిర్ణయాలు తొలి మంత్రి మండలి సమావేశంలోనే తీసుకున్నారు. ఈ నిర్ణయాలను అమలు చేయడానికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఆడంబరాలకు పోకుండా అన్ని కార్యక్రమాలు నిరాడంబరంగా నిర్వహించడంతోపాటు ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వ ఆదాయం పెంచడానికి ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలు ప్రభుత్వంపై సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రతి నిర్ణయం అమలు జరిగే తేదీని కూడా ప్రకటించడం ఈ ప్రభుత్వం ప్రత్యేకత.

            జగన్మోహన రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 12 రోజులలోనే ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను పరిశీలిస్తే ఈ ప్రభుత్వం పని తీరు అర్థమవుతుంది. రూ.2 వేలుగా ఉన్న అవ్వా, తాతల పెన్షన్‌ను రూ. 2,250కు పెంచారు. దానిని దశలవారీగా ఏడాదికి రూ.250 చొప్పున రూ. 3 వేల వరకు పెంచుతారు.  ‘వైఎస్ఆర్ రైతు భరోసా’  పథకం కింద రైతులకు అందజేసే ఏడాదికి ఇచ్చే రూ.12,500  రబీ నుంచే అందజేస్తారు.  అక్టోబర్ 15న దీనిని ప్రభుత్వం  ప్రారంభించనుంది. ఈ పథకం కింద  రైతు ఖాతాల్లోకి నేరుగా ఈ డబ్బు జమ చేస్తారు. ఇందు కోసం ప్రభుత్వానికి మొత్తం రూ. 13,125 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. వ్యవసాయం అంటే పండుగలా రైతులు భావించేలా చేయడంతోపాటు ప్రభుత్వ సేవలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్న పట్టుదలతో సీఎం ఉన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక అల్లాడుతున్న రైతుకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పేద రైతులకు ఉచితంగా బోర్లు వేస్తారు. ఇందుకోసం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక రిగ్గ్ ని అందుబాటులో ఉంచుతారు. రైతులకు కనీస మద్దతు ధర(ఎంఎస్ పీ) లభించే ఏర్పాట్లు చేస్తారు. ఇందు కోసం  రూ.3000 కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధిని బడ్జెట్‌లో పెట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. గిట్టుబాటు ధరను సీజన్ ప్రారంభం (తొలకరి)లోనే ప్రకటిస్తారు.వ్యవసాయంఅనుబంధ రంగాలలోని వివిధ అంశాలను అధ్యయనం చేసేందుకు రైతులకు దశ దిశ నిర్దేశించేందుకు ఆయా రంగాల్లోని నిపుణులుఅధికారులతో వ్యవసాయ కమిషన్‌ ఏర్పాటు చేస్తారు.  పరపతి విధానం మొదలు వ్యవసాయ సంక్షోభం వరకు పలు అంశాలను వ్యవసాయ కమిషన్‌ అధ్యయనం చేసి,  ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది.  స్థానిక ఉత్పత్తుల నిల్వకు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక శీతల గిడ్డంగి ఒక వేర్‌ హౌస్అవసరం మేరకు ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు నిర్మిస్తారు.  సహకార రంగంలోని డైరీలకు పాలు పోసే రైతులకు లీటరుకు నాలుగు రూపాయల బోనస్‌ చెల్లిస్తారు.  మూతపడిన సహకార రంగ చక్కెర మిల్లులను 
పునరుద్ధరిస్తారు. వ్యవసాయం వల్ల తీవ్రంగా నష్టపోయి దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు కన్నుమూస్తే వారికి రూ.7 లక్షల ఎక్స్‌ గ్రేషియో చెల్లించే అవకాశం ఉంది. విపత్తుల నిధి కోసం కేంద్రం ఇచ్చే రూ. 2 వేల కోట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 2 వేల కోట్లు కలసి మొత్తం రూ. 4 వేల కోట్లతో  ఓ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తుంది. ధాన్యం కొనుగోలుబియ్యం సేకరణ వంటి వ్యవహారాలలో ఉత్తమ ఫలితాలను సాధించేందుకు పౌరసరఫరాల విభాగం వ్యవసాయ శాఖతో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నారు . పంటల బీమా ప్రీమియం చెల్లించే బాధ్యత ప్రభుత్వమే తీసుకోనుంది. రైతులకు వడ్డీ లేని రుణాలు అందించడంతోపాటు విపత్తుల సమయంలో సకాలంలో పంట నష్ట పరిహారం ఇప్పించడానికి తగిన వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.  అక్టోబర్ 2న గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తారు. వాటికి కీలక బాధ్యతలు అప్పగించి అక్కడే  రైతులకు నాణ్యమైన విత్తనాలుఎరువులుపురుగుమందులు లభించే ఏర్పాట్లు చేస్తోంది.  నకిలీ విత్తనాలు విక్రయించే కంపెనీలు డీలర్లపై  క్రిమినల్‌ కేసులు నమోదు చేసి వారిని జైలుకు పంపాలనిఅందుకు అవసరమైతే చట్టాలు కూడా సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడానికి వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురానున్నారు. భూ యజమానులకు నష్టంలేకుండా కౌలుదారులకు సాయం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రబీ నాటికి కౌలు రైతులను గుర్తిస్తే వారికి కూడా ప్రభుత్వ రాయితీలు ప్రయోజనాలుఇతర సాయం అందించే ఏర్పాట్లు చేస్తారు. వారికి 11 నెలల కాలానికి ప్రత్యేక కార్డులు అందజేస్తారు. ఉద్యోగులు అందరి డిమాండ్ సీపీఎస్ రద్దు. అందుకు మంత్రి మండలి అంగీకరించింది. ఇందు కోసం ఆర్ధిక శాఖ మంత్రి  చైర్మన్ గా,  కార్యదర్శులు  సభ్యులుగా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాణ్యమైన బియ్యంతోపాటు మరో ఆరు రకాల నిత్యావసర వస్తువులను ప్యాక్‌ చేసి గ్రామ వాలంటీర్ల ద్వారా పేదల ఇంటి ముంగిటికే చేర్చాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.  ముందుగా ప్రకటించిన ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల మంది గ్రామ వాలంటీర్లను  ఆగస్ట్ 15 నాటికి నియమించే అవకాశం ఉంది.  సెప్టెంబర్‌ 1 నుంచి ఆ వస్తువుల పంపిణీ చేపడతారు. పేదల జీవితాలను నాశనం చేస్తున్న మద్యం అమ్మకాలను క్రమంగా తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. బెల్టు షాపులను మూసివేయిస్తారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనాన్ని  రూ. 1000 నుంచి రూ. 3వేలకు పెంచారు. వైద్య,ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పని చేసే ఆశా వర్కర్ల జీతాలను ఒక్కసారిగా రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచారు. శాంతిభద్రతల పరిరక్షణలో  పండుగ-పబ్బం లేకుండా అనుక్షణం పని ఒత్తిడితో  అలుపెరుగకుండా శ్రమిస్తున్న పోలీసుల సేవలను ప్రభుత్వం గుర్తించింది. వారికి వారానికి ఒక రోజు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకు విధివిధానాలు రూపొందించడానికి ఒక కమిటీని కూడా వేశారు. 
తమ బిడ్డను బడికి పంపే ప్రతి పేద తల్లికి ‘అమ్మ ఒడి’ పథకం కింద ఏడాదికి రూ.15వేల ఆర్థిక సహాయం అందిస్తారు. వచ్చే ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం(రిపబ్లిక్ డే)రోజున దీనిని ప్రారంభిస్తారు.  ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో దేనికి పంపినా ఈ సహాయం అందిస్తారు. అర్హతఅనుభవం ఆధారంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి విధి విధానాలు రూపొందించడానికి ఆర్ధిక విద్యుత్ వైద్య  పంచాయితీ రాజ్విద్య పురపాలక శాఖల మంత్రులతో మంత్రి మండలి ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు,  కన్సల్టెన్సీలను వెంటనే రద్దు చేస్తారు. లాభాపేక్ష లేని సంస్థలకు ఆ బాధ్యతలు అప్పగించి ఆ ఉద్యోగులకు లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకుంటారు. ఇందు కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. అన్ని శాఖల్లోని పారిశుద్ధ్య కార్మికులకు రూ.18 వేలు జీతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలకు లబ్ది చేకూరే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ఓ సవాలుగా ప్రభుత్వం స్వీకరించింది. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంతో సీఎం జగన్మోహన రెడ్డి ఉన్నారు. కేంద్రం నుంచి రావలసిన నిధులను త్వరితగతిన మంజూరు చేయించడానికి కావలసిన అన్ని చర్యలను తీసుకోవడానికి ప్రభుత్వం అధికార యంత్రాగాన్ని సిద్ధం చేస్తోంది.  ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం భవిష్యత్ లో మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోని విధంగా సీఎం జగన్మోహన రెడ్డి  సాహతోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేశం ఏపీ వైపు చూసే విధంగా రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలన్నదే సీఎం లక్ష్యం.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...