Jul 5, 2019


‘ఏక భారత్’ దిశగా సమాయత్తం!
ఒకే దేశం-ఒకే చట్టం-ఒకే పన్ను- ఒకే ఎన్నికలు-ఒకే కార్డు
          
       

  ఒకే దేశం – ఒకే చట్టం అన్న దిశగా భారత సమాజాన్ని సమాయత్తం చేయవలసిన అవసరం ఉంది.  విభిన్న భాషలు, మతాలు, సంస్కృతులు సమ్మిళితమైన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనేది వినడానికి ఇంపుగా ఉంటుంది. అందులో గాఢతలేదు. బలీయమైన బంధంలేదు. దేశం ఒకటే, రాజ్యాంగం ఒకటే. అయినప్పటికి 29 రాష్ట్రాలలో 29 రకరకాల చట్టాలు ఉన్నాయి. ఏకత్వం అనేది  లోపించింది. దేశ మొత్తం జనాభాలో ఏకత్వం అనే భావన బలీయంగా ఏర్పడవలసిన అవసరం ఉంది.  భారత సమాజంలో అందుకు తగిన నేపధ్యాన్ని కేంద్రం ఏర్పరచవలసిన అవసరం ఉంది.  ఒకే దేశం - ఒకే చట్టం - ఒకే ఎన్నికలు - ఒకే కార్డు – ఒకే రకమైన రిజర్వేషన్ విధానాలు -  స్త్రీ, పురుషులిద్దరికీ సమన్యాయం -  ఉమ్మడి పౌర స్మృతి - ఒకే పన్ను .... వెరసి  ‘ఏక భారత్’ భావన ప్రతి పౌరుడిలో ఏర్పడాలి. ఆధార్ కార్డుతో మొదలైన ఈ కార్యక్రమం ఒక్కక్కటిగా ‘ఏక భారత్’ బలపడే దిశగా సాగుతోంది.  ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ప్రజ అంటూ 'ఏక్తా భారత్' అనే నినాదంతో  జనసంఘ్ పార్టీ పుట్టింది. కాల క్రమంలో అది భారతీయ జనతా పార్టీగా ఏర్పడింది. ఆ పార్టీ పరిపాలన ఈ లక్ష్యాలను దృష్టిలోపెట్టుకొని కొనసాగుతోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే చట్టం అమలులో ఉండాలన్నది వారి భావన.    భిన్న మతాలు, విభిన్న సంస్కృతులు గల భారత దేశం వంటి పెద్ద దేశంలో ఈ 'ఒకే విధానం' సాధ్యం కాదని కొందరు చెబుతారు. మతాలను, సాంప్రదాయాలను, విభిన్న సంస్కృతులను గౌరవిస్తూనే ‘ఏక భారత్’ను సృష్టించడానికి అవకాశం ఉంది. ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు, ఇబ్బందులు ఉంటాయి. సంక్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. అయినా అది సాధించిన నాడే మనం భారతీయులుగా సంపూర్ణత్వాన్ని పొందగలం. మానసికంగా ప్రతి పౌరుడు ఏక భావనతో ఉంటాడు. ఒక్కసారిగా ఈ మార్పు సాధ్యం కాదు. క్రమక్రమంగా ఒక్కో అంశంలో కొద్దికొద్దిగా మార్పులు తీసుకురావాలి. దేశంలో ఒకే కార్డు విధానం, అదే ఆధార్ కార్డు అమలులోకి వచ్చింది. 2009 జనవరి 28న ఆధార్ వ్యవస్థ ఏర్పడింది.
ఆధార్ కార్డు వల్ల అనేక అంశాలలో అటు ప్రభుత్వానికి, ఇటు పౌరుడికి ఎంతో సౌలభ్యంగా ఉంది. ఈ కార్డు దేశమంతటా చెల్లుబాటు అవుతోంది. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా ఆ తరువాత మార్పులు చేర్పులతో ఆధార్ కార్డు విధానాన్ని మెరుగుపరిచి మంచి ఫలితాలు సాధిస్తున్నారు.  ఒకే దేశం - ఒకే పన్ను అనే నినాదంతో 2017 జూలై 1న కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చింది. ఇందులో కూడా మార్పులు చేర్పులు చేసి మెరుగైన ఫలితాలు సాధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
               ఇప్పుడు ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ విధానం వల్ల పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే లక్షలాది మంది కూలీలు ప్రయోజనం పొందనున్నారు. దేశ వ్యాప్తంగా 612 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను రేషన్ షాపుల ద్వారా ఏటా 81 కోట్ల మందికి పంపిణీ చేస్తున్నారు. జాతీయ ఆహార భద్రత చట్టం సమర్ధవంతంగా అమలు చేయడంలో భాగంగా ప్రజా పంపిణీ విధానంలో మార్పులు తీసుకువచ్చి ఈ పథకాన్ని ప్రవేశ పెట్టాలన్న ఆలోచనలో కేంద్రం ప్రభుత్వం ఉంది. రేషన్ కార్డు ద్వారా ప్రస్తుతం స్వగ్రామంలోనే రేషన్ సరుకులు తీసుకునే వీలుంది.  ఈ పథకం అమలైతే లబ్దిదారులు దేశంలో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం జిల్లాల నుంచి వేలాది మంది ఉపాధి కోసం చెన్నై, హైదరాబాద్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు వలస వెళుతుంటారు. బీహార్ నుంచి లక్షల సంఖ్యలో కూలీలు దేశమంతటికి వలస వెళుతుంటారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి అనేక మంది పనుల కోసం దక్షిణాది రాష్ట్రాలకు వస్తుంటారు. ఇటువంటి లక్షల మంది ఒకే రేషన్ కార్డు పథకం ద్వారా వారు పని చేసే ప్రాంతాలలోనే ప్రతి నెల రేషన్ పొందగలుగుతారు. ఇది ఓ అద్వితీయమై ఆలోచన. ఉపాధి కోసం వలస వెళ్లే అందరికీ లబ్ది చేకూరుతుంది. ముందుగా ఈ పథకాన్ని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అమలు చేస్తారు. తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న యోచనలో కేంద్రం ఉంది.
                దేశంలో ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండటంతో పరిపాలనకు అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓటర్లు ఎక్కువమంది ఉండటంతో వ్యయం కూడా అధికంగానే అవుతుంది. ఈ నేపధ్యంలో 'ఒకే దేశం-ఒకే ఎన్నికలు' అన్న భావనను కేంద్రం ముందుకు తీసుకువచ్చింది. ఇప్పుడు దేశమంతటా అదే చర్చ జరుగుతోంది. భవిష్యత్ లో లోక్ సభ, రాష్ట్ర శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనలో కేంద్రం ఉంది. పలు ప్రాంతీయ పార్టీలు కూడా దీనికి మద్దతు పలుకుతున్నాయి. బీసీలు, మైనార్టీలు, గిరిజనుల రిజర్వేషన్లకు సంబంధించి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో చట్టం అమలులో ఉంది. రాజ్యాంగ మూల సూత్రాలకు ఇది విరుద్ధం. దీని వల్ల అనేక మంది నష్టపోతున్నారు.  అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైన చట్టం ఉండాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. రిజర్వేషన్లకు సంబంధించి దేశంలో ఒకే చట్టం ఉండాలని తెలంగాణ శాసనసభలో ఒక తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపారు. విస్తృత స్థాయిలో దేశంలో చర్చ జరిగే అంశాలలో ఉమ్మడి పౌర స్మృతి మరొకటి. ప్రస్తుతం  హిందూ, ముస్లిం, క్రైస్తవ.. అన్ని మతాలకు సంబంధించిన 'పర్సనల్ లా'లను సంస్కరించవలసి ఉంది.  ఒకేసారి ఉమ్మడి పౌర స్మృతి గురించి మాట్లాడితే ఛాందసవాదులు అందుకు అంగీకరించరు. అందువల్ల చట్టాలను కొంచెం కొంచెంగా సంస్కరించుకుంటూ పోవాలి. మొదట వివాహ వయస్సును సవరించి,  ఆ తర్వాత ఒక్కొక్కటిగా విడాకులు, మనోవర్తి అంశాలను,  వివాహ రిజిస్ట్రేషన్ విధానాలను సంస్కరించాలి. అలా చేయడం వల్ల ఎక్కువ వ్యతిరేకత వ్యక్తం కాదు. ఆ విధంగా దేశవ్యాప్తంగా ఒకే చట్టం, ఒకే ఎన్నికలు, ఒకే రిజర్వేషన్, ఒకే పన్ను, ఒకే కార్డు, ఒకే విధానం అమలు చేయాలి. కేవలం చట్టాలను మార్చినంత మాత్రాన సమాజం మారిపోదు. మార్పు రావాలంటే సమాజం అందుకు సిద్ధంగా ఉండాలి. లేదా సమాజాన్ని అందుకోసం సిద్ధం చేయాలి. ప్రస్తుతం అలా సమాజాన్ని సిద్ధం చేసే ప్రయత్నాలలో కేంద్రం ఉంది.   అంతర్కగతంగా అటువంటి ఆలోచనలతోనే కేంద్రం ఒక్కొక్కటిగా సంస్కరణలు చేస్తోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అలా చేయడం వల్ల భారత సమాజం కూడా  ‘ఏక భారత్’ దిశగా సమాయత్తమయ్యే అవకాశం ఉంది.
 -     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...