Jul 3, 2019


తండ్రిని మించిన తనయుడు
          
 
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డితో పోల్చితే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన రెడ్డి తండ్రిని మించిపోయారు. పాలనలో, వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో సంచనాలు సృష్టిస్తున్నారు. ఎవరూ ఊహించని రీతిలో, గతంలో ఎవరూ తీసుకోనివిధంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన హామీలకు మించి  డాక్టర్ వైఎస్ నిర్ణయాలు తీసుకున్నారు. అమలు చేశారు. ఇప్పుడు జగన్ కూడా నెల రోజుల్లోనే  అంతకు మించిన నిర్ణయాలు తీసుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

                ప్రభుత్వ పాలనతోపాటు కొన్ని పథకాల వల్ల కొందరు ముఖ్యమంత్రులు చరిత్రలో చిరస్తాయిగా నిలిచిపోతారు. కిలో రెండు రూపాయలకు బియ్యం పథకంలో ఎన్ని మార్పులు చేసినా ఆ క్రెడిట్ ఎన్టీ రామారావుకే దక్కుతుంది. అలాగే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి పథకాలలో ఎన్ని మార్పులు చేసినా, ఎలా అమలు చేసినా వాటిని డాక్టర్ వైఎస్ పథకాలుగానే ప్రజలు గుర్తుంచుకుంటారు. పేద  ప్రజల ఆరోగ్యానికి, బడుగు, బలహీన వర్గాల పిల్లల ఉన్నత చదువులకు డాక్టర్ వైఎస్ ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్ మెంట్ ను ఆయన పెట్టుబడిగా భావించారు. ఆయన ఆశించిన విధంగా ఆ పథకం అద్వితీయమైన ఫలితాలను సాధించింది. పేద, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు ఎంతో ప్రయోజనం చేకూర్చింది. ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పేద కుటుంబాలకు చెందిన ఇంజనీర్లు దేశం నలుమూలలే కాకుండా, విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా స్థిరపడ్డారంటే అది ఆయన చలవే. తండ్రిని మించిన ఆలోచనలతో జగన్ ముందుకు వచ్చారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటూ అతి తక్కువ కాలంలోనే రాజకీయంగా నిలదొక్కుకున్నారు. తండ్రితో పోల్చుకుంటే తక్కువ సమయంలోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే తక్కువ సమయంలోనే ఎక్కువ పోరాటం చేశారు. తండ్రి కంటే ఎక్కువగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మొండిగా ఒక్కడే నిలబడ్డారు. ఘన విజయం సాధించారు.
             అధికారం చేపట్టిన రోజు నుంచే ఎన్నికల హామీ నవరత్నాల అమలుకు జగన్ పూనుకున్నారు. తండ్రి మాదిరిగానే ఆరోగ్యానికి, విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీని అలాగే కొనసాగిస్తూ, విద్య విషయంలో జగన్ మరో అడుగు ముందుకు వేశారు. తండ్రి మాదిరిగానే విద్య కోసం చేసే వ్యయాన్ని పెట్టుబడిగానే భావిస్తున్నారు. విద్యా హక్కు, ఉచిత విద్య అమలులో ఉన్నా పేదరికం, ఆర్థిక, కుటుంబ పరిస్థితుల కారణంగా దేశంలోని తల్లులు తమ పిల్లలను బడికి పంపించలేని పరిస్థితులు ఉన్నాయి. ఏ తల్లి అయినా తమ బిడ్డలు చదువుకోవాలనే అనుకుంటుంది. అయితే దరిద్రం అందుకు అనుకూలించనివ్వదు.  దానిని గమనించిన జగన్ పిల్లలను బడి బాట పట్టించడానికి, వారి భవిష్యత్ కు బంగారు బాట వేయడానికి నవరత్నాలలో అత్యంత ముఖ్యమైన ‘అమ్మ ఒడి’ పథకం ప్రవేశపెట్టనున్నారు. ఈ పథకం వల్ల తమ పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏడాదికి రూ.15వేలు అందుతాయి. అంటే నెలకు రూ.1,250లు. అలా ఒకటవ తరగతి నుంచి  పదవ తరగతి ఇస్తారు. దానిని ఇంటర్ వరకు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇక రాష్ట్రంలోని ప్రతి తల్లి తన బిడ్డ ఆడ పిల్ల అయినా, మగ పిల్లవాడైనా బడికి పంపుతుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో బడికి వెళ్లే పిల్లల సంఖ్య పెరుగుతుంది. మధ్యలో బడి మానివేసే వారి సంఖ్య తగ్గుతుంది. అక్షరాస్యత పెరుగతుంది.  జగన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. అంతేకాకుండా అతి తక్కువ కాలంలోనే అక్రమ కట్టడాలను కూల్చివేయాలన్న నిర్ణయం తీసుకొని, అమలు చేయడం  సాహసోపేతమైన చర్యలకు నిదర్శనం. రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాలు, పొలాలు, వాగులు, కాలవలు, చెరువులు, రోడ్లు, చివరికి స్మశానాలు కూడా ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టారు. వాటిని అన్నిటిని వెంటనే  కూల్చివేయవలసిన అవసరం ఉంది.  పర్యావరణ పరిరక్షణకే కాకుండా, ట్రాఫిక్ కష్టాలను తొలగించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. బడా బాబుల భవనాలే కూల్చివేస్తున్నందున ఇక భవిష్యత్ లో ఎవరూ ఈ విధంగా అక్రమ కట్టడాలు కట్టడానికి పాల్పడరు. ఇది ఓ మంచి పరిణామం. ప్రపంచంలో ఎక్కడ ఏ మంచి మార్పు జరిగినా కొన్ని నష్టాలు తప్పవు. అది సహజం. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. మంచి భవిష్యత్ కు మార్గం ఇది.  ఇటువంటి వాటికి ఎవరో ఒకరు నాంధి పలకాలి. ఇక్కడ అది జగన్ ద్వారా జరుగుతోంది. ఇక ముందు ముందు ఈ యువ సీఎం ఎటువంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూద్ధాం.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...