Jul 6, 2019


పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులు
           
  యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడానికి శ్రీకారం చుట్టారు. ప్రక్షాళన మొదలు పెట్టారు. నిజాయితీ, సమర్థతల ఆధారంగా అధికారులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. అంతే కాకుండా పోలీసుల జీవితాలు, వారి సాదకబాదకాలు తెలుసుకొని వారి కుటుంబాలలో కూడా వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చూడని కోణంలో ఈ ప్రభుత్వం వారికి, వారి కుటుంబానికి మధ్య పెరిగిన దూరాన్ని గమనించింది. ఎండనక, వాననక, రాత్రి పగలు వారు చేసే శ్రమని, వృత్తి పరంగా వారు ఎదుర్కొనే ఇబ్బందులను తెలుసుకుంది. భార్యా పిల్లలతో గడపడానికి అవకాశం లేని వారి విధుల తీరుని  గుర్తించింది.  వారు కూడా కుటుంబంతో నవ్వుతూ బతకాలని వారికి వారాంతపు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. దేశంలో ఎక్కడా ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ రకంగా ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. పోలీసుల జీవన శైలిలో మార్పు రావడం ద్వారా ప్రజలు, బాధితుల పట్ల వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. వారు కుటుంబంతో గడపడం ద్వారా మరింత ఉత్తేజంగా పని చేయడానికి అవకాశం ఉంటుంది.  అదే విధంగా వారు ప్రజలను కూడా నవ్వుతూ పలకరించాలని సూచిస్తోంది. వారి బాధలు సావదానంగా వినాలని  చెబుతోంది. ఆ విధంగా వారి జీవితాలలో మార్పు తీసుకురావడంతోపాటు వారు ప్రజలతో మెలిగే తీరు స్నేహపూర్వకంగా ఉండాలన్నది ప్రభుత్వ  ఆలోచన. ఈ క్రమంలో రాష్ట్రంలోని పోలీస్ శాఖ పని విధానం, వారి వ్యవహర శైలి దేశంలో నెంబర్ వన్ గా ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఆ స్థాయికి రావడానికి కావలసిన స్వేచ్ఛను కూడా ప్రభుత్వ ఆ శాఖకు ఇచ్చింది. ఆ స్వేచ్ఛ ఎంతవరకు అంటే అక్రమాలు, అన్యాయాల్లో ఎమ్మెల్యేల మాట కూడా వినవలసి అవసరంలేదు. అదే సమయంలో దాదాపు రెండు లక్షల మందికి ప్రతినిధిగా ఉండే ఎమ్మెల్యేలకు మిగిలిన విషయాలలో తగిన గౌవరం ఇచ్చి వారితో కలిసి పనిచేయాలి. అక్రమ వ్యవహారాలలో తాను జోక్యం చేసుకోనని సీఎం స్పష్టం చేశారు. పోలీసులు ప్రజల సేవకులు.   బలహీన వర్గాల పట్ల  సానుకూల దృక్పథంతో ఉండాలి. దళితులు, పేదలు, బడుగు వర్గాల పట్ల వారి  పోకడలో మార్చురావాలి. మహిళల హక్కులను కాపాడాలి.  సమాజంలో బలహీనులు, గొంతు ఎత్తలేనివారిని గుర్తించి వారికి సహాయం అందించాలి.  ఇందు కోసం ప్రతి పోలీస్‌స్టేషన్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిబ్బంది కొరతను పరిగణనలోకి తీసుకొని నూతన నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇబ్బందులు, బాధలు, వేధింపులు నిరాశా పూర్వక వాతావరణం నుంచి బాధితులు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు  వస్తారు. ఆప్యాయతతో నవ్వుతూ వారిని ఆహ్వానించి,  వారి ఫిర్యాదులను స్వీకరించాలి. వారి ఇబ్బందులు తెలుసుకొని సమస్యలు అవగాహన చేసుకొని వారికి సేవ చేయాలి. సైబర్ నేరాలను అదుపు చేయడానికి పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇప్పిస్తారు.  ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో అనుసరించే విధానాలను పరిశీలించి వాటిలో ఉత్తమమైనవాటిని ఇక్కడ అనుసరిస్తారు.
 మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తారు.  ఉదయం 10:30 గంటల నుంచి 12:30 గంటల వరకు  ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఫిర్యాదు ఇచ్చినవారికి రశీదు ఇస్తారు. ప్రతి పిర్యాదు ఎప్పటికి పరిష్కరిస్తారో అందులో రాస్తారు. ప్రజలలో విశ్వసనీయత పెంచేవిధంగా పూర్తి పారదర్శకత, బాధ్యతతో వ్యవహరిస్తారు. ఎస్పీ, ఆ పైస్థాయి అధికారులు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీలు చేస్తారు. ఫిర్యాదులను పరిష్కరించినది లేనిది ర్యాండమ్ గా పరిశీలిస్తారు. పోలీస్ వ్యవస్థలోని పూర్తి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచడానికి జిల్లా పోర్టల్ ను ప్రారంభిస్తారు.  అందులో ఎఫ్‌ఐఆర్‌లు, లైసెన్స్‌ లు, అనుమతులు... వంటి వాటినన్నిటిని పోస్ట్ చేస్తారు. పోలీసు అధికారుల పనితీరుపై బాధితులు, ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తారు. అవినీతిని పూర్తిగా నిర్మూలించడంతోపాటు ఎప్పటికప్పుడు పోలీసుల పనితీరుపై ఉన్నతాధికారులు నివేదికలు తెప్పించుకుంటారు. ఆ నివేదికలఆధారంగా వారికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ వ్యవహారం మొత్తం శాస్త్రీయంగా నిర్వహిస్తారు. పోలీస్ వ్యవస్థను ప్రజలకు అత్యంత చేరువ చేసి, సదభిప్రాయం కలిగించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. విశ్వసనీయత, పారదర్శకత, సమస్యల పరిష్కారంలో వేగం, మంచి ప్రభుత్వం, అవినీతి రహితపాలన, సరైన విధానాలు, నంబర్‌ ఒన్‌ పోలీసింగ్‌ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...