v నేత విరామ భృతి ఇవ్వడానికి నిర్ణయం
v 23,353 మందికి రూ.110 కోట్ల రుణ మాఫీ
v గుర్తింపు కార్డులు ఇచ్చిన మొదటి రాష్ట్రం ఏపీ
v 25 వేల మందికి అదనంగా పించన్
v 1,18,622 మందికి గుర్తింపు కార్డులు
v 87,677 మందికి వృద్ధాప్య పెన్షన్
v 55,500 మందికి వడ్డీ సబ్సిడీ
v త్వరలో చేనేత కార్పోరేషన్ ఏర్పాటుచేసే అవకాశం
రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. వ్యవసాయం రంగం తరువాత అత్యధిక మంది ఆధారపడేది చేనేత పరిశ్రమే. దేశంలో 2.5 కోట్ల మంది, రాష్ట్రంలో 11 లక్షల మంది ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. వర్షాకాలంలో గుంటలలో నీరు చేరి వృత్తి కొనసాగించలేని దయనీయ స్థితి వారిది. పనిలేకపోతే తిండి ఉండదు. అప్పులపాలై, ఆ అప్పులు తీర్చలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వర్షాకాలంలో వృత్తి కోల్పోతున్న తమకు నేత విరామ భృతి ఇవ్వాలని చేనేత కార్మికులు ఎంతోకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పరిస్థితిని అర్ధం చేసుకొని వర్షాకాలంలో రెండు నెలల పాటు చేనేత కార్మిక కుటుంబానికి నెలకు రూ.2 వేల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. అక్టోబర్ 5వ తేదీన జరిగిన మంత్రి మండలి సమావేశం ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. దీని వల్ల రాష్ట్రంలో 90,765 చేనేత కుటుంబాలు ప్రయోజనం చేకూరుతుంది. ప్రజాసాధికార సర్వే ప్రకారం రాష్ట్రంలో వారి జనాభా 2,18,029గా వుంది. అదేవిధంగా ఆప్కో(ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్ లూమ్ వీవర్స్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్) వ్యాపారాభివృద్ధికి వీలుగా రూ.150 కోట్ల మార్జిన్ మనీ సహాయం మంజూరుకు ప్రభుత్వం గ్యారంటీగా వుండేందుకు కూడా మంత్రిమండలి అంగీకరించింది. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2014-15 నుండి 2017-18 వరకు 4 ఏళ్లలో చేనేత జౌళి శాఖ ద్వారా వారి సంక్షేమానికి ప్రభుత్వం వివిధ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. చేనేత కార్మికుల రుణ మాఫీ పథకం క్రింద 23,353 మందికి రూ.110 కోట్ల రుణాలు మాఫీ చేసింది. వృద్దాప్య పించను రూ.200 నుండి రూ.1000 కు పెంచింది. ఈ పథకం ద్వారా 25వేల మంది చేనేత కార్మికులకు అదనంగా పించన్ మంజూరు చేశారు. పెన్షన్ పొందేవారి వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు తగ్గించారు. మొత్తం 87,677 మందికి వృద్ధాప్య పెన్షన్ అందజేస్తున్నారు. ఇంకా 10,583 మంది పెన్షన్ మంజూరు చేసే అవకాశం ఉంది. బ్లాక్ లెవల్ చేనేత క్లస్టర్ల క్రింద 33,446 మంది చేనేత కార్మికులు రు.15.80 కోట్ల మేర లబ్ది పొందారు. వడ్డీ సబ్సిడీ/పావలా వడ్డీ పథకం ద్వారా 55,500 మంది చేనేత కార్మికులకు రు.16.86 కోట్ల మేర లబ్ది చేకూరింది. నేత కార్మికుల ఆర్ధిక సహాయ పథకం క్రింద 23,582 మందికి రు.26.62 కోట్లు అందజేశారు. మరమగ్గాల కార్మికులకు 50 శాతం విద్యుత్ సబ్సిడీ పథకం క్రింద 42,592 మంది చేనేత కార్మికులకు రు.17.59 కోట్లు మంజూరు చేశారు. జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ(ఎన్ హెచ్ డీసీ), ఆప్కో నుంచి హ్యంక్ యారన్, డైస్ కెమికల్స్ వంటి ముడి సరకుల కొనుగోలుపై 20 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. ఈ పథకం క్రింద 66,900 మంది చేనేత కార్మికులకు రు.20.08 కోట్లు విడుదల చేశారు. సహకార చేనేత కార్మికుల పొదుపు నిధి క్రింద 18,091 చేనేత కార్మికులు రు.6.38 కోట్ల మేర లబ్ది పొందారు. మైక్రో యూనిట్స్ డెవలప్ మెంట్ అండ్ ఫైనాన్సు ఏజెన్సీ(ఎమ్ యుడిఆర్ ఎ- ముద్ర) పథకం క్రింద 10,209 మంది నేత కార్మికుల కోసం బ్యాంకుల ద్వారా రు.52.27 కోట్లు మంజూరు చేశారు. దేశంలో చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు ఇచ్చిన మొదటి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. సహకార సంఘాల ద్వారా 1,18,622 మందికి, ఇతరులకు 1,44,950 మందికి చేనేత, జౌళి శాఖ కార్డులు అందజేశారు.
చేనేతకు పూర్వ వైభవం తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. చేనేత కులాలు, ఆ వర్గాల యువత, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలోపెట్టుకొని, ప్రభుత్వం చేనేత పైనాన్స్ కార్పోరేషన్ లేక చేనేత ఆర్థిక మండలి ఏర్పాటుచేయాలన్న ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించి విధివిధానాలు రూపొందించడానికి చేనేత, జౌళి శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రత్యేక బడ్జెట్ తో కార్పోరేషన్ ఏర్పాటైతే చేనేత వృత్తి చేసుకోవడానికి ఆర్ధిక సహకారం, వడ్డీలేని రుణాలు, రాయితీతో కూడిన రుణాలు, చేనేత కార్మికుల ఆడపిల్లల వివాహ వంటి కార్యక్రమాలకు నగదు ప్రోత్సాహం, పిల్లల చదువులకు ఆర్ధిక సహకారం, చేనేత బజారులు ఏర్పాటుకు సహకారం, చేనేత పింఛనులు, వ్యాపార విస్తరణ, ఆప్కోకు రివాల్వింగ్ ఫండ్, నేత కార్మికులకు ఆరోగ్య భద్రత, వృత్తి భద్రత, బీమా భద్రత, మరణించిన కార్మికులనికి దహన సంస్కారాలకు కూడా సహాయం అందించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ కార్పోరేషన్ కు ఏడాదికి రూ.1000 కోట్ల వరకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. అయితే రెండు వేల కోట్ల రూపాయలతో చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్, చేనేత కులాల నాయకులు ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 19 చేనేత కులాలు ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో 13 శాతం మంది వారు ఉన్నారు. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నాడే చరకా(చక్రం)ని కనిపెట్టిన శాస్త్రజ్ఞులు వీరు. రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేల్లో ఈ కులాల నుంచి ఒక్కరు కూడా లేరు. చేనేత కులాల మధ్య ఐక్యత లేకపోవడం, నాయకత్వం లోపం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులలో చేనేత కులాలను కలపడానికి వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ తీవ్రంగా కృషి చేస్తోంది. రాష్ట్రంలోని దాదాపు 35 చేనేత సంఘాలను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 45 శాసనసభ నియోజకవర్గాల్లో గెలుపు-ఓటములు నిర్ణయించగల స్థితిలో చేనేత కులాల వారు ఉన్నారు.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914
No comments:
Post a Comment