చేనేత కులాలన్నీ ఏకమవుతున్న వేళ
ఉద్యమిస్తున్న చేనేత కులాలు
చేనేత వర్గాలు రాజకీయంగా బలపడేయత్నాలు
చేనేత వర్గాల యువతకు ప్రాధాన్యం
ఫిబ్రవరి 2న గన్నవరంలో చేనేత కులాల సమావేశం
చేనేత వర్గానికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ, రాజకీయంగా తగిన ప్రాధాన్యత లేదు. రాష్ట్రంలో వ్యవసాయం తరువాత అత్యధిక మంది చేనేత, దాని అనుబంధ రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. రాజకీయంగా బలపడటం కోసం, శాసనసభా స్థానాల్లో తమ వాటా కోసం రాష్ట్రంలోని చేనేత కులాలు ఏకమవుతున్నాయి. దేశంలో తరతరాలుగా చేనేత వృత్తిపైనే జీవించే కులాలు అనేకం ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి పద్మశాలి, దేవాంగ, జాండ్ర, పట్టుసాలి, తొగటవీరక్షత్రియ, స్వకులశాలి, కుర్హీనసెట్టి (కుర్ణి)(నెస్సి), సేనాపతులు, కైకాల, కర్ణభక్తులు,కరికాల భక్తులు, సాధనాసూరులు, బావసార క్షత్రియ, ఖత్రి, నీలి, నీలకంఠి, కోస్టి, ముదలియార్ మొత్తం 18 చేనేత కులాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఇవి అంత్యంత వెనుకబడిన కులాల(ఎంబీసీ) జాబితాలో ఉన్నాయి. జాతీయ స్థాయిలో చేనేత పరిశ్రమ ప్రాధాన్యతను గుర్తించి ప్రతి ఏడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం (నేషనల్ హ్యాండ్‌లూమ్-డే) నిర్వహించాలని 2015లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ రంగానికి చెందిన కులాల నుంచి రాష్ట్ర శాసనసభలో ఒక్కరు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత శాసనసభలో ఆ ఒక్కరు కూడా లేరు. చేనేత కులాల మధ్య ఐక్యత లేకపోవడం, నాయకత్వం లోపమే దీనికి ప్రధాన కారణం. ఇతర కులాలు, రంగాల నుంచి శాసనసభ్యులుగా ఎన్నికవుతున్నారు. మంత్రులు అవుతున్నారు. ఆయా రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అయితే, చేనేత రంగం విషయానికి వచ్చేసరికి రాష్ట్ర జనాభాలో దాదాపు 13 శాతం మంది ఉన్నా, రాజకీయ పార్టీలు వారికి ప్రాధాన్యత ఇవ్వడంలేదు. రాష్ట్రంలోని 175 మంది శాసనసభ్యుల్లో చేనేత కులాల నుంచి ఒక్కరంటే ఒక్కరే కదిరి శాసనసభ్యుడు కందికుంట వెంకట ప్రసాద్ ఉన్నారు. ఈ రంగానికి చెందినవారికి మంత్రి పదవి కూడా ఇవ్వలేదు.
ప్రభుత్వ వద్ద అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 1,77,447 మంది చేనేత కార్మికులు ఉన్నారు. ప్రస్తుతం మూడు లక్షల మంది ప్రత్యక్షంగా, 8 లక్షల మంది పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. దీర్ఘకాలంగా చేనేత కులాలకు చెందిన వారికి మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల వారి సమస్యలను ఇతర కులాలు, వృత్తులకు చెందిన మంత్రులకు చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. వారికి ఈ రంగం పట్ల తగినంత అవగాహన లేకపోవడ వల్ల వీరి సమస్యల పరిష్కారం పట్ల వారు ఆసక్తి చూపించే అవకాశాలు తక్కువ. చేనేత వృత్తికి సంబంధించిన నూలు, సిల్క్, రంగులు, రసాయనాలు ముడిసరుకులు వంటి వాటి ధరలు, చేనేత ఉత్పత్తులు, అమ్మకాలు, ఎగుమతులు, పన్నులు, సబ్జిడీలు, ఇతర సౌకర్యాలు.... వంటి సమస్యలు సమగ్రంగా తెలుసుకోవడానికి వారికి సమయం ఉండదు. ఈ కారణంగా కూడా చేనేత సమస్యలు రోజురోజుకు పేరుకుపోతున్నాయి. ఆ సమస్యల పరిష్కారం దిశగా కూడా అడుగులు పడటంలేదు. అవగాహనా లోపం వల్ల నిజమైన చేనేత కార్మికులకు ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు అందడంలేదు. చేనేత కార్మికులకు ఏడాదికి రూ.24వేలు ఇచ్చే పథకం ఇంట్లో చేనేత మగ్గం ఉన్నవారికే వర్తిస్తుంది.
మగ్గం పట్టే ఇల్లు అద్దెకు తీసుకునే స్తోమతలేని కార్మికులు బయట షెడ్లలో నేత నేస్తారు. జీవితాంతం షెడ్లలోనే నేతనేసే కార్మికులు వేలల్లో ఉన్నారు. వాస్తవానికి ఈ పథకం వారికి వర్తించాలి. ప్రభుత్వానికి, మంత్రులకు, అధికారులకు చేనేత కార్మికుని బతుకు చిత్రం తెలియకపోవడం ఇలా జరుగుతోంది. రాష్ట్రంలోని చేనేత కార్మికుల స్థితిగతులను, వృత్తిపరంగా వారు ఎదుర్కునే సమస్యలను ప్రభుత్వానికి అర్థమయ్యేరీతిలో వివరించవలసి ఉంది. అందుకు చేనేత వర్గాల నుంచి, చేనేత రంగంపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తులు నేతలుగా ఎదగవలసి ఉంది. గతంలో మాచాని సోమప్ప, ప్రగడ కోటయ్య, పుచ్చల సత్యనారాయణ, కుండా రామయ్య, అగిశం వీరప్ప, దామర్ల రమాకాంతరావు, గోలి వీరాంజనేయులు వంటివారు మరణించిన తరువాత ఈ రంగం నుంచి రాజకీయంగా నాయకత్వం లోపం కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. వారు చేనేత కార్మికుల మధ్యే తిరిగేవారు. వారికి చేనేత సమస్యలపై పూర్తి అవగాహన ఉండేది. అందువల్ల వారి హయాంలో ఈ రంగానికి ఎంతో మేలు జరిగింది. ఆ తరువాత ఈ కులాల వారు రాజకీయంగా బలహీనమవడం వల్ల చేనేత రంగానికి తీవ్ర నష్టం జరుగుతూ వస్తోంది. ఈ కులాల వారికి, కార్మికులకు న్యాయం జరగడంలేదు. చేనేత వర్గాల వారు దాదాపు 65 లక్షల మంది, అంటే రాష్ట్ర జనాభాలో 12 శాతం మంది ఉన్నా ఒక్క మంత్రి పదవి కూడా లేదు. చేనేత మంత్రిత్వ శాఖ ఈ వృత్తి గురించి తెలియని, మరో కులం వారు నిర్వహించడం వల్ల వారికి చేనేత సమస్యలపై అవగాహన ఉండదు. నేరుగా చేనేత రంగంతో సంబంధం ఉన్న, చేనేత వృత్తి, ఆ రంగంలోని సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నవారు శాసనసభలో, మంత్రి మండలిలో ఉండవలసిన అవసరం ఉంది. ఆ దిశగా, రాజకీయం లక్ష్యంతో ఉద్యమించాలని చేనేత కులాల వారు నిర్ణయించుకున్నారు. అందరూ ఐక్యంగా ఉండి శాసనసభ్యులను గెలిపించుకోకపోతే పరిస్థితి ఇంకా దిగజారుతుందని గ్రహించారు. ఈ నేపథ్యంలో చేనేత కుల సంఘాల పునరేకీకరణ అవసరాన్ని గుర్తించారు. గతంలో క్రియాశీలకంగా ఉన్న కొన్ని సంఘాలు వివిధ కారణాల వల్ల ప్రస్తుతం యాక్టివ్ గా లేవు. అందువల్ల కూడా ఈ రంగానికి నష్టం జరిగింది. దాదాపు 8 ఏళ్ల క్రితం ఏర్పడిన ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతోంది. ఫెడరేషన్ ని బలోపేతం చేయడంతోపాటు చేనేత వర్గాలు రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అన్ని చేనేత కులాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది.
చేనేత రంగానికి ప్రసిద్ధి చెందిన గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇటీవల ఫెడరేషన్ ఈ 18 కులాలలోని ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో చేనేత వర్గానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల నేతలు, ఆయా కులాల పెద్దలు పాల్గొన్నారు. అందరూ కలసికట్టుగా రాజకీయంగా తమకు రావలసిన వాటాను రాబట్టుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. అయితే, ఇందుకు చేనేత కులాల ఐక్యతతోపాటు యువతను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని, చాలా శ్రమించవలసి ఉందని గుర్తించారు. రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాలని తీర్మానించారు. రాష్ట్రంలోని చేనేత కులాలతోపాటు, చేనేత సంఘాలను కూడా కలుపుకుపోవాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 45 శాసనసభ నియోజకవర్గాల్లో గెలుపుపై ప్రభావం చూపగల స్థాయిలో చేనేత కులాలు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. అంటే, అంత మంది ఎమ్మెల్యేలను నిర్ణయించగల స్థితిలో వారు ఉన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా, నిరంతరం చేనేత వర్గాలు రాజకీయంగా ఎదగడానికి కృషిచేయాలని భావిస్తున్నారు. చేనేత కులాలలో ఐక్యత, బల ప్రదర్శన కోసం రాష్ట్ర స్థాయిలో భారీఎత్తున ‘చేనేత శంఖారావం సభ’ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, ఈ భారీ బహిరంగ సభ ఒకే సారి రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలా? లేక ముందుగా జిల్లాల స్థాయిలో సభలు నిర్వహించి, ఆ తర్వాత ఒకేసారి చేనేత శంఖారావం సభ నిర్వహించాలా? అనే విషయంలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. పలువురు పలురకాల అభిప్రాయాలు చెప్పారు. ఈ విషయమై ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం కృష్ణా జిల్లా గన్నవరంలో చేనేత కులాలకు చెందిన కొంతమంది ముఖ్యులు సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. చేనేత శంఖారావం సభ నిర్వహించాలన్న నిర్ణయానికి వస్తే, సభ నిర్వహించే ప్రదేశం, తేదీ, జనసమీకరణ, జిల్లాల వారీగా బాధ్యతల అప్పగింత... తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914
No comments:
Post a Comment