Jan 14, 2025

పద్మశాలీయుల చరిత్ర

పద్మం అంటే తామర పువ్వు లేదా కమలం అని అర్థం. శాలి అనగా వస్త్రం. తుళు భాషలో సాలీ అంటే సాలెపురుగు. పద్మశాలి అనే పదానికి  విజ్ఞానం అని కూడా అర్థం ఉంది. పురాణాల ప్రకారం,  పద్మశాలీయుల మూలపురుషుడు మృకండ మహర్షి. మృకండ మహర్షి కుమారుడు భక్త మార్కండేయుడు. భక్త మార్కండేయుని కుమారుడే భావనాఋషి స్వామి. ఈ భక్తమార్కండేయుని చరిత్ర మహాభారతం, భాగవత పురాణం, మార్కండేయ పురాణాలలో వివరించారు. పద్మశాలీయుల కులదైవం 'భక్త మార్కండేయుడు' మృత్యువును జయించిన పరమ శివభక్తుడు. శివభక్తుల గురించి తల్చుకోగానే మార్కండేయుడి పేరు వెంటనే స్ఫురిస్తుంది. పిల్లల్లో భగవంతుడి పట్ల విశ్వాసాన్ని, అనుకున్నది సాధించడంలో చూపాల్సిన పట్టుదలని పెంచేందుకు మార్కండేయుడి కథను ఆదర్శంగా చెబుతారు. 'మార్కండేయ పురాణం' ప్రకారం నేటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో యమునా నదీ జన్మస్థానమైన 'యమునోత్రి' వద్ద మృకండ మహర్షి, మరుద్వతి దంపతులకు భక్తమార్కండేయుడు జన్మించాడు.  ఉత్తర కాశీ జిల్లాలోని యమునోత్రి ఆలయానికి వెళ్లే మార్గంలో ‘మార్కండేయ తీర్థం’  అనే పవిత్ర స్థలం ఉంది. మృకండ మహర్షికి సంతానం లేకపోవడంతో, పరమశివుని ప్రార్ధించగా, శివుడు ప్రత్యక్షమై, నిండునూరేళ్ళు జీవించే మూర్ఖుడైన పిల్లవాడు కావాలో, 16 సంవత్సరాలు మాత్రమే జీవించే సకల విద్యాసంపన్నుడు,  గుణవంతుడైన బాలుడు కావాలో కోరుకోమన్నాడు. మృకండ మహర్షి దంపతులు గుణవంతుడైన 16 ఏళ్ళు జీవించే పిల్లవాడే కావాలని కోరుకున్నారు. దీనితో వారికి మార్కండేయుడు జన్మించాడు. చిన్నవయస్సులోనే కుమారుడు దూరమవుతాడనే వేదన మృకండ మహర్షి దంపతులకు మార్కండేయుడు పుట్టినప్పటినుండే మొదలైంది.  మార్కండేయుడు ఙ్ఞాన సముపార్జన కొరకు అరణ్యాలకు వెళ్ళి 16వ ఏట వరకు దీక్షలో ఉన్నాడు. ఆయుష్షు చివరి గడియల్లో     యమధర్మరాజు వచ్చి యమపాశాన్ని మార్కండేయుని మీదకు వదలడంతో భయంతో మార్కండేయుడు శివలింగాన్ని  ఆలింగనం చేసుకున్నాడు.  పరమశివుడు ప్రత్యక్షమై యముని మీద ఆగ్రహించాడు. మార్కండేయుడికి శివుడు ఓ వరం ఇస్తాడు. ‘‘ఎంతకాలం గడిచినా నీకు 16 సంవత్సరాల వయసే ఉంటుంది. సృష్టిలో నువ్వు 'చిరంజీవి' గా వెలుగొందుతావు’’ అని అభయమిచ్చాడు. ఈ ఘట్టం తమిళనాడులోని తిరుక్కడయూర్‌ అనే ప్రాంతంలో జరిగిందని ఓ నమ్మకం. కార్తీక మాసంలో ఈ ఆలయంలో విశేషమైన పూజలు జరుగుతాయి. మార్కండేయుడు అప్పటి నుంచి చిరంజీవిగా ఉండటమే కాకుండా, అష్టాదశ పురాణాలలో ఒకటైన `మార్కండేయ పురాణం‘ని కూడా రాశాడు. హిందూ మతంలోని 18 పురాణాలలో ఇది ఒకటి. 

మార్కండేయుడి భార్య అగ్నిదేవుని పుత్రిక దూమ్రావతి. ఆ దంపతుల  కుమారుడు భావనాఋషి. భావనాఋషి సూర్యభగవానుడి కుమార్తెలైన ప్రసన్నవతి, భద్రావతిలను వివాహం చేసుకున్నాడు. వారికి 101 మంది కుమారులు. ఆ కుమారులు పద్మం నారతో వస్త్రాలను తయారు చేసే వృత్తిని ఎన్నుకొని పద్మశాలీయుల 101 గోత్రాలకు, గోత్ర పురుషులయ్యారు. పద్మశాలీ కులానికి చెందిన పరబ్రహ్మమూర్తి తన కులస్థులను 101 గోత్రాలతో, 8 శాఖలుగా విడదీసి 4 మఠాలు స్థాపించి, వాటికి గురువులను నియమించాడు. ఎటుచూచినా పద్మశాలీయులు ఋషి వంశానికి చెందిన వారు. దైవాంశసంభూతులు. వస్త్ర ఉత్పత్తిని పవిత్రమైన చేతివృత్తిగా చేపట్టి మానవునికి అవసరమైన వస్త్రాలు నేసి,  మానవ నాగరికతకు, సంస్కృతికి బాటలు వేసిన వస్త్ర నిర్మాతలు పద్మశాలీయులు. ఊహాశక్తి, అంచనాశక్తి, క్రియాశక్తి, సాంకేతిక శక్తి, కళాత్మకశక్తి, జ్ఞాపక శక్తి, ఓర్పు, నేర్పు, కూర్పువంటి సద్గుణ సంపన్నులు పద్మశాలీయులు.  పద్మశాలీయులు భృగువంశ బ్రాహ్మణులు. వేద శాఖలో వీరు ఋగ్వేద బ్రాహ్మణులు. పద్మశాలీయుల్లో తొలి నుంచి శాఖాహారులుగా ఉన్నవారు ఉన్నారు. వీరి ఆచార వ్యవహారాల్లో ఆర్య, ద్రవిడ సంస్కృతులు కనిపిస్తాయి. పద్మశాలీయులకు ఉపనయన సంస్కారం, జంధ్య ధారణ ఉంది. మన వ్యవస్థలో ఈ జంధ్య ధారణ సాంప్రదాయం  పద్మశాలీయులు, బ్రాహ్మణులు, వైశ్యులు, విశ్వబ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులు అయిదు కులాలకు మాత్రమే ఉంటుంది. 

ఆధునికంగా పరిశీలిస్తే, పద్మశాలి అనేది భారతదేశంలో ఒక సామాజిక వర్గం. అత్యంత నైపుణ్యంతో  చేనేత వస్త్రాలను తయారు చేసే ఓ గొప్ప వృత్తి వారిది. పురాణాలు కాకుండా, మన దేశంలో పురాతన, ఆధునిక సామాజిక కుల వ్యవస్థలను పరిశీలించినా వృత్తులవారీగా కులాలు ఏర్పడ్డాయి. బ్రాహ్మణులు దైవ కార్యాలతోపాటు విద్యా సంపన్నులుగా ఉండేవారు.  విశ్వబ్రాహ్మణులు విగ్రహాలు, ఆభరణాలు, వడ్రంగం .. వంటి పనులు చేయడంలో  ఎంతో నైపుణ్యత కలిగి ఉంటారు. వారిది కూడా చాలా సునిశితమైన పని. నాయీ బ్రాహ్మణులు మంగలి వృత్తితోపాటు దైవ కార్యాలలో, శుభకార్యాలలో మంగళ వాయిద్యాలు వాయిస్తుంటారు. వైశ్యులు వ్యాపారమే వృత్తిగా జీవిస్తుంటారు. ఏ వృత్తి ప్రత్యేకత దానిదే.   పద్మశాలీయుల చేనేత వృత్తి మహోన్నతమైనది. దేవతల వస్త్రాలతోసహా మానవ జాతి మొత్తానికి అంగ వస్తాలను తయారుచేసే వృత్తి. ప్రపంచ వ్యాప్తంగా చేనేత వృత్తిదారులందరికీ ఈ ఖ్యాతి దక్కుతుంది. ఇది వాస్తవం. అంగా(దేహం)నికి ఆచ్ఛాదన(వస్త్రం)తయారు చేయడం ఒక విశిష్టత అయితే, అత్యంత సన్నని దారాలను పోగుపోగుగా చేతితో నేసి అగ్గిపెట్టెలో అమర్చగల ఆరు గజాల చీరని తయారు చేయడం, ఉంగరంలో దూర్చగల ఏడు మూరల చీరని తయారుచేయడం, దారాలను నేయడంతోపాటు రంగుల దారాలను కావలసిన రీతిలో అమర్చి రామాయణ దృశ్యకావ్యాన్ని కూడా ఒక చీరలో రూపొందించగల నైపుణ్యం మరో విశిష్టత. 

పద్మశాలి కులానికి చెందిన వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతోపాటు ఉత్తరకాశీ జిల్లాలో కూడా ఎక్కువగా ఉన్నారు. మత పరంగా వీరిలో శైవులు, వైష్ణవులు ఉన్నారు. వృత్తులను అనుసరించి కైకాల, కర్ణభక్తులు, సేనాపతులు, తొగట సాలీలుగా విడిపోయారు. గతంలో కేవలం చేనేత వృత్తిలో జీవనం సాగించిన పద్మశాలీయులు ప్రస్తుతం అనేక వృత్తులపై జీవనం గడుపుతున్నారు. భారత రాజ్యాంగం వీరిని ఆర్థికంగా వెనుకబడిన తరగతులుగా పరగణించి ఓబీసీగా వర్గీకరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పద్మశాలీయులు వెనుకబడిన తరగతులు బీసీ-బి విభాగంలో ఉన్నారు.

 పద్మశాలీయుల్లో రాజకీయ అనుభవం కలిగిన తలపండిన పెద్దలు ఏ ఇద్దరోముగ్గురో తప్ప పెద్దగా చెప్పుకోదగిన సమర్ధవంతమైన నాయకులు లేకపోవటం దురదృష్టకరం. ఆ ఉన్నవారు కూడా యువతకు చేయూతనివ్వడంలేదు.  వారిని ప్రోత్సహించడంలేదు.  మనలో శక్తి సామర్ధ్యాలకు, నైపుణ్యానికి కొదవలేదు, కానీ వాటిని సంఘటిత శక్తిగా మలచలేకపోతున్నాం.  అదే పెద్దలోపం. నాయకత్వమనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. అలాగే, ఒక వ్యక్తి రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందడానికి  కొంత కాలంపాటు  జనంతో అన్నివిధాలా మమేకమవ్వాలి. అప్పుడే  నాయకుడిగా ఎదుగుతాడు. మన యువత విద్య, సాంకేతిక రంగాల్లో దూసుకువెళుతున్నారు. దేశవిదేశాల్లో మంచి పేరు సంపాదిస్తున్నారు. రాజకీయంగా మాత్రం మన వాటాను కూడా మనం దక్కించుకోలేకపోతున్నాము. రాజకీయ పరిస్థితులు కూడా అందుకు అనుకూలంగా లేవు. డబ్బు, కుళ్లు, కుటిల రాజకీయాలు ఎక్కువైపోయాయి.   సామాజిక పరిస్థితుల రీత్యా రెండు మూడు కులాల చేతిలోనే రాజకీయ అధికారం ఉంది. ఒకరి తర్వాత ఒకరు వారే రాజకీయ అధికారం చేజిక్కించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో, ఈ రాజకీయ వ్యవస్థలో ఇతర వర్గాలు తట్టుకోవడం కష్టం. అయినా,  మన స్థాయిలో మనం కూడా సంఘటితమై, బలీయంగా ఎదగవలసిన అవసరం ఉంది. ముందుకు వచ్చినవారిని ప్రోత్సహించాలి. మన యువత ఆ దిశగా కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది.

అన్ని ప్రాంతాలలో సామాజికంగా పద్మశాలీయులకు మంచి పేరుంది.  పద్మశాలీయులు శ్రమజీవులని, అత్యంత చైతన్యవంతమైన సామాజిక వర్గం అని, మంచి మేధో సంపత్తి గలవారన్న భావన ఉంది. ఉత్తములని, నమ్మకస్తులని, సౌమ్యులని, గొడవలు పెట్టుకోరని, గొడవలకు రారన్న భావన ఇతర కులాలు, మతాల వారిలో ఉంది. మన వారి వితరణ భావం గురించి మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇలా చెప్పారు. ‘‘నా చిన్నతనంలో నెలకి మూడు నాలుగు సార్లు పద్మశాలి సోదరుల ఇంట్లో తినేవాణ్ణి. వాళ్ళు వుండే ఇంట్లో ముగ్గురు  కూర్చోడానికి స్థలం ఉండేది కాదు. కానీ, నన్ను ఎప్పుడూ ఆకలితో పడుకోనిచ్చేవాళ్ళు కాదు’’ అని చెప్పారు. పద్మశాలీయులు గుణ సంపన్నులు అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?  అందుకే, మనతో అన్ని కులాల వారు, మతాల వారు సఖ్యతగా ఉంటారు. మనకి సహకరిస్తుంటారు.  దీనిని మనం అన్ని అంశాలలో అంటే రాజకీయంగా, విద్య, వ్యాపార పరంగా... ఉపయోగించుకోవాలి. ఎన్నికల్లో మనం గెలిచే అవకాశం ఉన్న  ప్రాంతాలలో కూడా రాజకీయ పార్టీలు మనకు టిక్కెట్లు ఇవ్వడంలేదు. రాజకీయంగా ఆయా పార్టీలకు ఉండే అనుమానాలు వాటికి ఉంటాయి. మనం ఐక్యతతో కలిసికట్టుగా ఉండి, మన బలాన్ని నిరూపించుకోవాలి.  ఆ పార్టీలే పిలిచి మరీ టిక్కెట్ ఇస్తాయి. ఆ స్థాయిలో మనం ఐక్యతను చాటుకోవాలి. 

చేనేత వృత్తికి గతంలో గొప్ప గౌరవం దక్కేది. ఈ వృత్తిపై ఆధారపడిన పద్మశాలీయులకు ఎంతో గౌరవం ఉండేది. ప్రస్తుతం మరమగ్గాలు, మిల్లులు రావడంతో,  చేనేత వస్త్రాలు వాటితో పోటీ పడటం అసాధ్యం అయింది. దీంతో, చాలా మంది ఉపాధి కోల్పోయారు. వేరే పనులు చేయలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినప్పటికీ, చేనేత వస్త్రాలకు ఉన్న విలువ తగ్గలేదు. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా చేనేత వస్త్రాలకు  ప్రత్యేక  గుర్తింపు ఉంది. ఆరోగ్య రీత్యా చేనేత వస్త్రాలు ఉత్తమమైనవిగా తేల్చారు. అందువల్ల చాలా మంది చేనేత వస్త్రాలపట్ల మక్కువ చూపుతున్నారు. అయితే, మిల్లు వస్త్రంతో పోల్చితే, చేనేత వస్త్రాల ధర ఎక్కువ. దాంతో, సంపన్న వర్గాలు మాత్రమే చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తున్నారు. పద్మశాలి కులంలో అత్యంత ప్రతిభావంతులు, నిపుణులకు కొదవలేదు. ఇప్పటికీ చేనేతలో అనేక అద్భుతాలు సృష్టిస్తున్నారు.  మనిషి జీవించినంత కాలం చేనేతకు విలువ ఉంటుంది. చేనేతకు డోకాలేదు. 

ఎక్కడైతే చేనేత రంగం బలహీనపడిందో అక్కడ, ఆయా ప్రాంతాలలో అనువైన  ఇతర లాభసాటి రంగాలవైపు మనవారు మళ్లాలి. ఆయా రంగాల్లో కూడా దూసుకుపోవాలి. విప్లవం అంటే ఇదే. మన వృత్తి, జీవన శైలిలో విప్లవాత్మక మార్పులు రావాలి.  చేనేత రంగం దెబ్బతిన్న తర్వాత  మంగళగిరిలో చేనేత కార్మికులు, వారి పిల్లలు ఇతర రంగాలలో స్థిరపడ్డారు. కొందరు ఉన్నత చదువులు చదివితే, ఎక్కువ మంది గోల్డ్ వర్కర్లుగా స్థిరపడ్డారు. ఆర్థికంగా కాస్త పుంజుకున్నారు.   ఒక్క మంగళగిరిలోనే  పది వేల మంది పద్మశాలీయులు గోల్డ్ వర్కర్లుగా స్థిరపడ్డారు. పద్మశాలి సంఘం తరఫున ఏడాదికి ఒకటి, రెండు సార్లు యువతకు రాజకీయ, వ్యాపార, ఇతర రంగాల్లో ప్రముఖుల చేత శిక్షణా తరగతులు నిర్వహించాలి. ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలి. వివిధ రంగాలలో నిష్ణాతులైన వారిచేత ప్రసంగాలు ఇప్పించాలి. ముఖ్యంగా చదువు, రాజకీయం, వ్యాపారం... వంటి అంశాలలో ఎలా ఎదగాలో నేర్పాలి.  వాస్తవ ప్రపంచంలో తలెత్తే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. వారిలో కొత్త ఆలోచనలు రేకెత్తించాలి. ఉత్సాహం నింపాలి.

                                                                                                            - శిరందాసు నాగార్జున

No comments:

Post a Comment

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...