టీడీపీ పుట్టినప్పటి నుంచి అంటిపెట్టుకుని ఉన్న ధనుంజయ
కళా,సాహితీ రంగాలకు కూడా విస్తరించిన గుత్తికొండ సేవలు
పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించిన కృషీవలుడు ధనుంజయ
మంగళగిరిలో లోకేష్ గెలుపు కోసం గుత్తికొండ విశేష కృషి
చేనేత రంగంలో కార్మికవర్గ నేతగా గుత్తికొండ ధనుంజయ రావు అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఆయన రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీ పుట్టుకతోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ధనుంజయ టీడీపీని వదలలేదు. అదే ఆయన ప్రత్యేక. ఎన్టీఆర్ గారిపై అపార అభిమానం అతనిని పార్టీవైపు మళ్లించింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారంటే ఆపార గౌరవం. ఆయన విధానాలకు బాగా ఆకర్షితులయ్యారు. ఆయన బీసీలకు ఇచ్చే ప్రాధాన్యతకు ధనుంజయ ఆకర్షితులయ్యారు. చంద్రబాబు గారి పరిపాలనాదక్షతకు ముగ్ధులయ్యారు. చంద్రబాబు గారి నాయకత్వంలో చేనేతల సంక్షేమం కోసం కృషి చేస్తూ , బీసీలలో, చేనేత వర్గాల్లో మంచి గుర్తింపుని, గౌరవాన్ని పొందుతున్నారు. పదవుల కోసం ప్రాకులాడే మనిషి కాదు. టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్నారు. అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా చేనేత సమస్యలపై పోరాడటం ఆయన నైజం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేనేత కార్మికులకు పథకాలు రావడానికి కృషి చేశారు.
14 సంవత్సరాల వయసులో చేనేత మగ్గం నేస్తూ.. అప్పుడే పుట్టిన తెలుగుదేశం పార్టీలో చిన్న వయసు అయినప్పటికీ సభ్యత్వం రెండు రూపాయలు కట్టి తీసుకున్నారు. ఎన్టీఆర్ మీద అభిమానంతో ఆయన ఎక్కడ సభలు పెట్టినా అక్కడికి వెళ్లేవారు. మొట్టమొదటిసారిగా మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా 1983లో, 1985లో పోటీ చేసిన డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారికి, 1989లో ఎలయన్స్ లో సిపిఎం అభ్యర్థి సింహాద్రి శివారెడ్డికి, 1994 సిపిఎం అభ్యర్థి నిమ్మగడ్డ రామ్మోహన్ రావు, 1999లో బిజెపి అభ్యర్థి ఎడ్లపాటి రఘునాథ బాబుకి, 2004లో బిజెపి అభ్యర్థి తమ్మిశెట్టి జానకి దేవికి, 2009లో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన మాదల రాజేంద్ర గారికి, 2014లో గంజి చిరంజీవికి, 2019లొ నారా లోకేష్ గారికి ఎన్నికల్లోమద్దతుగా పనిచేశారు. ఇప్పుడు2024 లో కూడ నారా లోకేష్ గారికి అంకితభావంతో పనిచేశారు. 1988లో పట్టణ తెలుగు నాడు చేనేత కార్మిక సంఘం ఉపాధ్యక్షులుగా, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులుగా 1994 వరకు పనిచేశారు. 1995 నుండి పట్టణ తెలుగు నాడు చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శిగా నిరంతరం శ్రమిస్తున్నారు. 2006లో అప్పుడే కొత్తగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర చేనేత విభాగం ఏర్పాటు చేయగా, రాష్ట్ర కార్యవర్గంలో చేనేత విభాగం రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా 2019 వరకు కొనసాగారు. 2022 నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. బీసీలను కూడగట్టడంలో విశేష కృషి చేశారు. బీసీలను పార్టీవైపు మళ్లించడానికి నిరంతరం శ్రమించి బీసీ నేతగా ఎదిగారు.
2006లో మాదాల రాజేంద్ర గారు మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేస్తున్న టైంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న చేనేత ఆరోగ్య బీమా కార్డులు చేనేత కార్మికులకు ఇప్పించటంలో ధనుంజయ కృషి ఎంతో ఉంది. బీమా కోసం కార్మికులు చెల్లించాల్సిన సొమ్ము మొత్తాన్ని రాజేంద్ర గారు చెల్లించారు. దాదాపు 3,000 మంది చేనేత కుటుంబాలకు కార్డులు వరుసగా మూడు సంవత్సరాలు అందజేసి, వారికి అండగా నిలిచారు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ చేనేత విభాగం తరఫున గుత్తికొండ ధనంజయరావు విశేష కృషి చేశారు. ఇది పార్టీకి ఎంతో మేలు చేకూర్చింది. ఇప్పటికీ చేనేత కుటుంబాల్లో మళ్లీ ఆరోగ్య భీమా కార్డులు కావాలని అడుగుతూ ఉంటారు.
అంతేకాకుండా ఒక పక్క పార్టీ కార్యక్రమాల్లో నిరంతరం పనిచేస్తూ, సామాజిక కార్యక్రమాల్లో పద్మశాలి సంఘాల్లో పనిచేస్తూ చేనేత కార్మికులకు అన్ని రకాలుగా అండగా ఉన్నారు. చేనేత ఉద్యమాల్లో ముఖ్యంగా మంగళగిరి చేనేత కార్మికుల వేతనాలు పెంచే విషయంలో చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీతో కలిసి పోరాటం చేయటంలో ముందుంటారు. 2004లో అధికారం కోల్పోయిన తర్వాత ఏర్పడిన నిమ్మల కృష్ణప్ప నేతృత్వం లోని రాష్ట్ర చేనేత విభాగం కమిటీలు ముఖ్య పాత్ర పోషించాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటన చేసి చేనేత సమస్యలపై చంద్రబాబుకు ఒక నివేది అందించారు. అప్పట్లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో చేనేత కార్మికులకు ఇస్తున్న రాయితీలు అక్కడున్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేయడం కోసం చంద్రబాబు గారు, నిమ్మల కిష్టప్ప నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీలో కూడా గుత్తికొండ ధనుంజయరావు ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో పర్యటించిన కమిటీ నివేదిక ఆధారంగానే 2014లో ఏర్పడిన చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం వాటిలో కొన్ని సంక్షేమ పథకాలను, రాయితీలను చేనేత కార్మికులకు అందించింది.
చేనేత కులాల్లో, ముఖ్యంగా పద్మశాలీ కులంలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. దీనికి ముందు అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం జాతీయ ఉపాధ్యక్షులుగా పనిచేశారు. తిరుపతి తిరుచానూరు అఖిలభారత పద్మశాలి అన్న సత్ర కమిటీ సభ్యులుగా పని చేశారు. పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ సభ్యులుగా, మంగళగిరి బ్రాంచ్ ప్రధాన కార్యదర్శిగా, మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం ఉపాధ్యక్షులుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు.
పార్టీ, చేనేత రంగంలోనే కాకుండా కళారంగంతో కూడా ఆయనకు అనుబంధం ఉంది. ఆ రంగంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల కాలంలో మంగళగిరి ప్రాంతంలో సాహితీ కళా రంగాలకు ప్రాధాన్యత కొరబడింది. కళాభిమానులు, సాహితీ అభిమానులు, పెద్దలు మళ్లీ కళాసాహితీ రంగాలకు ప్రాణం పోయాలని తీర్మానం చేసి, గుత్తికొండ ధనుంజయరావుని మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గా ఎన్నుకున్నారు. మూడు సంవత్సరాల క్రితం మంగళగిరి సాహితీ కళా వేదిక ఆవిర్భవించింది. దానికి కన్వీనర్ గా గుత్తికొండ ధనంజయరావు కొనసాగుతున్నారు. ఈ మూడు సంవత్సరాల కాలంలో సాహితీ కళా రంగాల వైభవాన్ని తీసుకురావటంలో ముందున్నారు.
1987 నుంచి 1991 వరకు మంగళగిరి రత్నాల చెరువు ప్రాంతంలో కూలి పనులకు వెళ్లే 14 సంవత్సరాలలోపు పిల్లలకు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వ పథకమైన "అనియత విద్య" ద్వారా ధనుంజయరావు ఎంతోమంది పిల్లలకు విద్యను అందించారు. తరువాత శ్రామిక నగర్లో ఒక అరుణోదయ పబ్లిక్ స్కూల్ స్థాపించి వందలాది మంది పిల్లలకు విద్యాబోధన చేశారు. 2000 సంవత్సరంలో స్థాపించిన అభయ సేవా సమితి ఉపాధ్యక్షులుగా అనేక ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటుకు కృషి చేశారు.
ప్రస్తుతం వివిధ హోదాలలో గుత్తికొండ ధనుంజయరావు అటు పార్టీకి, ఇటు చేనేత, కుల, కళా, సాహితీ సంఘాల తరఫున ప్రజా సేవను కొనసాగిస్తున్నారు.
గుత్తికొండ ధనుంజయరావు నిర్వహించిన, నిర్వహించే పదవులు:
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టిడిపి బీసీ సెల్.
జాతీయ కార్యదర్శి, అఖిల భారత పద్మశాలి సంఘం.
కేంద్ర కమిటీ సభ్యులు, పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్.
ప్రధాన కార్యదర్శి, పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ మంగళగిరి బ్రాంచ్.
ఉపాధ్యక్షులు, మంగళగిరి పట్టణ పద్మశాలియ బహుత్తమ సంఘం.
కన్వీనర్, మంగళగిరి సాహితీ కళావేదిక
మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్
No comments:
Post a Comment