ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు.
ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి....
వాడి భాష మనకి రాదు...
వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు.
మనకి అది "గాడిదగుడ్డు" గా అర్థమైంది.
మనం "రాజమహేంద్రి" అన్నాం...
వాడికి "రాజమండ్రి"లా వినిపించింది.
మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు.
వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి సరిగ్గా అయిదేళ్ల ముందు) తయారు చేశాడు.
చాలా మంది తెల్ల అధికారులు దుబాషీలను పెట్టుకున్నారు. దుబాషీలంటే ద్విభాషీలు. అటుది ఇటు ఇటుది అటు వివరించి చెప్పగలవారు వీరు. కానీ అందరికీ అంత దృశ్యం ఉండేది కాదు. వీళ్లు ముక్కస్యముక్కానువాదం చేసేవారు.
గుడిమెట్ల బంగారయ్య అంటే ..... Temple steps golden father అని..
పత్తికొండ నాగప్ప అంటే cotton mountain cobra father అని
తోటకూర అంటే Garden to come అనీ చిత్ర విచిత్రంగా అను"వధించే" వారు.
అలాంటి సమయంలో తెల్లోడి భాషను తెల్లోడి కన్నా తేటతెల్లంగా నేర్చుకుని, ధారాళంగా మాట్లాడేయడం అంటే మాటలు కాదు. ఇంకా ఇంగ్లండుకు పోయి ఉన్నత విద్య నేర్చుకోవడం వంటివి అలవాటు కాలేదు. అలాంటి రోజుల్లో తెల్లోడే తెల్లబోయేలా ఇంగ్లీషు మాట్లాడే వాడికి బోలెడంత డిమాండ్ ఉండేది.
అలాంటి వాడే మన పావులూరి శంకరనారాయణ శ్రేష్ఠి. సొంతూరు నెల్లూరు. కానీ మద్రాసులో స్థిరపడ్డారు. తండ్రి రామానుజం చెట్టి నుంచి ఇంగ్లీషు నేర్చుకున్నారు. తండ్రిలాగానే దుబాషీ అయ్యారు. తండ్రి గంజాంలో రస్సెల్ అనే తెల్లదొరకు దుబాషీగా పనిచేసేవాడు. ఈయన విజయనగరం మహారాజా, జయపురం మహారాజా, పిఠాపురం, కొచ్చి, నూజివీడు జమీందారీ కుటుంబాల పిల్లలకు ఇంగ్లీషు చదువులు చెప్పారు. ఆ తరువాత మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో లెక్కల మేస్టారుగా పనిచేశారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో పరీక్షాధికారిగా కూడా పనిచేశారు. అంటే తన జీవిత కాలంలో ఆయన తమిళనాడు రాజధాని మద్రాసు, ఒరిస్సాలోని గంజాం, జయపురం, మన రాష్ట్రంలోని విజయనగరం, పిఠాపురం, నూజివీడు, నెల్లూరు, కేరళలోని కొచ్చి లను సందర్శించాడన్న మాట.
రాచబిడ్డలకు చదువులు చెబుతున్నప్పుడే ఆయన వారి సౌలభ్యం కోసం ఇంగ్లీషు పదాలు, వాటి తెలుగు అర్థాల జాబితాను తయారు చేశారు. తరువాత దాన్నే వ్యవస్థీకరించి తెలుగువాడు తయారు చేసిన తొలి ఇంగ్లీషు తెలుగు డిక్షనరీని తయారు చేశారు. అంతే కాదు ... ఆయన తమిళ - ఇంగ్లీషు, ఇంగ్లీషు - తమిళ డిక్షనరీలను కూడా తయారు చేశారు. 1900 ప్రాంతంలో తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ కూడా తయారు చేశారు. తన అవసరం కోసం ఇంగ్లీషు వాడు తయారు చేసినవి కాకుండా మన అవసరం కోసం మనవాడు తయారుచేసిన మొట్టమొదటి డిక్షనరీలు ఇవేనేమో!
ఆయన తయారుచేసిన తెలుగు డిక్షనరీ 1897లో ప్రచురితమైంది. దాని పేరే శంకరనారాయణ డిక్షనరీ. అప్పటి నుంచీ ఇంగ్లీషు నేర్చుకోవాలనుకున్న వారందరికీ శంకరనారాయణ డిక్షనరీయే ఆధారమైంది. అందరికీ ఆధునిక వేదమైంది. ఆయన బతికుండగానే అయిదు ముద్రణలకు నోచుకుంది. ప్రతి ముద్రణకీ కొత్త పదాలు జోడయ్యాయి. ఆయన 1924-25 ప్రాంతంలో చనిపోయారు. ఆ తరువాత 1927 లో గిడుగు సీతాపతి గారు, 1951 లో చిలుకూరి నారాయణ రావు గారు, తరువాత వేదం లక్ష్మీనారాయణ గారు కొత్తకొత్త పదాలను జోడించారు. 1953 లో నారాయణ అయ్యర్ దీనిని పరిష్కరించారు. ఇలా 1897 నుంచి 1953 వరకూ పదకొండు సార్లు పునర్ముద్రణ పొందింది ఈ డిక్షనరీ. కోస్తా జిల్లాల్లో ఇప్పటికీ ఈ డిక్షనరీయే ప్రామాణికం. తరతరాల విద్యార్థులకు ఇది హస్త భూషణంగా నిలిచింది. అనుమానం వస్తే చాలు ఆ పుస్తకం తీస్తారు. అంత ప్రజాదరణ ఉంది ఈ డిక్షనరీకి. 2004 అక్టోబర్లో విజయవాడకు చెందిన విక్టరీ పబ్లిషర్స్ దీన్ని మళ్లీ ముద్రించారు. ఆగస్టు 2005 నాటికి మలి ముద్రణ అవసరమైంది. మళ్లీ 2006, 2007లలో పునర్ముద్రించాల్సి వచ్చింది. ఈ నిఘంటువు ప్రజాదరణకు ఇదే నిదర్శనం.
కోస్తా, తమిళనాడుల్లో ఆంగ్ల భాష నేర్చుకోవడంలో ఆయన పాత్ర అనన్యసామాన్యం. ఆయన పేరుతోనే ఆయన వ్రాసిన డిక్షనరీ పేరొందింది. ఇప్పటికీ శంకరనారాయణ డిక్షనరీ అంటే ప్రామాణికమే. పావులూరి శంకరనారాయణ శ్రేష్ఠి ఇప్పుడు లేరు. ఆయన పోయి దాదాపు తొంభై ఏళ్లు దాటింది. కానీ లక్షలాది మంది విద్యార్థులు ఆంగ్ల పదం విషయంలో అనుమానం రాగానే శంకరనారాయణ డిక్షనరీ చూస్తారు.