Apr 15, 2024

స్ఫూర్తి ప్రదాతలు అంటే ఎవరు?

రజా హుస్సేన్  పుస్తకంపై సమీక్ష

అబ్దుల్ రజా హుస్సేన్ రాసిన ‘స్ఫూర్తి ప్రదాతలు’ పుస్తకం చదివే ముందు స్ఫూర్తి ప్రదాతలు అంటే ఎవరు అని ఆలోచించాను. స్ఫూర్తిగా నిలవడానికి గొప్పగొప్ప వ్యక్తులే కావలసిన అవసరంలేదు. అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి, హిట్లర్ వంటివారితోపాటు అత్యంత సామాన్యమైన వ్యక్తులు కూడా నాకు స్ఫూర్తినిచ్చినవారిలో ఉన్నారు.     ఒక్కసారిగా 50 ఏళ్లు వెనక్కెళ్లాను. పొన్నూరు బస్టాండ్ లో మండుటెండలో ఓ 80 ఏళ్ల వృద్ధుడు బుట్టలో ముంజలు పెట్టుకుని అమ్ముతున్నాడు. మరోపక్క అన్ని అవయవాలు బాగానే ఉన్న ఓ వ్యక్తి అడుక్కుంటున్నాడు. ఆ అడుక్కుతినేవాడు గుర్తులేడుగానీ, ఆ వృద్ధుడు ఇప్పటికీ నా కళ్లలో మెదులుతాడు. ఎన్నో వందసార్లు నాకు గుర్తుకువచ్చాడు. ఆ వయసులో కూడా ఒకరిపై ఆధారపడకుండా కష్టపడి ముంజలు అమ్ముతూ డబ్బు సంపాదించుకుంటున్నాడు. అతని నిజాయితీ, ఒకరిని యాచించకుండా ఆ కష్టపడేతత్వం నాకు బాగా నచ్చాయి. అతను నాకు స్ఫూర్తిగా నిలిచాడు. ఆ తర్వాత కూడా చాలా మంది అలాంటి వ్యక్తులు నాకు స్ఫూర్తిమంతులుగా కనిపించారు. నేను చిన్నప్పుడు ఓ తౌడు కొట్టులో పనిచేశారు. తౌడు కొనుగోలుకు తరచూ రైల్లో చెన్నై వెళ్లేవాడిని. ఆ రైల్లో  ఓ అంథుడు స్కేళ్లు, పెన్నులు వంటివాటిని అమ్మేవాడు. అదే రైల్లో మరోపక్క కొందరు అంథులు పాటలు పాడుతూ అడుక్కునేవారు. స్కేళ్లు, పెన్నులు అమ్మే ఆ అంథుడు నాకు స్ఫూర్తి. వాస్తవానికి అతను అమ్మే వస్తువులు అవసరంలేకపోయినా, నేను వాటిని కొనేవాడిని. అలా నేను కొన్న ఇనప స్కేలు ఇప్పటికీ నా వద్ద ఒకటి ఉంది. అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి వంటివారి పక్కన హిట్లర్ ఏంటని అనుకోవచ్చు. అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి జీవితాలు నాకు స్ఫూర్తి. హిట్లర్ లక్ష్యం కోసం పట్టుదలగా పనిచేయడం నాకు స్ఫూర్తి. అతని లక్ష్యంవేరు. నా లక్ష్యం మాత్రం చదువు.నేను 7వ తరగతి మధ్యలో ఆర్థిక కారణాల వల్ల చదువు మానివేశాను. చాలా పనులు చేసి, చివరికి చేనేత కార్మికుడిగా నేత నేసేవాడిని. దాదాపు 8 ఏళ్ల తర్వాత మెట్రిక్ పరీక్షలు రాయాలనుకున్నాను. ఆ సమయంలోనే హిట్లర్ జీవిత చరిత్ర చదివాను. తన లక్ష్యం చేరుకోవడానికి హిట్లర్  కఠోర దీక్ష, పట్టుదలతో చేసిన ప్రయత్నం నాకు నచ్చింది. అనేక మందితోపాటు హిట్లర్ స్ఫూర్తితో అంతే పట్టుదలతో 7వ తరగతి మధ్యలో ఆపివేసిన నేను  ఓ యజ్ఞంలా రాత్రి పగలు చదివి ఆరు నెలల్లోనే మెట్రిక్ పరీక్షలు రాసి, ఒకేసారి పాసయ్యాను.


 అబ్దుల్ రజా హుస్సేన్ రాసిన ‘స్ఫూర్తి ప్రదాతలు’ విషయానికి వస్తే, ఇందులో 20 మంది ప్రముఖులు, సాధారణ వ్యక్తులు స్ఫూర్తి ప్రదాతలుగా ఎలా నిచిచారో చాలా చక్కగా తదైన శైలిలో వివరించారు. తెలుగులో ఎంఏ చేసి, డిగ్రీ కాలేజీలో తెలుగు అధ్యాపకులుగా, జర్నలిస్టుగా చేసిన అనుభవంతో చక్కటి తెలుగులో, పుస్తకం మొదలుపెడితే ఎక్కడా ఆగకుండా చదివేవిధంగా రాశారు. 

పుట్టుకతోనే చూపులేని ఓ వ్యక్తి ప్రాథమిక విద్య నుంచి పీజీ వరకు ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. ప్రముఖ రచయిత అడవి బాపిరాజు నవలలపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. తాను చదివిన విశ్వవిద్యాలయంలోనే ఆచార్య పీఠాన్ని అలంకరించారు. ఆయనను వేలిపట్టుకుని ఆ స్థాయికి చేరుకునేవరకు నడిపించిన, ఆయన తండ్రి  కూడా స్ఫూర్తిమంతులే. ఢిల్లీ ఐఐటీ విద్యార్థి, అమెరికాలోని ప్రతిష్టాత్మక హూస్టన్ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పూర్తి చేశారు.  ఆ తర్వాత పోస్ట్ డాక్టరేట్ కూడా పూర్తి చేసి, ఆయన చదివిన ఢిల్లీ ఐఐటీలోనే ప్రొఫెసర్ గా చేశారు. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆయన శిష్యులే. అంతటి మహామనిషి ఇప్పుడు ఓ గిరిజన ప్రాంతంలో తలుపు కూడా లేని ఓ పూరి గుడిసెలో ఉంటూ గిరిజనాభివృద్ధికి పాటుపడుతున్నారు. గిరిజన పిల్లలకు చదువు చెబుతున్నారు. ఓ మూడు జతల దుస్తులు, ఓ టవల్, ఓ పాత సైకిల్ మాత్రమే ఆయన ఆస్తి. అంతటి చదువులు చదివి, అంత నిరాడంబరంగా జీవించేవాడే మనీషి.  తెలుగు సాహిత్యంలో  తళుక్కుమన్న మెరుపు తీగె ఆ చేనేత కార్మికుడు. 33 ఏళ్ల తర్వాత కంటిచూపు కోల్పోయారు. 1935-1975 మధ్య మన పరిసరాలలోని జీవితాలను కథలుగా రాసిన ఓ గొప్ప కథకుడు.  అప్పటి ప్రఖ్యాత కథకులు తల్లావఝుల శివశంకర శాస్త్రి, మల్లాది రామకృష్ణ శాస్త్రిలు పూనుకొని ఆయన కథలను అచ్చు వేయించారు. ఆ కథలు, ఆ కథకుడు ఎంత గొప్పవారో మనం అర్థంచేసుకోవచ్చు. 

ఓ రైస్ మిల్లు యజమాని  1944లోనే విద్య విలువ తెలుసుకుని తన స్వగ్రామంలో ఓ విద్యా సంస్థ నెలకొల్పేందేకు రూ.26వేల రూపాయలు ఇచ్చారు. ఆయన పేరుతోనే ఓ స్కూల్ ని ఇప్పటికీ నిర్వహిస్తున్నారు.ఈ పాఠశాలలో చదివిన అనేక మంది దేశవిదేశాలలో ఉన్నత స్థితిలో ఉన్నారు. అదే పాఠశాలలోని ఓ తెలుగు మాస్టార్ పద్య కావ్యాలు రాయడంలో, అవధానాలు చేయడంలో దిట్ట. జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు విశ్వనాథ సత్యనారాయణ, ప్రముఖ కవి డాక్టర్ సి.నారాయణ రెడ్డి ఇద్దరూ ఆయన అవధానాన్ని మెచ్చుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారైతే ఏకంగా ఆ మాస్టార్ కాలికి గండపెండేరం తొడిగారు.


పుట్టుకతోనే అంథుడైన ఓ విజ్ఞని గణిత శాస్త్రాన్ని ఔపోసనపట్టి  గణితావధానంలో దిట్టగా నిలిచారు. అంకెలు ఎలా ఉంటాయో కూడా తెలియని ఆయన గణిత బ్రహ్మగా కీర్తి పొందారు. నాలుగు వేల ఏళ్లకు సరిపడా క్యాలండర్ ని తయారు చేశారు. 

ఆమెకు ఇప్పుడు 110 సంవత్సరాల వయసు. ఆమెకు చదువులేదు. తల్లిదండ్రులు దినసరి కూలీలు.పేదరికంలో జీవించింది.  ఆమె శ్వాస, ధ్యాస, భాష, చివరికి ఆమె ఊపిరి కూడా చెట్లే. పర్యావరణ ప్రేమికురాలిగా కేంద్ర ప్రభుత్వం ఆమెని గుర్తించి ‘పద్మశ్రీ’తో సత్కరించింది. 

సంకల్ప బలం ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని నిరూపించారు  నటుడిగా, చేనేత కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించిన ఓ వ్యక్తి. చేనేత కార్మికుడి నుంచి మాస్టర్ వీవర్ గా ఎదిగాడు. వస్త్రవ్యాపారిగా నాణ్యతకు ప్రధాన్యత ఇస్తూ మంచి పేరు సంపాదించారు. పొట్ట కూటికోసం నేత నేసిన ఆ కార్మికుడు ఇప్పుడు వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. కళాకారుడి నుంచి కళాపోషకుడిగా ఎదిగారు. నటుడు, కార్మికుడు, వ్యాపారవేత్త, సౌమ్యుడు, సహృదయుడు, కళాపోషకుడు..వంటి పార్శాలున్న అరుదైన వ్యక్తి అతను. 

అతనికి కాళ్లు కదలవు, మెడ నిలవదు.చిత్రలేఖనే అతని ఆయుధం. 7వ తరగతి తర్వాత అతనికి కష్టాలు ప్రారంభమయ్యాయి. మొదట కాళ్లు, కీళ్ల నొప్పులు. తర్వాత మెడ నిలవని పరిస్థితి. తండ్రి నింపిన ధైర్యంతో గురువులు, శిక్షణ లేకుండానే చిత్రకారుడిగా ఎదిగారు. ఆమెకు రెండు చేతులూ లేవు. అయినా, అధైర్యపడలేదు. కాలి వేళ్లతోనే పెన్సిల్, కుంచె పట్టుకుని చిత్రాలు గీయడం మొదలుపెట్టింది. చిత్రకళా ప్రపంచంలో ఓ స్థానాన్ని సంపాదించుకుంది. 

కళ కళ కోసం కాదు, సమాజం కోసం అని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు ప్రముఖ చిత్రకారుడు మరొకరు. అబద్ధం ఆడనంటే ఓ బొమ్మ గీసిస్తారు. మందుకొట్టనంటే ఓ బొమ్మ, పొగతాగనంటే ఇంకో బొమ్మ గీసిస్తారు. ఇవన్నీ ఫ్రీగానే ఇస్తారు. అదే ఆయన ప్రత్యేకత. మరో ప్రకృతి ఆరాధకుడు, ప్రకృతి ఉపాధ్యాయుడు. మొక్కలు, పక్షులే అతని ప్రపంచం. వనమూలికా వైద్యం గురించి పుస్తకాలు రాశారు. 

పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడిన తొలి ఉద్యమకారిణి. దోమలను సంహరించే డీడీటీ(Dichloro-Diphenyl-Trichloroethane) మందు వల్ల పర్యావరణానికి జరిగే హాని, మానవాళికి జరిగే నష్టం గురించి ఆమె ప్రపంచానికి చాటిచెప్పారు. వాస్తవ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులతో వచ్చిన ఓ సునామీనే తట్టుకున్న నిజమైన మహిళాభ్యుదయవాది ఓ తల్లి. భర్త మానసినక పరిస్థితి బాగోలేక ఇల్లు వదిలివెళ్లిపోతే, పేదరికం అనుభవిస్తూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కొటూ, ఎంఏ పూర్తి చేసి, డీఎస్సీ రాశారు.ప్రభుత్వ టీచర్ ఉద్యోగం పొందారు. ఇద్దరు పిల్లలను ప్రయోజకులను చేశారు. ఓ సాధారణ పేద మహిళ ధీరవనితగా నిలిచారు.  సంగీత లోకంలో ఓ వేగుచుక్క, ఫిడేలు వాయిద్య పరికరానికి ఓ రూపంగా నిలిచిన మన తెలుగువాడు, మరుగుజ్జు అయినా ఇస్లామిక్ సంస్కృతికి అద్దంపట్టే, ఆకాశాన్ని తాకే ఆలోచనలతో  గొప్ప చిత్రాలను గీసిన మహాచిత్రకారుడు,  91 ఏళ్ల వయసులోనూ పేదల డాక్టర్ గా, మదర్ ఆఫ్ ఇండోర్ గా నిలిచి, పద్మశ్రీ అవార్డు అందుకున్న  గైనకాలజిస్ట్ డాక్టర్, ఇంగ్లీష్ చానల్ ఈది, మెగల్లాన్ సంధిని దాటిన మగధీరుడు, మన మరో తెలుగువాడు... ఇలా వారంతా ఎలా స్ఫూర్తిమంతులుగా నిలిచారో  రజాహుస్సేన్ పాఠకుల్ని ఆకట్టుకునే విధంగా రాసిన తీరు చాలా బాగుంది. తెలుగు భాషా సౌందర్యాన్ని ఒడిసిపట్టిమరీ  ఈ పుస్తకాన్ని రాశారు. చదవడం వచ్చిన అన్ని వయసులవారు చదవదగిన పుస్తకం ఇది. 


పుస్తకం పేరు : స్ఫూర్తి ప్రదాతలు

రచయిత : అబ్దుల్ రజా హుస్సేన్

పుస్తకం ధర : రూ.120

పుస్తకాలు లభించు చోటు:

తిరంగా ముసల్మాన్ ప్రచురణలు

11-5-410, ఫ్లాట్ నెం.402

లిలీ బ్లాక్, నయూముల్ కాసిం అపార్ట్ మెంట్స్

రెడ్ హిల్స్, హైదరాబాద్-50000

                      -శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ -9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...