Aug 29, 2025

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు

తెలుగంటే...గోంగూర

తెలుగంటే...గోదారి

తెలుగంటే...గొబ్బిళ్ళు

తెలుగంటే...గోరింట

తెలుగంటే...గుత్తోంకాయ్

తెలుగంటే...కొత్తావకాయ్

తెలుగంటే....పెరుగన్నం

తెలుగంటే...ప్రేమా, జాలీ, అభిమానం

తెలుగంటే...పోతన్న

తెలుగంటే...బాపు

తెలుగంటే...రమణ

తెలుగంటే...అల్లసాని పెద్దన

తెలుగంటే...తెనాలి రామకృష్ణ

తెలుగంటే...పొట్టి శ్రీరాములు

తెలుగంటే...అల్లూరి సీతారామరాజు

తెలుగంటే...కందుకూరి వీరేశలింగం

తెలుగంటే...గురజాడ

తెలుగంటే...శ్రీ శ్రీ

తెలుగంటే...వేమన

తెలుగంటే...నన్నయ

తెలుగంటే...తిక్కన

తెలుగంటే...ఎఱ్ఱాప్రగడ

తెలుగంటే...గురజాడ

తెలుగంటే...క్షేత్రయ్య

తెలుగంటే...శ్రీనాధ

తెలుగంటే...మొల్ల

తెలుగంటే...కంచర్ల గోపన్న

తెలుగంటే....కాళోజి

తెలుగంటే...కృష్ణమాచార్య

తెలుగంటే...సిద్ధేంద్ర

తెలుగంటే...గౌతమీ పుత్ర శాతకార్ణి

తెలుగంటే...రాణీ రుద్రమదేవి

తెలుగంటే...రాజరాజ నరేంద్రుడు

తెలుగంటే...రామలింగ నాయుడు

తెలుగంటే...తిమ్మనాయుడు

తెలుగంటే...రామదాసు

తెలుగంటే...ఆచార్య నాగార్జున

తెలుగంటే...పోతులూరి వీరబ్రహ్మం

తెలుగంటే...జిడ్డు కృష్ణమూర్తి

తెలుగంటే...వుప్పలూరి గోపాల కృష్ణమూర్తి

తెలుగంటే...సింగేరి శంకరాచార్య

తెలుగంటే...అన్నమాచార్య

తెలుగంటే...త్యాగరాజు

తెలుగంటే...వీర పాండ్య కట్టబొమ్మన

తెలుగంటే...విశ్వేశ్వరయ్య

తెలుగంటే...బాబూ రాజేంద్రప్రసాద్

తెలుగంటే...చిన్నయ్య సూరి

తెలుగంటే...సర్వేపల్లి రాధాకృష్ణన్

తెలుగంటే...పీవీ నరసింహారావు

తెలుగంటే...రాజన్న

తెలుగంటే...సుశీల

తెలుగంటే...ఘంటసాల

తెలుగంటే...రామారావు

తెలుగంటే...అక్కినేని

తెలుగంటే...సూర్యకాంతం

తెలుగంటే...ఎస్.వీ.రంగారావు

తెలుగంటే...అయ్యలరాజు రామభద్రుడు

తెలుగంటే...పండుమిరప

తెలుగంటే...సంక్రాంతి

తెలుగంటే...సరోజిని నాయుడు

తెలుగంటే....భద్రాద్రి రామన్న

తెలుగంటే...తిరుపతి ఎంకన్న

తెలుగంటే...మాగాణి

తెలుగంటే...సాంబ్రాణి

తెలుగంటే...ఆడపిల్ల ఓణి

తెలుగంటే...చీరకట్టు

తెలుగంటే...ముద్దపప్పు

తెలుగంటే...ఓంకారం

తెలుగంటే...యమకారం

తెలుగంటే....మమకారం

తెలుగంటే...సంస్కారం

తెలుగంటే...కొంచెం ఎటకారం

తెలుగంటే...పట్టింపు

తెలుగంటే...తెగింపు

తెలుగంటే....లాలింపు

తెలుగంటే...పింగళి వెంకయ్య

తెలుగంటే...పైడి మర్రి వెంకట సుబ్బారావు

తెలుగంటే....టంగుటూరి ప్రకాశం

తెలుగంటే...చిలకమర్తి లక్ష్మీనరసింహం

తెలుగంటే...భాస్కరుడు

తెలుగంటే...దేవులపల్లి

తెలుగంటే...ధూర్జటి

తెలుగంటే...తిరుపతి శాస్త్రి

తెలుగంటే...గుఱ్ఱం జాషువ

తెలుగంటే...కోరాడ మహాదేవశాస్ట్రీ

తెలుగంటే...కోరాడ రామకృష్ణయ్య

తెలుగంటే...కోరాడ రామచంద్రకవి

తెలుగంటే...కొనకళ్ల వెంకటరత్నం

తెలుగంటే...మల్లన్న

తెలుగంటే...నండూరి

తెలుగంటే...పానుగంటి

తెలుగంటే...రామానుజం

తెలుగంటే...రావి శాస్త్రి

తెలుగంటే...రవి వర్మ

తెలుగంటే...రంగనాధుడు

తెలుగంటే...కృష్ణదేవరాయలు

తెలుగంటే...తిరుపతి వెంకటకవులు

తెలుగంటే...విశ్వనాథ

తెలుగంటే...నన్నే చోడుడు

తెలుగంటే...ఆరుద్ర

తెలుగంటే...ఎంకి

తెలుగంటే...ఆదిభట్ల

తెలుగంటే...గాజుల సత్యనారాయణ

తెలుగంటే...మల్లాది సుబ్బమ్మ

తెలుగంటే...ఆర్యభట్టు

తెలుగంటే...త్యాగయ్య

తెలుగంటే...కేతన

తెలుగంటే...వెంపటి చిన సత్యం

తెలుగంటే...ఉషశ్రీ

తెలుగంటే...జంధ్యాల

తెలుగంటే...ముళ్ళపూడి

తెలుగంటే...మంగళంపల్లి బాలమురళీకృష్ణ

తెలుగంటే...అక్కిరాజు ఉమాకాంతం

తెలుగంటే...తిలక్

తెలుగంటే...అడివి బాపిరాజు

తెలుగంటే...జక్కన

తెలుగంటే...అచ్చమాంబ

తెలుగంటే...దాశరథి

తెలుగంటే...తెలంగాణ,ఆంధ్ర

తెలుగంటే...ముక్కుపుడక 

తెలుగంటే...పంచెకట్టు

తెలుగంటే...ఇంటిముందు ముగ్గు

తెలుగంటే...నుదుటిమీద బొట్టు

తెలుగంటే...తాంబూలం

తెలుగంటే...పులిహోర

తెలుగంటే....సకినాలు

తెలుగంటే....మిర్చి బజ్జి

తెలుగంటే...బందరు లడ్డు

తెలుగంటే....కాకినాడ ఖాజా

తెలుగంటే.....జీడిపాకం

తెలుగంటే...మామిడి తాండ్ర

తెలుగంటే...రాగి ముద్ద

తెలుగంటే...జొన్న రొట్టె

తెలుగంటే...అంబలి

తెలుగంటే...మల్లినాథ సూరి

తెలుగంటే...భవభూతి

తెలుగంటే...ప్రోలయ నాయకుడు

తెలుగంటే...రాళ్ళపల్లి 

తెలుగంటే...కట్టమంచి

తేనెలూరు తెలుగంటే ఆంధ్ర కోనసీమ పంట

తెలుగు నేలంటే రాయలేలిన సీమ రాయలసీమ

తెలుంగు ఆణమంటే తెలంగాణ

తెలుగంటే..... నీవు నేను మనం

Aug 21, 2025

ఎస్‌జేఎఫ్ఐ జాతీయ కమిటీలో ఏపీ నుంచి ఐదుగురికి స్థానం


తిరువనంతపురం: 21 ఆగస్టు 2025: ఏపీ నుంచి సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SJFI) ఉపాధ్యక్షులుగా డాక్టర్ టి.జనార్ధన్, జాతీయ కమిటీ సభ్యులుగా  ఎంవీ రామారావు(విజయవాడ), శిరందాసు నాగార్జున రావు (మంగళగరి), హెచ్.ఆజాద్(అనంతపురం),  ఎం.నరేంద్ర(తిరుపతి) ఎంపికయ్యారు. అధికారికంగా ఏర్పడిన అఖిల భారత సీనియర్ జర్నలిస్ట్స్ సమావేశంలో ఈ డిమాండ్ లేవనెత్తారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురం వేదికగా  ఎస్‌జేఎఫ్ఐ ఆవిర్భవించింది.  ఎస్‌జేఎఫ్ఐ జాతీయ సమావేశంలో దేశ వ్యాప్తంగా ఉన్న సీనియర్ జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలని, ఆరోగ్య బీమా కల్పించాలని, రైల్వే రాయితీలు పునరుద్దరించాలని, జర్నలిస్టులపై దాడులు నివారించాలని..తదితర డిమాండ్లతో తీర్మానాలు చేసింది. 


సీనియర్ జర్నలిస్టులకు కేంద్రం పెన్షన్ ఇవ్వాలి: ఎస్‌జే‌ఎఫ్‌ఐ

తిరువనంతపురం: 21 ఆగస్టు 2025: సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SJFI) రిటైర్డ్ జర్నలిస్టుల కోసం పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కొత్త సమాఖ్య అధికారికంగా ఏర్పడిన అఖిల భారత సీనియర్ జర్నలిస్ట్స్ సమావేశంలో ఈ డిమాండ్ లేవనెత్తారు. సీనియర్ జర్నలిస్టుల కోసం దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ పథకాన్ని అమలు చేయాలని, నిలిపివేసిన రైల్వే ప్రయాణ రాయితీని పునరుద్ధరించాలని కూడా ఈ సమావేశం పిలుపునిచ్చింది.  సందీప్ దీక్షిత్ (ఢిల్లీ) సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎన్‌పి చెక్కుట్టి (కేరళ) సెక్రటరీ జనరల్‌గా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఆనందమ్ పులిపలుపుల (తెలంగాణ), సుహాసిని ప్రభు గోవాంకర్ (గోవా), డాక్టర్ టి.జనార్ధన్ (ఆంధ్రప్రదేశ్), చందర్ ప్రకాష్ భరద్వాజ్ (మధ్యప్రదేశ్), కార్యదర్శులుగా కె.శాంతకుమారి (కర్ణాటక), కన్హు నందా (ఒడిశా), ఆర్. రంగరాజ్ (తమిళనాడు), డాక్టర్ జయపాల్ పరశురాం పాటిల్ (మహారాష్ట్ర), కోశాధికారి కె.పి.విజయకుమార్ (కేరళ) ఎన్నికయ్యారు. అన్ని రాష్ట్రాల నుంచి  జాతీయ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.  ఆంధ్రప్రదేశ్ నుంచి  సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SJFI) ఉపాధ్యక్షులుగా డాక్టర్ టి.జనార్ధన్, జాతీయ కమిటీ సభ్యులుగా  ఎంవీ రామారావు, ఎం.నరేంద్ర, శిరందాసు నాగార్జున రావు, హెచ్.ఆజాద్ ఎంపికయ్యారు. 

ముగింపు వేడుకను గోవా, మిజోరం మాజీ గవర్నర్ అడ్వకేట్ పి.ఎస్. శ్రీధరన్ పిళ్లై ప్రారంభించారు. మాజీ కేంద్ర మంత్రి ప్రొఫెసర్ కె.వి. థామస్, మాజీ మంత్రి పి.కె. కున్హాలికుట్టి, ఎస్.జె.ఎఫ్.ఐ అధ్యక్షుడు సందీప్ దీక్షిత్, ప్రధాన కార్యదర్శి ఎన్.పి. చెక్కుట్టి కూడా సభలో ప్రసంగించారు.  ఈ సమావేశాల్లో పెట్టిన తీర్మానాలు ఇలా ఉన్నాయి. తీర్మానం (1) సీనియర్ జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ పథకాన్ని SJFI డిమాండ్ చేస్తోంది. నేడు భారతదేశం అంతటా సీనియర్ జర్నలిస్టుల పరిస్థితి దుర్బలంగా మరియు అనిశ్చితంగా ఉంది. చాలా రాష్ట్రాల్లో, ఈ వృత్తి నుండి పదవీ విరమణ చేసిన జర్నలిస్టులు వివిధ అనారోగ్యాలు, పరిష్కరించబడని కుటుంబ భారాలు మరియు ఒంటరితనం వంటి అనేక సమస్యల మధ్య తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. సాధారణ ఆదాయం లేకపోవడంతో, రెండు అవసరాలను తీర్చుకోవడం ప్రాథమిక సవాలు. చాలా మంది విషయంలో, స్వీయ మరియు జీవిత భాగస్వామి వైద్య ఖర్చులు భరించలేనంత ఎక్కువగా ఉంటాయి. పిల్లల నుండి మద్దతు ఓదార్పు ఇవ్వడం అంత సులభం కాదు ఎందుకంటే వారికి కూడా వారి కుటుంబ యూనిట్లు ఉన్నాయి. ఈ తీవ్రమైన పరిస్థితిని చాలా అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అందువల్ల, సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ఈ మొదటి జాతీయ సమావేశం, దేశవ్యాప్తంగా అర్హత కలిగిన సీనియర్ జర్నలిస్టులందరినీ కవర్ చేసే జాతీయ పెన్షన్ పథకాన్ని అత్యవసరంగా అమలు చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరుతోంది. 

ప్రస్తుత తరం సీనియర్ జర్నలిస్టులు ఎటువంటి నిర్దిష్ట ఆదాయాన్ని సంపాదించరు కాబట్టి, పెన్షన్ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలి.  భారత ప్రభుత్వం ప్రకటనల ద్వారా మీడియా సంస్థలకు భారీగా మద్దతు ఇస్తుంది, ప్రకటన చెల్లింపులో నిర్దిష్ట శాతాన్ని సంక్షేమ పథకానికి కేటాయించవచ్చు. 

వృత్తి నుండి పదవీ విరమణ చేసిన జర్నలిస్టులకు ప్రతిపాదిత జాతీయ పెన్షన్ పథకాన్ని దోహదపడేలా ప్రభుత్వం జర్నలిస్ట్ సంఘాలతో సంప్రదింపులు జరపాలి. సీనియర్ జర్నలిస్టులు నిర్ణయించి కోరితే తప్ప, ప్రతిపాదిత జాతీయ పెన్షన్ పథకం వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం అమలులో ఉన్న పెన్షన్ పథకాలను భర్తీ చేయకూడదు. జాతీయ పెన్షన్ పథకంపై సంప్రదింపులు ప్రారంభించడానికి ప్రభుత్వం వెంటనే SJFI మరియు వివిధ వర్కింగ్ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి. తీర్మానం (2):  కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS)లో సీనియర్ జర్నలిస్టులను చేర్చాలని SJFI డిమాండ్ చేస్తోంది.దేశంలోని అన్ని వృద్ధుల మాదిరిగానే సీనియర్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న కీలక సవాలు ఆరోగ్యానికి సంబంధించినది. చాలా మంది సీనియర్ జర్నలిస్టులు సాధారణ ఆదాయం లేకపోవడం వల్ల మనుగడను సవాలుగా భావిస్తారు. దానితో పాటు పెరుగుతున్న వైద్య ఖర్చులను తీర్చాల్సిన అవసరం ఉంది. సీనియర్ జర్నలిస్టులకు సరసమైన, అందుబాటులో ఉన్న ఆరోగ్య సంరక్షణ తప్పనిసరి అని SJFI  ఈ మొదటి జాతీయ సమావేశం విశ్వసిస్తోంది. అందువల్ల, దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) కవరేజీని విస్తరించాలని మేము భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఇతర విభాగాలకు సబ్సిడీ ఆరోగ్య బీమా పథకంలో సీనియర్ జర్నలిస్టులను చేర్చాలని ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతోంది. ముఖ్యంగా, కేరళలోని సీనియర్ జర్నలిస్టులను రాష్ట్ర ఉద్యోగుల కోసం MEDICEP పథకంలో చేర్చాలని మేము కేరళ ప్రభుత్వాన్ని కోరుతున్నాము.

తీర్మానం.(3)సీనియర్ సిటిజన్లందరికీ రైళ్లలో రాయితీ ప్రయాణాన్ని పునరుద్ధరించాలని SJFI డిమాండ్ చేస్తోంది. దేశంలో సీనియర్ సిటిజన్లు చాలా కాలంగా రైళ్లలో రాయితీ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. భారత ప్రభుత్వం 2020లో తీసుకున్న నిర్ణయం వృద్ధుల అనవసర ప్రయాణాన్ని పరిమితం చేయడమే. రైల్వేలు రైలులో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు రాయితీని ఉపసంహరించుకుని ఐదు సంవత్సరాలు దాటింది. కోవిడ్ తర్వాత పరిస్థితి చాలా మారిపోయింది మరియు రైల్వేల పనితీరు బాగా మెరుగుపడింది. సీనియర్ సిటిజన్లకు 50% రాయితీ ప్రయాణాన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వానికి ఇది సరైన సమయం అని మేము భావిస్తున్నాము. సీనియర్ సిటిజన్లకు రాయితీ ప్రయాణాన్ని పునరుద్ధరించడంపై మేము వెంటనే నిర్ణయం తీసుకుంటాము.

తీర్మానం(4):  భారతదేశంలో జర్నలిస్టులపై పెరుగుతున్న బెదిరింపులు మరియు బాధితుల పట్ల ఈ సమావేశం తన ఆందోళన మరియు తీవ్ర వేదనను నమోదు చేస్తుంది. అసోం క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ప్రఖ్యాత జర్నలిస్టులు సిద్ధార్థ్ వరదరాజన్ మరియు కరణ్ థాపర్‌లను దేశద్రోహ ఆరోపణలపై సమన్లు ​​జారీ చేసినట్లుగా, చట్ట దుర్వినియోగాన్ని ఇది ఖండిస్తుంది.స్వేచ్ఛాయుతమైన మరియు విమర్శనాత్మక జర్నలిజం ప్రజాస్వామ్యానికి చాలా అవసరమని మరియు బలవంతం ద్వారా నిశ్శబ్దం చేయలేమని ఇది ధృవీకరిస్తుంది. ఈ సమావేశం అనుభవజ్ఞులైన జర్నలిస్టులు మరియు పత్రికా స్వేచ్ఛపై ఇటువంటి దాడులను నిరసిస్తూ వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తుంది.


Aug 19, 2025


నటనలో పట్టున్న గానగంధర్వుడు

ఘనంగా 70వ జన్మదిన వేడుకలు


వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీత్యా ఆయన నటుడు, గాయకుడు.. వెరసి కళలపట్ల మక్కువ ఎక్కువగా ఉన్న వామపక్ష భావజాలం ఉన్న కళాకారుడు. నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడే  ఆయన వేదికనెక్కారు. ఆయనే మంగళగిరి గానగంధర్వుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి పొట్లాబత్తుని లక్ష్మణరావు.

గుంటూరు జిల్లా మంగళగిరికి  చెందిన చేనేత, ప్రజానాట్యమండలి కళాకారుడు, కడలూరి డిటెన్యూ, ప్రముఖ కమ్యూనిస్టు  పొట్లాబత్తుని వెంకటేశ్వరరావు- తల్లి మహాలక్ష్మి దంపతులకు లక్ష్మణరావు 1956 ఆగస్టు 19న  జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. తండ్రి వెంకటేశ్వరరావు కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొని  కడలూరు సెంట్రల్ జైలులో డిటెన్యూగా ఉన్నారు. తండ్రి లక్షణాలే బాల్యం నుంచి లక్ష్మణరావు పుణికిపుచ్చుకున్నారు. వృత్తి, ప్రవృత్తి అన్నీ తండ్రి లక్షణాలే. అయితే, ఈయన స్వయంకృషితో చేనేత కళాకారుడి నుంచి మాస్టర్ వీవర్‌(చేనేత మగ్గాలు నేయించే యజమాని)గా, ఆ తర్వాత చేనేత వస్త్ర వ్యాపారిగా ఎదిగి ఆర్థికంగా స్థిరపడ్డారు. ఆయన సామాజికంగా, ఆర్థికంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఓ గొప్ప మానవతావాది. మంచి స్నేహశీలి. పాత మంగళగిరిలోని జీఆర్(గంజి రామాంజనేయులు) స్కూల్‌లో ప్రాథమిక విద్యతో లక్ష్మణరావు చదువు ముగిసింది.  అక్కడ నుంచి జీవితాన్ని చదవడం మొదలుపెట్టారు. మంగళగిరి మెయిన్ బజారు గుర్రబ్బళ్ల సెంటర్‌లోని  వింజమూరి వెంకటరత్నం చిల్లర కొట్టుతో అతని సంపాదనపర్వం  మొదలైంది. అప్పటి నుంచే మంగళగిరిలోని అన్నివర్గాల ప్రజలతో, పెద్దలతో పరిచయాలు మొదలయ్యాయి. ఆ చిల్లర కొట్లో కొద్దికాలం మాత్రమే పనిచేశారు. 11 ఏళ్లకే చేనేత మగ్గం గుంటలోకి దిగారు. అది మొదలు దాదాపు 30 ఏళ్లు చేనేత కళాకారుడిగా జీవించారు. 1976 మార్చి 5న లక్ష్మణరావు-లక్ష్మిని వివాహం చేసుకున్నారు. 


1988 నుంచి  చేనేత మగ్గాలు నేయించడం ప్రారంభించారు. రెండేళ్లు గడిచింది. ఎదుగుబొదుగులేదు.  1990లో లక్ష్మణరావు అమ్మ మహాలక్ష్మి తండ్రి ఆత్మకూరు గ్రామానికి చెందిన చిట్టెల అంకయ్య  వ్యాపార వృద్ధి కోసం రూ.10వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఆ పెట్టుబడితో వ్యాపారం వృద్ధి చేయడంపై దృష్టిసారించారు. రెండు చేనేత మగ్గాలతో మొదలుపెట్టిన చేనేత వ్యాపారం రెండు నెలల్లో 20 మగ్గాలకు చేరింది. అక్కడి నుంచి మాస్టర్ వీవర్‌గా ఎదుగుతూ వచ్చారు. నేడు 400 మగ్గాలు నేయిస్తున్నారు. మంగళగిరిలో ఆయనకు చేనేత షెడ్లు ఉన్నాయి. సొంత షెడ్లలోని మగ్గాలతోపాటు మంగళగిరి, భట్టిప్రోలు, ఐలవరం, తెనాలి, పెడన, చేబ్రోలు, మచిలీపట్నం వంటి చోట్ల కూడా ఆయన చీరలు నేయిస్తుంటారు. నీతి, నిజాయితీ, నమ్మకం, ఇతరులకు సహాయపడటం వంటి లక్షణాలు ఆయన జీవన శైలిలోనే ఉన్నాయి. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదగడానికి అవి ఆయనకు ఉపయోగపడ్డాయి. చేనేత వస్త్రాల రంగు, నైపుణ్యంగల వస్త్రాల తయారీకి మంగళగిరి ప్రసిద్ధి. దానికితోడు ఆయన స్వయంగా చేనేత కళాకారుడు కావడంతో చేనేత వస్త్రాల తయారీలో రంగులు, డిజైన్ల రూపకల్పనలో ఆధునిక పోకడలుపోతూ మాస్టర్ వీవర్‌గా మంచి గుర్తింపు పొందగలిగారు. 1992లో చేనేత వస్త్రాలయం 

‘లక్మ్షీశారీస్’ని  ప్రారంభించారు. మొదట రిటైల్ వ్యాపారం ప్రారంభించి, తర్వాత హోల్ సేల్ వ్యాపారం కూడా మొదలుపెట్టారు.  కొడుకు శ్రీకాంత్ ఆయనకు అన్ని విధాల చేదోడువాదోడుగా ఉండటంతో వ్యాపారవేత్తగా కూడా లక్ష్మణరావు దూసుకుపోతున్నారు. మంగళగిరిలో ప్రముఖ వ్యాపార సంస్థగా ఎదిగిన    ‘లక్మ్షీశారీస్’కి  రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలలో కూడా మంచి పేరుంది. దాంతో వారి వ్యాపారం రూ.4 కోట్ల టర్నోవర్‌కు చేరింది. అటు చేనేత వృత్తిలో, ఇటు రిటైల్, హోల్ సేల్ వ్యాపారంలో  లక్ష్మణరావు దాదాపు వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తున్నారు. 

వృత్తి రీత్యా చేనేత కళాకారుడైన లక్ష్మణరావు ప్రవృత్తి రీత్యా నటుడు, గాయకుడు, రేడియో కళాకారుడు.  దానికి తోడు తండ్రి వెంకటేశ్వరరావు ప్రముఖ కమ్యూనిస్టు పార్టీ నేత, ఆ ఉద్యమంలో పాల్గొని కడలూరి డిటెన్యూగా జైలుకు కూడా వెళ్లారు.  ఆయన కూడా ప్రజానాట్యమండలి కళాకారుడు. అప్పట్లో మిక్కిలినేని వంటి హేమాహేమీలతో ఆయన నటించారు.  ఆయన వామపక్ష భావజాలం, రంగస్థల నటన లక్ష్మణరావుకు బాగా వంటబట్టాయి. అయితే, తండ్రిని మించిన తనయుడుగా వృత్తి పరంగా, ప్రవృత్తి పరంగా, ఆర్థికంగా ఎదిగారు.  నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడే వేదికనెక్కిన ఘనత లక్ష్మణరావుకు ఉంది. ‘మా భూమి’ నాటకంలో ప్రముఖ సినిమా నటుడు మిక్కిలినేని రాధాకృష్ణ నటించిన పాత్రకు కొడుకుగా 5 నెలల వయసులోనే లక్ష్మణరావుని తండ్రి స్టేజీ ఎక్కించారు. తల్లిదండ్రులు ఎత్తుకుని ఆడించే దృశ్యంలో కనిపించారు. ఆ తర్వాత పదేళ్ల వయసు నుంచి నటించడం మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల ప్రదర్శనలు ఇచ్చారు. ఒక్క ‘భూ భాగోతం’ నృత్య నాటిక ఒక్కటే 500 ప్రదర్శనలు ఇచ్చారు.   గంభీరమైన స్వరంతో భావాన్ని ప్రకటిస్తారు. స్వరంలో మాధుర్యం, గంభీరం రెండూ పలికిస్తారు.  గానం కూడా అంతే మధురంగా, వినసొంపుగా ఆలపిస్తారు. మంచంమీద మనిషి, ఎవరు కారణం?, వెలుగొచ్చింది, ఆంజనేయరెడ్డి చరిత్ర, అడ్రెస్ లేని మనుషులు, శ్రీముఖ వ్యాఘ్రం, కనువిప్పు, తిరుగు టపా, వంద నోటు, క్షీరసాగర మథనం... వంటి అనేక నాటకాలు, నాటికలలో నటించారు.  ఆయన నటించిన ప్రతి నాటిక 40 నుంచి 50 సార్లు ప్రదర్శించారు.  శ్రీముఖ వ్యాఘ్రం నాటికలో సినీనటి అన్నపూర్ణ(ఉమ), లక్ష్మణరావు భార్యాభర్తలుగా నటించారు. 

1979 నుంచి 2012 వరకు రేడియో ఆర్టిస్ట్‌గా అనేక  నాటికలలో నటించారు. పాటలు పాడారు. ముఖ్యంగా నాటక రంగంలో దర్శకత్వం, రచన, నటన.. వంటి విషయాలలో  లక్ష్మణరావుకు  మంగళగిరికి చెందిన అందె నరసింహారావు, కట్టా నాగేశ్వరరావు, కట్టా అంజిబాబు, గట్టెం నరసింహమూర్తి, భాస్కరరావు, కున్నెర్ల బుజ్జి, బొడ్డు విద్యాసాగర్, కొంగతి సాంబశివరావు, గోలి సీతారామయ్య, సందుపట్ల భూపతి... వంటివారు సహకారం అందించారు. 


వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ లక్ష్మణరావుకు  కళలంటే ప్రాణం. పదేళ్ల క్రితం ప్రారంభించిన  విశ్వశాంతి కళాపరిషత్ వ్యవస్థాపక కన్వీనర్ కూడా  అయిన పొట్లాబత్తుని లక్ష్మణరావు నేటి తరానికి సాంస్కృతిక, కళల ఆవశ్యకతను తెలియపరిచేందుకు  తండ్రి కడలూరి డిటెన్యూ, ప్రజాకళాకారుడు, కీర్తిశేషులు పొట్లాబత్తుని వెంకటేశ్వరరావు పేరిట పాత మంగళగిరి బైపాస్ రోడ్డు పక్కన  లక్ష్మీశారీస్ భవనంపైన  దాదాపు పదేళ్ల క్రితం ‘పొట్లాబత్తుని వెంకటేశ్వరరావు కళానిలయం’ను ప్రారంభించారు. కళలు, సాహిత్యం సామాజిక చైతన్యానికి ఉత్తమ సాధనాలుగా ఆయన భావిస్తారు.  కళ కళ కోసం కాదు- కళ ప్రజల కోసం. గానం  కాసు కోసం, కీర్తి కోసం కాకూడదన్నది ఆయన నినాదం, లక్ష్యం. మంగళగిరి నగరంలో సాంస్కృతిక పునర్ వైభవాన్ని చాటేందుకు  ఈ కళానిలయంను   సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు  ఉచితంగా ఇస్తారు. ప్రజా కళాకారుడైన లక్ష్మణరావు నగరంలో జరిగే అన్ని సాంస్కృతిక కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, ఆయా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ యువతను ప్రోత్సహిస్తుంటారు.  మంగళగిరి బుద్ధ విహార్ వ్యవస్థాపక సభ్యులైన లక్ష్మణరావు  కళల ద్వారా సామాజిక చైతన్యం తీసుకువచ్చేందుకు విశేషంగా కృషి చేస్తుంటారు. రాజకీయంగా కూడా లక్ష్మణరావు చురుకుగా వ్యవహరిస్తుంటారు. టీడీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆ పార్టీ ముఖ్య కార్యక్రమాలలో పాల్గొంటుంటారు.  ఆగస్టు 19న లక్ష్మణరావు 70వ జన్మదిన వేడుకలు ఆయన మిత్రులు ఘనంగా నిర్వహించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పొట్లాబత్తుని లక్మణరావు కళాసేవను ఇలాగే కొనసాగిస్తారని ఆశిద్దాం.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914



Aug 7, 2025

చేనేతపై ప్రభుత్వం చల్లని చూపు

నేడు చేనేత దినోత్సవం

జాతీయోద్యమంలో చేనేత రంగం కీలక పాత్ర పోషించింది.  జాతీయ నాయకులు  విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపు ఇవ్వడంతో  1905, ఆగస్టు 7న  కోల్‌కతాలో విదేశీ వస్త్రాలను దగ్ధం చేశారు. ఆ సంఘటన ఉద్యమానికి ఊపు తెచ్చింది. దాంతో  చేనేత చిహ్నమైన రాట్నానికి జాతీయోద్యమ జెండాలో స్థానం కల్పించారు. నూలు వడకడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టారు. మహాత్మా గాంధీ తకిలి అనే కదురు ద్వారా దూదితో నూలు వడుకుతుండేవారు. ఆ విధంగా చేనేత  చిహ్నం జాతీయోద్యమానికి ప్రతీకగా నిలిచింది. విదేశీ వస్త్రాలను తొలిసారి దగ్ధం చేసిన ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవం(నేషనల్ హ్యాండ్‌లూమ్-డే)గా నిర్వహించాలని  కేంద్ర ప్రభుత్వం 2015లో నిర్ణయించింది. అప్పటి  నుంచి జాతీయ స్థాయిలో చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. 


ఆంధ్రప్రదేశ్‌లో  కూటమి ప్రభుత్వం చల్లని చూపు చేనేత రంగంపై పడింది. ఈ ప్రభుత్వం చేనేత వృత్తిని గౌరవించడంతోపాటు చేనేత కార్మికుల చిందించే శ్వేదాన్ని గుర్తించింది. వారికి మద్దతు పలుకుతూ, వారి జీవనాన్ని మెరుగు పరచడం కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. చేనేత కుటుంబాలలో వెలుగు నింపుతోంది. చేనేతకు పూర్వ వైభవం వస్తోంది. చేనేత మగ్గం మోతలు మోగుతాయి. ప్రభుత్వం చేనేతకు ఊతం ఇస్తే,  అది ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది.  ప్రభుత్వ చర్యల వల్ల చేనేత రంగం అభివృద్ధి చెందడంతోపాటు చేనేత కుటుంబాలకు, అలాగే చేనేత అనుబంధ రంగాలలో ఇతరులకూ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.  చేనేత ఉత్పత్తులు పెరిగి, ఎగుమతులు పెరిగి ఈ రంగం కూడా సంపదని సృష్టిస్తుంది. చేనేత కార్మికులకు ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తారు.  ఈ పథకం ప్రకారం చేనేత మగ్గం ఉన్న కుటుంబానికి 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం. మర మగ్గం ఉన్న కుటుంబానికి 500 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం. ఈ ఉచిత విద్యుత్  పథకం కోసం ప్రభుత్వం  రూ.125 కోట్ల వ్యయం భరించనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో  50 వేల చేనేత మగ్గాలు ఉన్న కుటుంబాలు, 15 వేల మర మగ్గాలు ఉన్న కుటుంబాలు లబ్ధి పొందుతాయి. మగ్గానికి ఉచిత విద్యుత్  ఇవ్వడం అంటే చేనేత కార్మికుడి కష్టానికి గౌరవం ఇవ్వడమే.  అలాగే, చేనేత కార్మికులకు ఇచ్చే వీవర్ పెన్షన్‌ని నెలకు రూ.4వేలకు పెంచారు. చేనేత వస్త్రాల అమ్మకంపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న 5 శాతం జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే  భరిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.   చేనేత కార్మికుల కోసం రూ.5 కోట్లతో త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయాలని కూడా సీఎం నిర్ణయించారు. చేనేత కుటుంబాలు ఎక్కువగా ఉన్న మంగళగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎన్నికవడం కూడా చేనేత వర్గాలకు కలిసి వచ్చింది.  మంత్రి నారా లోకేష్  చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.  చేనేతను ప్రపంచస్థాయికి తీసుకెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఈరోజు మంగళగిరి ఆటోనగర్‌లోని వీవర్‌శాలలో జరిగే  జాతీయ చేనేత దినోత్సవంలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. అంటే, ఈ ప్రభుత్వం చేనేతకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. 

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Jul 23, 2025

ఆధునిక హంగులతో ‘బుద్ధునితో నా ప్రయాణం’








రెండున్నర గంటలు ప్రేక్షకులను కట్టిపడేసిన నాటకం


స్టేజీ నాటకానికి  ఆధునిక హంగులు అద్దారు. నాటకంను ప్రదర్శించే తీరులో నూతన పోకడలకు ప్రాధాన్యత ఇచ్చారు.  రికార్డ్ చేసిన నాటకాన్ని  30 మంది కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. భాష, భావం, సంగీతం, నృత్యాలతో బౌద్ధాన్ని స్టేజీపై ఆవిష్కరించారు.  ఎలక్ట్రానిక్ మీడియా ఆవహించిన ఈ రోజుల్లో వందల మంది ప్రేక్షకులను కదలకుండా రెండున్నర గంటలు కట్టిపడేసింది. నాటకాన్ని చూసినవారందరికీ ఓ కొత్త అనుభూతిని కలిగించింది. అదే ‘బుద్ధునితో నా(అంబేద్కర్) ప్రయాణం’ అనే నృత్యరూప నాటకం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన బుద్ధుడు ఆయన ధర్మం పుస్తకం ఆధారంగా ఈ నాటకాన్ని రాశారు. ఆ నాటి సామాజిక పరిస్థితులను, గౌతముడు బుద్ధుడిగా మారిన తీరు, బుద్ధుని బోధనల సారంతో బౌద్ధం-అంబేద్కరిజంని ఆవిష్కరించారు. బౌద్ధానికి, బుద్ధునికి, జీవితానికి సంబంధించిన అనేక ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు లభిస్తాయి. అంబేద్కర్ కలిగిన సందేహాలు ఎలా నివృత్తి అయ్యాయో, మనకి కూడా నివృత్తి అవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జ్ఞనోదయం అవుతుంది.  ఇక ఆచరించడం అనేది మనపైనే ఆధారపడి ఉంటుంది. అతి సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో ఎక్కవ భాగం వాడుక భాషలో ఈ దృశ్యరూపకాన్ని అద్వితీయంగా రూపొందించారు. కొన్ని దృశ్యాలు చాలా ప్రత్యేకంగా ప్రదర్శించారు. వాటిలో  గౌతముడు బుద్ధుడిగా మారిన సన్నివేశం చూపరులను బాగా ఆకట్టుకుంది. వేదికపై ఒకేసారి మూడు సన్నివేశాలు కనిపిస్తాయి. రికార్డ్ చేసిన నాటకం అయినా,  ప్రేక్షకులు గమనించలేనంగా నటీనటులు అందరూ  పెదాల కదలికను ప్రదర్శించారు. రికార్డ్ చేసిన నాటకం అయినందునే నిర్ణయించిన ప్రకారం 2.20 గంటలకు ముగుస్తుంది. 


బుద్ధుడి పాత్రధారి చాలా అందంగా ఉన్నారు. చక్కటి ముఖవర్చస్సు. బుద్ధుడిలోని ఆ శాంతం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత,  నడక,  నమ్రత, స్థిత ప్రజ్ఞత, మరణాన్ని జయించిన తేజస్సు ఆ నటుడిలో మూర్తీభవించింది. ఆయన మాటతీరు, అభినయం అద్వితీయం. నాటకం ఆద్యంతం, స్టేజీపై లైట్లు ఆఫ్ చేసిన సమయంలో కూడా ఆ నటుడి నటన ఒకేతీరుగా ఉండటం ప్రత్యేకం.  అంబేద్కర్ పాత్రధారి కూడా చాలా చక్కగా నటించారు. ఆయన నడవడి, మాటతీరు, సందేహాలు వ్యక్తం చేసే విధానం బాగా ఆకట్టుకున్నాయి.  బుద్ధుడు, అంబేద్కర్ ఇద్దరి వస్త్రధారణ బాగుంది. నాటకం మొత్తాన్ని మోసిన ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు మొత్తం  ఆరుగురు నృత్య కార్మికులు, శ్రామికులు, కళాకారుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారు నాటకం మొత్తం శ్రమించారు. వారు అలుపెరుగకుండా, చెమటలు కక్కుతూ, ప్రేక్షకుల ఆసక్తి తగ్గకుండా నృత్యం చేశారు. కథంగా వారే నడిపారు.  దాదాపు రెండు గంటలు వారు నృత్యం చేయడంతోపాటు వివిధ రకాల పాత్రలు కూడా పోషించడం విశేషం. 

మైనస్ పాయింట్లు

నాటకం ఇతివృత్తం, ప్రదర్శన తీరు ఎంత అద్బుతంగా ఉన్నప్పటికీ క్లైమాక్స్‌లో హిందు మతాన్ని విమర్శించడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. మతం ఏదైనా(ఏదైనా) మత్తు మందులాంటిదే. అందులో సందేహంలేదు. అలాంటప్పుడు ఒక్క హిందు మతాన్నే విమర్శించడం సరైన ఆలోచన కాదని నాకు అనిపించింది. అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్నే ఎందుకు స్వీకరించారు.? అది మరో అంశం. అంబేద్కరిస్టులలో అత్యధిక మంది క్రైస్తవులు లేక ఆ మతానికి చెందిన కుటుంబాల నుంచి వచ్చినవారే. ఇది మరో పెద్ద అంశం. వాటిజోలికి  నేను వెళ్లడంలేదు.  సమాజానికి ఎంతో ఉత్తమమైన, విలువైన సందేశాలను అందించిన, బుద్ధుని బోధనలను అత్యంత ఆసక్తికరంగా చూపించి, వినిపించి, చివరకు  హిందు మతాన్ని విమర్శించిన తీరు అసలు బాగోలేదు. ఉత్తమ బోధనలతో శిఖర స్థాయికి వెళ్లిన ఆలోచనలు చివరి అయిదు నిమిషాలలో ఒక్కసారిగా దిగజారినట్లనిపించింది. ఈ సమాజానికి ఈ నాటకం అవసరం చాలా ఉంది. బౌద్ధం, అంబేద్కర్ భావజాలంతోపాటు ప్రపంచ మానవ జాతికి  కావలసిన అనేక అంశాలను అత్యంత సులువుగా అర్థం చేసుకునే విధంగా నాటకంని ప్రదర్శించారు. అందువల్ల, నాటక రచయిత, ప్రదర్శకులు ఈ విషయాన్ని తప్పక ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇక ముందు ముందు ప్రదర్శనలలో మార్పులు చేస్తే మంచిదని నా అభిప్రాయం.  నాటకంలో భాష 90 శాతం వ్యవహారికమే వాడారు. ఓ పది శాతం మాత్రం గ్రాంథికం వాడారు. దానిని కూడా వ్యవహారికంలోకి మార్చవలసిన అవసరం ఉందనిపించింది.

విజయవాడ మొగల్రాజ్ పురం సిద్దార్థ కాలేజీ ఆడిటోరియంలో జూలై 22 మంగళవారం  రాత్రి  బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్ధ కళాపీఠం, కామ్రేడ్ జీఆర్‌కే - పోలవరపు సాంస్కృతిక సమితి వారి సంయుక్త సహకారంతో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు ఈ నాటకాన్ని ప్రదర్శించారు.  వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా   వందల మంది  నాటకం చూసేందుకు వచ్చారు. వారిలో కమ్యూనిస్టు పార్టీలకు చెందిన వారితోపాటు ప్రగతిశీలవాదులు, ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు.  కదలకుండా కూర్చొని చూశారు. ఓ నాటకం పట్ల ప్రజలు  ఇంతటి ఆసక్తికనపరచడం, వారి ఆలోచనల స్థాయికి తగ్గకుండా నాటకాన్ని ప్రదర్శించడం గమనార్హం.సంతోషం.  

మరో మైనస్ పాయింట్

ముందుగా ప్రకటించిన ప్రకారం నాటకంని ప్రారంభించలేదు. గంట ఆలస్యంగా  నాటకాన్ని మొదలు పెట్టారు. నా దృష్టిలో  ఇది క్షమార్హం కాదు. ఎందుకో వివరిస్తాను.  బుద్ధుడు - అంబేద్కర్ లను  ఉన్నతమైన వ్యక్తులుగా ప్రపంచం గుర్తించింది. తెలుగు నేలపై  సామాజిక, రాజకీయ, తాత్విక కోణాలను స్పృశిస్తూ, వారిద్దరి గురించి, వాళ్ళు సమాజం కోసం పడిన తపన గురించి, సమాజానికి వారు చూపించిన సార్వకాలికమైన సత్యాలను, వారి జీవితాల్లో జరిగిన పలు సంఘటనలను సంగీత, సాహిత్య సమ్మేళనంతో నిండిన గొప్ప కళారూపంగా, అత్యంత ఆధునిక సాంకేతిక, సౌండ్ అండ్ లైటింగ్ విధానాలతో  ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసే విధంగా నాటకంని ప్రదర్శిస్తున్నట్లు రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా  ప్రచారం చేశారు. చేస్తున్నారు. ప్రదర్శిస్తున్నారు. బౌద్ధులు, బౌద్దాభిమానులు, అంబేద్కరిస్టులు, వామపక్ష వాదులు, అభ్యుదయ వాదులు, సామాజిక మార్పును కాంక్షించే  ప్రగతిశీలు అందరినీ ఈ నాటకం పేరుతో కూడకడుతున్నారు. ఇది చాలా మంచి పరిణాం. ఇప్పటికే రెండు రాష్ట్రాలలో మంచి గుర్తింపు పొందారు. దానిని దృష్టిలో పెట్టుకుని దూర ప్రాంతాల నుంచి కార్లు, బస్సులు, టూవీలర్ల పై వందల సంఖ్యలో ప్రేక్షకులు వచ్చారు. సమాజంలో ఓ విప్లవాత్మకమైన మార్పు రావాలన్న దసాశయంతో ఈ నాటకంని ప్రదర్శిస్తున్నారు. అందువల్ల ఒక్క క్షణం కూడా ఆలస్యం జరగకుండా సమయపాలన పాటించవలసిన అవసరం నిర్వాహకులకు ఉంది. 

-శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...