Nov 20, 2024

గ్రామీణ బ్యాంకుల విలీనం


గ్రామీణ బ్యాంకులు మరింత సమర్థవంతంగా పని చేసేందుకు, ఖర్చులను నియంత్రించడం కోసం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) దేశంలోని పలు బ్యాంకులను విలీనం చేస్తోంది. దశలవారీగా ఈ ప్రక్రియని కొనసాగిస్తోంది.  గ్రామీణ బ్యాంకులను కూడా విలీన బ్యాంకుల జాబితాలో చేర్చింది. ఇక ముందు చేపట్టే నాలుగో దశ  గ్రామీణ బ్యాంకుల సంఖ్య 43 నుంచి 28కి తగ్గించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఒకే రాష్ట్రం ఒకే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ) అన్న లక్ష్యంతో   విధివిధానాలను ఆర్బీఐ రూపొందించింది.  నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్)తో కూడా  సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటారు.  ఈ విషయమై తమ తమ అభిప్రాయాలను  ఈ నెల  20లోపల తెలపమని  ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల స్పాన్సర్ బ్యాంకుల అధిపతులను కోరింది.   2020-21 నాటికి మూడు దశల విలీనం ద్వారా  గ్రామీణ బ్యాంకుల సంఖ్య 196 నుండి 43కి తగ్గింది. ఇప్పుడు ఆ సంఖ్య 28కి తగ్గనుంది. 

ఇందులో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న 43 ఆర్ఆర్బీలను  15గా కుదిస్తారు. ఇందులో ఏపీకి చెందిన 4 బ్యాంకులు, యూపీ 3, పశ్చిమ బెంగాల్‌ 3, బీహార్‌, మధ్యప్రదేశ్‌, జమ్మూ, గుజరాత్‌, రాజస్థాన్‌, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన రెండేసి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ విలీన ప్రక్రియ అప్పులు, ఆస్తుల సర్దుబాటుకు లోబడి జరుగుతుంది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం నాబార్డ్‌తో చర్చలు కొనసాగుతున్నాయి.  

ఆర్ఆర్బీ చట్టం-1976 కింద గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తుల వారికి రుణాలు, ఇతర సౌకర్యాలను అందించే లక్ష్యంతో ఈ బ్యాంకులను  ఏర్పాటు చేశారు. ఈ చట్టాన్ని 2015లో సవరించారు. దీని ప్రకారం అటువంటి బ్యాంకులు కేంద్ర, రాష్ట్ర బ్యాంకుల నుండి కాకుండా ఇతర వనరుల నుండి మూలధనాన్ని సేకరించేందుకు అనుమతించారు. ఆర్ఆర్బీలో కేంద్ర ప్రభుత్వ వాటా 50 శాతం, స్పాన్సర్ బ్యాంకు వాటా 35 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 15 శాతం ఉంటుంది. 

ఏపీలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్( కెనరా బ్యాంక్ స్పాన్సర్), చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్( యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), సప్తగిరి గ్రామీణ బ్యాంక్(ఇండయన్ బ్యాంక్), ఆంధ్ర గ్రామీణ వికాస్ బ్యాంక్-ఏపీ విభాగం(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఉన్నాయి. అయితే, ఇక ముందు ఆంధ్ర గ్రామీణ వికాస్ బ్యాంక్ కు స్పాన్సరర్ గా కెనరా బ్యాంకు ఉంటుంది.  ఆర్ఆర్బీ చట్టం-1976 లక్ష్యాలకు అనుగుణంగా ఈ బ్యాంకులు పని చేస్తున్నాయి. ఇవి గ్రామీణ ప్రాంతాలలో అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్జీహెచ్)కు, డ్వాక్రా(డెవలప్‌మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్) సంఘాలకు, చిన్నచిన్న వ్యాపారులకు బాగా ఉపయోగపడుతున్నాయి. జాతీయ బ్యాంకులతో పోల్చుకుంటే ఈ బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ కూడా అధికంగా ఇస్తున్నాయి. ఈ బ్యాంకుల సామర్థ్యాన్ని పెంచితే సహకార రంగానికి బాగా ఉపయోకరంగా ఉంటుంది. ఈ బ్యాంకులు కూడా వాణిజ్య బ్యాంకులతో పోటీపడుతూ డిజిటల్ లావాదేవీలు, ఇతర సౌకర్యాలను మెరుగుపరుస్తున్నాయి.

                                                                 శిరందాసు నాగార్జున - సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...