Oct 6, 2023

చాట్‌ జీపీటీలో సంపూర్ణ కచ్చితత్వం అసాధ్యం

చాట్‌ జీపీటీ ఒక పరిశీలన

చాట్‌ జీపీటీ వల్ల ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గే ప్రమాదంలేదు

ఇప్పుడు ప్రపంచం అంతా చాట్‌ జీపీటీ (చాట్ జనరేటివ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్ ఫార్మర్)పైనే చర్చ జరుగుతోంది. దీనిపై భిన్నకథనాలు వినిపిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతోంది. నేడు ఎంతో మంది చాట్ జీపీటీపైనే ఆధారపడుతున్నారు. ఏఐతో ఎన్నో అద్భు తాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఈ చాట్ బోట్ మనిషి చేసే చాలా పనులను చేస్తుంది. పలు కంపెనీలు ఏఐతో పనులు చేస్తూ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇది అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని,  దీని ఉపయోగం పెరిగేకొద్దీ అదే స్థాయిలో ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుందని అత్యధిక మంది భయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, చాట్‌ జీపీటీ వల్ల ఆశించినంత ప్రయోజనంలేదని, ఈ ఓపెన్‌ ఏఐను స్థాపించిన సంస్థ (అమెరికన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ రీసెర్చ్ లేబరేటరీ) సంక్షోభంలో ఉందని, అది వచ్చే ఏడాదికి దివాళాతీస్తుందని మరికొందరు అంటున్నారు. ఈ రెండు వాదనలు సరైనవి కావు.  ఏఐ వల్ల కొంత ప్రయోజనం ఉన్నమాట నిజమే. అయితే, దాని వల్ల ఉద్యోగాలు భారీ స్థాయిలో కోల్పోయే మాట వాస్తవం కాదు. దీనివల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. అలాగే, నష్టాలు కూడా ఉన్నాయి. 



చాట్‌ జీపీటీ అంటే రెండు ముక్కల్లో తెలుసుకుందాం. ఇది గూగుల్ కు ప్రత్యామ్నాయం, దానిని అభివృద్ధి పరిచినట్లుగా భావించవచ్చు. ఉదాహరణకు మనకు ఏదైనా ఒక అంశానికి సంబంధించిన సమాచారం కావాలంటే గూగుల్ లో సెర్చ్ చేస్తే,  దానికి సంబంధించి వివిధ వెబ్ సైట్లలో ఉండే సమాచారం చూపుతుంది. వాటిలో నుంచి మనకు కావలసిన సమాచారం తీసుకోవాలి. చాట్‌ జీపీటీలో అయితే, మనకు కావలసిన అంశానికి సంబంధించిన సమాచారం గుత్తగా ఒకేచోట లభిస్తుంది. ఉదాహరణకు హైదరాబాద్ లేక అమరావతి అని ఎంటర్ చేస్తే, గూగుల్ లో వాటికి సంబంధించిన చాలా రకాల సమాచారం వస్తుంది. చాట్‌ జీపీటీలో అయితే,హైదరాబాద్ లేక అమరావతి సమాచారం ఒకేచోట లభిస్తుంది. ఆ సౌలభ్యం ఇందులో ఉంది. ఇందులో అపారమైన సమాచారం ఉంటుంది. టెక్స్ట్ రూపంలో ఏ ప్రశ్న అడిగినా టెక్స్ట్ రూపంలో  సమాధానం ఇస్తుంది. అయితే,   ఇందులో ఈ సమాచారం మ్యాజిక్ ద్వారా ఏమీ రాదు. దానిని ఉద్యోగులే సేకరించి, ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుంటారు. అయినా, ఆ సమాచారంలో చాలా లోపాలు ఉంటుంటాయి. ఆ లోపాలను ఉద్యోగులే సరిదిద్దాలి.  అందువల్ల కొన్నిచోట్ల ఉద్యోగాలు పోతే, మరికొన్నిచోట్ల కొత్త ఉద్యోగాలు లభిస్తాయి.  ఇందుకు సంబంధించి పరిశోధనా ఫలితాలను పరిశీలిద్ధాం. అకౌంటింగ్‌ పరీక్షలో చాట్‌ జీపీటీ కంటే విద్యార్థులే మెరుగైన ప్రతిభ కనబరిచారు. విద్యార్థుల సరాసరి స్కోర్ 76.7 శాతం ఉండగా,  చాట్‌ జీపీటీ స్కోర్‌ 47.4 శాతం మాత్రమే ఉంది. అమెరికాలో బ్రింగ్‌హ్యామ్‌ యంగ్‌ యూనివర్సిటీ(బీవైయూ)తోపాటు మరో 186 ఇతర యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు అకౌంటింగ్‌ పరీక్షల్లో చాట్‌జీపీటీ ఎలా పని చేస్తుందో విస్తృత స్థాయిలో పరిశీలించారు. వారు తెలుసుకున్న విషయాలను అకౌంటింగ్‌ ఎడ్యుకేషన్‌ జర్నల్‌లో ప్రచురించారు. చాట్‌ జీపీటీ కంటే విద్యార్థులే తెలివైనవారని తేల్చారు. అయితే 11.3 శాతం ప్రశ్నల విషయంలో చాట్‌ జీపీటీ స్కోర్‌ మెరుగ్గా ఉందని తేలింది. అకౌంటింగ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, ఆడిటింగ్‌లో ఫలితాలు మెరుగ్గా ఉన్నాయి. ట్యాక్స్‌, ఫైనాన్షియల్‌, మేనేజరియల్‌ అసెస్‌మెంట్‌లో  ఫలితాలు అధ్వాన్నంగా ఉన్నాయి. మేథమెటికల్‌ ప్రక్రియల్లో ఇబ్బందులు ఎదురైనట్లు గమనించారు. 

చాట్‌ జీపీటీపై ఓ కేసు విషయంలో ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను పరిశీలిద్ధాం. మానవ మేధస్సును చాట్‌జీపీటీ ప్రభావితం చేయలేదని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ప్రతిభా ఎం సింగ్ వ్యాఖ్యానించారు. చాట్‌జీపీటీ ఆధారంగా కోర్టులు తీర్పులు చెప్పలేవన్నారు. తీర్పు ఇవ్వడానికి, వాస్తవాలు తేల్చడానికి చాట్‌జీపీటీని ప్రాతిపదికగా తీసుకోలేమని స్పష్టం చేశారు. ఇలాంటి చాట్‌బోట్‌ల కచ్చితత్వం, వాటిపై ఎంతవరకు ఆధారపడవచ్చనేది ఇంకా ప్రయోగాల దశలోనే ఉందన్నారు. అందువల్ల అవగాహన కోసం మాత్రం దీనిని ఉపయోగించుకోవచ్చని వివరించారు. చాట్ జీపీటీ డేటా ఊహాజనితమని,ఇందులో కచ్చితత్వం లేదని ఆయన అన్నారు. 

కాగా, చాట్‌ జీపీటీ వేదిక ఓపెన్‌ ఏఐ అతి త్వరలోనే ఆర్థిక సంక్షోభంలోకి జారుకోనుందని అనలిటిక్స్ ఇండియా సర్వే పేర్కొంది.  2024 చివరికి ఆ కంపెనీ దివాలా తీయవచ్చని అనలిటిక్స్‌ ఇండియా మేగజైన్‌ తన నివేదికలో వెల్లడించింది.  ఈ  ఓపెన్‌ ఏఐ సంస్థను  సామ్‌ ఆల్ట్‌మన్‌ 2022 నవంబర్ లో స్థాపించారు. జీపీటీ -3.5, జీపీటీ-4 వాడుకొనేందుకు డబ్బులు వసూలు చేస్తున్నప్పటికీ ఆ సంస్థ సరిపడా ఆదాయం సమకూర్చుకోలేకపోతోంది. ఇప్పట్లో  బ్రేక్‌ ఈవెన్‌ రావడం కష్టమేనని నిపుణులు అంటున్నారు. ఓపెన్‌ ఏఐని నడిపించేందుకు ప్రతి రోజూ 7 లక్షల డాలర్లు (రూ.5.8 కోట్లు) ఖర్చవుతోందని అంచనా. ఆ స్థాయిలో ఆదాయం మాత్రం రావడంలేదు.మొదట్లో దీనిని అత్యధికమంది ఉపయోగించేవారు. క్రమంగా వారి సంఖ్య తగ్గుతోంది. జూన్‌లో 170 కోట్ల మంది  చాట్‌ జీపీటీని ఉపయోగించుకోగా,  జులై నాటికి వారి సంఖ్య 150 కోట్లకు తగ్గింది. అంటే 12 శాతం పడిపోయింది. దాంతో సంస్థ నష్టాల్లో ఉంది. అయితే, 2023 చివరికి  200 మిలియన్‌ డాలర్ల ఆదాయం వస్తుందని ఓపెన్‌ ఏఐ అంచనా వేస్తోంది. 2024 నాటికి బిలియన్‌ డాలర్‌ కంపెనీగా అవతరిస్తుందని పేర్కొంది. వినియోగదారుల సంఖ్యను పెంచుకునేందుకు  ఓపెన్ ఏఐ సంస్థ తాజాగా  చాట్ జీపీటీ-4 అప్ డేట్ వెర్షన్ ను తీసుకొచ్చింది. ఇది దాదాపు మనిషిలాగే పనిచేస్తుందని సంస్థ తెలిపింది.ఈ కొత్త వెర్షన్ మరింత సురక్షితంగా ఉంటుందని ఓపెన్ ఏఐ తన బ్లాగ్‍లో పేర్కొంది. క్లిష్టమైన ప్రశ్నలు, సమస్యలకు కూడా కచ్చితమైన సమాధానాలు ఇస్తుందని ఓపెన్ ఏఐ తెలిపింది. భవిష్యత్ లో ఇమేజ్ ల రూపంలో ప్రశ్నలు అడిగినా సమాధానాలు చెప్పేలా చాట్ జీపీటీ 4ను రూపొందించారు. ఉదాహరణకు ఒక రిఫ్రిజిరేటర్ (ఫ్రిడ్జ్) లోపలి భాగాన్ని ఫొటో తీసి జీపీటీ-4లో అప్ లోడ్ చేస్తే, అందులో ఉన్న పదార్థాలతో ఏయే వంటలు చేయొచ్చు. ఎన్నిరకాల వంటలు, ఎలా చేయొచ్చో వివరిస్తుంది. ఆ వివరాలన్నిటినీ ఉద్యోగులే అప్ లోడ్ చేస్తారు. అయితే, అన్ని సందర్భాలలో కచ్చితత్వం సాధ్యంకాదు. చివరకు ఉద్యోగులే దాని కచ్చితత్వాన్ని పరిశీలించవలసి ఉంటుంది. అందువల్ల చాట్‌ జీపీటీ అభివృద్ధి చెందే క్రమంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ఆయా సంస్థలు ఉద్యోగాల సంఖ్యను భారీగా తగ్గించే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. 

-శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914


In Chat GPT..absolute accuracy is impossible

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...