Jun 9, 2020

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే

 సామాజిక అంశాలు, వ్యక్తిత్వాలు, మానవసంబంధాల సమాహారం


తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమం అత్యున్నత స్థానంలో నిలుస్తుంది. అత్యధిక మంది ఈ కార్యక్రమాన్ని చూడడానికి ఆసక్తి చూపుతారు. దానికి ప్రధాన కారణం సీనియర్ జర్నలిస్ట్ వేమూరి రాధాకృష్ణ, ఆయన ఎన్నుకునే వ్యక్తులు, ఇంటర్వ్యూ నిర్వహించే విధానం, శైలి.  ఈ కార్యక్రమం చరిత్ర, ఉన్నత వ్యక్తుల వ్యక్తిత్వాలు, మానవసంబంధాలు, సామాజిక అంశాలు, తెలుగు నేల నాలు చెరుగుల గల సంప్రదాయాల సమాహారం. రాజకీయం, విద్య, వైద్యం, సినిమా, క్రీడలు, శాస్త్ర, సాంకేతిక ... ఇలా వివిధ రంగాలలో నిష్ణాతులైన మహోన్నత వ్యక్తుల వ్యక్తిత్వాలను ఇందులో ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ వ్యక్తులతోపాటు ట్రాన్స్ జండర్‌, ఇతర రాష్ట్రాల, ఇతర భాషల వారిని  కూడా ఇంటర్వ్యూ చేసి వారి జీవన విధానాన్ని, వారి అంతరంగాన్ని  ఆవిష్కరించారు.  సమకాలీన సమాజంలోని మూడు తరాల వారిని, అలాగే ఒకే కుటుంబంలో మూడు తరాలవారిని కూడా  ఇంటర్వ్యూ చేశారు. బాధ్యతలు తెలిసి, విలువలు కలిగిన ఎంతోమంది మహోన్నత వ్యక్తుల అంతరంగాలను మనకు చాలా దగ్గరగా చూపించారు. స్వాతంత్ర్య పోరాటం, మానవ జీవితంలో వడిదుడుకులు,  సాధారణ స్థాయి నుంచి ఓ వ్యక్తి ఉన్నత శిఖరాలకు అధిరోహించడం, వ్యాపార లావాదేవీలు, వ్యక్తుల ఉద్ధాన పతనాలు, వ్యవసాయం, వ్యాపారం, సినిమా ఒకటేమిటి అన్ని రంగాలలో వచ్చిన, వస్తున్న మార్పులకు ప్రత్యక్ష సాక్షులు మనకి వివరిస్తారు.  
జర్నలిస్టు విలువలను కాపాడుతూ  ప్రతి ఒక్కరిని నొప్పించకుండా ఎంతో గౌరవంగా, స్నేహపూర్వకంగా, ఆప్యాయంగా, సౌమ్యంగా, సన్నిహితంగా తనదైన శైలిలో  ప్రశ్నిస్తూ వారి మనసులను ఆవిష్కరించడం ఆర్కే ప్రత్యేకత.

రాజకీయాలలో కురువృద్ధులు, స్వాతంత్ర్య సమరయోధులు వందేళ్ల యడ్లపాటి వెంకట్రావు, కొండా లక్ష్మణ్ బాపూజీ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు, జయపాల్ రెడ్డి,  జేడీ లక్ష్మీనారాయణ, చెన్నమనేని రాజేశ్వరరావు, కొడుకు రమేష్, సోదరుడు విద్యాసాగర్ రావు, గాలి జనార్ధన రెడ్డి, ఏకె పాల్, డి.శ్రీనివాస్, అసదుద్దీన్ ఓవైసీ, అశోక్ గజపతి రాజు, బొత్స సత్యనారాయణ,  భూమా నాగిరెడ్డి, ఆనం సోదరులు,  భూమన కరుణాకర రెడ్డి, దేవినేని నెహ్రూ, సామాజిక కార్యకర్త సునీత కృష్ణన్, నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు,  అప్పటి న్యూజెర్సీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ చివుకుల ఉపేంద్ర, సినిమా రంగం నుంచి  దగ్గుబాటి రామానాయుడు, కొడుకు సురేష్, మనవడు రానా, అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున, అమల, కృష్ణ, విజయనిర్మల, మహేష్ బాబు, అశ్వనీదత్, బాపయ్య, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, గొల్లపూడి మారుతీరావు, అనంత శ్రీరామ్, అలనాటి నటీమణులు కేఆర్ విజయ, వాణిశ్రీ, గీతాంజలి,  నేటి తరం హీరోలు, హీరోయిన్స్ అనుష్క, కమెడియన్ ఆలీ, డాక్టర్ సమరం, కంచ ఐలయ్య, చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌ రెడ్డి, అపోలో ఆస్పత్రుల వ్యవస్థాపకుడు డాక్టర్‌ ప్రతాప్‌ సి.రెడ్డి, హైదరాబాద్ యూనివర్శిటీ వీసీ అప్పారావు, ఏసీబీ డీజీ ప్రసాద రావు, మాజీ డీజీపీ అరవిందరావు, ఇన్ఫోటెక్‌ వ్యవస్థాపక చైర్మన్‌ బివిఆర్‌ మోహన్‌ రెడ్డి,  శాంతా బయోటెక్ కె.ఐ. వరప్రసాద్‌ రెడ్డి, మైహోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్‌రావు, బిజినెస్‌ స్టాండర్డ్‌ ఎడిటర్‌ సంజయ్‌ బారు,  విజ్ఞాన్ రత్తయ్య, హోమియోపతి వైద్యులు పావులూరి కృష్ట చౌదరి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ, యండమూరి వీరేంద్రనాథ్, నేరెళ్ల వేణుమాధవ్, శోభానాయుడు, వీరంగంశ్యామల, వంగపండు ప్రసాద రావు,  డాక్టర్ గురవారెడ్డి .. ఇలా వివిధ రంగాలలో నిష్ణాతులైన వారిని ఇంటర్వ్యూ చేశారు.

ఉస్మానియాలో హానరీ పోస్టులో నెలకు రూపాయి జీతానికి పని చేసిన నిమ్స్ కు డైరెక్టర్ (డాక్టర్ కాకర్ల సుబ్బారావు) కావడం, అమెరికాలో ఎన్టీఆర్ కు పరేషన్ చేసినవారందరూ ఇండియన్సే, మరో జన్మంటూ ఉంటే ఐపీఎస్‌గానే పుడతా(ఏకే మహంతి), తండ్రీ కొడుకులు ఐపీఎస్ లే, సైన్స్‌ లాంటివి ఇంగ్లీషులో చెప్పి,సోషల్‌ లాంటివి తెలుగులో చెప్పాలి(అరవింద్ రావు), సిద్ధాంతాలను నిజంగా నమ్మితే వాళ్లను ఏ పరిస్థితులూ చెడగొట్టవు- ఎన్టీఆర్‌ సుప్రీం. చిరంజీవి మీద చాలా ప్రభావాలున్నాయి(డాక్టర్ మిత్రా),

తెలుగు మాట్లాడలేకపోవడం పెద్ద లోపం. తెలుగు నేర్చుకోవడం కోసం ఒక ట్యూటర్‌ను పెట్టుకున్నాను(అసదుద్దీన్ ఓవైసీ), ప్రపంచ బ్యాంకు నుంచి అత్యంత ఎక్కువ అప్పు తీసుకున్న దేశం అమెరికాయే(2013), శృంగారం చూపించకుండా ఏ కళా లేదు(స్వాతీ సోమనాథ్), నవ్వించడం ఒక భోగం,నవ్వడం ఒక యోగం,నవ్వలేకపోవడం ఒక రోగం. చాలామంది డాక్టర్లు ఆ రోగం తెచ్చిపెట్టుకుంటారు(డాక్టర్ గురవారెడ్డి), గ్రంథి మల్లికార్జున రావు.

 కార్యక్రమ ప్రాధాన్యత, ఆర్కే ప్రశ్నించే తీరు, ఆయా వ్యక్తుల నిజాయితీ వల్ల గానీ 90 శాతానికిపైగా వ్యక్తులు తమ అంతరంగాలను ఆవిష్కరించారు. మనసులోని భావాలను బాహాటంగా, ధైర్యంగా, స్పష్టంగా చెప్పారు. మనసు విప్పి నిజాయితీగా మాట్లాడారు. బహిరంగంగా చెప్పదగినవి, చెప్పకూడానివి కూడా చెప్పారు. అయితే  లక్ష్మీ పార్వతి, మంచు లక్ష్మి మాత్రం చాలా కృత్రిమంగా, నాటకీయంగా మాట్లాడినట్లనిపించింది.  

 భవిష్యత్‌లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అంశం తీసుకొని విశ్వవిద్యాలయాలలో ఎంఫిల్, పీహెచ్‌డీ చేస్తారు. జర్నలిజం, చరిత్ర, ఎలక్ట్రానిక్ మీడియా ... తదితర విభాగాలలో పరిశోధన చేయడానికి అవకాశం ఉంది. వివిధ రంగాలలో నిష్ణాతులైన మహోన్నత వ్యక్తుల  ఇంటర్వ్యూలన్నిటినీ భవిష్యత్ తరాల కోసం విశ్వవిద్యాలయాలు నిక్షిప్తం చేయవలసిన అవసరం ఉంది. అమెరికా, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో అరుదుగా దొరికే  ఇటువంటి వాటిని విశ్వవిద్యాలయాలు బాధ్యత తీసుకొని భద్రపరుస్తాయి. ఆ విధంగా మన దేశంలో కూడా చేస్తారని ఆశిద్ధాం.

-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

 

No comments:

Post a Comment

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...