‘ఎదురీత’ పుస్తకంపై సమీక్ష
తెలుగు సాహితీ ప్రపంచంలోకి పదునైన కలంతో, ఆధునిక భావాలతో, అభ్యుదయ కవిత్వంతో దూకుడుగా దూసుకు వచ్చారు గోలి మధు. ఏ సమస్య చెప్పినా క్షణంలో ఆ సమస్యపై సాధారణ పదాలతో, అందరికీ అర్థమయ్యే రీతిలో అద్భుతమైన కవిత రాయగల దిట్ట మధు. స్పష్టమైన దృక్పథంతో ఆయన కవితలు రాస్తారు. ప్రగతిశీల కవిత్వం రాస్తూ తెలుగు సాహిత్యంలో మధు అభ్యుదయ కవిగా మంచి పేరు సాధించారు. మధు ఓ చైతన్యం, ఓ మెరుపు, ఓ ఎరుపు. ఇంతకు ముందు మధు భారతీయ ధర్మ విశ్లేషణ, నవశకం, రైతు సమరభేరి, గమనం, సంఘర్షణ అనే అయిదు కవితా సంపుటిలను అందించారు. మధు ఆరవ కవితా సంపుటి ‘ఎదురీత’ను ఈ నెల(అక్టోబరు) 12న మంగళగిరి సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు ఆవిష్కరించారు. మధు కవిత్వం నచ్చి, ముచ్చటపడి ఈ సంపుటి ముద్రణా దాతగా నన్నపనేని నాగేశ్వరరావు ముందుకు వచ్చారు. మధు చేసేది ప్రభుత్వ ఉద్యోగం అయినా, ప్రభుత్వాలపై తిరుగుబాటు కవిత్వం రాయగల ధైర్యవంతుడు. ప్రభుత్వాలేకాదు, సమాజంలోని రుగ్మతలన్నిటిపై సూటిగా, ఎంతో అందంగా కవితలు రాస్తారు. మనిషిగా ఎంత ఒదిగి ఉన్నా, కవిగా మాత్రం దేనికీ నెరవరు, తగ్గరు. తలెత్తుకుని మరీ కవిత్వం రాస్తారు. తన కవిత్వం మొత్తం ప్రతిబింబించే విధంగా ఈ సంకలనానికి ‘ఎదురీత’ అని అర్థవంతమైన శీర్షిక పెట్టారు. ఆయన ధోరణి ఈ కవితా సంకలనంలో స్పష్టంగా అర్థమవుతుంది. సమాజం పట్ల, తను రాయవలసిన కవిత్వం పట్ల స్పష్టమైన అవగాహన ఉన్న కవి . ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమానికి బాసటగా ‘రైతు సమరభేరి’ కవితా సంపుటి తీసుకువచ్చారు. మధు కవిత్వం ఎంత మక్కువతో రాస్తారో, ఉద్యోగం కూడా అంతే నిజాయితీ, నిబద్ధత, అంకితభావంతో చేస్తారు. ఈ కవితా సంపుటిలోని 55 కవితలలో వివిధ విభిన్న పార్శ్వాలను స్పర్శించారు. ఇందులోని ప్రతి కవితలో భాష, భావం, శబ్దం, ప్రేమ, ఆత్మీయత, సామాజిక స్పృహ, ఆవేశం, ఉద్రేకంతో కూడిన ఓ కొత్తదనాన్ని పాఠకులకు అందించాలనే తపన ఆయనలో కనిపించింది. ఈ కవితలను చదవడం మొదలుపెడితే, చివరి వరకు పుస్తకం మూయలేరు. పాఠకులను అంతగా కట్టిపడేశాలా ఈ కవితలు ఉన్నాయి. సమాజం పట్ల, కవిత్వం పట్ల ఆయనకు ఉన్న అంకిత భావం స్పష్టంగా తెలుస్తోంది. ప్రజల పక్షం, బాధితుల పక్షం నిలిచిన కవి గోలి మధు. సజావుగా సాగే జీవితం తలక్రిందులైతే, కాలానికి ఎదురీది, తనని, తన చెల్లిని పెంచిన తీరు ద్వారా అమ్మ గోలి పార్వతీ దేవే తన ఎదురీతకు స్ఫూర్తి అని చెప్పడంలోనే మధు సంస్కారం తెలుస్తోంది. మంగళగిరి లయన్స్ క్లబ్ అధ్యక్షురాలిగా ప్రజాసేవలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన దివంగత నన్నపనేని లక్ష్మికి ఈ పుస్తకం అంకితం ఇవ్వడం ద్వారా ఆయన మహిళలకు ఇచ్చే గౌరవం అర్థమవుతోంది.
150 పేజీల ఈ పుస్తకం వెల : రూ.150
రచయిత గోలి మధు సెల్: 9989186883
ప్రతులకు : 9848199098
సమీక్షకులు : శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914


















