Aug 7, 2018


దేశ వారసత్వ సంపద చేనేత
ఆగస్ట్ 7 జాతీయ చేనేత దినోత్సవం
v  చేనేత కార్పోరేషన్ ఏర్పాటు ఆలోచనలో ప్రభుత్వం
v  వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ బలోపేతం
v  త్వరలో విజయవాడలో చేనేత కులాల ఆత్మగౌరవ సభ
               
భారతదేశ వారసత్వ సంపద చేనేత. జాతీయోద్యమంలో చేనేత కీలక పాత్ర పోషించింది.  ఉద్యమంలో భాగంగా జాతీయ నేతలు  విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపు ఇచ్చారు.  1905, ఆగస్టు 7  కోల్ కతాలో విదేశీ వస్త్రాలను దగ్ధం చేశారు. ఆ తరువాత చేనేత చిహ్నం రాట్నాన్ని జాతీయోద్యమ జెండాలో చేర్చారు. తకిలి అనే కదురు ద్వారా దూదితో నూలు వడకడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టారు. మహాత్మా గాంధీ చర్ఖాతో నూలు వడుకుతుండేవారు. అలా చేనేత వృత్తి చిహ్నం జాతీయోద్యమానికి ప్రతీకగా నిలిచింది. అలా చేనేత వృత్తి చిహ్నం జాతీయోద్యమానికి ప్రతీక అయింది. విదేశీ వస్త్రాలను దగ్ధం చేసి జాతీయోధ్యమానికి ఓ ఊపు తెచ్చిన ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా జరపాలని చేనేత కార్మికులు కోరుతూ వచ్చారు. జాతీయ స్థాయిలో చేనేత పరిశ్రమ ప్రాధాన్యతను గుర్తించి చివరకు 2015వ సంవత్సరంలో ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవం (నేషనల్ హ్యాండ్‌లూమ్-డే)గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన చేనేతకు పూర్వ వైభవం తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. చేనేత కార్మికులకు, చేనేత కులాలలోని పేదలకు చేయూతనిచ్చి ఆదుకోవడానికి ప్రభుత్వం చేనేత కార్పోరేషన్ ఏర్పాటుచేయాలన్న ఆలోచనలో ఉంది. సంబంధిత అధికారులు దీని విధివిధానాలు రూపొందిస్తున్నారు. చేనేత రంగం అభివృద్ధికి, ఆ కులాలకు చెందిన వారి ఉపాధి కల్పనకు రూ.1000 కోట్ల వరకు  నిధులు కేటాయించే అవకాశం ఉంది. ప్రత్యేక బడ్జెట్ తో కార్పోరేషన్ ఏర్పాటైతే  చేనేత  వృత్తి చేసుకోవడానికి ఆర్ధిక సహకారం, వడ్డీలేని రుణాలు, రాయితీతో కూడిన రుణాలు,  చేనేత కార్మికుల ఆడపిల్లల వివాహ వంటి కార్యక్రమాలకు నగదు ప్రోత్సాహం, పిల్లల చదువులకు ఆర్ధిక సహకారం, చేనేత బజారులు ఏర్పాటుకు సహకారం,  చేనేత పింఛనులు, వ్యాపార విస్తరణ, ఆప్కోకు రివాల్వింగ్ ఫండ్, నేతకార్మికులకు ఆరోగ్య భద్రత, వృత్తి భద్రత, భీమా భద్రత, ఆఖరికి దహన సంస్కారాలకు కూడా సహాయం అందించడానికి అవకాశం ఏర్పడుతుంది.

చేనేత కులాల నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు
           రాష్ట్రంలో ప్రస్తుతం మూడు లక్షల మంది ప్రత్యక్షంగా, 8 లక్షల మంది పరోక్షంగా  చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు.  చేనేత వర్గాల వారు దాదాపు 65 లక్షల మంది, అంటే రాష్ట్ర జనాభాలో  13 శాతం మంది ఉన్నారు.  రాష్ట్రంలోని 175 మంది శాసనసభ్యుల్లో ఈ కులాల నుంచి ఒక్కరు కూడా లేరు.  దానికి ప్రధాన కారణం చేనేత కులాల మధ్య ఐక్యత లేకపోవడం, నాయకత్వం లోపం. ఈ కులాల నుంచి, చేనేత వృత్తికి చెందినవారు ఎమ్మెల్యేలు లేకపోవడంతో ఇతర కులాలవారు, రంగాల వారు చేనేత శాఖ మంత్రులు అవుతున్నారు.  వారికి ఈ రంగంపై పూర్తి అవగాహన ఉండే అవకాశం లేదు. అందువల్ల చేనేత రంగం  అభివృద్ధికి నోచుకోవడంలేదు. చేనేత కులాల నుంచి ఒకరిద్దరు చట్టసభలకు ఎన్నికైనా వారికి చేనేత వృత్తి, ఆ రంగంలోని సమస్యలపైన సంపూర్ణ అవగాహన ఉండటంలేదు. దాంతో ఈ రంగం అభివృద్ధి కుంటుపడింది. చేనేత కులాల వారు, చేనేత కార్మికులు ఆర్థికంగా గానీ, వృత్తిపరంగా గానీ అభివృద్ధి చెందడానికి అవకాశం లేకుండాపోయింది. వారి సమస్యలను ఇతర కులాలు, వృత్తులకు చెందిన ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకుల ద్వారా పరిష్కరించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. వీరి సమస్యల పరిష్కారం పట్ల వారు ఆసక్తి చూపించే అవకాశాలు తక్కువ. చేనేత వృత్తికి సంబంధించిన నూలు, సిల్క్, రంగులు, రసాయనాలు ముడిసరుకులు వంటి వాటి ధరలు,  చేనేత ఉత్పత్తులు, అమ్మకాలు, ఎగుమతులు, పన్నులు, సబ్జిడీలు, సౌకర్యాలు.... వంటి సమస్యలు తెలుసుకోవడానికి వారికి సమయం ఉండదు. ఈ కారణంగా కూడా చేనేత సమస్యలు రోజురోజుకు పేరుకుపోతున్నాయి.   దామర్ల రమాకాంతరావు, ప్రగడ కోటయ్య, కొండాలక్ష్మణ్ బాపూజీ, గోలి వీరాంజనేయులు వంటివారు  మరణించిన తరువాత ఈ రంగం నుంచి రాజకీయంగా నాయకత్వం లోపం కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. వారు చేనేత కార్మికుల మధ్యే తిరిగేవారు.  వారికి చేనేత సమస్యలపై పూర్తి అవగాహన ఉండేది. అందువల్ల వారి హయాంలో ఈ రంగానికి ఎంతో కొంత మేలు జరిగింది. ఆ తరువాత ఈ కులాల వారు రాజకీయంగా బలహీనమవడం వల్ల చేనేత రంగంలోని కార్మికుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఈ కులాల వారు, కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. ఆకలి చావులు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చేనేత కులాల నుంచి ఎంపీలుగా నిమ్మల కిష్టప్ప, బుట్టా రేణుక, ఎమ్మెల్సీగా పోతుల సునీత ఉన్నా, వారికి నేరుగా చేనేత రంగంతో సంబంధంలేదు. చేనేత వృత్తిపై ఆధారపడిన కుటుంబంలో పుట్టిపెరిగి, ఆ వృత్తితో పెనవేసుకుపోయి, ఆ రంగంలోని సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న గంజి చిరంజీవి మంగళగిరి శాసనసభ నియోజకవర్గంలో 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన గెలిచి ఉంటే ఈ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కి ఉండేది. అంటే మంత్రి పదవి ఇవ్వడానికి  ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ కులాల నుంచి ఎన్నిక కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా చేయగలిగింది ఏమీలేదు.  చేనేత కులాల వారికి పరిస్థితి పూర్తిగా అర్ధమైంది.  తమ కులాల నుంచి శాసనసభ్యులను గెలిపించుకోకపోతే పరిస్థితి ఇంకా దిగజారుతుందని గ్రహించారు. ఈ నేపధ్యంలో చేనేత కుల సంఘాల పునరేకీకరణ అవసరాన్ని గుర్తించారు. గతంలో క్రియాశీలకంగా ఉన్న  వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ ను బలోపేతం చేయడం ద్వారా రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా జూన్ 24న రాజమండ్రిలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సభకు 14 చేనేత కులాల పెద్దలు హాజరయ్యారు. నేత వృత్తి, ఉద్యోగ, మహిళా, యువజన, విద్యార్ధి, న్యాయ, వైద్య, వాణిజ్య విభాగాలు ఏర్పాటుపై చర్చించారు.  అందరూ కలసికట్టుగా రాజకీయంగా తమకు రావలసిన వాటాను రాబట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. రాజకీయాలకు అతీతంగా కలసి పనిచేయాలని తీర్మానించారు. అన్ని కులాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి రాజకీయ అధికారం చేజిక్కించుకోవడానికి ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూతిక శ్రీనివాస విశ్వనాధ్  తీవ్రంగా కృషి చేస్తున్నారు. రాష్ట్రంలోని దాదాపు 35 చేనేత సంఘాలను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా చేనేత కులాల నాయకులతో ఫ్రంట్ కార్యవర్గాలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో 45 శాసనసభ నియోజకవర్గాల్లో గెలుపు-ఓటములు నిర్ణయించగల స్థితిలో చేనేత కులాల వారు ఉన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేనేత జనబలం ఉన్న చోట తమకు సీట్లు కేటాయించాలని రాజకీయ పార్టీల నేతలను కలిసి అడగాలని నిర్ణయించుకున్నారు.  15 అసెంబ్లీ, 5 ఎంపీ సీట్లు కేటాయించాలని వారు రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలలో పోటీ చేసే చేనేత కులాల వారికి పార్టీలతో సంబంధం లేకుండా ఆర్థిక సహాయంతోపాటు అన్ని రకాలుగా ఫ్రంట్ తరపున మద్దతుపలకనున్నారు.  ఫ్రంట్ ఆధ్వర్యంలో రాజమండ్రి, ఏలూరు వంటి నగరాలలో ఐక్యవేదికలు ఏర్పాటు చేశారు.  కర్నూలు, నెల్లూరులలో వేల మందితో చేనేత మహాదీక్షలు, అనంతపురంలో చేనేత సహకార సంఘాల బాధ్యులతో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత  కులాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఆ ఉత్సాహంతో త్వరలో విజయవాడలో 4 లక్షల మందితో  చేనేత కులాల ఆత్మగౌరవ సభను భారీ స్థాయిలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.  రెండు వేల కోట్ల రూపాయలతో చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని  చేనేత కులాల నాయకులు ఎంపీలు కిష్టప్ప, రేణుక, ఎమ్మెల్సీ సునీత, మాజీ మంత్రి మురుగడు హనుమంతరావు, మంగళగిరి మునిసిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, పెడన మునిసిపల్ చైర్మన్ బండారు ఆనంద ప్రసాద్,  శల కోటివీరయ్య, విశ్వనాధ్, జగ్గారపు శ్రీనివాస్, ఆకాశపు స్వామి, గుత్తికొండ ధనుంజయ, రాజపంతుల నాగేశ్వరావు వంటివారు ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు. చేనేత వృతితో నేరుగా సంబంధం ఉన్నవారికే కార్పోరేషన్ బాధ్యతలు అప్పగిస్తే మంచిదన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.
-      శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914




Aug 5, 2018


చేనేత కులాల పునరేకీకరణ
v రాజకీయ అధికారమే లక్ష్యం
v తీవ్రంగా ప్రయత్నిస్తున్న వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్
v ఆగస్ట్ 7 జాతీయ చేనేత దినోత్సవం


                  రాజకీయంగా బలపడటం కోసం రాష్ట్రంలోని  చేనేత కులాలు ఏకమవుతున్నాయి. రాష్ట్రంలో వ్యవసాయం తరువాత అత్యధిక మంది చేనేత, దాని అనుబంధ రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. దేశంలో తరతరాలుగా చేనేత వృత్తిపైనే జీవించే కులాలు అనేకం ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి పద్మశాలి, దేవాంగ, జాండ్ర, పట్టుశాలి, సాలి, తొగటశాలీలు, స్వకులశాలి, కురిమిసెట్టిశాలి,  సేనాపతులు, కైకాల, కర్ణభక్తులు, కరికాలభక్తులు,  తొగుల వీరక్షత్రియ,  సాధనాసూరులు, అచ్చుకట్లవాళ్ళు, దూదేకుల,  కుర్ని, ఖత్రి,  నీలి, నీలకంఠి, కోష్ఠి, నక్కల, పట్కార్, కైకోల, కైకోలన్, సెంగుండం, సెంగుంతర్,  సాలివన్, నెస్సి మొదలైన కులాలు ఉన్నాయి. ఇందులోని దాదాపు 19 కులాల వారు ఏపీలో ఉన్నారు.   అధిక కులాలు అంత్యంత వెనుకబడిన కులాల(ఎంబీసీ) జాబితాలో ఉన్నాయి.  చేనేత భారతదేశ వారసత్వ సంపద. జాతీయోద్యమంలో చేనేతకు మంచి గుర్తింపు లభించింది. ఆ ఉద్యమంలో భాగంగా   1905, ఆగస్టు 7  కోల్ కతాలో విదేశీ వస్త్రాలను దగ్ధం చేయడంతో విదేశీ వస్తు బహిష్కరణ ప్రారంభమైంది. ఆ తరువాత చేనేత చిహ్నం రాట్నాన్ని జాతీయోద్యమ జెండాలో చేర్చారు.  మహాత్మా గాంధీ చర్ఖాతో నూలు వడుకుతుండేవారు. అలా చేనేత వృత్తి చిహ్నం జాతీయోద్యమానికి ప్రతీకగా నిలిచింది. జాతీయ స్థాయిలో చేనేత పరిశ్రమ ప్రాధాన్యతను గుర్తించి 2015 ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవం (నేషనల్ హ్యాండ్‌లూమ్-డే)గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ రంగానికి చెందిన కులాల నుంచి రాష్ట్ర శాసనసభలో ఒక్కరు కూడా ప్రాతినిధ్యం వహించడంలేదు. దానికి ప్రధాన కారణం చేనేత కులాల మధ్య ఐక్యత లేకపోవడం, నాయకత్వం లోపం. ఏ కులానికి చెందినా వ్యవసాయ రంగం నుంచి ఎక్కువ మంది శాసనసభ్యులుగా ఎన్నికవుతున్నారు. మంత్రులు అవుతున్నారు. ఆ రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. చేనేత రంగం విషయానికి వచ్చేసరికి రాష్ట్ర జనాభాలో 13 శాతం మంది ఉన్నా ఈ కులాల నుంచి ఒక్కరు కూడా ఎన్నిక కాలేదు. రాష్ట్రంలోని 175 మంది శాసనసభ్యుల్లో ఈ కులాల నుంచి ఒక్కరు కూడా లేరు.  చేనేత శాఖ మంత్రి అయిన వారికి ఈ రంగంపై పూర్తి అవగాహన లేక తగిన రీతిలో అభివృద్ధికి చర్యలు తీసుకోవడంలేదు. చేనేత కులాల నుంచి ఒకరిద్దరు చట్టసభలకు ఎన్నికైనా వారికి చేనేత వృత్తి, ఆ రంగంలోని సమస్యలపైన సంపూర్ణ అవగాహన ఉండటంలేదు. దాంతో ఈ రంగం అభివృద్ధి కుంటుపడింది. చేనేత కులాల వారు, చేనేత కార్మికులు ఆర్థికంగా గానీ, వృత్తిపరంగా గానీ అభివృద్ధి చెందడానికి అవకాశం లేకుండాపోయింది. రాష్ట్రంలో ప్రస్తుతం మూడు లక్షల మంది ప్రత్యక్షంగా, 8 లక్షల మంది పరోక్షంగా  ఈ రంగంపై ఆధారపడి బతుకుతున్నారు.  వారి సమస్యలను ఇతర కులాలు, వృత్తులకు చెందిన ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. వీరి సమస్యల పరిష్కారం పట్ల వారు ఆసక్తి చూపించే అవకాశాలు తక్కువ. చేనేత వృత్తికి సంబంధించిన నూలు, సిల్క్, రంగులు, రసాయనాలు ముడిసరుకులు వంటి వాటి ధరలు,  చేనేత ఉత్పత్తులు, అమ్మకాలు, ఎగుమతులు, పన్నులు, సబ్జిడీలు, సౌకర్యాలు.... వంటి సమస్యలు ఆమూలాగ్రం తెలుసుకోవడానికి వారికి సమయం ఉండదు. ఈ కారణంగా కూడా చేనేత సమస్యలు రోజురోజుకు పేరుకుపోతున్నాయి.   దామర్ల రమాకాంతరావు, ప్రగడ కోటయ్య, కొండాలక్ష్మణ్ బాపూజీ, గోలి వీరాంజనేయులు వంటివారు  మరణించిన తరువాత ఈ రంగం నుంచి రాజకీయంగా నాయకత్వం లోపం కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. వారు చేనేత కార్మికుల మధ్యే తిరిగేవారు.  వారికి చేనేత సమస్యలపై పూర్తి అవగాహన ఉండేది. అందువల్ల వారి హయాంలో ఈ రంగానికి ఎంతో మేలు జరిగింది. ఆ తరువాత ఈ కులాల వారు రాజకీయంగా బలహీనమవడం వల్ల చేనేత రంగంలోని కార్మికుల పరిస్థితి దయనీయ స్థితికి చేరింది. ఈ కులాల వారు, కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. చేనేత వర్గాల వారు దాదాపు 65 లక్షల మంది, అంటే రాష్ట్ర జనాభాలో  13 శాతం మంది ఉన్నా ఒక్క శాసనసభ్యుడు కూడా లేరు. మంత్రి పదవీ  లేదు. చివరికి చేనేత మంత్రిత్వ శాఖ కూడా మరో కులం వారు నిర్వహించవలసి వస్తోంది.  చేనేత కులాల నుంచి ఎంపీలుగా నిమ్మల కిష్టప్ప, బుట్టా రేణుక, ఎమ్మెల్సీగా పోతుల సునీత ఉన్నా, వారికి నేరుగా చేనేత రంగంతో సంబంధంలేదు. చేనేత వృత్తిపై ఆధారపడిన కుటుంబంలో పుట్టిపెరిగి, ఆ వృత్తితో పెనవేసుకుపోయి, ఆ రంగంలోని సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న గంజి చిరంజీవి మంగళగిరి శాసనసభ నియోజకవర్గంలో 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన గెలిచి ఉంటే ఈ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కి ఉండేది. అంటే మంత్రి పదవి ఇవ్వడానికి  ఒక్క ఎమ్మెల్యే కూడా చేనేత కులాల నుంచి ఎన్నిక కాలేదు. పరిస్థితులు ఇలా ఉంటే ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా చేయగలిగింది ఏమీలేదు.  తమ వర్గానికి చెందిన వారు శాసనసభ్యులుగా ఎన్నికైతే మంత్రి పదవి ఇవ్వమని అడగవచ్చు. ఎమ్మెల్యేనే లేకపోతే ఏం అడుగుతారు? చేనేత కులాల వారికి పరిస్థితి పూర్తిగా అర్ధమైంది. అందరూ ఐక్యంగా ఉండి శాసనసభ్యులను గెలిపించుకోకపోతే పరిస్థితి ఇంకా దిగజారుతుందని గ్రహించారు. ఈ నేపధ్యంలో చేనేత కుల సంఘాల పునరేకీకరణ అవసరాన్ని గుర్తించారు. గతంలో క్రియాశీలకంగా ఉన్న  వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ ను బలోపేతం చేయడం ద్వారా రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అన్ని కులాలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూతిక శ్రీనివాస విశ్వనాధ్  తీవ్రంగా కృషి చేస్తున్నారు. రాజమండ్రిలో జూన్ 24న ఏర్పాటు చేసిన సభకు 14 చేనేత కులాలకు చెందిన పెద్దలు హాజరై అందరూ కలసికట్టుగా రాజకీయంగా తమకు రావలసిన వాటాను రాబట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. రాజకీయాలకు అతీతంగా కలసి పనిచేయాలని తీర్మానించారు.  రాష్ట్రంలోని దాదాపు 35 చేనేత సంఘాలను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  ఫ్రంట్ ఆధ్వర్యంలో ఆయా కులాల పెద్దలతో నేతవృత్తి, ఉద్యోగ, మహిళా, యువజన, విద్యార్ధి, న్యాయ, వైద్య, వాణిజ్య విభాగాలు ఏర్పాటుపై చర్చావేదికలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా చేనేత కులాల నాయకులతో ఫ్రంట్ కార్యవర్గాలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో 45 శాసనసభ నియోజకవర్గాల్లో గెలుపుపై ప్రభావం చూపగల స్థాయిలో చేనేత కులాలవారు ఉన్నారు. అంటే అంత మంది ఎమ్మెల్యేల తల రాతలు రాసే స్థితిలో వారు ఉన్నారు.  రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేనేత జనబలం ఉండి గెలవడానికి అవకాశం ఉన్న లోక్ సభ, శాసనసభ స్థానాలను ఆయా పార్టీల నేతలను కలిసి అడగాలని నిర్ణయించుకున్నారు. 15 అసెంబ్లీ, 5 ఎంపీ సీట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎన్నికలలో పోటీ చేసే చేనేత కులాల వారికి ఆర్థిక సహాయంతోపాటు అన్ని రకాలుగా ఫ్రంట్ తరపున మద్దతుపలకనున్నారు.  ఫ్రంట్ ఆధ్వర్యంలో రాజమండ్రి, ఏలూరు వంటి నగరాలలో ఐక్యవేదికలు ఏర్పాటు చేశారు.  కర్నూలు, నెల్లూరులలో వేల మందితో చేనేత మహాదీక్షలు, అనంతపురంలో చేనేత సహకార సంఘాల బాధ్యులతో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఆయా కులాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఆ ఉత్సాహంతో త్వరలో విజయవాడలో 4 లక్షల మందితో  చేనేత కులాల ఆత్మగౌరవ సభను భారీ స్థాయిలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. చేనేత రంగం అభివృద్ధికి, ఆ కులాలకు చెందిన వారి ఉపాధి కల్పనకు వెయ్యి కోట్ల రూపాయలతో చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని  చేనేత కులాల నాయకులు ఎంపీలు కిష్టప్ప, రేణుక, ఎమ్మెల్సీ సునీత, మాజీ మంత్రి మురుగడు హనుమంతరావు, మంగళగిరి మునిసిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, విశ్వనాధ్, ఆకాశపు స్వామి వంటివారు ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు. చేనేత వృతితో నేరుగా సంబంధం ఉన్నవారికే కార్పోరేషన్ బాధ్యతలు అప్పగించాలని కూడా వారు కోరుతున్నారు.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

Aug 3, 2018


దిగ్విజయంగా కొనసాగుతున్న గ్రామదర్శిని
ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్
Ø గ్రామాల బాటపట్టిన ప్రజా ప్రతినిధులు
Ø 1408 గ్రామాల్లో గ్రామదర్శిని, 378 వార్డుల్లో నగర దర్శిని
Ø మంత్రి లోకేష్ ద్వారా యుతకు మేలు
              సచివాలయం, ఆగస్ట్ 3: రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన వినూత్న కార్యక్రమం ‘గ్రామదర్శిని-గ్రామ వికాసం’ దిగ్విజయంగా కొనసాగుతున్నట్లు శాసన మండలిలో ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో శుక్రవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రభుత్వం ఏర్పడి జూలై 16వ తేదీకి 1,500 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టిన విషయం తెలసిందే. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ గ్రామాలకు వెళ్లి ప్రజలను కలవడానికి, వారి సమస్యలు తెలుసుకోవడానికి ఉపయోగపడే మంచి కార్యక్రమం అన్నారు. ఇప్పటి వరకు 1408 గ్రామాల్లో గ్రామదర్శిని, 378 వార్డుల్లో నగర దర్శిని కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు గ్రామాల్లో, వార్డుల్లో  మంచి స్పందన వస్తున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటించేటప్పుడు ఏవైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు.  పీపుల్స్ ఫస్ట్ పేరుతో ప్రవేశపెట్టిన 1100 విభాగం ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో లోటుపాట్లను కూడా దీని ద్వారా సరిదిద్దుతున్నారని చెప్పారు.

మంత్రి లోకేష్ ద్వారా యుతకు మేలు
        పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ద్వారా యువతకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. ఆయన రాకతో ఉద్యోగ అవకాశాలు పెరిగాయని చెప్పారు. ఆన్ లైన్ పోర్టల్ ఏర్పాటు చేయడం ద్వారా నిరుద్యోగులు తమ పేరు, విద్యార్హతలు వంటి వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఏర్పడిందన్నారు. ఆ విధంగా వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయని తెలిపారు. నిరుద్యోగ యువతకు వారికి ఇష్టమైన రంగాల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం ద్వారా  12 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఈ పథకం దేశంలో ఎక్కడా సరైన రీతిలో అమలు జరగడంలేదన్నారు. మన రాష్ట్రంలో 22-35 సంవత్సరాల మధ్య యువతకు నెలకు రూ.1000లు భృతి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ మేనిఫెస్టోలోని 90 శాతం పైగా అంశాలను అమలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా చంద్రబాబు నాయకత్వంలో ఎంతో అభివృద్ధి జరుగుతోందని, మళ్లీ ఆయనే రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఆయనపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని డొక్కా అన్నారు.

Aug 1, 2018


వేగం పుంజుకున్న
విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ పనులు



Ø ఏడీబీ రుణం రూ.5 వేల 544 కోట్లు
Ø రూ.537 కోట్లు విడుదల
Ø విశాఖ, మచిలీపట్నం, దొనకొండ, శ్రీకాళహస్తి-ఏర్పేడుల్లో  4 పారిశ్రామిక క్లస్టర్లు
Ø జక్కంపూడి ప్రాంతంలో ఎకనామిక్ సిటీ


ప్రణాళికాబద్ధంగా, స్థిరమైన పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పలు విధానాలు  రూపొందించింది. భారీ స్థాయిలో పెట్టుబడులు రాబట్టడం ద్వారా పారిశ్రామిక ప్రగతిని సాధించడంతోపాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలన్నది ప్రభుత్వ లక్ష్యం.  ఇందులో భాగంగా పారిశ్రామిక కారిడార్లు, పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటు చేస్తారు.  ప్రత్యేక పెట్టుబడుల రీజియన్లు, జోన్లలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు(ఎస్ఐపీబీ),స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ కమిటీ(ఎస్ఐపీబీ)లను ఏర్పాటు చేశారు. పీపీపీ(పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం) పద్దతిలో బహుళ రంగాలకు సంబంధించి ప్రత్యేకమైన పార్కులు ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో చేపట్టిన  చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్(సీబీఐసీ)విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్(వీసీఐసీ), కర్నూలు - బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌(కేబీఐసీ)లలో వీసీఐసీ పనులు వేగం పుంజుకున్నాయి. రాష్ట్రలో 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఈ తీరం వెంట భూగర్భంలో అపారమైన ఖనిజ సంపద నిక్షిప్తమై ఉంది. ఈ కారిడార్ ఏర్పాటు చేయతలపెట్టిన ప్రాంతం ఇదే కావడంతో అభివృద్ధికి అవకాశాలు మెండు.  నైపుణ్యత కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండటం, నిరంతరం విద్యుత్ సరఫరా వల్ల పెట్టుబడిదారులు ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు.  దేశంలో తీరప్రాంతంలో ఏర్పడే  మొదటి కారిడార్ ఇది.  భవిష్యత్ లో ఇది కీలకమైన తూర్పు ఆర్థిక  కారిడార్ గా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.  ఇది శ్రీకాకుళం జిల్లాలోని పైడిభీమవరం నుంచి తమిళనాడులోని చెన్నై వరకు విస్తరించి ఉంటుంది. 2500 కిలో మీటర్ల కారిడార్ ఇది. ఈ కారిడార్ ఏర్పాటులో భాగంగా విశాఖపట్నంమచిలీపట్నం, దొనకొండ, శ్రీకాళహస్తి-ఏర్పేడుల్లో నాలుగు పారిశ్రామిక క్లస్టర్ ప్రాంతాలను (నోడ్స్) ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. మొదటి దశ కింద విశాఖపట్నం, శ్రీకాళగహస్తి-ఏర్పేడుల్లో పారిశ్రామిక ప్రాంతాలు, ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. తీరం వెంట రోడ్డు నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.  ఈ కారిడార్ లో భారీ స్థాయిలో పెట్టుబడులకు, లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుందని అంచనా. ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) వీసీఐసీపై అధ్యయనం చేసి భారీగా రూ.5,544 కోట్లు రుణం అందించడానికి అంగీకారం తెలిపింది. ఈ రుణాన్ని రెండు దశలలో అందజేస్తుంది.  ఇప్పటికే సుమారు రూ.537 కోట్లు రుణం విడుదల చేసింది. విద్యుత్, నీటిసరఫరా తదితర మౌలిక సదుపాయాల కల్పించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు తొలిదశ 2019 నాటికి పూర్తవుతుంది. తొలిదశలో ప్రధానమైన 800 కిలోమీటర్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు.   రెండవ దశ 2022 నాటికి పూర్తి అవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 840 మిలియన్ డాలర్లు. ఇందులో ఏపీ ప్రభుత్వానికి 30 శాతం వాటా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఈ ప్రాజెక్టు ప్రగతిని, పనుల పురోగతిని స్వయంగా చేసేందుకు, అధికారులతో సమీక్షించేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు ఉపాధ్యక్షులు వెన్కాయ్ ఝాంగ్ తమ అధికార బృందంతో జూలైలో రెండు రోజుల పర్యటనకు రాష్ట్రానికి వచ్చారు. జూలై 19న  అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ తో భేటీ అయ్యారు. ప్రాజెక్ట్ పురోగతిపై వారు చర్చించారు. గుర్తించిన నాలుగు ఇండస్ట్రియల్ క్లస్టర్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని,  ఆయా పనులు శరవేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎస్ స్పష్టం చేశారు. త్వరితగతిన ఈ కారిడార్ ఏర్పాటుకు వీలుగా తమ బ్యాంకు నుంచి అన్ని విధాలా తగిన తోడ్పాటును అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఝాంగ్  సిఎస్ కు చెప్పారు.  విజయవాడ శివారులోని జక్కంపూడి ప్రాంతంలో ఎకనామిక్ సిటీ నిర్మాణాన్ని చేపట్టారు.  ఇది దేశానికే ఒక రోల్ మోడల్ ప్రాజెక్టు అవుతుందన్నది అధికారుల భావన. ఇందులోనే హౌసింగ్, ఎకనామిక్ సిటీ సంయుక్తంగా ఉంటాయి. ఈ కారిడార్ రాష్ట్రం ఆర్థికంగా బలపడటానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ అంతర్జాతీయ స్థాయి పోటీ వాతావరణం ఉంటుంది. పెట్టుబడులు, మౌలికసదుపాయాలతోపాటు స్థానిక వాణిజ్య కార్యకలాపాలు మెరుగుపడతాయి.  విశాఖపట్నం, నక్కపల్లి, కాకినాడ ప్రాంతాలను  పెట్రోలియం, కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ఇన్ వెస్ట్ మెంట్ రీజియన్స్ (పీసీపీఐఆర్)గా అభివృద్ధి చేస్తారు.
      విశాఖ, చిత్తూరు ప్రాంతాలను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెట్టుబడి రీజియన్లగా అభివృద్ధి చేస్తున్నారు.  ఈ రీజియన్లలో నివాస ప్రాంతాలతోపాటు ఐటీ, ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ ఉత్పత్తులు, ప్రజోపకరణాలు, మౌలిక సదుపాయాలు, పరిపాలనా సేవలు అందుబాటులో ఉంటాయి. పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, సమీకృత టౌన్ షిప్ ల వంటివి కూడా ఉంటాయి. రాష్ట్రంలో విశాఖ మేజర్ పోర్టుతోపాటు గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం వంటి పలు మీడియం పోర్టులు కూడా ఉన్నాయి. జల రవాణాకు అవకాశం ఉన్నందున సాగర తీరంలో ఇటు ప్రభుత్వం రంగంలోనూ, అటు ప్రైవేటు రంగంలోనూ  అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  అంతర్జాతీయంగా పేరొందిన పలు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు(ఎంఓయు) కూడా చేసుకున్నాయి.  ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే దక్షిణ తూర్పు ఆసియా దేశాలతో భారత్ వాణిజ్య కార్యకలాపాలు మరింత బలోపేతమవుతాయని ఏడీబీ పట్టణాభివృద్ధి విభాగపు ప్రధాన విశ్లేషకుడు మనోజ్ శర్మ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని సముద్ర తీరం పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా రూపొందుతుంది. మెరైన్ ఉత్పత్తుల్లో ఏపీ దేశంలో అత్యున్నత స్థానంలో ఉంది. ఎగుమతులు కూడా అధికంగా ఇక్కడ నుంచే జరుగుతున్నాయి. మెరైన్ కార్గోలను  పంపే మేజర్ పోర్టులలో విశాఖపట్నం పోర్ట్ ఒకటి.   అందువల్ల పెద్ద పెద్ద పారిశ్రామిక యూనిట్లతోపాటు ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి విస్తృతంగా అవకాశాలు ఉన్నాయి. సముద్ర ఉత్పత్తులతో తయారు చేసే ‘రెడీ టూ ఈట్’ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలోపెట్టుకొని ఆ రకమైన యూనిట్లు ఏర్పాటు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తి కావడానికి ప్రభుత్వంలోని వివిధ శాఖల మధ్య సమన్వయం చాలా అవసరం. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. 
-శిరందాసు నాగార్జున, డెవలప్ మెంట్ జర్నలిస్ట్ – 9440222914