Aug 7, 2018


దేశ వారసత్వ సంపద చేనేత
ఆగస్ట్ 7 జాతీయ చేనేత దినోత్సవం
v  చేనేత కార్పోరేషన్ ఏర్పాటు ఆలోచనలో ప్రభుత్వం
v  వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ బలోపేతం
v  త్వరలో విజయవాడలో చేనేత కులాల ఆత్మగౌరవ సభ
               
భారతదేశ వారసత్వ సంపద చేనేత. జాతీయోద్యమంలో చేనేత కీలక పాత్ర పోషించింది.  ఉద్యమంలో భాగంగా జాతీయ నేతలు  విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపు ఇచ్చారు.  1905, ఆగస్టు 7  కోల్ కతాలో విదేశీ వస్త్రాలను దగ్ధం చేశారు. ఆ తరువాత చేనేత చిహ్నం రాట్నాన్ని జాతీయోద్యమ జెండాలో చేర్చారు. తకిలి అనే కదురు ద్వారా దూదితో నూలు వడకడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టారు. మహాత్మా గాంధీ చర్ఖాతో నూలు వడుకుతుండేవారు. అలా చేనేత వృత్తి చిహ్నం జాతీయోద్యమానికి ప్రతీకగా నిలిచింది. అలా చేనేత వృత్తి చిహ్నం జాతీయోద్యమానికి ప్రతీక అయింది. విదేశీ వస్త్రాలను దగ్ధం చేసి జాతీయోధ్యమానికి ఓ ఊపు తెచ్చిన ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా జరపాలని చేనేత కార్మికులు కోరుతూ వచ్చారు. జాతీయ స్థాయిలో చేనేత పరిశ్రమ ప్రాధాన్యతను గుర్తించి చివరకు 2015వ సంవత్సరంలో ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవం (నేషనల్ హ్యాండ్‌లూమ్-డే)గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన చేనేతకు పూర్వ వైభవం తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. చేనేత కార్మికులకు, చేనేత కులాలలోని పేదలకు చేయూతనిచ్చి ఆదుకోవడానికి ప్రభుత్వం చేనేత కార్పోరేషన్ ఏర్పాటుచేయాలన్న ఆలోచనలో ఉంది. సంబంధిత అధికారులు దీని విధివిధానాలు రూపొందిస్తున్నారు. చేనేత రంగం అభివృద్ధికి, ఆ కులాలకు చెందిన వారి ఉపాధి కల్పనకు రూ.1000 కోట్ల వరకు  నిధులు కేటాయించే అవకాశం ఉంది. ప్రత్యేక బడ్జెట్ తో కార్పోరేషన్ ఏర్పాటైతే  చేనేత  వృత్తి చేసుకోవడానికి ఆర్ధిక సహకారం, వడ్డీలేని రుణాలు, రాయితీతో కూడిన రుణాలు,  చేనేత కార్మికుల ఆడపిల్లల వివాహ వంటి కార్యక్రమాలకు నగదు ప్రోత్సాహం, పిల్లల చదువులకు ఆర్ధిక సహకారం, చేనేత బజారులు ఏర్పాటుకు సహకారం,  చేనేత పింఛనులు, వ్యాపార విస్తరణ, ఆప్కోకు రివాల్వింగ్ ఫండ్, నేతకార్మికులకు ఆరోగ్య భద్రత, వృత్తి భద్రత, భీమా భద్రత, ఆఖరికి దహన సంస్కారాలకు కూడా సహాయం అందించడానికి అవకాశం ఏర్పడుతుంది.

చేనేత కులాల నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు
           రాష్ట్రంలో ప్రస్తుతం మూడు లక్షల మంది ప్రత్యక్షంగా, 8 లక్షల మంది పరోక్షంగా  చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు.  చేనేత వర్గాల వారు దాదాపు 65 లక్షల మంది, అంటే రాష్ట్ర జనాభాలో  13 శాతం మంది ఉన్నారు.  రాష్ట్రంలోని 175 మంది శాసనసభ్యుల్లో ఈ కులాల నుంచి ఒక్కరు కూడా లేరు.  దానికి ప్రధాన కారణం చేనేత కులాల మధ్య ఐక్యత లేకపోవడం, నాయకత్వం లోపం. ఈ కులాల నుంచి, చేనేత వృత్తికి చెందినవారు ఎమ్మెల్యేలు లేకపోవడంతో ఇతర కులాలవారు, రంగాల వారు చేనేత శాఖ మంత్రులు అవుతున్నారు.  వారికి ఈ రంగంపై పూర్తి అవగాహన ఉండే అవకాశం లేదు. అందువల్ల చేనేత రంగం  అభివృద్ధికి నోచుకోవడంలేదు. చేనేత కులాల నుంచి ఒకరిద్దరు చట్టసభలకు ఎన్నికైనా వారికి చేనేత వృత్తి, ఆ రంగంలోని సమస్యలపైన సంపూర్ణ అవగాహన ఉండటంలేదు. దాంతో ఈ రంగం అభివృద్ధి కుంటుపడింది. చేనేత కులాల వారు, చేనేత కార్మికులు ఆర్థికంగా గానీ, వృత్తిపరంగా గానీ అభివృద్ధి చెందడానికి అవకాశం లేకుండాపోయింది. వారి సమస్యలను ఇతర కులాలు, వృత్తులకు చెందిన ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకుల ద్వారా పరిష్కరించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. వీరి సమస్యల పరిష్కారం పట్ల వారు ఆసక్తి చూపించే అవకాశాలు తక్కువ. చేనేత వృత్తికి సంబంధించిన నూలు, సిల్క్, రంగులు, రసాయనాలు ముడిసరుకులు వంటి వాటి ధరలు,  చేనేత ఉత్పత్తులు, అమ్మకాలు, ఎగుమతులు, పన్నులు, సబ్జిడీలు, సౌకర్యాలు.... వంటి సమస్యలు తెలుసుకోవడానికి వారికి సమయం ఉండదు. ఈ కారణంగా కూడా చేనేత సమస్యలు రోజురోజుకు పేరుకుపోతున్నాయి.   దామర్ల రమాకాంతరావు, ప్రగడ కోటయ్య, కొండాలక్ష్మణ్ బాపూజీ, గోలి వీరాంజనేయులు వంటివారు  మరణించిన తరువాత ఈ రంగం నుంచి రాజకీయంగా నాయకత్వం లోపం కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. వారు చేనేత కార్మికుల మధ్యే తిరిగేవారు.  వారికి చేనేత సమస్యలపై పూర్తి అవగాహన ఉండేది. అందువల్ల వారి హయాంలో ఈ రంగానికి ఎంతో కొంత మేలు జరిగింది. ఆ తరువాత ఈ కులాల వారు రాజకీయంగా బలహీనమవడం వల్ల చేనేత రంగంలోని కార్మికుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఈ కులాల వారు, కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. ఆకలి చావులు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చేనేత కులాల నుంచి ఎంపీలుగా నిమ్మల కిష్టప్ప, బుట్టా రేణుక, ఎమ్మెల్సీగా పోతుల సునీత ఉన్నా, వారికి నేరుగా చేనేత రంగంతో సంబంధంలేదు. చేనేత వృత్తిపై ఆధారపడిన కుటుంబంలో పుట్టిపెరిగి, ఆ వృత్తితో పెనవేసుకుపోయి, ఆ రంగంలోని సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న గంజి చిరంజీవి మంగళగిరి శాసనసభ నియోజకవర్గంలో 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన గెలిచి ఉంటే ఈ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కి ఉండేది. అంటే మంత్రి పదవి ఇవ్వడానికి  ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ కులాల నుంచి ఎన్నిక కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా చేయగలిగింది ఏమీలేదు.  చేనేత కులాల వారికి పరిస్థితి పూర్తిగా అర్ధమైంది.  తమ కులాల నుంచి శాసనసభ్యులను గెలిపించుకోకపోతే పరిస్థితి ఇంకా దిగజారుతుందని గ్రహించారు. ఈ నేపధ్యంలో చేనేత కుల సంఘాల పునరేకీకరణ అవసరాన్ని గుర్తించారు. గతంలో క్రియాశీలకంగా ఉన్న  వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ ను బలోపేతం చేయడం ద్వారా రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా జూన్ 24న రాజమండ్రిలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సభకు 14 చేనేత కులాల పెద్దలు హాజరయ్యారు. నేత వృత్తి, ఉద్యోగ, మహిళా, యువజన, విద్యార్ధి, న్యాయ, వైద్య, వాణిజ్య విభాగాలు ఏర్పాటుపై చర్చించారు.  అందరూ కలసికట్టుగా రాజకీయంగా తమకు రావలసిన వాటాను రాబట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. రాజకీయాలకు అతీతంగా కలసి పనిచేయాలని తీర్మానించారు. అన్ని కులాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి రాజకీయ అధికారం చేజిక్కించుకోవడానికి ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూతిక శ్రీనివాస విశ్వనాధ్  తీవ్రంగా కృషి చేస్తున్నారు. రాష్ట్రంలోని దాదాపు 35 చేనేత సంఘాలను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా చేనేత కులాల నాయకులతో ఫ్రంట్ కార్యవర్గాలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో 45 శాసనసభ నియోజకవర్గాల్లో గెలుపు-ఓటములు నిర్ణయించగల స్థితిలో చేనేత కులాల వారు ఉన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేనేత జనబలం ఉన్న చోట తమకు సీట్లు కేటాయించాలని రాజకీయ పార్టీల నేతలను కలిసి అడగాలని నిర్ణయించుకున్నారు.  15 అసెంబ్లీ, 5 ఎంపీ సీట్లు కేటాయించాలని వారు రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలలో పోటీ చేసే చేనేత కులాల వారికి పార్టీలతో సంబంధం లేకుండా ఆర్థిక సహాయంతోపాటు అన్ని రకాలుగా ఫ్రంట్ తరపున మద్దతుపలకనున్నారు.  ఫ్రంట్ ఆధ్వర్యంలో రాజమండ్రి, ఏలూరు వంటి నగరాలలో ఐక్యవేదికలు ఏర్పాటు చేశారు.  కర్నూలు, నెల్లూరులలో వేల మందితో చేనేత మహాదీక్షలు, అనంతపురంలో చేనేత సహకార సంఘాల బాధ్యులతో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత  కులాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఆ ఉత్సాహంతో త్వరలో విజయవాడలో 4 లక్షల మందితో  చేనేత కులాల ఆత్మగౌరవ సభను భారీ స్థాయిలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.  రెండు వేల కోట్ల రూపాయలతో చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని  చేనేత కులాల నాయకులు ఎంపీలు కిష్టప్ప, రేణుక, ఎమ్మెల్సీ సునీత, మాజీ మంత్రి మురుగడు హనుమంతరావు, మంగళగిరి మునిసిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, పెడన మునిసిపల్ చైర్మన్ బండారు ఆనంద ప్రసాద్,  శల కోటివీరయ్య, విశ్వనాధ్, జగ్గారపు శ్రీనివాస్, ఆకాశపు స్వామి, గుత్తికొండ ధనుంజయ, రాజపంతుల నాగేశ్వరావు వంటివారు ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు. చేనేత వృతితో నేరుగా సంబంధం ఉన్నవారికే కార్పోరేషన్ బాధ్యతలు అప్పగిస్తే మంచిదన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.
-      శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914




No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...