Jun 15, 2026

మంగళగిరిలో ముగ్గురు ప్రముఖులకు సన్మానం

 

మంగళగిరి: మంగళగిరి మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో మూడు రంగాలలో  ముగ్గురు నగర ప్రముఖులు గుత్తికొండ ధనుంజయ రావు, గోలి మధు, శిరందాసు నాగార్జున రావులను ఆ టెక్ పార్క్ బిల్డర్లలో ఒకరైన యింజమూరి శ్రీనివాసరావు ఆదివారం రాత్రి సన్మానించారు. చేనేత నేత గుత్తికొండ ధనుంజయ రావు 14 ఏళ్ల వయసులోనే టీడీపీలో చేరి, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎదిగి, ఆ పార్టీ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపారు.  ప్రముఖ అభ్యుదయ కవి  గోలి మధు భారతీయ ధర్మ విశ్లేషణ, నవశకం, రైతు సమరభేరి, గమనం, సంఘర్షణ, ఎదురీత వంటి కవితా సంపుటిలతో తెలుగు కవితా లోకంలో తనకంటూ ఒక పేజీని సొంతం చేసుకున్నారు. మంగళగిరిలో జర్నలిజంలో మొట్టమొదట మాస్టర్ డిగ్రీ చేసిన సీనియర్ జర్నలిస్ట్ శిరందాసు నాగార్జున రిపోర్టర్-సబ్ ఎడిటర్ నుంచి న్యూస్ ఎడిటర్ వరకు ప్రముఖ దినపత్రికలలో పనిచేసి,  40 ఏళ్లకుపైగా అనుభవంతో ‘ప్రజారాజధాని అమరావతి’ అనే పుస్తకం రాశారు. ఈ ముగ్గురుని యింజమూరి శ్రీనివాసరావు శాలువాలతో సన్మానించి, గౌరవించారు.

















Jun 12, 2026

తొలి సన్మానం


నాకు తొలి సన్మనం జరిగిన ప్రదేశానికి ఒక విశిష్టత ఉంది. సాదారణంగా నాకు సన్మానాలంటే ఇష్టం ఉండదు. అందువల్ల ఎవరైనా సన్మానం చేస్తానంటే వద్దని చెప్పేవాడిని. సంవత్సరం సరిగా గుర్తులేదు, 2002 లేదా 2003లో కడప జిల్లా  ప్రొద్దుటూరు సన్మానం చేయించుకోవలసి వచ్చింది. అక్కడి దేవాలయాలు చూడటానికి మా కుటుంబంతో వెళ్లాను.  అప్పుడు అక్కడి వార్త స్టాఫ్ రిపోర్టర్ ప్రసాద్ దగ్గర ఉండి, దేవాలన్నీ చూపించారు. చివరికి ఒక దేవాలయంలోకి వెళ్లినప్పుడు, దర్శనం అయిన తర్వాత ‘‘ఆలయ కమిటీవారు మీకు సన్మానం చేస్తారట’’ సార్ అని ప్రసాద్ చెప్పారు. ‘‘నాకు సన్మాలంటే ఇష్టం ఉండదు, వద్దు’’అని చెప్పాను. అయితే, ప్రసాద్ పట్టుబట్టారు. ‘‘ఇక్కడ బహుభాషా కోవిదుడు, 'సరస్వతీపుత్ర' పుట్టపర్తి నారాయణాచార్యులు ఈ అగస్తేశ్వర ఆలయంలోనే ఈ చెట్టు క్రింద కూర్చొని   ‘శివతాండవం’ కావ్యం రాశారు. అదే చెట్టు క్రింద మీకు సన్మానం చేస్తారు. వద్దనకండి సార్’’బతిమిలాడినట్లు అడిగారు. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడే నాకు తొలిసారిగా సన్మానం చేశారు.  పుట్టపర్తి నారాయణాచార్యులు అత్తగారి ఊరు  ప్రొద్దుటూరు. ఆయన అక్కడ కొంత కాలం ఉన్నారు. ఆ సమయంలోనే శివతాండవం కావ్యం రాశారు. 


https://www.youtube.com/watch?v=wSsDbPTmc_k



Jun 10, 2026

పౌరహక్కుల బాలగోపాల్


భారతదేశపు ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త, గొప్ప ఆలోచనాపరుడు, న్యాయవాది మరియు గణిత శాస్త్రజ్ఞుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పౌరహక్కుల ఉద్యమానికి ఆయన ఒక దిక్సూచిగా నిలిచారు. సమాజంలోని అణగారిన, దళిత, గిరిజన వర్గాల హక్కుల కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు కె. బాలగోపాల్ (కందళ్ల బాలగోపాల్) జయంతి జ్ఞాపకం

కె. బాలగోపాల్ గారు 1952 జూన్ 10న కర్ణాటకలోని బళ్లారిలో జన్మించారు. అనంతపురం జిల్లా రాళ్ల అనంతపురం ఆయన స్వస్థలం. ఈయన తల్లిదండ్రులు నాగమణి, పార్థనాథశర్మ. ప్రముఖ సాహితీవేత్త రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ ఈయనకు మాతామహుడు (తాత). ప్రముఖ రచయిత్రి, టీవీ సమర్పుకురాలు మరియు మాజీ తెలుగు విశ్వవిద్యాలయ ప్రో. మృణాళిని గారు వారి చెల్లెలు. ప్రసిద్ధ పాత్రికేయురాలైన వసంత లక్ష్మి ఈయన భార్య.
......
బాలగోపాల్ అసాధారణమైన మేధావి. వరంగల్‌లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ (ప్రస్తుత NIT) నుండి గణితంలో డాక్టరేట్ (Ph.D) పూర్తి చేశారు. ఢిల్లీలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో పోస్ట్-డాక్టోరల్ పరిశోధన కూడా చేశారు.
......
1985 వరకు కాకతీయ విశ్వవిద్యాలయంలో బోధించారు. పోలీసుల నుండి ప్రాణహాని ఎదురవడంతో ఆయన తన అధ్యాపక పదవికి రాజీనామా చేసి, ఆ తర్వాత పూర్తిస్థాయిలో పౌర హక్కుల కార్యకలాపాలలో నిమగ్నమయ్యారు. మొదట ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీ (APCLC)కి 15 సంవత్సరాల పాటు ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత 1998లో తాను స్థాపించడంలో సహాయపడిన హ్యూమన్ రైట్స్ ఫోరమ్ (HRF) అనే సంస్థలో పనిచేశారు.
▪️పౌరహక్కుల ఉద్యమం
1) APCLC లో పాత్ర: 1983 నుండి 1998 వరకు ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం (APCLC) ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు.
2) మానవ హక్కుల వేదిక (HRF): నక్సలైట్లు/మాోయిస్టుల హింసను, అలాగే ప్రభుత్వ రాజ్యహింసను (బూటకపు ఎన్‌కౌంటర్లు) ఒకేలా వ్యతిరేకించాలనే సైద్ధాంతిక భేదాల వల్ల ఆయన APCLC నుండి బయటకు వచ్చారు. ఆ తర్వాత 1998లో మానవ హక్కుల వేదిక (Human Rights Forum - HRF) ను స్థాపించారు.
3) దేశవ్యాప్త పర్యటనలు: కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, గుజరాత్ అల్లర్ల నుండి ఈశాన్య రాష్ట్రాల వరకు ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా అక్కడికి వెళ్లి నిజనిర్ధారణ నివేదికలు (Fact-finding reports) రూపొందించారు.
.....
దాదాపు మూడు దశాబ్దాల గణతంత్ర రాజ్యం సంక్షోభంలోకి జారిన 1975 నాటి భారత అత్యవసర పరిస్థితి వల్ల రాజకీయ చైతన్యం పొందిన తరానికి బాలగోపాల్ చెందినవారు. ఏకపక్ష అరెస్టులు, విచారణ లేని నిర్బంధాలు, మర్మమైన మరణాలు నిరంకుశ రాజ్యం రాకకు సంకేతాలుగా నిలిచాయి. సార్వభౌమ శ్రేయస్సు పేరిట అలా చేస్తున్నామని ప్రకటిస్తూనే, తమ దేశ-రాజ్యం ఏమి చేయగలదో, శిక్ష నుండి ఎలా తప్పించుకోగలదో భారత పౌరులు ముందుగానే రుచి చూశారు. యువకుడిగా, విమర్శనాత్మక దృక్పథంతో ఉండటం అంటే ఆనాటి పరిస్థితులతో మమేకమవ్వడమే. బాలగోపాల్ కూడా అలాగే చేశారు: మార్క్సిజంపై ఆసక్తితో మొదలుపెట్టి, ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని పోరాటపటిమ గల వామపక్ష రాజకీయాలను అనుసరించారు, వాటికి మద్దతు ఇచ్చారు. ముఖ్యంగా, గ్రామీణ ఆంధ్రలోని ఆదివాసులు, దళితులతో కూడిన అతిపెద్ద అణగారిన వర్గాలను ఒక బలమైన రాజకీయ శక్తిగా సంఘటితం చేయడంలో ఆ వామపక్షాలు చేసిన కృషికి ఆయన అండగా నిలిచారు.
▪️ప్రజా న్యాయవాదిగా (Lawyer)
అణగారిన వర్గాల తరఫున కోర్టుల్లో పోరాడేందుకు ఆయన తన 40 ఏళ్ల వయసులో న్యాయశాస్త్రం (Law) చదివి న్యాయవాదిగా మారారు.పోలీసు బూటకపు ఎన్‌కౌంటర్లు, లాకప్ డెత్‌లు, చుండూరు దళిత నరమేధం వంటి అనేక కేసుల్లో బాధితుల తరఫున పైసా ఖర్చు లేకుండా వాదించి ఉచిత న్యాయ సహాయం అందించారు.
.......
మన జనాభాలోని అత్యంత అట్టడుగు వర్గాలకు చెందిన భూమి, వనరులను పొందే హక్కులు, మరియు హక్కుల కోతకు సంబంధించిన కేసులను ఆయన చేపట్టారు. తన న్యాయవాద వృత్తిలో ఎంతో నిశితంగా ఉంటూ, రాజ్యాంగంలో పొందుపరచబడిన అటువంటి హక్కులను పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నప్పటికీ, భారత కుల సమాజం యొక్క 'చట్టవిరుద్ధ' స్వభావం గురించి ఆయనకు ఎలాంటి భ్రమలు లేవు. అంతేకాకుండా, దేశంలోని చాలా ప్రాంతాలలో ప్రాచీన శాసనకర్త అయిన మనువు యొక్క శాసనం ఇప్పటికీ అమలులో ఉందని ఆయన అనేక సందర్భాలలో ఎత్తి చూపారు. అందువల్ల, హక్కుల ఉద్యమాలు ప్రభుత్వ తప్పిదాల వల్ల కలిగే ఉల్లంఘనలతో పాటు, పౌర శిక్షా రాహిత్యం వల్ల కలిగే ఉల్లంఘనలతో కూడా నిరంతరం పోరాడవలసి వచ్చింది.
▪️రచయితగా మరియు ఆలోచనాపరుడిగా...
బాలగోపాల్ గారు పౌర హక్కుల కార్యకర్త కావడంతో పాటు, ఒక గొప్ప రచయిత కూడా. ఆయన గొప్ప ఒరిజినల్ థింకర్ (మౌలిక ఆలోచనాపరుడు). కులం, వర్గం, ప్రజాస్వామ్యం, ఆర్థిక విధానాలపై ఆయన రాసిన వ్యాసాలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. ప్రసిద్ధ వారపత్రిక ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ (EPW) లో మూడు దశాబ్దాల పాటు అనేక విశ్లేషణాత్మక వ్యాసాలు రాశారు. ఆయన రాసిన వ్యాసాల సంకలనాలు 'Ear to the Ground' వంటి పుస్తకాలుగా ప్రచురితమయ్యాయి.
......

ఆయన తెలుగు, ఆంగ్ల భాషలలో హక్కుల విషయాలపై రాశారు. ఆయన వ్యాసాలు దాదాపు ఎల్లప్పుడూ కేవలం జరిగిన సంఘటనల నివేదికల కన్నా ఎక్కువగా ఉండేవి. ఈ విషయంలో ఆయన ఒక కొత్త రాత ప్రక్రియకు మార్గదర్శకుడని చెప్పవచ్చు; అది వర్ణనాతీతమైనది: స్థానిక వివరాలు, చరిత్రలపై నిష్కళంకమైన శ్రద్ధ చూపుతూనే, వేగవంతమైన, హింసాత్మక పరివర్తనలో ఉన్న ఒక సమాజంలోని వర్గ, కుల స్వరూపాలను మనకు వివరిస్తూ, ఆయన విస్తృత చిత్రాన్ని ఆవిష్కరించగలిగారు. చివరికి, ఒక సంఘటనను దాని తక్షణ, చారిత్రక సందర్భాలలో, వర్గాలు, కులాల మధ్య మరియు భారత ప్రజలకు, భారత రాజ్యానికి మధ్య మారుతున్న సామాజిక, రాజకీయ సంబంధాల నేపథ్యంలో ఎలా 'చదవాలో' మనం నేర్చుకున్నాం.
▪️హిందుత్వ ఆవిర్భావాన్ని రాజకీయ విశ్లేషణలో ప్రతిభావంతుడు....
అదేవిధంగా, హిందూ మితవాదంపై ఆయన రాసిన అనేక రచనలలో స్పష్టంగా కనిపించే, భారతదేశంలోని రాజకీయ జీవితంలోని నిరంకుశ అంశాలపై ఆయనకున్న అవగాహన, హిందుత్వ యొక్క వికారమైన స్వరూపాలను వివరిస్తూ, కొత్త దిశలను సూచిస్తున్నాయి: హిందుత్వ ఆవిర్భావాన్ని వీలైనంత కచ్చితంగా గుర్తించాల్సిన అవసరం, మరియు ప్రజాస్వామ్య వైఫల్యం, అంతేకాక రాజకీయ అవకాశవాదం కలిసి మితవాదానికి ఏ విధంగా కొంత రాజకీయ గౌరవాన్ని సంపాదించిపెట్టాయో తెలుసుకోవాల్సిన అవసరం.
రాజకీయ విశ్లేషణలో ప్రతిభావంతుడు, సామాజిక తార్కికంలో నిశిత పరిశీలకుడు అయిన బాలగోపాల్, అన్నింటికంటే ముఖ్యంగా జీవన నైతికత గురించి, మనం ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించాలనే దాని గురించి ఆందోళన చెందారు. అన్నింటికన్నా మించి, సమానత్వం మరియు న్యాయం కోసం మన సామూహిక హక్కులను ధృవీకరిస్తూ, గౌరవ స్ఫూర్తితో మనం ఒకరితో ఒకరు ఎలా జీవించగలమోనని ఆయన తీవ్రంగా మదనపడ్డారు.
......
బాలగోపాల్ అత్యంత సాధారణ జీవితాన్ని గడిపారు. ఎప్పుడూ రైళ్లలో సాధారణ క్లాస్‌లోనే ప్రయాణిస్తూ, ప్రజల సమస్యల కోసం నిరంతరం శ్రమించేవారు. తెలుగు సమాజానికి ఒక 'కన్సైన్స్ కీపర్' (వివేక సాక్షి)గా నిలిచిన ఆయన, 2009 అక్టోబర్ 8న గుండెపోటుతో మరణించారు.

‘సహకార భూమి’కి సంపూర్ణంగా సహకరిస్తాం

సహకార వ్యవస్థకు ఓ దిక్సూచి ఈ పత్రిక

ఆప్కాబ్ చైర్మన్ గన్ని, ఎండీ రామకృష్ణ భరోసా


సహకారభూమి తృతీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తున్న ఆప్కాబ్ చైర్‌పర్సన్ గన్ని వీరాంజనేయులు, ఎండీ ఆర్.వి. రామకృష్ణ, నాబార్డ్ డిజిఎం ఎం.ఎస్.ఆర్. చంద్ర మూర్తి తదితరులు
 

విజయవాడ, జూన్ 9: సహకార రంగం విలువలు, విశిష్టత, సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిస్వార్థంగా కృషిచేస్తున్న ‘సహకారభూమి’ పక్షపత్రికకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ (ఆప్కాబ్) అండగా నిలుస్తుందని సంస్థ చైర్‌పర్సన్ గన్ని వీరాంజనేయులు, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.వి. రామకృష్ణ భరోసా ఇచ్చారు. సహకారభూమి తృతీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను విజయవాడలోని సహకారభూమి జర్నల్ కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో మంగళవారం ఉదయం గన్ని వీరాంజనేయులు ఆవిష్కరించారు. తొలి ప్రతిని విశిష్ట అతిథిగా హాజరైన నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం.ఎస్.ఆర్. చంద్ర మూర్తి, మలి ప్రతిని గౌరవ అతిథి ఆర్.వి. రామకృష్ణకు అందజేశారు. 

ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథిగా ఆప్కాబ్ చైర్‌పర్సన్ గన్ని మాట్లాడుతూ.. సహకార రంగం బలోపేతానికి ఇటువంటి పత్రికలు అత్యంత అవసరమని చెప్పారు. సహకారభూమి వ్యవస్థాపకులైన సహకారవేత్తలు, సీనియర్ జర్నలిస్టులు, సంఘాలు ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా, సహకార ఉద్యమం సజీవంగా ఉండాలని, దాని విలువలు సమాజానికి తెలియజేయాలనే మహోన్నత లక్ష్యంతో ఈ పత్రికను నిర్వహిస్తున్నారని కొనియాడారు. సహకార రంగానికి సంబంధించిన సమాచారం, చరిత్ర, విలువలు, స్ఫూర్తిదాయక గాథలను ప్రజలకు చేరవేస్తూ సహకారభూమి ఒక ఉద్యమంలా పనిచేస్తోందని గన్ని కితాబిచ్చారు. సహకారభూమి కార్యాలయంలో సహకార స్ఫూర్తిని ప్రతిబింబించే నినాదాలు, సహకార ఉద్యమ ప్రముఖుల చిత్రాలు, వారి సేవలను ప్రదర్శించిన తీరు తనను ఎంతో ప్రభావితం చేసిందని చెప్పారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన సహకారోద్యమ సీనియర్ నాయకుడు దాసరి కేశవులును హృదయపూర్వకంగా అభినందిస్తున్నానన్నారు. ‘సహకారం మన సంస్కృతి -  సహజీవనం మన సంప్రదాయం, సంఘశక్తే సహకార శక్తి’ వంటి సందేశాలు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.

నేటి డిజిటల్ యుగంలో పుస్తక పఠనంపై ఆసక్తి తగ్గుతున్నా, సహకార రంగానికి సంబంధించిన అవగాహన కల్పించే పత్రికల అవసరం మరింత పెరిగిందన్నారు. సహకార రంగంలో జరుగుతున్న సేవలు, విజయాలు, సవాళ్లు ప్రజలకు తెలియాలంటే సహకారభూమి వంటి వేదికలు నిరంతరం కొనసాగాల్సిన అవసరం ఉందని గన్ని చెప్పారు. ఈ నేపథ్యంలో సహకారభూమి పత్రికకు సంస్థాగత మద్దతు అందించే అంశాన్ని ఆప్కాబ్ స్థాయిలో పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఆప్కాబ్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డిసిసిబి)లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (ప్యాక్స్) స్థాయిలో పత్రిక విస్తరణకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ అంశాన్ని ఆప్కాబ్ జనరల్ బాడీ సమావేశంలో చర్చించి, సహకారభూమికి సాధ్యమైనంత సహకారం అందించే దిశగా కృషి చేస్తామని గన్ని వివరించారు.

సహకార రంగానికి సేవలందిస్తున్న ఇటువంటి కార్యక్రమాలకు అందించగలిగే మద్దతు, సహాయంపై నాబార్డ్ అధికారులతోనూ చర్చిస్తామని తెలిపారు. సహకారభూమి సహకార విలువలను పరిరక్షిస్తూ, రైతులు, మహిళా సంఘాలు, ఉద్యోగులు, మేధావుల్లో సహకార స్ఫూర్తిని పెంపొందించే దిశగా చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రాబోయే తరాల మనస్సుల్లో సహకార భావజాలం నిలిచిపోయేలా పత్రిక చేస్తున్న సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తూ ఎడిటర్ అక్బర్ పాషా, న్యూస్ బ్యూరో చీఫ్ కృష్ణ, పత్రిక బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. పత్రిక డిజిటల్ రూపంలోనూ అందుబాటులోకి రావాలని సూచిస్తూ, అందుకు వ్యయమయ్యే 50 వేల రూపాయలు, పత్రిక కార్యాలయం నిర్వహణకు మరో 10 వేల రూపాయలను వ్యక్తిగత విరాళంగా ప్రకటించి, అక్కడికక్కడే అందజేశారు. 

గౌరవ అతిథిగా హాజరైన ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.వి. రామకృష్ణ సందేశమిస్తూ.. పత్రిక అన్ని సంఘాలకు చేరాల్సిన అవసరముందని, ఇందుకు ఆప్కాబ్ చేయూతనిస్తుందని చెప్పారు. వెబ్సైట్ రూపకల్పన కోసం ఆయన కూడా సంస్థ తరపున 50 వేల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని కూడా ఆప్కాబ్ అందిస్తుందని భరోసా ఇచ్చారు. విశిష్ట అతిథిగా నాబార్డ్ ప్రతినిధి చంద్ర మూర్తి సందేశమిస్తూ.. సహకారభూమి పత్రిక అత్యవసరంగా డిజిటల్ రూపంలోకి రావాల్సిన అవసరముందన్నారు. పత్రికకు నాబార్డ్ అందించే సాయంపై కూడా ఆలోచన చేస్తామని, తమ సంస్థ నుంచి కూడా సాంకేతిక సహకారం పొందవచ్చని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమానికి వెటరన్ జర్నలిస్ట్ వడ్లమూడి పద్మావతి అధ్యక్షత వహించారు. సీనియర్ జర్నలిస్ట్, పాత్రికేయుల సంఘ నేత చావా రవి సభకు స్వాగతం పలికారు. సీనియర్ సహకరవాదులు, జర్నలిస్టులు దాసరి కేశవులు, ఇఫ్కో రవీంద్ర, జి.వి. రంగారెడ్డి, శిరందాసు నాగార్జున, ప్రసాదరెడ్డి, టి.వి. నరసింహారావు, దుర్గరాజు స్వాతి, డి. రామారావు, వై. శ్రీనివాసరావు, శివప్రసాద్, సీనియర్ ఫొటోగ్రాఫర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Jun 4, 2026

చివరి 60 నెలల సగటు వేతనం ఆధారంగానే పూర్తి పెన్షన్‌ లెక్కింపు

 

ఈపీఎఫ్ఓ (EPFO) అవలంబిస్తున్న 'ప్రొ-రేటా' (Pro-rata) పద్ధతిని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు కొట్టివేసింది. సర్వీస్ కాలాన్ని విభజించి పెన్షన్‌ను తగ్గించే పాత పద్ధతి చెల్లదని, పదవీ విరమణ సమయంలో చివరిగా తీసుకున్న 60 నెలల సగటు వేతనం ఆధారంగానే పూర్తి పెన్షన్‌ను లెక్కించాలని స్పష్టం చేసింది.

ఈపీఎఫ్ పెన్షన్ లెక్కింపుపై పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాల వివరాలు:

ప్రొ-రేటా పద్ధతి రద్దు: 2014 సవరణ తర్వాత ఈపీఎఫ్ఓ ప్రవేశపెట్టిన ప్రొ-రేటా పద్ధతిని కోర్టు తప్పుబట్టింది. దీనివల్ల ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్ భారీగా తగ్గిపోతుందని పేర్కొంది. 

సరైన లెక్కింపు సూత్రం: పదవీ విరమణకు ముందున్న చివరి 60 నెలల (5 సంవత్సరాలు) సగటు జీతం ఆధారంగానే పింఛనును లెక్కించాలని ఆదేశించింది.అర్హులైన వారందరికీ వర్తింపు: ఈ తీర్పు కేవలం పిటిషన్ వేసిన వారికి మాత్రమే కాకుండా, అర్హులైన ప్రతి ఒక్క ఉద్యోగికి/పెన్షనర్‌కు వర్తిస్తుందని స్పష్టం చేసింది. 

వడ్డీతో బకాయిలు: ఈపీఎఫ్ఓ తప్పుడు విధానాల వల్ల పెన్షన్ కోల్పోయిన వారికి, ఆ బకాయిలను 8 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.


పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు – అధిక PF పెన్షన్‌పై కీలక తీర్పు

ప్రో-రాటా విధానం రద్దు

▶▶ ఉద్యోగ సేవా కాలాన్ని విభజించకుండా పెన్షన్‌ను లెక్కించాలి : 12 వారాల్లో అమలు

కె. సునిల్‌కుమార్

పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) అమలు చేసిన ప్రో-రాటా (అనుపాత) విధానాన్ని రద్దు చేసింది. ఈ విధానం ద్వారా అధిక PF పెన్షన్ లెక్కింపులో వివాదాస్పద ఆదేశాలు జారీ చేయబడ్డాయి.

హైకోర్టు న్యాయమూర్తి హర్‌ప్రీత్ సింగ్ బ్రార్ ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం, పెన్షన్‌ను లెక్కించేటప్పుడు 2014 సెప్టెంబర్ 1కు ముందు మరియు తర్వాత సేవా కాలాన్ని విడదీయకూడదు. బదులుగా, చివరి 60 నెలల సగటు వేతనం ఆధారంగా మొత్తం పెన్షన్‌ను లెక్కించాలి.

పెన్షన్ పునఃలెక్కింపుతో వచ్చే బకాయిలపై 8% వడ్డీ కూడా చెల్లించాలని సూచించింది.

ఈ తీర్పులో పెన్షనర్లు చాలా కాలంగా కోర్టుల్లో లేవనెత్తుతున్న పలు అంశాలపై అనుకూల ఆదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా, డీఏ (Dearness Allowance) మరియు వేతన సవరణ బకాయిలను కూడా పెన్షన్ లెక్కింపులో పరిగణనలోకి తీసుకోవాలి అని పేర్కొంది.

ముఖ్యాంశాలు

2024 ఫిబ్రవరి 14న EPFO జారీ చేసిన ప్రో-రాటా విధానం అమలు సర్క్యులర్‌ను కోర్టు రద్దు చేసింది.

సురీందర్ కుమార్ సింగ్ సహా వంద మందికి పైగా ఈ పిటిషన్ దాఖలు చేశారు.

అయితే ఈ తీర్పు కేవలం పిటిషనర్లకే కాకుండా అందరికీ వర్తిస్తుంది అని కోర్టు స్పష్టం చేసింది.

ప్రయోజనాలు పొందేందుకు పెన్షనర్లు మళ్లీ కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం లేదని తెలిపింది.

అలాగే, ఈ కేసులో పిటిషన్ దాఖలు చేసిన వారి పెన్షన్ పునఃపరిశీలన, బకాయిల చెల్లింపు మరియు వడ్డీ చెల్లింపును 12 వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది.

ఈ నెల 27న జారీ చేసిన సమాధానం ప్రకారం, ఇతర అర్హులైన పెన్షనర్లు కూడా 3 నెలలలోపు EPFO అధికారులకు దరఖాస్తు చేసి ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.

Jun 3, 2026

పర్యావరణ, ప్రజా ఆరోగ్యమే ‘స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర’ లక్ష్యం


భవిష్యత్తులో తలెత్తే సమస్యలను, అవసరాలను ముందుగానే ఊహించగల దార్శనికుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పారిశుద్ధ్యంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానానికి తీసుకువెళ్లేందుకు,  ప్లాస్టిక్ ఫ్రీ రాష్ట్రంగా రూపు దిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు.  నిర్దేశించిన లక్ష్యాల సాధన దిశగా కార్పోరేషన్ విజయవంతంగా ముందుకు సాగుతోంది. పర్యావరణ పరిరక్షణ, ప్రజా ఆరోగ్యమే ‘స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర’ లక్ష్యం.  చెత్త పన్నుని రద్దు చేయడంతోపాటు చెత్త నుంచి కూడా ఆదాయం సమకూర్చే మార్గాలను గృహిణులకు ఈ ప్రభుత్వం చూపుతోంది.  స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాలతో  రాష్ట్రంలో 2015లో ఈ  కార్పొరేషన్ ని ఏర్పాటు చేశారు.  రాష్ట్రంలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం,  వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడానికి దీనిని ప్రారంభించారు.  వ్యర్థాల నిర్వహణ, నీటి సంరక్షణ,  వ్యర్థాలను శుద్ధి చేయడం, వ్యర్థాల నుంచి సంపద సృష్టించడం, వేస్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి,  ప్లాస్టిక్ రీసైక్లింగ్  వంటి అనేక కార్యక్రమాలను చేపడుతోంది.  స్వచ్ఛాంధ్ర విజన్-2047లో భాగంగా  రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడం,  వ్యర్థాలను తడిచెత్త, పొడిచెత్త,  బయోమెడికల్ వేస్ట్... వంటి వివిధ రకాలుగా వేరుచేసి సమర్థవంతంగా నిర్వహించడంలో చురుకుగా ముందుకు సాగుతోంది.  సంపద సృష్టించేవిధంగా రాష్ట్రంలో పలు ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు.  పారిశుద్ధ్యానికి సంబంధించి అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా చేపట్టింది.  మునిసిపల్,  పంచాయతీ సిబ్బందికి, ఆషా వర్కర్లకు, ఆరోగ్య సిబ్బందికి శిక్షణ ఇప్పిస్తోంది. అలాగే, వివిధ వ్యాపార సంస్థల అసోసియేషన్ల వారు, కళాకారులు,  విద్యార్థులు,  విశ్వవిద్యాలయాల వారిని ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.  

సీఎం చంద్రబాబు ప్రతి నెలలో ఒక రోజు పారిశుద్ధ్యానికి కేటాయింపు

ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన రాష్ట్రాంగా మార్చేందుకు  ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా  ప్రతి నెలలో ఒక రోజు(మూడవ శనివారం) ప్రత్యేకంగా స్వచ్ఛ ఆంధ్రకు కేటాయిస్తున్నారు.  ‘స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాలలో స్వయంగా పాల్గొంటూ,  తానే చీపురు పట్టుకుని వీధులను శుభ్రంచేయడంతోపాటు పరిసరాలన్నిటినీ పరిశీలిస్తున్నారు.  పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడుతున్నారు. వారి వృత్తిలో తలెత్తే సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తున్నారు.  సీఎం,  కార్పొరేషన్ చైర్మన్  పాల్గొనడంతో,  ప్రతి జిల్లాలో కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు కూడా పాల్గొంటుండటంతో ఈ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయి. మంచి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి.

గ్రీన్ ఏపీ లక్ష్యంగా

గ్రీన్ ఏపీ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన వనరులు,  హరిత హైడ్రోజన్,  పచ్చదనాన్ని పెంచడం,  కాలుష్య నిర్మూలనపై దృష్టి సారించింది.  ఇందులో భాగంగా 2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో దేశంలో మన రాష్ట్రం ప్రధాన పాత్ర పోషించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది.  ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నారు. అర్బన్, టెర్రెస్ గార్డెనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  ఇళ్లలో తయారు చేసే వివిధ రకాల కంపోస్టింగ్ కి సంబంధించి వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో పచ్చదనం విస్తరిస్తోంది. ఈ పచ్చదనం వల్ల ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో వాతావరణంలో వేడి తగ్గుతోంది.

పట్టాభిరామ్, అధికారుల బృందం వివిధ రాష్ట్రాలలో అధ్యయనం

కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి  లక్ష్యాలను ఓ యజ్ఞంలా స్వీకరించి కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పట్టాభిరామ్ దేశంలోని పలు రాష్ట్రాలలో పర్యటించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్, మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబై, నవీ ముంబై,  పూణే మెట్రోపాలిటన్ ప్రాంతంలో పారిశ్రామిక కేంద్రం  పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్, గుజరాత్ లోని సూరత్, వడోదర, అహ్మదాబాద్, కర్ణాటకలోని మంగళూరు,  ఉడిపి, పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతా, ఉత్తర ప్రదేశ్ లోని లక్నో, తెలంగాణలోని సిద్ధిపేట.... వంటి నగరాలు, పట్టణాలలో పర్యటించి అక్కడి పారిశుద్ధ్య పరిస్థితులను అధ్యయనం చేశారు.  ఆయా కార్పోరేషన్లలో ఇంటింటా చెత్త సేకరణ విధానం,  తడిచెత్త, పొడి చెత్త వేరుచేయడం,   తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువు తయారీ,  సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ ప్రక్రియలు, చెత్త నుంచి బయోగ్యాస్‌ ఉత్పత్తి, ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి ప్లాస్టిక్‌ టైల్స్‌ తయారీ విధానం,  పట్టణంలోని మౌలిక సదుపాయాల నిర్వహణ...మొదలైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పట్టాభిరామ్ తన వ్యక్తిగత యూరప్ పర్యటనలో కూడా పలు నగరాలలో పర్యటించి అక్కడ అవలంబించే పద్ధతులను అధ్యయనం చేశారు. డెన్మార్క్, జర్మనీ, నెదర్లాండ్, స్విడ్జర్లాండ్.. మొదలైన దేశాలలో పర్యటించి వేస్ట్‌ మేనేజ్మెంట్‌, వేస్ట్ రీసైక్లింగ్... వంటి అంశాలను పరిశీలించారు.   వారి పర్యటనలలో గ్రహించిన అంశాలను, మన రాష్ట్రంలో అమలు చేయదగినవాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

స్వచ్ఛ అవార్డులు ప్రకటించిన తొలి రాష్ట్రం ఏపీ

‘స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాలలో  చురుకుగా పాల్గొనేవారి సేవలను గుర్తించి, అటువంటి వారిని గౌరవించి,  ప్రోత్సహించే విధంగా గత అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను ఇవ్వడం ప్రారంభించింది. దేశంలో ఇటువంటి అవార్డులను ప్రారంభించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. స్వచ్ఛ చాంపియన్ పేరుతో  ఈ అవార్డులను వ్యక్తులకు, సంస్థలకు ఇచ్చా రు. మొత్తం అన్ని వర్గాల వారిని స్వచ్ఛ మునిసిపాలిటీలు, స్వచ్ఛ ఎస్ఎల్ఎఫ్(స్లమ్ లెవెల్ ఫెడరేషన్స్), స్వచ్ఛ పాఠశాలలు,  స్వచ్ఛ హాస్పటల్స్,  స్వచ్ఛ బస్ స్టేషన్లు,  స్వచ్ఛ హోటల్స్,  స్వచ్ఛ పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ),  స్వచ్ఛ వారియర్స్(శానిటేషన్ వర్కర్లు),  స్వచ్ఛ గ్రామ పంచాయితీలు,  స్వచ్ఛ గ్రామ సంస్థలు,  స్వచ్ఛ అంగన్ వాడీలు,  స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాలు,  స్వచ్ఛ రైతుబజార్లు,  స్వచ్ఛ పరిశ్రమలు(అతిపెద్ద, పెద్ద),  స్వచ్ఛ ఎన్‌జీవోస్(స్వచ్ఛంద సంస్థలు)/పౌర సంస్థలు,  స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్స్ అని 12 కేటగిరీలుగా విభజించి ఈ అవార్డులు ఇచ్చారు.  రాష్ట్ర వ్యాప్తంగా 52 రాష్ట్ర స్థాయి, 1,421 జిల్లా స్థాయి అవార్డులు ఇచ్చారు. పారిశుద్ధ్యం పర్యావరణ పట్ల ఆసక్తి ఉన్నవారిలో  ఈ అవార్డులు ఉత్సాహం నింపాయి.

రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్రీ కార్యాలయాలు

పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ముందుగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించి, ప్లాస్టిక్ రహిత మునిసిపల్ కార్యాలయాలుగా మార్చడానికి శ్రీకారం చుట్టారు. తొలుత అమరావతిలోని ఏపీ సెక్రెటేరియేట్ నుంచి మొదలు పెట్టారు. గత ఆగస్టు 15 నుంచి సచివాలయంలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, కప్పులు,  ప్లేట్లు, క్యారీ బ్యాగులు వంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా  నిషేధించారు.  వాటి స్థానంలో స్టీల్,  గాజు బాటిళ్లను వాడుతున్నారు. ఆర్ఓ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు.  ప్రతి ఉద్యోగికి ఉచితంగా స్టీల్ బాటిళ్లు అందజేశారు.  సచివాలయాన్ని అత్యుత్తమ పనితీరుతో దేశంలోనే మొదటిసారిగా ప్లాస్టిక్ ఫ్రీ సెక్రటేరియట్ గా మార్చినందుకు  స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్‌కు 2025 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక స్కాచ్ గోల్డ్ అవార్డ్ కూడా లభించింది. అమరావతిలోని  స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కార్యాలయంలో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించి, ప్లాస్టిక్ రహిత కార్యాలయంగా మార్చేశారు.  తొలుత అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఈ విధానాన్ని విస్తరిస్తున్నారు. ఇప్పటికే  రాష్ట్రంలో  మొత్తం 26 జిల్లాల్లోని  20 జిల్లాల్లో  62 మునిసిపల్ కార్యాలయాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ కార్యాలయాలుగా మారాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆదర్శంగా తీసుకుని కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ కూడా రోజుకు 15 నుంచి 18 గంటలు పని చేస్తున్నారు. వివిధ ప్రాంతాలలో పర్యటించడంతోపాటు అధికారులు, ఏజన్సీలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, అందరూ లక్ష్య సాధనలో నిమగ్నమయ్యే విధంగా ఉత్సాహపరుస్తున్నారు.

-శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Jun 1, 2026

వైభవంగా గుత్తికొండ ధనుంజయ జన్మదిన వేడుకలు











మంగళగిరి:  మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో  సభ్యులు  గుత్తికొండ ధనుజయరావు  జన్మదిన వేడుకలు గుంటూరు జిల్లా మంగళగిరిలోని దామర్ల నాంచారమ్మా చెరువు ప్రాంగణంలోని భవనారుషి స్వామి వారి దేవస్థానంలో సోమవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగాయి. మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంగళగిరి బుద్ధ విహార అధ్యక్షులు రేకా కృష్ణార్జున రావు  మాట్లాడుతూ సాహితీ కళారంగాల అభ్యున్నతికి గుత్తికొండ ధనుంజయరావు గారు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవని అన్నారు. విశ్వశాంతి కళాపరిషత్ కన్వీనర్ పొట్లాబాత్తుని లక్ష్మణరావు మాట్లాడుతూ నిబద్దత, ఓర్పు, సహనంతో కూడిన వైఖరి కారణంగానే గుత్తికొండ ధనుంజయరావు గారిని తెలుగుదేశం పార్టీలో అత్యున్నత పొలిట్ బ్యూరో పదవి వరించిందని చెప్పారు. ఈ విధంగా సామాన్య కార్యకర్తను గౌరవించడం తెలుగుదేశం పార్టీ గొప్పతనం అని అభిప్రాయపడ్డారు. తోలుత మానవతా వేదిక కమిటీ సభ్యులు అందరూ సమూహంగా ధనుంజయరావు దంపతులను ఘనంగా సన్మానించారు. అటుపిమ్మట పురప్రముఖులు, బంధుమిత్రులు, స్నేహితులు, అభిమానులు శాలువాళ్లతోనూ, పుష్పగుచ్చాలతోనూ ఘనంగా సత్కరించారు.

పద్మశాలీయ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, దుగ్గిరాల మండల తెలుదేశం పార్టీ అధ్యక్షులు కేసంనేని శ్రీ అనిత, ధనుంజయరావు బాల్యమిత్రులు అల్లక తాతారావు, సందుపట్ల భూపతి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ మంచా విజయమోహనరావు, ఆంధ్ర నాటక కళాసమితి అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు, సీనియర్ పాత్రికేయులు శిరందాసు నాగార్జున తదితరులు పాల్గొన్నారు. పండుగ వాతావరణాన్ని తలపించే రీతిలో జరిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధనుజయరావు దంపతులు ధన్యవాదాలు తెలిపారు.

జీవితం అంటే ఎవరూ లీక్ చేయని పరీక్షా పత్రం

శ్రీహరి ‘సిత్రా’లుపై సమీక్ష



సైకాలజీపై 26 పుస్తకాలు రాసిన ఓ ప్రొఫెసర్ రాసిన కవిత్వం ఇది. వివిధ రకాలైన ఛాయా చిత్రాలను చూసి స్పందించి, అనుభూతిపొంది రాసిన కవిత్వం ఇది. తెలుగు సాహిత్యంలో ఇది ఓ సరికొత్త ప్రక్రియ. ఛాయా చిత్రాలు, దృశ్యాలను చూసి వాటిలోని భావోద్వేగాలు, కవి ఆలోచనల దొంతరల నుంచి అక్షర బద్ధంచేసే కవిత్వ ప్రక్రియ ఇది. దీనిని ఛాయాచిత్రాల కవిత్వం ( ఫొటో పొయెట్రీ) అంటారు. తెలుగు సాహిత్యంలో ఈ రకమైన కవిత్వానికి ఆధ్యుడు అని చెప్పలేం గానీ, ఛాయాచిత్రాల కవిత్వం రాసిన మొదటితరం కవిగా డాక్టర్ మురుగుడు శ్రీహరి నిలుస్తారు. ఈ రకమైన కవిత్వం రాయడం ఆయన 1984లోనే ప్రారంభించారు. అయితే, పుస్తక రూపంలో ఇప్పుడే తీసుకువచ్చారు. ఈ చిత్రాలలో ఎన్నో భావాలు, బాధలు, వ్యధలు, ఆనందం, చీకటి, వెలుగు, సముద్రం, దాని సవ్వడులు, అలల శబ్దాలు, అగాధం, అలసట, అలజడి, ఆశ, నిరాశ, ఆనందం, అపురూపం, ఒంటరితనం, స్పష్టత, అస్పష్టత, బ్రాంతి, భారతీయ జీవితం, సాగర తీరం, శబ్దం, నిశ్శబ్దం, ప్రకృతి, సంస్కృతి.... ఇలా ఎన్నో కనిపిస్తాయి. ఆ దృశ్యాలను కవితలుగా మలచిన తీరు అద్భుతం. మనసు లోతులను తాకుతాయి ఇందులోని చిత్రాలు, కవితలు. ప్రేమ, భావ, అభ్యుదయ, అనుభూతి, మనసు..... అన్ని రకాల కవిత్వం ఈ పుస్తకంలో ఉంది.

అమ్మ గురించి అద్భుతంగా రాశారు. ‘‘అమ్మకు నా ఆకలి చెప్పాల్సిన అవసరం రాలేదు... బాల్యంలో నా పిచ్చి భాషను క్షణంలో పసిగట్టేది .....’’ ఇలా అందరికీ అమ్మ జ్ఞాపకాలు గుర్తుకుతెస్తారు శ్రీహరి. అడుగు మొదలయ్యాక ఆగదు.. తర్వాత అద్భుం...., చూసికూడా రాయలేని పరీక్షే జీవితం... అని సాగుతుంది శ్రీహరి కవిత్వం. ఒంటరిగా పోరాడే తెగువ ఉంటే, చిన్న బిందువ కూడా సునామీనే, గెలుపు రుచి చూపిస్తుందని చక్కటి కవిత్వం రాశారు. జీవితం అంటే సమాధానాలు దొరకని, ఎవరూ లీక్ చేయని పరీక్షా పత్రంగా పేర్కొన్నారు. జీవితం గురించి ఇంతకంటే ఎవరైనా ఏం చెప్పగలం!. దారంకంటే సులువుగా తెగిపోయే బంధాలు... ఎవరికీ ఎవరూ ఏమీ కాని సమాజం.... అని ఓ వాస్తవాన్ని చాలా గొప్పగా చెప్పారు. జారుతున్న కన్నీటి బొట్టు గురించి చాలా చక్కగా రాశారు. అంతేకాదు, ఆ బొట్టుకు విలువకట్టే తరాజు ఈ సృష్టిలో ఎక్కడ? అని ప్రశ్నించారు. ఎలా బతకాలో తెలుసుకోవడానికి ఒక్క జ్ఞాపకం చాలంటారు. నిన్ను నువ్వు మలుచుకునే ఓ ఆయుధం ఒంటరితనం అని ఓ నగ్నసత్యాన్ని చెప్పారు. ప్రేమంటే బ్రాయ్ ఫ్రెండ్, గర్ల ఫ్రెండ్ గా ఉండటం కాదని, ఎలా ఉండాలో వివరించి మరీ కవిత రూపంలో చెప్పారు. బుతువులు సైతం లెక్కచేయకుండా కబుర్లు చెప్పి, ఇప్పుడు శిథిలమైపోతున్న పోస్టు బాక్సు దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ చక్కటి కవిత రాశారు. ఇలా ఎన్నో భావాలు, వాస్తవాలు, అనుభూతులు ఇందులో ఉన్నాయి. అంతేకాదు, అవి ప్రతిబింభించే చిత్రాలు కూడా ఉన్నాయి. ప్రతి ఫొటో వెనుక ఓ కథ మనకు కనిపిస్తుంది. ఫొటోలకు తగ్గట్టుగా కవితలు రాశారు. అయితే, ఈ పుస్తకంలోని ఫొటోలు కలర్ లో లేకపోవడం వెలితిగా అనిపించింది. భావాలను అర్థం చేసుకోవడానికి రంగులు కూడా ముఖ్యం.
పుస్తక సమీక్షులు: శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914
పుస్తకం : శ్రీహరి ‘సిత్రా’లు
రచయిత : డాక్టర్ మురుగుడు శ్రీహరి
పుస్తకాల కోసం : 9441693323

May 25, 2026

రాష్ట్ర శాసనమండలి సభ్యుల నియామకానికి నిబంధనలు

 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(3)(e) అనేది రాష్ట్ర శాసనమండలి (Legislative Council లేదా Vidhan Parishad) సభ్యుల నియామకానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిబంధన. ఈ నిబంధన ప్రకారం, ఒక రాష్ట్ర శాసనమండలిలోని మొత్తం సభ్యులలో మిగిలిన భాగాన్ని (అంటే దాదాపు 1/6 వంతు సభ్యులను) ఆ రాష్ట్ర గవర్నర్ నామినేట్ (నియమించాల్సి) ఉంటుంది.

 గవర్నర్ ఎవరిని నామినేట్ చేస్తారు?

 (అర్హతలు)

ఆర్టికల్ 171 లోని క్లాజ్ (5) ప్రకారం,  సమాజంలో  5 రంగాలలో,  విశేషమైన జ్ఞానం లేదా ప్రాక్టికల్ అనుభవం (Practical Experience) ఉన్న వ్యక్తులను గవర్నర్ శాసనమండలి సభ్యులుగా (MLC) నామినేట్ చేస్తారు.

 1. సాహిత్యం (Literature): గొప్ప రచయితలు, కవులు లేదా భాషా కోవిదులు.

 2. శాస్త్ర సాంకేతిక రంగాలు (Science): శాస్త్రవేత్తలు, పరిశోధకులు.

 3. కళలు (Art) నటన, సంగీతం, చిత్రలేఖనం, శిల్పకళ వంటి రంగాలలో నిపుణులు.

 4. సహకార ఉద్యమం (Co-operative Movement) సహకార సంఘాల బలోపేతానికి కృషి చేసినవారు.

 5. సామాజిక సేవ (Social Service) సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల కోసం సేవలందించిన సామాజిక కార్యకర్తలు.

 శాసనమండలి (ఎగువ సభ) అనేది మేధావుల సభగా పిలవబడుతుంది.

 ఎన్నికల్లో నేరుగా పోటీ చేయకపోయినా, సమాజానికి ఉపయోగపడే వివిధ రంగాల మేధావుల సేవలను చట్టసభలకు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ 171(3)(e) ని పొందుపరిచారు. 

ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా భారతదేశంలో కేవలం 6 రాష్ట్రాలకు మాత్రమే ఇలాంటి శాసనమండలి.

 తెలంగాణ రాష్ట్రంలో శాసనమండలిలో 40 MLC స్థానాలు ఉన్నాయి. 

అందులో 6 MLC స్థానాలను గవర్నర్  నామినేట్ చేస్తారు.

May 18, 2026

హైదరాబాద్‌లో నిలూఫర్ హాస్పిటల్

ఆమె పేరు నిలూఫర్.ఆమె జనవరి 4, 1916న ఇస్తాంబుల్‌లో జన్మించింది. ఆమె తల్లి ఆదిలే సుల్తాన్, ఒట్టోమన్ సుల్తాన్ మురాద్ V మనవరాలు. ఆమె ప్యాలెస్‌లలో పెరిగింది, ఫ్రాన్స్‌లో చదువుకుంది, ఫ్రెంచ్, టర్కిష్ మరియు ఇంగ్లీష్ భాషలలో అనర్గళంగా మాట్లాడేది. ఆమె ఒట్టోమన్ సామ్రాజ్యపు చివరి యువరాణులలో ఒకరు. 1931లో, 15 ఏళ్ల వయసులో, అప్పటి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన  హైదరాబాద్ నిజాం రెండో కుమారుడు ప్రిన్స్ మోజం జాహ్‌తో ఆమెకు వివాహం జరిగింది. భారతదేశం గురించి దాదాపు ఏమీ తెలియకుండానే ఆమె హైదరాబాద్ చేరుకుంది. ఆమె చీర కట్టడం నేర్చుకుంది. ఉర్దూ నేర్చుకుంది. పర్దా పాటించడానికి నిరాకరించింది. నిజాం కుటుంబంలోని ఇతర మహిళలు మూసి ఉన్న తలుపుల వెనుక ఉండిపోగా, నిలూఫర్ బహిరంగ కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, సామాజిక సమావేశాలకు హాజరయ్యేది.  అంతర్జాతీయ పత్రికలు ఆమెను ప్రపంచంలోని పది మంది అత్యంత అందమైన మహిళల్లో ఒకరిగా పేర్కొన్నాయి. కానీ ఆ గ్లామర్ వెనుక ఆమె వ్యక్తిగత జీవితం బాధాకరంగా ఉండేది. ఆమెకు పిల్లలు కలగలేదు. 1948లో ఆమె భర్త రెండో భార్యను చేసుకున్నాడు. 21 ఏళ్ల తర్వాత 1952లో అతను నిలూఫర్‌కు విడాకులు ఇచ్చాడు. విడాకులకు మూడు సంవత్సరాల ముందు, ఆమెకు ఎంతో ఇష్టమైన పని మనిషి రఫతున్నీసా ప్రసవ సమయంలో తగిన వైద్య వసతులు లేకపోవడం వల్ల మరణించింది. తీవ్రంగా బాధపడిన ఆమె “ఇకపై ఏ రఫత్ కూడా మరణించకూడదు.”అని డిసైడ్ అయింది. మహిళలు, పిల్లల కోసం ఒక ప్రత్యేక ఆసుపత్రిని నిర్మించాల్సిందిగా ఆమె నిజాంను ఒప్పించింది.  హైదరాబాద్‌లోని రెడ్ హిల్స్‌లో నిర్మించిన ఈ ఆస్పత్రి 1953లో ప్రారంభమైంది.  నిజాం దీనికి నిలూఫర్ హాస్పిటల్ అని పేరు పెట్టాడు. అది ప్రారంభం కావడం ఆమె ఎన్నడూ చూడలేదు. ఆమె అప్పటికే ఫ్రాన్స్ వెళ్ళిపోయింది.  ఆమె తన శేషజీవితాన్ని పారిస్‌లో గడిపింది. జూన్ 12, 1989న ఆమె73 సంవత్సరాల వయసులో మరణించింది. హైదరాబాద్‌లోని నిలూఫర్ హాస్పిటల్ నేటికీ నిలిచి ఉంది. ఇది 500 పడకలను కలిగి ఉంది. ప్రతి సంవత్సరం వేలాది మంది తల్లులు, పిల్లలకు చికిత్స అందిస్తుంది.  ఆమె ఎన్నడూ తల్లి కాలేదు. కానీ, వేలాది మంది తల్లులకు, పిల్లలకు ప్రాణాదారం అయింది.

ఏపీలో 50 శాతానికి పైగా బీసీ జనాభా

2024 కులగణన నివేదికలో వెల్లడి


 తాజా సమగ్ర కులగణన సర్వేల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ జనాభాలో బీసీలు 50.59% (2.68 కోట్లు) ఉన్నారు. అలాగే తెలంగాణలో బీసీల జనాభా 46.25% ఉండగా, ముస్లిం బీసీలను కలుపుకుంటే మొత్తం శాతం 56.33% కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల సర్వే ఆధారంగా బీసీల గణాంకాలు: 

మొత్తం బీసీ జనాభా: 2.68 కోట్లు

బీసీల జనాభా శాతం: 50.59%

అత్యధిక బీసీ జనాభా ఉన్న జిల్లాలు: శ్రీకాకుళం, కర్నూలు, విశాఖపట్నం

సహాయక చర్యలు: బీసీ సంక్షేమానికి వివిధ ప్రభుత్వాలు కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సాయం, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి.

 రాష్ట్ర మొత్తం జనాభా 5.31 కోట్లు కాగా, వెనకబడిన తరగతుల వారు 2.68 కోట్లు. ఇది మొత్తం జనాభాలో 50.59 శాతం. ఫిబ్రవరి 2024లో అప్పటి YSRCP ప్రభుత్వం ఆధ్వర్యంలో  సచివాలయ సిబ్బంది  రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కుల గణన ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.

BC వర్గంలో 138 కులాలు : రాష్ట్రంలో వెనుకబడిన తరగతులను ఐదు వేర్వేరు విభాగాలుగా వర్గీకరించారు. ఈ విభాగాలు అన్నీ కలిపి మొత్తం 138 కులాలను కలిగి ఉన్నాయి. నిర్దిష్టంగా చెప్పాలంటే BC-A విభాగం కింద 51 కులాలు, BC-B కింద 27, BC-C కింద ఒకటి, BC-D కింద 45, BC-E కింద 14 కులాలు జాబితా చేశారు.


శ్రీకాకుళం జిల్లా జనాభాలో 80.83% మంది BCలే : ప్రతి జిల్లాలోని మొత్తం జనాభాతో పోలిస్తే వెనుకబడిన తరగతుల శాతం పరంగా చూస్తే, శ్రీకాకుళం జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జిల్లా జనాభాలో వెనుకబడిన తరగతుల వాటా 80.83% (19.23 లక్షలు) గా ఉంది. 76.55% (15.14 లక్షలు)తో విజయనగరం జిల్లా రెండవ స్థానంలోనూ, 72.73% (12.74 లక్షలు)తో అనకాపల్లి జిల్లా మూడవ స్థానంలోనూ నిలిచాయి. తర్వాతి స్థానాల్లో కర్నూలు (69.18%), విశాఖపట్నం (67.07%),అనంతపురం (60.25%) జిల్లాలు నిలిచాయి. మొత్తంగా రాష్ట్రం మొత్తాన్ని పరిశీలించినప్పుడు, వెనుకబడిన తరగతుల (BC) జనాభా సాంద్రత అత్యధికంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నట్లు తేలింది.

మరోవైపు చూస్తే, అల్లూరి సీతారామరాజు జిల్లాలో వెనుకబడిన తరగతుల జనాభా చాలా తక్కువగా ఉంది. ఇది కేవలం 3.26 శాతంగా నమోదైంది. పోలవరం (15.16%), తూర్పు గోదావరి (29.43%), ప్రకాశం (33.91%), డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ (38.73%) జిల్లాల్లో కూడా వెనుకబడిన తరగతుల జనాభా మిగిలిన వాటితో పోలిస్తే తక్కువగానే ఉంది.

సంఖ్యా పరంగానూ శ్రీకాకుళమే అగ్రస్థానంలో : సంఖ్యాపరంగా చూసినా కూడా, వెనుకబడిన తరగతుల జనాభా విషయంలో శ్రీకాకుళం జిల్లానే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ జిల్లాలో వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తుల సంఖ్య అత్యధికంగా 19.29 లక్షలుగా నమోదైంది. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో కర్నూలు (18.85 లక్షలు), విశాఖపట్నం (15.48 లక్షలు), అనంతపురం (15.25 లక్షలు), విజయనగరం (15.14 లక్షలు), అనకాపల్లి (12.74 లక్షలు), శ్రీ సత్యసాయి (12.02 లక్షలు) జిల్లాలు ఉన్నాయి. కాకినాడ, నెల్లూరు , నంద్యాల జిల్లాల్లో వెనుకబడిన తరగతుల జనాభా ఒక్కో జిల్లాలో సుమారు 10 లక్షల చొప్పున ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో చాలా తక్కువగా 22,878 మంది వ్యక్తులు నమోదైనప్పటికీ, పోలవరం (60,038), బాపట్ల (5.08 లక్షలు), పార్వతీపురం మన్యం (5.14 లక్షలు), మార్కాపురం (5.16 లక్షలు) జిల్లాల్లో కూడా BC జనాభా సాపేక్షంగా తక్కువగానే ఉంది.

BC-A విభాగంలో 84.72 లక్షల మంది : వెనుకబడిన తరగతుల జనాభాలోని ఉప-విభాగాలను విశ్లేషించగా, BC-A సమూహం అత్యంత పెద్దదిగా వెల్లడైంది. ఇందులో 84.72 లక్షల మంది వ్యక్తులు ఉన్నారు. దీని తర్వాత స్థానాల్లో BC-D (82.88 లక్షలు), BC-B (67.42 లక్షలు), BC-E (32.12 లక్షలు), BC-C (1.70 లక్షలు) వర్గాలు ఉన్నాయి.

BC-A సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ప్రధానంగా శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కనిపిస్తారు.

BC-B జనాభా కర్నూలు, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా ఉంది.

BC-C వర్గానికి చెందిన సభ్యులు అధికంగా పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో కేంద్రీకృతమై ఉన్నారు.

BC-D జనాభా విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో అత్యధికంగా ఉంది.

BC-E వర్గానికి చెందిన వ్యక్తులు ప్రధానంగా కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో కనిపిస్తారు.

May 15, 2026

యువ న్యాయవాదులను భయపెట్టవద్దు


ఏపీ హైకోర్టు ఘటనపైనే ఇప్పుడు దేశమంతటా చర్చ

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మే 5న జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ), సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ)లతోపాటు దేశంలోని పలు బార్ అసోసియేషన్లు స్పందించాయి. యువ న్యాయవాదులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ సంఘటనతో అనేక కొత్త ప్రశ్నలు కూడా తలెత్తాయి. లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్ఓసీ), పాస్‌పోర్టు స్వాధీనం అంశాలను సవాల్ చేస్తూ దాఖలైన ఓ పిటిషన్ ఆ రోజు హైకోర్టు ముందుకు వచ్చింది. ఈ కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున వాదించిన ఓ యువ న్యాయవాదిపై హైకోర్టు న్యాయమూర్తి తర్లాడ రాజశేఖర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ సందర్భంగా గతంలో ఇలాంటి కేసులో ఇచ్చిన కోర్టు తీర్పు కాపీ అవసరమని న్యాయమూర్తి భావించారు. దీంతో, కేసును వాయిదా వేయాలని జస్టిస్ రాజశేఖర్ రావు సూచించారు. అయితే, పిటిషనర్ తరఫు యువ న్యాయవాది వెంటనే విచారణ కొనసాగించాలని కోరారు. తన వాదన వినిపించడానికి, పదేపదే మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించారు. దీంతో, జడ్జి అసహనం వ్యక్తం చేశారు. ఆగ్రహంతో,

"నేను మీ రిట్ పిటిషన్‌ను కొట్టివేశానా? ఆర్డర్ కాపీని తీసుకురమ్మని మాత్రమే కోరాను. మీరేదో గొప్ప సీనియర్ న్యాయవాది అనుకుంటున్నారా? కనీసం 10 ఏళ్ల అనుభవం కూడా లేకుండా ఈ కట్టను విసిరేస్తారా?’’ అని అన్నారు. న్యాయవాది నిర్లక్ష్యంగా ప్రవర్తించారని భావించిన జడ్జి, 24 గంటల పాటు అతనిని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచమని పోలీసులను పిలిచారు. దీంతో కోర్టు హాల్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లాయర్లు అందరూ షాక్‌కు గురయ్యారు. పోలీసులు వచ్చిన తర్వాత ‘‘తీసుకెళ్లండి. లోపల వేయండి’’ అని జడ్జి అన్నారు. ఆ తర్వాత బార్ అసోసియేషన్‌తో కలిసి ధర్నా చేయండి అని కూడా జడ్జి వ్యాఖ్యానించారు. మరో పక్క యువ న్యాయవాది చేతులు జోడించి క్షమించమని, దయ చూపమని వేడుకున్నారు. అయినా, న్యాయమూర్తి ఆయనను మందలించారు. ఇక్కడ ఉన్న ఇతర న్యాయవాదులు కూడా ఇది చూశారని, కోర్టులో ఉన్న లాయర్ల పేర్లు నమోదు చేసి సాక్షులుగా రికార్డు చేయాలని జడ్జి సూచించారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వెంటనే, సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో, జడ్జి ఆగ్రహించడం, న్యాయవాది వేడుకోవడం స్పష్టంగా కనిపించాయి. దాంతో, దేశం అంతటా న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంమైంది. బీసీఐ, ఎస్‌సీబీఏ, దేశంలోని ఇతర బార్ అసోసియేషన్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఆందోళన వ్యక్తం చేశాయి. జడ్జి తీరుని ఖండించాయి. అయితే, వెంటనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ , హైకోర్టు బార్ అసోసియేషన్ రంగంలోకి దిగారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయవాదితో, న్యాయమూర్తితో విడివిడిగా మాట్లాడారు. 24 గంటల జ్యుడీషియల్ కస్టడీ ఆదేశాలు అమలు కాకుండా ఆపారు. సమస్య సామరస్యంగా సద్దుమణిగింది. అయినప్పటికీ, ఈ ఘటన న్యాయవ్యవస్థలో, న్యాయవాదుల్లో, ముఖ్యంగా యువ న్యాయవాదుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. యువ న్యాయవాదుల పట్ల న్యాయమూర్తులు సహనంతో వ్యవహరించాలని, వారిని ప్రోత్సాహించాలని బీసీఐ, ఎస్‌సీబీఏ, ఇతర బార్ అసోసియేషన్లు వ్యక్తం చేసిన అభిప్రాయాన్నే సుప్రీం కోర్టు కూడా వ్యక్తం చేసింది. యువ న్యాయవాదులలో భయం, అవమానం లేదా బెదిరింపులకు కారణమయ్యే ఏ చర్య అయినా బార్ స్వాతంత్ర్యాన్ని, న్యాయ వ్యవస్థ సమర్థవంతమైన పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని బీసీఐ, ఎస్‌సీబీఏ హెచ్చరించింది. ఇలాంటి సంఘటనలు యువ న్యాయవాదులపై ప్రతికూల ప్రభావాన్ని చూపడంతోపాటు న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య సంస్థాగత సమతుల్యతను దెబ్బతీస్తాయని బీసీఐ పేర్కొంది. న్యాయవాది బహిరంగ క్షమాపణ చెప్పినప్పటికీ, న్యాయమూర్తి ప్రవర్తించిన తీరుని బార్ అసోసియేషన్లు తప్పుపట్టాయి. ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ తీరుపై పలువురు యువ న్యాయవాదులు తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. జూనియర్ లాయర్లను కోర్టులో బెదిరించడం, అవమానించడం అంగీకరించలేని అంశం అన్నది వారి వాదన. న్యాయమూర్తులు సీనియర్లు, జూనియర్ల మధ్య వివక్ష చూపడం భావ్యంకాదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు. కోర్టు కార్యకలాపాల్లో మర్యాద, క్రమశిక్షణ అత్యంత కీలకమని ఈ సంఘటన స్పష్టం చేస్తోందని మరికొందరన్నారు. ఈ ఘటనతో మరో కొత్త డిమాండ్ కూడా వినవస్తోంది. కొలీజియం వ్యవస్థ దేశంలో న్యాయవ్యవస్థను నాశనం చేస్తోందని, పరీక్షల ద్వారా వచ్చే ప్రొఫెషనల్ జడ్జీలు కావాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ హైకోర్టులో జరిగిన ఘటనపై సీజేఐ జోక్యాన్ని కోరుతూ బీసీఐ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా లేఖ రాశారు. సదరు న్యాయవాది తన శారీరక ఇబ్బందులను వివరిస్తూ, పదేపదే క్షమించమని వేడుకున్నా న్యాయమూర్తి కనికరించలేదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. యువ న్యాయవాదులను ప్రోత్సహించడానికి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక అంతర్గత యంత్రాంగం ఉండాలని ఎస్‌సీబీఏ అధ్యక్షుడు వికాస్ సింగ్ నొక్కి చెప్పారు. కోర్టుల అధికారాన్ని గౌరవించాల్సిందేనని, అయితే, న్యాయాధికారాలను వినియోగించేటప్పుడు సంయమనం, నిష్పాక్షికత, కరుణ కూడా ఉండాలని ఎస్‌సీబీఏ సూచించింది. న్యాయవాదులను భయపెట్టే బదులు, యువ న్యాయవాదులు ధైర్యంగా, నిర్భయంగా, స్వతంత్రంగా వాదించేలా ప్రోత్సహించేంత బలంగా న్యాయవ్యవస్థ ఉండాలని అడ్వకేట్ అసోసియేషన్ ఆఫ్ బెంగళూరు(ఏఏబీ) పేర్కొంది.
కోర్టు కార్యకలాపాల్లో చిన్నపాటి లోపం దొర్లిందనే కారణంతో ఒక యువ న్యాయవాదిని 24 గంటల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలన్న జడ్జి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై బీసీఐ, ఎస్‌సీబీఏ చేసిన తీర్మానాల ఆధారంగా నమోదైన రెండు రిట్ పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం ఈ నెల 15న విచారణ చేపట్టనుంది. యువ న్యాయవాదుల విషయంలో న్యాయమూర్తులు సహనం పాటించాలి, ప్రోత్సాహించేవిధంగా వ్యవహరించాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సమస్యను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, బార్ అసోసియేషన్ ప్రమేయంతో హైకోర్టు స్థాయిలోనే సామరస్య పూర్వకంగా పరిష్కరించినందున, తమ వైపు నుండి ఎటువంటి ఆదేశాలు అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది . యువ న్యాయవాది కోపంతో ఫైళ్లను పోడియంపై కొట్టారని భావించి, అతడిని పోలీసు కస్టడీకి పంపిస్తానని జస్టిస్ రాజశేఖర్‌రావు హెచ్చరించారు. అయితే, ఆ న్యాయవాది చేతిలోంచి ఫైలు జారిపోయిందని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి కేవలం మౌఖికంగా వ్యాఖ్యానించారని, ఎటువంటి లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వలేదని ధర్మాసనం గుర్తు చేసింది. సందర్భం గురించి వివరించకుండా కోర్టు విచారణకు సంబంధించిన వీడియో క్లిప్స్‌ని ప్రసారం చేసే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సుప్రీం కోర్టు ధర్మాసనం మీడియాను కోరింది. మీడియాకు కూడా బాధ్యత ఉందని, క్రియాశీలక పాత్ర పోషిస్తుందని సుప్రీం కోర్టు ఆశిస్తోంది.
ఈ ఘటనతో న్యాయవాదులు, న్యాయమూర్తుల బృందాలకు మధ్య తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి సుప్రీం కోర్టు చర్యలు చేపట్టింది. బార్, న్యాయవ్యవస్థ మధ్య తలెత్తే సమస్యల పరిష్కారానికి బార్ కౌన్సిల్స్, బార్ అసోసియేషన్‌ల సభ్యులతో కూడిన గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కమిటీలను (జీఆర్సీలు) హైకోర్టులు, దిగువ కోర్టులలో ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. ఇటువంటి కమిటీలను జిల్లా/తాలూకా స్థాయిలో కూడా ఏర్పాటు చేయాలని కోర్టు పేర్కొంది. న్యాయవాదులు, ధర్మాసనాలు ఒకే లక్ష్యం కోసం పనిచేస్తాయి. ధర్మాసనం ఒక వైపు ఎత్తైన కుర్చీలలో కూర్చుంటే, న్యాయవాదులు న్యాయం కోసం నిలబడి వాదిస్తుంటారు! ఈ నేపథ్యంలో 15న జరిగే విచారణలో సుప్రీం కోర్టు ఈ ఘటనపై ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో వేచి చూడాలి. న్యాయ వ్యవస్థ పటిష్టవంతమయ్యే విధంగా, యువ న్యాయవాదులకు భరోసా ఇచ్చేవిధంగా అత్యున్నత న్యాయ స్థానం తీర్పు ఇస్తుందని ఆశిద్దాం.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

https://www.sci.gov.in/case-status-case-no/# Writ Petition (Civil) Case Number :604 Case Year : 2026

Serial NumberDiary NumberCase NumberPetitioner NameRespondent NameStatusAction
128532/2026W.P.(C) No. 000604 / 2026 Registered on 08-05-2026
SUPREME COURT BAR ASSOCIATIONHIGH COURT OF ANDHRA PRADESHDISPOSEDView

Diary Number28532/2026 Filed on 08-05-2026 03:04 PM

15 ఏళ్లు నిండిన బైక్ రిజిస్ట్రేషన్‌ పొడిగింపు

 ఆంధ్రప్రదేశ్‌లో 15 ఏళ్లు నిండిన బైక్ రిజిస్ట్రేషన్‌ను (RC Renewal) పొడిగించుకోవడానికి లేదా ఫిట్‌నెస్ సర్టిఫికేట్ (FC) పొందడానికి మీరు సిద్ధం కావాల్సిన ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి.

1. బండి కండిషన్ (Mechanical Checkpoints)
RTO ఇన్‌స్పెక్టర్ బండిని ఫిజికల్‌గా తనిఖీ చేస్తారు. ఈ క్రిందివి పక్కాగా ఉండాలి:
Chassis Number: ఇంజిన్ మరియు ఛాసిస్ నంబర్లు స్పష్టంగా ఉండాలి (పెన్సిల్ ప్రింట్ తీయడానికి వీలుగా).
Lights & Indicators: హెడ్ లైట్ (High/Low beam), ఇండికేటర్లు, బ్రేక్ లైట్ మరియు నంబర్ ప్లేట్ లైట్ ఖచ్చితంగా పనిచేయాలి.
Brakes & Tyres: బ్రేకులు సరిగ్గా ఉండాలి. టైర్ల త్రెడ్ (Grip) అరిగిపోయి ఉండకూడదు.
Appearance: బండికి తుప్పు (Rust) ఉండకూడదు. బాడీ కలర్ RCలో ఉన్నట్లుగానే ఉండాలి. సైడ్ మిర్రర్లు తప్పనిసరి.
Engine Performance: ఇంజిన్ నుండి విపరీతమైన శబ్దం లేదా పొగ రాకూడదు.
Horn: హారన్ వర్కింగ్ కండిషన్‌లో ఉండాలి.
2. అవసరమైన పత్రాలు (Required Documents)
అప్లై చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ అన్నీ అందుబాటులో ఉంచుకోండి:
Original RC: పాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్.
Insurance: ప్రస్తుతం అమలులో ఉన్న ఇన్సూరెన్స్ కాపీ.
Pollution (PUC): వాలిడిటీ ఉన్న కాలుష్య నియంత్రణ పత్రం.
Address Proof: ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి.
Tax Receipt: రోడ్ టాక్స్ కట్టిన రసీదు.
3. ఫీజులు మరియు ఇతర ఛార్జీలు
Renewal Fee: బైక్ కోసం సుమారు ₹300 వరకు ఉంటుంది. (స్మార్ట్ కార్డ్ కోసం అదనంగా ₹200 ఉండవచ్చు).
Green Tax: 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఏపీలో గ్రీన్ టాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇది సుమారు ₹2,000 (15 ఏళ్లకు) ఉండవచ్చు.
Late Fee: RC ఎక్స్‌పైర్ అయిన తర్వాత అప్లై చేస్తే నెలకు ₹300 చొప్పున పెనాల్టీ పడుతుంది. కాబట్టి 60 రోజుల ముందే అప్లై చేయడం మంచిది.
4. అప్లికేషన్ ప్రాసెస్ (Process)
Parivahan Portal: ఆన్‌లైన్‌లో 'Renewal of Registration' ఆప్షన్ ద్వారా అప్లై చేసి ఫీజు చెల్లించాలి.
Form 25: ఈ ఫారాన్ని నింపి, ఛాసిస్ నంబర్ పెన్సిల్ ప్రింట్‌ను దానిపై తీసుకోవాలి.
Slot Booking: మీకు వీలైన రోజున RTO ఆఫీస్‌లో బండిని చూపించడానికి స్లాట్ బుక్ చేసుకోవాలి.
Inspection: నిర్ణీత తేదీన బండిని RTO ఆఫీస్‌కు తీసుకెళ్లి ఇన్‌స్పెక్టర్ సంతకం చేయించుకోవాలి.

మంగళగిరిలో ముగ్గురు ప్రముఖులకు సన్మానం

  మంగళగిరి: మంగళగిరి మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో మూడు రంగాలలో  ముగ్గురు నగర ప్రముఖులు గుత్తికొండ ధనుంజయ రావు, గోలి మధు, శిరందాసు నాగార్జున ...