26న ప్రగడ కోటయ్య 110వ జయంతి
చేనేత కార్మికులకు, చేనేత రంగానికి సహకార సంఘాలు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని గట్టిగా నమ్మిన స్వాతంత్ర సమరయోధుడు, బీసీ రాజకీయ నేత ప్రగడ కోటయ్య. గుంటూరు జిల్లా నిడుబ్రోలులో చేనేత వృత్తిపై జీవించే పద్మశాలి కుటుంబానికి చెందిన ప్రగడ వీరభద్రుడు, కోటమ్మ దంపతులకు కోటయ్య 1915, జూలై 26న రెండవ కుమారుడుగా జన్మించారు. జాతీయోద్యమంలో చురుకుగా పాల్గొన్న కోటయ్య చేనేత కార్మికుల సంక్షేమం కోసం, సహకార రంగం పటిష్టత కోసం ఎంతో శ్రమించారు. జాతీయ స్థాయిలో ప్రముఖ బీసీ నేత, బహుజన బంధు, అత్యంత నిజాయితీపరుడైన కోటయ్య ప్రగడ కోటయ్య మూడుసార్లు శాసనసభకు, ఒకసారి శాసన మండలికి, ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. రైతులు, పేదలు, బీసీలు, ముఖ్యంగా చేనేత అభివృద్ధి, చేనేత కార్మికుల సంక్షేమం, సహకార రంగం కోసం ఆయన తుది శ్వాస వరకు కృషి చేశారు. దేశంలో చేనేత రంగంపై జీవించే కోట్ల మందికి ఆరాధ్యుడైన ప్రగడ కోటయ్య 1995 నవంబర్ 26న అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. చేనేత రంగానికి సంబంధించి మళ్లీ అంతటి నేతగా ఎవరూ ఎదగలేకపోయారు.ప్రగడ కోటయ్య ఓ వైపు స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే, మరో వైపు చేనేత కార్మికుల కోసం చాలా చురుకుగా పనిచేశారు. చేనేతరంగంతో పాటు రైతులు, జిన్నింగ్, స్పిన్నింగ్, కాంపోజిట్ మిల్లులపై ఆమూలాగ్రం ఆయన అధ్యయనం చేశారు. ప్రగడ కోటయ్య మద్రాసులోని టెక్స్‌టైల్ ఇన్‌స్టిట్యూట్ లో తన ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత, అదే మద్రాస్ టెక్స్‌టైల్స్ ఇన్‌స్టిట్యూట్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేశారు. ఈ అనుభవంతో 1935లో ఏర్పడిన మద్రాసు రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహకార సంఘంలో ప్రొడక్షన్ ఇన్‌ఛార్జి ఉద్యోగంలో చేరారు. రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికుల సమావేశాలను నిర్వహించి, మరిన్ని సహకార సంఘాలను స్థాపించాలని వారిని ప్రోత్సహించారు. ఆ సమయంలోనే సర్కారు జిల్లాల్లో ప్రాథమిక చేనేత సహకార సంఘాలను ఏర్పాటు చేసేందుకు విశేషంగా కృషి చేశారు.
1945లో ఏర్పడిన ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ వీవర్స్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 1939లో జరిగిన మద్రాసు రాష్ట్ర కేంద్ర చేనేత సహకార సంఘం ఎన్నికల్లో డైరెక్టర్లుగా చేనేత నాయకులు ఎన్నికయ్యేవిధంగా పథక రచన చేసి విజయం సాధించారు. 1941లో బ్రిటీష్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేనేత రంగం స్థితిగతులను అధ్యయనం చేసేందుకు థామస్ కమిటీని నియమించింది. ఈ కమిటీని కోటయ్య గుంటూరు జిల్లాకు ఆహ్వానించారు. చేనేత రంగ సమస్యలపై వంద పేజీల మెమొరాండాన్ని ఆ కమిటీకి అందజేశారు. 1942లో మద్రాసు రాష్ట్ర చేనేత పారిశ్రామిక సంఘాన్ని చైతన్యవంతం చేసేందుకు గుంటూరు జిల్లా మంగళగిరికి దామర్ల రమాకాంతరావు అధ్యక్షులుగా, కోటయ్య ప్రధాన కార్యదర్శిగా కృషి చేశారు. నూలు కొరతను అధిగమించేందుకు నూలు ధరల స్థిరీకరణ కోసం చేనేత రక్షణ యాత్రలు నిర్వహించారు. 1947లో పొన్నూరు నుంచి ఆయన ‘చేనేత’ వారపత్రికను కూడా తీసుకువచ్చారు.
అసంఘటితంగా ఉన్న చేనేత రంగం అభివృద్ధికి, మిల్లు వస్త్రాల పోటీని చేనేత వస్త్రాలు తట్టుకోలేని పరిస్థితుల్లో, చేనేత ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించడానికి ప్రగడ కోటయ్య ఎంతో కృషి చేశారు. ఇందుకు సహకార రంగమే ఉత్తమమైనదిగా ఆయన భావించారు. ప్రగడ కోటయ్య హయాంలో ఆంధ్ర ప్రాంతంలో ఆనాడు 200పైగా నూతన చేనేత సహకార సంఘాలను ఏర్పాటు చేశారు. 1952లో చీరాల నుంచి మద్రాసు శాసనసభకు ఎన్నికైన వెంటనే, చీరలు, దోవతులు చేనేత మగ్గాలపైనే ఉత్పత్తి చేయాలని రిజర్వు చేస్తూ సభలో తీర్మానం చేయించారు. ఆ తర్వాత హైదరాబాద్, ముంబై, బీహార్ శాసనసభల్లో కూడా ఇదే రకమైన తీర్మానాలను ఆమోదించారు.
చీరాల శాసనసభ్యునిగా ప్రగడ కోటయ్య అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించారు. చీరాల సహకార స్పిన్నింగ్ మిల్లు స్థాపనకు, దానికి ప్రభుత్వం 99 ఎకరాలు కేటాయించేందుకు కృషి చేశారు. ఆ మిల్లుకు దానికి వ్యవస్థాపక చైర్మన్ గా కోటయ్య బాధ్యతలు స్వీకరించారు. ఆ మిల్లు నిర్మాణానికి అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ 1950 అక్టోబరు 13న శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏ ప్రధాన మంత్రి చీరాల రాలేదు. ఆ సభలోనే చిలప నూలు ఆవశ్యకతను ప్రధానికి తెలియజేశారు. దాంతో, చేనేత కార్మికుల అవసరాలు తీర్చేందుకు ప్రతి జిల్లాలో చేనేత కార్మికుల ఆధ్వర్యంలోనే సహకార నూలు మిల్లులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాని నెహ్రూ ఆదేశించారు. ఆ నూలు మిల్లుని 1963 ఫిబ్రవరి 13న అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. చీరాల, గుంతకల్లు, నెల్లూరు, రాజమండ్రి తదితర పట్టణాలలో సహకార రంగంలో నూలు మిల్లుల ఏర్పాటుకు కోటయ్య ఎంతో కృషి చేశారు.
ప్రగడ కోటయ్య 70వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు చీరాలలో పెద్దఎత్తున సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో పాల్గొన్న ఆనాటి ఉత్తరప్రదేశ్ గవర్నర్ బెజవాడ గోపాలరెడ్డి కోటయ్యను ‘ప్రజాబంధు’ బిరుదుతో సత్కరించారు. 70వ పుట్టిన రోజు అని కోటయ్య అభిమానులు రూ.70 వేలు సేకరించి ఆయనకు బహూకరించారు. అయితే, ఆ మొత్తాన్ని ఆయన స్థాపించిన జూనియర్ కాలేజీకి ఇచ్చివేశారు. ‘ప్రజాబంధు’ బిరుదు ఇచ్చిన వెంటనే అక్కడిక్కడే సార్థకం చేసి చూపించారు. అందుకనే అభిమానులు ఆయనను ప్రజాబంధు ప్రగడ కోటయ్య, చేనేత కోటయ్య, చేనేత పిత, బహుజన నేత... అని కొనియాడుతుంటారు. చేనేత సంక్షేమం కోసం అహర్నిశలు పోరాడిన ప్రగడ కోటయ్య జయంతిని జూన్ 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. మంగళగిరిలోని టిడ్కో ఇళ్ల వద్ద సుమారు 6 ఎకరాల్లో అద్భుతమైన పార్కు నిర్మించి, దానికి ప్రగడ కోటయ్య పేరుపెట్టడంతోపాటు ఆ పార్కులో ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని నెలకొల్పనుంది.
ప్రగడ కోటయ్య నిర్వహించిన పదవులు
1948–1974 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు
1949 అఖిల భారత కుటీర పరిశ్రమల బోర్డు చేనేత స్థాయి సంఘం కమిటీ సభ్యుడు
1950 చేనేత వస్త్రాల ఉత్పత్తికి సంబంధించి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ సభ్యుడు.
1952–1962 శాసనసభ సభ్యుడు
1955–1956 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు
1959 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘం లిమిటెడ్ (APCO)కు నేపథ్యంగా నిలిచిన, చీరాల సహకార స్పిన్నింగ్ మిల్లు వ్యవస్థాపక చైర్మన్.
1962–1965 ఆల్ ఇండియా కో-ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ ఫెడరేషన్ వైస్-ఛైర్మన్
1967–1972 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు
1973–1975 న్యూఢిల్లీలోని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్స్ లిమిటెడ్ ఛైర్మన్.
1974–1980 ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడు
1974–1978 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి
1975 రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్దికి సూచనలు, కనీస వేతనాలను నిర్ణయించడానికి ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు
1976–1978 ఆల్ ఇండియా హ్యాండ్-లూమ్ బోర్డు సభ్యుడు
1990–1995 రాజ్యసభ సభ్యుడు
- శిరందాసు నాగార్జున రావు, సీనియర్ జర్నలిస్ట్- 9440222914.


No comments:
Post a Comment