Jun 1, 2026

జీవితం అంటే ఎవరూ లీక్ చేయని పరీక్షా పత్రం

శ్రీహరి ‘సిత్రా’లుపై సమీక్ష



సైకాలజీపై 26 పుస్తకాలు రాసిన ఓ ప్రొఫెసర్ రాసిన కవిత్వం ఇది. వివిధ రకాలైన ఛాయా చిత్రాలను చూసి స్పందించి, అనుభూతిపొంది రాసిన కవిత్వం ఇది. తెలుగు సాహిత్యంలో ఇది ఓ సరికొత్త ప్రక్రియ. ఛాయా చిత్రాలు, దృశ్యాలను చూసి వాటిలోని భావోద్వేగాలు, కవి ఆలోచనల దొంతరల నుంచి అక్షర బద్ధంచేసే కవిత్వ ప్రక్రియ ఇది. దీనిని ఛాయాచిత్రాల కవిత్వం ( ఫొటో పొయెట్రీ) అంటారు. తెలుగు సాహిత్యంలో ఈ రకమైన కవిత్వానికి ఆధ్యుడు అని చెప్పలేం గానీ, ఛాయాచిత్రాల కవిత్వం రాసిన మొదటితరం కవిగా డాక్టర్ మురుగుడు శ్రీహరి నిలుస్తారు. ఈ రకమైన కవిత్వం రాయడం ఆయన 1984లోనే ప్రారంభించారు. అయితే, పుస్తక రూపంలో ఇప్పుడే తీసుకువచ్చారు. ఈ చిత్రాలలో ఎన్నో భావాలు, బాధలు, వ్యధలు, ఆనందం, చీకటి, వెలుగు, సముద్రం, దాని సవ్వడులు, అలల శబ్దాలు, అగాధం, అలసట, అలజడి, ఆశ, నిరాశ, ఆనందం, అపురూపం, ఒంటరితనం, స్పష్టత, అస్పష్టత, బ్రాంతి, భారతీయ జీవితం, సాగర తీరం, శబ్దం, నిశ్శబ్దం, ప్రకృతి, సంస్కృతి.... ఇలా ఎన్నో కనిపిస్తాయి. ఆ దృశ్యాలను కవితలుగా మలచిన తీరు అద్భుతం. మనసు లోతులను తాకుతాయి ఇందులోని చిత్రాలు, కవితలు. ప్రేమ, భావ, అభ్యుదయ, అనుభూతి, మనసు..... అన్ని రకాల కవిత్వం ఈ పుస్తకంలో ఉంది.

అమ్మ గురించి అద్భుతంగా రాశారు. ‘‘అమ్మకు నా ఆకలి చెప్పాల్సిన అవసరం రాలేదు... బాల్యంలో నా పిచ్చి భాషను క్షణంలో పసిగట్టేది .....’’ ఇలా అందరికీ అమ్మ జ్ఞాపకాలు గుర్తుకుతెస్తారు శ్రీహరి. అడుగు మొదలయ్యాక ఆగదు.. తర్వాత అద్భుం...., చూసికూడా రాయలేని పరీక్షే జీవితం... అని సాగుతుంది శ్రీహరి కవిత్వం. ఒంటరిగా పోరాడే తెగువ ఉంటే, చిన్న బిందువ కూడా సునామీనే, గెలుపు రుచి చూపిస్తుందని చక్కటి కవిత్వం రాశారు. జీవితం అంటే సమాధానాలు దొరకని, ఎవరూ లీక్ చేయని పరీక్షా పత్రంగా పేర్కొన్నారు. జీవితం గురించి ఇంతకంటే ఎవరైనా ఏం చెప్పగలం!. దారంకంటే సులువుగా తెగిపోయే బంధాలు... ఎవరికీ ఎవరూ ఏమీ కాని సమాజం.... అని ఓ వాస్తవాన్ని చాలా గొప్పగా చెప్పారు. జారుతున్న కన్నీటి బొట్టు గురించి చాలా చక్కగా రాశారు. అంతేకాదు, ఆ బొట్టుకు విలువకట్టే తరాజు ఈ సృష్టిలో ఎక్కడ? అని ప్రశ్నించారు. ఎలా బతకాలో తెలుసుకోవడానికి ఒక్క జ్ఞాపకం చాలంటారు. నిన్ను నువ్వు మలుచుకునే ఓ ఆయుధం ఒంటరితనం అని ఓ నగ్నసత్యాన్ని చెప్పారు. ప్రేమంటే బ్రాయ్ ఫ్రెండ్, గర్ల ఫ్రెండ్ గా ఉండటం కాదని, ఎలా ఉండాలో వివరించి మరీ కవిత రూపంలో చెప్పారు. బుతువులు సైతం లెక్కచేయకుండా కబుర్లు చెప్పి, ఇప్పుడు శిథిలమైపోతున్న పోస్టు బాక్సు దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ చక్కటి కవిత రాశారు. ఇలా ఎన్నో భావాలు, వాస్తవాలు, అనుభూతులు ఇందులో ఉన్నాయి. అంతేకాదు, అవి ప్రతిబింభించే చిత్రాలు కూడా ఉన్నాయి. ప్రతి ఫొటో వెనుక ఓ కథ మనకు కనిపిస్తుంది. ఫొటోలకు తగ్గట్టుగా కవితలు రాశారు. అయితే, ఈ పుస్తకంలోని ఫొటోలు కలర్ లో లేకపోవడం వెలితిగా అనిపించింది. భావాలను అర్థం చేసుకోవడానికి రంగులు కూడా ముఖ్యం.
పుస్తక సమీక్షులు: శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914
పుస్తకం : శ్రీహరి ‘సిత్రా’లు
రచయిత : డాక్టర్ మురుగుడు శ్రీహరి
పుస్తకాల కోసం : 9441693323

జీవితం అంటే ఎవరూ లీక్ చేయని పరీక్షా పత్రం

శ్రీహరి ‘సిత్రా’లుపై సమీక్ష సైకాలజీపై 26 పుస్తకాలు రాసిన ఓ ప్రొఫెసర్ రాసిన కవిత్వం ఇది. వివిధ రకాలైన ఛాయా చిత్రాలను చూసి స్పందించి, అనుభూతిప...