Aug 19, 2026

దేశంలోని కోర్టులలో 5.74 కోట్లు దాటిన పెండింగ్ కేసులు

దేశంలోని న్యాయస్థానాలలో కోట్ల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పెండింగ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.  2022 జూన్ నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో దాదాపు 4.83 కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.     ప్రస్తుతం దేశం మొత్తంలో కోర్టులలో పెండింగ్ కేసులు 5.74 కోట్లు దాటిపోయాయి. ఒక్క సుప్రీం కోర్టులోనే పెండింగ్ కేసుల సంఖ్య 95 వేలు దాటింది.  సాక్షుల గైర్హాజరు కావడం, సరైన సమయానికి ఆధారాలు అందకపోవడంతో  కేసుల విచారణ ప్రక్రియ క్లిష్టంగా మారింది. లోక్ అదాలత్‌ల నిర్వహణ  ద్వారా రాజీ పడదగిన కేసులను త్వరగా పరిష్కరించడం, ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడం, ఈ-కోర్టుల ప్రాజెక్ట్ ద్వారా డిజిటల్ విధానంలో స్పీడ్ పెంచడం ... వంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా,  కేసుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూనే ఉన్నాయి. జడ్జిల పోస్టులు ఖాళీగా ఉండటం కూడా ఒక కారణం. నేషనల్ జ్యుడిషియల్ డేటా ప్రకారం  ఈ ఏడాది ఆగస్ట్ 17వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా  సుప్రీం కోర్టు, హైకోర్టులు, రాష్ట్రాలలోని ఇతర కోర్టులలో  సివిల్ కేసులు  1,58,54,896  ఉండగా,   క్రిమినల్ కేసులు 4,15,76,022 ఉన్నాయి. మొత్తం 5,74,30,918  పెండింగ్ కేసులు ఉన్నాయి.  ఇందులో 30 ఏళ్లకు పైగా పెండింగ్ లో ఉన్న కేసులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం సుప్రీం కోర్టులో  సివిల్ కేసులు  73,915,  క్రిమినల్ కేసులు 21,653,  మొత్తం 95, 568 పెండింగ్ కేసులు ఉన్నాయి.

రిజర్వ్ చేసిన తీర్పుల వెల్లడిలో కూడా హైకోర్టులలో తీవ్ర జాప్యం జరగడం పట్ల సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  హైకోర్టుల్లో విచారణలు, తీర్పుల వెల్లడిలో జాప్యం నివారించేందుకు  సుప్రీం కోర్టు చర్యలు చేపట్టింది.  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 కల్పించిన విశేష అధికారాలను  ఉపయోగించి న్యాయ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేలా, జాప్యం తగ్గించేలా పలు అంశాలపై అన్ని హైకోర్టులకు  సుప్రీం కోర్టు కొన్ని సూచనలు  చేసింది. సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌ మాల్య బగ్చిలతో కూడిన ధర్మాసనం మే 29న కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఝార్ఖండ్ కు సంబంధించిన ఒక కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ సూచనలు చేసింది. రిజర్వ్ చేసిన తీర్పులు గరిష్ఠంగా 3 నెలల్లోపు వెలువరించాలి. తీర్పు ధృవీకరించిన కాపీలో తీర్పును రిజర్వ్ చేసిన తేదీ, తీర్పును ప్రకటించిన తేదీ, తీర్పును అప్‌లోడ్ చేసిన తేదీని పేర్కొనాలి. సవివరమైన తీర్పును వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినప్పుడు, పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులకు ఇమెయిల్/ ఎస్ఎంఎస్ ద్వారా పంపాలి. బెయిల్ పిటిషన్లపై ఉత్తర్వులు అదే రోజు ప్రకటించి, అప్‌లోడ్ చేయాలి. బెయిల్ ఉత్తర్వులు రిజర్వ్ చేస్తే మరుసటి రోజే ప్రకటించాలి. బెయిల్ లేదా శిక్ష సస్పెన్షన్ ఉత్తర్వులు వెంటనే అధికారులకు తెలపాలి.  ఖైదీల విడుదల సాధ్యమైనంత వరకు అదే రోజు, లేకపోతే మరుసటిరోజు జరగాలి. బెయిల్ ఉత్తర్వుల అమలుపై ట్రయల్ కోర్టు హైకోర్టుకు నివేదిక ఇవ్వాలి.  కస్టడీలో ఉన్న అప్పిలెంట్ల కేసుల్లో 7 రోజుల్లోపే అదనపు వివరణలు కోరవచ్చు. ఇక అత్యవసర కేసు (కూల్చివేతలు, బహిష్కరణలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలు, బెయిల్‌ తదితరాలు)ల్లో కేవలం ప్రధాన నిర్ణయం (ఆపరేటివ్‌ ఆర్డర్‌) ముందుగా ఓపెన్‌ కోర్టులో ప్రకటించినా, దానికి గల పూర్తి కారణాలతో తీర్పును సాధారణంగా 7 రోజుల్లోపు, అసాధారణ పరిస్థితుల్లో 15 రోజుల్లోపు వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేయాలి.  ప్రకటించిన తీర్పు 24 గంటల్లోపు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి.  పెండింగ్ రిజర్వ్ తీర్పులపై ప్రతి నెల ఆటోమేటెడ్ ఇ-మెయిల్ పంపాలి.  2 నెలలు దాటిన పెండింగ్ తీర్పులను జడ్జిల దృష్టికి తీసుకెళ్లాలని లాయర్లకు సూచన చేశారు.  3 నెలల్లో తీర్పు రాకపోతే కేసు చీఫ్ జస్టిస్ దృష్టికి వెళ్లాలి.  మరో 2 వారాలు ఆలస్యమైతే కేసును వేరే బెంచ్‌కు బదిలీ చేసే అవకాశం ఉంటుంది.  3 నెలలైనా తీర్పు రాకపోతే పక్షాలు దరఖాస్తు చేసుకోవచ్చు.  4 నెలలు గడిచినా తీర్పు రాకపోతే బెంచ్ మార్పు కోరే హక్కు పక్షాలకు ఉంటుంది.  రిజర్వు చేసిన  తీర్పులు వెలువరించడంలో జరిగే జాప్యాన్ని తగ్గించి న్యాయ ప్రక్రియలో వేగం పెంచాలన్నది  సుప్రీంకోర్టు భావన.  హైకోర్టు, దిగువ కోర్టులలో ఈ సూచనలు పాటిస్తే, తీర్పుల వెల్లడిలో జాప్యం జరగదు.  కోర్టులలో పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించడానికి మధ్యవర్తిత్వం  ప్రోత్సహించడం, తరచూ లోక్ అదాలత్‌లను నిర్వహించడం, న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం, ఆధునిక సాంకేతికతను వాడడం, అనవసర వాయిదాలను తగ్గించడం, మౌలిక వసతులు పెంచడం.... వంటి  కొన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ఇంకా పెరుగుతూ వస్తోంది. కోట్లలో పేరుకుపోయిన పెండింగ్ కేసులు తగ్గించడానికి, వాయిదాలు తగ్గించడంతోపాటు విచారణ ప్రక్రియ వేగంగా జరిగే విధంగా  నూతన ఆలోచనలతో, కొత్త మార్గదర్శకాలను సుప్రీం కోర్టు రూపొందించవలసిన అవసరం ఉంది.

-      శిరందాసు నాగార్జున – 9440222914

దేశంలోని కోర్టులలో 5.74 కోట్లు దాటిన పెండింగ్ కేసులు

దేశంలోని న్యాయస్థానాలలో కోట్ల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పెండింగ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.  2022 జూన...