Sep 11, 2026

చేనేత కులాలు ఏకమవుతున్న వేళ





చేనేత వర్గాల వారు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్న దృఢసంకల్పంతో చేనేత కులాల వారు అందరూ ఏకమవుతున్నారు. చేనేత వర్గం వారు విద్య, వ్యాపారపరంగా ఎదుగుతూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నప్పటికీ, రాజకీయంగా తగిన ప్రాధాన్యత లేదన్న భావన వారిలో నెలకొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వ్యవసాయం తరువాత అత్యధిక మంది చేనేత, దాని అనుబంధ రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అంతే కాకుండా, ఈ రెండు రాష్ట్రాలకు చెందిన చేనేత కులాల వారు విద్య, వైద్యం, వ్యాపార రంగాలలో ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. మన దేశంలో తరతరాలుగా చేనేత వృత్తిపైనే జీవించే కులాలు అనేకం ఉన్నాయి. పద్మశాలి, దేవాంగ, తొగట, తొగట వీరక్షత్రియ, భావసార క్షత్రియ, కుర్ని, జాండ్ర, పట్టుసాలి, స్వకులశాలి, కురిమిశెట్టి (కుర్ణి), నెస్సి, సేనాపతులు, కైకాల, కర్ణభక్తులు, కరికాల భక్తులు, సాధనాసురులు, ఖత్రి, నీలి, నీలకంఠి, కోస్టి, ముదలియార్, కైకాల మొదలియార్, సాలియర్, దేవాంగ చెట్టియర్, సౌరాష్ట్రియన్స్, పట్టుసాలియర్, కైకోలరస్, సెంగుంత.. వంటి అనేక చేనేత కులాల వారు ఉన్నారు. ఇందులో దాదాపు 18 చేనేత కులాల వారు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు. ఇందులో కొన్ని కులాలు జాతీయస్థాయిలో అంత్యంత వెనుకబడిన కులాల(ఎంబీసీ) జాబితాలో ఉన్నాయి. చేనేత కులాల వారు అన్ని రంగాలలో పరస్పరం సహకరించుకుంటూ, రాజకీయంగా కూడా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే, ఈ కులాల మధ్య ఐక్యత కోసం వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్, ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్, అఖిల భారత పద్మశాలి సంఘం, ఇతర చేనేత కుల సంఘాల వారు తీవ్రంగా కృషి చేస్తున్నారు. చేనేత కులాల వారు రాజకీయంగా బలపడటంతోపాటు, చట్ట సభల్లో తమ వాటా స్థానాల కోసం ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు.

చేనేత ఉత్పత్తులు, ఆప్కో ప్రక్షాళన, చేనేత సహకార సంఘాల సమస్యలపై ఓవైపు చేనేత కార్మిక సంఘాల వారు ఈ నెల 2న ఏపీలోని మంగళగిరిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, చేనేత ఉద్యమ శంఖారావం పూరించారు. ఒకే మగ్గం-ఒకే గమ్యం, చేనేత వర్గాలను ఏకం చేద్ధాం అన్న పిలుపుతో ఈ నెల 5న అమెరికాలోని న్యూజెర్సీలో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ యూఎస్ఏ ప్రాంతీయ సదస్సును నిర్వహించింది. కులం, ప్రాంతం, భాషలకు అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చేనేత కుటుంబాలను అంతర్జాతీయ వేదికపై ఏకం చేయాలన్నది ఈ సదస్సు లక్ష్యం. వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మంది జీవించే చేనేత కులాల నుంచి ఏపీ
శాసనసభలో ఒక్కరు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత శాసనసభలో ఆ ఒక్కరు కూడా లేరు. అత్యంత దయనీయమైన పరిస్థితి ఏమిటంటే, రెండ తెలుగు రాష్ట్రాలలో చేనేత శాఖలకు మంత్రులుగా చేనేత రంగానికి చెందని ఇతర కులాల వారు ఉన్నారు. చేనేత కులాల మధ్య ఐక్యత లేకపోవడం, నాయకత్వం లోపమే దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు పది శాతం చేనేత కులాల జనాభా ఉన్నట్లు ఓ అంచనా. ఆ ప్రాతిపదికన జనాభా దామాషా ప్రకారం ఎన్నికలలో రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయించాలన్నది చేనేత వర్గాల డిమాండ్.
రాజకీయ పార్టీలు తమను గుర్తించేవిధంగా ఐక్యత చాటే ప్రయత్నంలో చేనేత కులాల వారు ఏకం కానున్నారు. ఏపీలో 175 మంది శాసనసభ్యుల్లో చేనేత కులాల నుంచి ఒక్కరంటే ఒక్కరే కదిరి శాసనసభ్యుడు కందికుంట వెంకట ప్రసాద్(టీడీపీ) ఉన్నారు. శాసన మండలిలో పంచుమర్తి అనురాధ(టీడీపీ) ఉన్నారు. అయినా, వారికి ఆ శాఖ మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేనేత కులం నుంచి ఉన్న ఒక్క సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించారు. ఆమెకు కూడా చేనేత శాఖ ఇవ్వలేదు. టీఆర్ఎస్ నుంచి శాసనసభలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, శాసనమండలిలో ఎల్.రమణ ఇద్దరు మాత్రమే ఉన్నారు. అందువల్ల, తెలంగాణలో అత్యధికంగా ఉన్న చేనేత కులం పద్మశాలీయుల్లో ఒకరిని కాంగ్రెస్ పార్టీ శాసన మండలికి తీసుకుని, మంత్రి పదవి ఇవ్వవలసిన అవసరం ఉంది. దీర్ఘకాలంగా చేనేత కులాలకు చెందిన వారికి మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల వారి సమస్యలను ఇతర కులాలు, వృత్తులకు చెందిన మంత్రులకు చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. వారికి ఈ రంగం పట్ల తగినంత అవగాహన లేకపోవడ వల్ల వీరి సమస్యల పరిష్కారం పట్ల వారు ఆసక్తి చూపించే అవకాశాలు తక్కువ. చేనేత వృత్తికి సంబంధించిన నూలు, సిల్క్, రంగులు, రసాయనాలు ముడిసరుకులు వంటి వాటి ధరలు, చేనేత ఉత్పత్తులు, అమ్మకాలు, ఎగుమతులు, పన్నులు, సబ్జిడీలు, ఇతర సౌకర్యాలు.... వంటి సమస్యలు సమగ్రంగా తెలుసుకోవడానికి వారికి సమయం ఉండదు. ఈ కారణంగా కూడా చేనేత సమస్యలు రోజురోజుకు పేరుకుపోతున్నాయి. ఆ సమస్యల పరిష్కారం దిశగా కూడా అడుగులు పడటంలేదు. అవగాహనా లోపం వల్ల నిజమైన చేనేత కార్మికులకు ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు అందడంలేదు. ప్రభుత్వానికి, మంత్రులకు, అధికారులకు చేనేత కార్మికుని బతుకు చిత్రంపై అవగాహన లేకపోవడం వల్ల ఇలా జరుగుతోంది. రాష్ట్రంలోని చేనేత కార్మికుల స్థితిగతులను, వృత్తిపరంగా వారు ఎదుర్కునే సమస్యలను ప్రభుత్వానికి అర్థమయ్యేరీతిలో వివరించవలసి ఉంది. అందుకు చేనేత వర్గాల నుంచి, చేనేత రంగంపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తులు రాజకీయ నేతలుగా ఎదగవలసిన అవసరం ఉంది. చేనేత కులాల నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రగడ కోటయ్య... వంటి నేతలు లేకపోవడం వల్ల ఈ రంగం నుంచి రాజకీయంగా నాయకత్వం లోపం కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. వారు చేనేత కార్మికులకు సన్నిహితంగా ఉండేవారు. వారికి చేనేత సమస్యలపై పూర్తి అవగాహన ఉండేది. జాతీయ స్థాయిలో చేనేత గళం వినిపించగల దమ్ముండేది. అందువల్ల వారి హయాంలో ఈ రంగానికి ఎంతో మేలు జరిగింది. ఆ తరువాత ఈ కులాల విద్యా, వ్యాపార, పారిశ్రామిక పరంగా ఎదిగినా, రాజకీయంగా బలహీనమవడం వల్ల చేనేత రంగానికి తీవ్ర నష్టం జరుగుతూ వస్తోంది.
నేరుగా చేనేత రంగంతో సంబంధం ఉన్న, చేనేత వృత్తి, ఆ రంగంలోని సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నవారు శాసనసభలో, మంత్రి మండలిలో ఉండవలసిన అవసరం ఉంది. ఆ దిశగా, రాజకీయం లక్ష్యంతో ఉద్యమించాలని చేనేత కులాల వారు నిర్ణయించుకున్నారు. అందరూ ఐక్యంగా ఉండి ఒక్కతాటిపై నిలబడి, శాసనసభ్యులను గెలిపించుకోకపోతే పరిస్థితి ఇంకా దిగజారుతుందని వారు గ్రహించారు. ఈ నేపథ్యంలో చేనేత కుల సంఘాల పునరేకీకరణ అవసరాన్ని గుర్తించారు. గతంలో క్రియాశీలకంగా ఉన్న కొన్ని సంఘాలు వివిధ కారణాల వల్ల ప్రస్తుతం యాక్టివ్ గా లేవు. అందువల్ల కూడా ఈ రంగానికి నష్టం జరిగింది. ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్, వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్, అఖిల భారత పద్మశాలి సంఘం, దేవాంగ.. తదితర ఇతర కుల సంఘాలు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నాయి. చేనేత వర్గాల వారు విద్య, వ్యాపార, ఆర్థిక పరంగా బలపడటంతోపాటు రాజకీయంగా ఎదగడానికి ఈ సంఘాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి . అన్ని చేనేత కులాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఆయా సంఘాలు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు అంతర్జాతీయ స్థాయిలో కూడా సమావేశమై అందరూ కలసికట్టుగా రాజకీయంగా తమకు రావలసిన వాటాను రాబట్టుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. అయితే, ఇందుకు చేనేత కులాల ఐక్యతతోపాటు రాజకీయంగా యువతను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని గుర్తించారు. ఇందుకోసం అన్ని చేనేత కులాల వారు కలిసి పనిచేయాలని తీర్మానించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో చేనేత కులాలతోపాటు, చేనేత కార్మిక సంఘాలను కూడా కలుపుకుపోవాలని నిర్ణయించారు. ఏపీలో దాదాపు 45 శాసనసభ నియోజకవర్గాల్లో, తెలంగాలో 30కి మించి గెలుపుపై ప్రభావం చూపగల స్థాయిలో చేనేత కులాలవారు ఉన్నట్లు నిర్ధారించారు. అంటే, అంత మంది ఎమ్మెల్యేలను నిర్ణయించగల స్థితిలో చేనేత కులాలవారు ఉన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా, నిరంతరం చేనేత వర్గాలు రాజకీయంగా ఎదగడానికి కృషిచేయాలని భావిస్తున్నారు. చేనేత కులాల వారు గెలిచే అవకాశం ఉన్న అధిక నియోజకర్గాలలో ఆయా పార్టీల టిక్కెట్లు దక్కించుకోవాలన్న గట్టి నిర్ణయానికి వచ్చారు. ఇందు కోసం రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయా సంఘాలు ఐక్యంగా భారీ స్థాయిలో బహిరంగ సభలు కూడా నిర్వహించాలన్న ఆలోచనతో వారు ఉన్నారు.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

Sep 9, 2026

న్యూజెర్సీలో ఘనంగా ముగిసిన వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ప్రాంతీయ సదస్సు

చేనేత వర్గాల ప్రపంచవ్యాప్త నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు ఏకమైన ప్రతినిధులు

 

న్యూజెర్సీ(యూఎస్ఏ)  సెప్టెంబర్ 9 : వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూడబ్ల్యూఓ) ఆధ్వర్యంలో యూఎస్ఏ ప్రాంతీయ సదస్సు2026 న్యూజెర్సీలోని ఫోర్డ్స్‌లోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్లో ఈ నెల 5వ తేదీ శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ చరిత్రాత్మక సమావేశానికి అమెరికా, కెనడా, భారతదేశంతోపాటు వివిధ దేశాల నుంచి చేనేత వర్గాలకు చెందిన వృత్తి నిపుణులు, వైద్యులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, సామాజిక నాయకులు, విద్యార్థులు, యువత, మహిళలు హాజరయ్యారు. దాదాపు 500 మంది పాల్గొన్న ఈ సదస్సు విజయవంతంగా ముగిసింది.  కులం, ప్రాంతం, భాషకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చేనేత కుటుంబాలను ఒక సమగ్ర అంతర్జాతీయ వేదికపై ఏకం చేయాలనే లక్ష్యంతో డబ్ల్యూడబ్ల్యూఓ నిర్వహించిన ఈ సదస్సు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ప్రతినిధుల ఉత్సాహభరితమైన భాగస్వామ్యం, వీవర్స్ సమాజం నుంచి లభించిన విశేషమైన మద్దతు ఈ కార్యక్రమాన్ని చిరస్మరణీయమైన, చరిత్రాత్మక విజయంగా నిలిపాయి.

ఈ సదస్సులో డబ్ల్యూడబ్ల్యూఓ ఫౌండర్ ఎమెరిటస్ డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల, వ్యవస్థాపకుల కమిటీ చైర్మన్  అంజన్ కర్నాటి, డబ్ల్యూడబ్ల్యూఓ వ్యవస్థాపకుడు, నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు  రమేష్ మునుకుంట్ల, ఇతర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు స్ఫూర్తిదాయకంగా ప్రసంగాలు చేశారు. డబ్ల్యూడబ్ల్యూఓ దార్శనికత, విజయాలు, భవిష్యత్తు కార్యాచరణతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చేనేత వర్గాల మధ్య ఐక్యత, సహకారాన్ని బలోపేతం చేయాలనే సంస్థ నిబద్ధత గురించి వారు వివరించారు.

ఈ సదస్సులో ప్రధాన ఆకర్షణగా డబ్ల్యూడబ్ల్యూఓ కార్యనిర్వాహక కమిటీ, డాక్టర్ హరనాథ్ పోలిచెర్లకు ప్రతిష్ఠాత్మకమైన గ్లోబల్ అచీవ్‌మెంట్ అవార్డు”**ను ప్రదానం చేసింది. ఆయన సాధించిన విశేష విజయాలు, అంకితభావంతో కూడిన నాయకత్వం, వైద్యరంగంలో  విశిష్ట సేవలు, డబ్ల్యూడబ్ల్యూఓతోపాటు ప్రపంచ చేనేత సమాజ అభివృద్ధికి అందిస్తున్న నిరంతర సహకారాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేశారు.

ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఎస్. వి. రామారావు కళారంగంలో సాధించిన అద్భుత విజయాలు, విశిష్ట సేవలను గుర్తిస్తూ డబ్ల్యూడబ్ల్యూఓ ఘనంగా సత్కరించింది.

ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ కోర్ కమిటీ సభ్యుడు  గడ్డం వెంకటేశ్వర్లు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. చేనేత కార్మికులు, వారి కుటుంబాల సామాజిక, ఆర్థిక సంక్షేమాన్ని మెరుగుపరిచేందుకు ఐక్యత, పరస్పర సహకారం, సమన్వయంతో కూడిన కృషి ఎంతో అవసరమని ఆయన వివరించారు.  విజయవంతమైన పారిశ్రామికవేత్త  కిశోర్ గంజి వృత్తిపరమైన విజయాలు, సామాజిక నాయకత్వం, విలువైన సేవలను గుర్తిస్తూ సంస్థ ఘనంగా సత్కరించింది.

దేవాంగ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వ్యవస్థాపకుడు డాక్టర్ వెంకటేశ్వర్లు బచ్చు, ఆరోగ్య కారణాలతో చివరి నిమిషంలో అనుకోకుండా ఏర్పడిన పరిస్థితుల వల్ల సదస్సుకు హాజరు కాలేకపోయారు. అయినప్పటికీ, ఆయన తన హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఈ సందర్భం కోసం తన ప్రసంగాన్ని పంపించారు. డబ్ల్యూడబ్ల్యూఓ లక్ష్యాలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చేనేత వర్గాల నిరంతర పురోగతికి ఆయన తన మద్దతును వ్యక్తం చేశారు.

నూతన డబ్ల్యూడబ్ల్యూఓ గ్లోబల్ కమిటీ ప్రకటన

సదస్సులో వ్యవస్థాపకుల కమిటీ చైర్మన్ అంజన్ కర్నాటి, రాబోయే రెండు సంవత్సరాల కాలానికి సంబంధించిన నూతన డబ్ల్యూడబ్ల్యూఓ గ్లోబల్ కమిటీని అధికారికంగా ప్రకటించారు.

కార్యనిర్వాహక కమిటీ:

  •  రమేష్ మునుకుంట్లఅధ్యక్షుడు (గ్లోబల్)
  • రాజశేఖర్ సజ్జప్రధాన కార్యదర్శి (గ్లోబల్)
  • రాజేశ్వర్ అడ్డగట్లఉపాధ్యక్షుడు (గ్లోబల్)
  •  సారధి కార్యంపూడిఉపాధ్యక్షుడు (గ్లోబల్)
  • నాగ శ్రీనివాసరావు సోమనఉపాధ్యక్షుడు (అమెరికా ఈశాన్య ప్రాంతం)
  • శ్రీనివాస్ చవడంఉపాధ్యక్షుడు (అమెరికా మధ్యపశ్చిమ ప్రాంతం)
  •  రామ్ లేఉపాధ్యక్షుడు (అమెరికా పశ్చిమ ప్రాంతం)
  • గణేశన్ సౌయ్యఉపాధ్యక్షుడు (అమెరికా దక్షిణ ప్రాంతం)
  •  అనిత సజ్జకార్యదర్శి, సాంస్కృతిక వ్యవహారాలు (గ్లోబల్)
  •  వరలక్ష్మి కటికాచైర్‌పర్సన్, మహిళా కమిటీ (అమెరికా ఈశాన్య ప్రాంతం)
  • సాయినాథ్ కర్నాటియువజన కమిటీ
  • సుబ్బరాయుడు చవడంయువజన కమిటీ
  •  కళ్యాణ్ వల్లాలయువజన కమిటీ

ధర్మకర్తల మండలి

  • కిశోర్ గంజిచైర్మన్, ధర్మకర్తల మండలి
  • చైతన్య చిట్టిమల్లవైస్ చైర్మన్, ధర్మకర్తల మండలి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉగాది అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న పార్వతి కౌతారపును ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఆమె సాధించిన విజయాలు, అందించిన సేవలను గుర్తిస్తూ ఘనంగా సత్కరించారు.

డబ్ల్యూడబ్ల్యూఓకు సంఘీభావం ప్రకటించిన విశిష్ట అతిథులు

చేనేత వర్గాలకు చెందనప్పటికీ, సమాజంలోని వివిధ సంస్థలు, రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు ప్రముఖ నాయకులు ఈ సదస్సుకు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. వారు డబ్ల్యూడబ్ల్యూఓకు, సంస్థ చేపడుతున్న కార్యక్రమాలకు సంఘీభావం ప్రకటించడంతోపాటు, డబ్ల్యూడబ్ల్యూఓ లక్ష్యాలు, సమ్మిళిత దార్శనికత, ప్రపంచవ్యాప్తంగా చేనేత కుటుంబాల సాధికారత కోసం సంస్థ చేస్తున్న కృషిని ప్రశంసించారు.

హాజరైన విశిష్ట అతిథులు:

  • శ్రీధర్ చిల్లరవ్యవస్థాపకుడు, చైర్మన్, మనటీవీ నెట్‌వర్క్
  •  శ్రీహరి మండాడిమాజీ అధ్యక్షుడు, ఎన్ఏటీఎస్
  • మధుసూదనరావు అన్నామాజీ అధ్యక్షుడు, టీఎఫ్ఏఎస్
  • దాము గెదెలమాజీ అధ్యక్షుడు, , టీఎఫ్ఏఎస్
  • కౌన్సిల్‌మన్ చార్లెస్ డిపియెరోమన్రో టౌన్‌షిప్, న్యూజెర్సీ
  • ప్రవీణ్ గూడూరుఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఎంఏటీఏ
  • విజయ భాస్కర్ కలాల్ప్రధాన కార్యదర్శి, ఎంఏటీఏ
  • నిరంజన్ వి. రెడ్డిపారిశ్రామికవేత్త, దాత, సామాజిక నాయకుడు
  • దీపక్ కట్టాపారిశ్రామికవేత్త, ఐటీ నిపుణుడు

చేనేత వారసత్వాన్ని పరిరక్షించడంతోపాటు చేనేత కుటుంబాలకు విద్యా, వృత్తి, ఆర్థిక అవకాశాలను సృష్టించేందుకు వివిధ సంస్థలు, సమాజాలతో భాగస్వామ్యాలను నిర్మించాలనే డబ్ల్యూడబ్ల్యూఓ నిబద్ధతకు వారి ప్రోత్సాహకర సందేశాలు మరింత బలం చేకూర్చాయి.

ఐక్యత, విద్య, పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం, యువతమహిళా నాయకత్వం, ఆర్థిక సాధికారతతోపాటు భారతదేశపు సుసంపన్నమైన చేనేత, నేయు కళల వారసత్వాన్ని పరిరక్షించి ప్రోత్సహించాల్సిన ప్రాధాన్యతను వక్తలు వివరించారు. ఈ సదస్సు ప్రతినిధులు వృత్తిపరమైన, వ్యాపార సంబంధాలను ఏర్పరచుకోవడానికి, ఆలోచనలను పంచుకోవడానికి, పరస్పర సహకార అవకాశాలను అన్వేషించడానికి, చేనేత కార్మికులు మరియు వారి కుటుంబాలకు మద్దతుగా చేపట్టవలసిన కార్యక్రమాలపై చర్చించడానికి విలువైన వేదికగా నిలిచింది. ఉపకార వేతనాలు, నైపుణ్యాభివృద్ధి, సామాజిక సేవ, సంప్రదాయ చేనేత వర్గాల ఆర్థిక సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించారు.   ప్రపంచవ్యాప్తంగా ఉన్న చేనేత వర్గాలకు చెందిన వివాహయోగ్యులైన యువతీ యువకులను, వారి కుటుంబాలను అనుసంధానించేందుకు ఈ ముఖ్యమైన కార్యక్రమం విశ్వసనీయమైన, సమ్మిళిత వేదికను అందిస్తుంది.

విద్యను ప్రోత్సహిస్తూ విద్యా ప్రతిభను గుర్తించాలనే డబ్ల్యూడబ్ల్యూఓ నిబద్ధతలో భాగంగా, సదస్సు సందర్భంగా అమెరికాకు చెందిన పలువురు ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందజేశారు. విద్యార్థుల అంకితభావం, విజయాలను అభినందించిన ఈ ఉపకార వేతనాలు, వారు తమ విద్యా లక్ష్యాలను సాధించడంతోపాటు సమాజానికి సేవ చేయడం కొనసాగించేందుకు ప్రోత్సాహాన్ని అందించాయి.

సదస్సు విజయవంతమయ్యేందుకు తమ అంకితభావం, భాగస్వామ్యంతో సహకరించిన విశిష్ట అతిథులు, వక్తలు, ప్రాయోజకులు, మద్దతుదారులు, నిర్వాహక కమిటీ సభ్యులు, యువ స్వచ్ఛంద సేవకులు, సాంస్కృతిక కళాకారులు, కుటుంబ సభ్యులందరికీ డబ్ల్యూడబ్ల్యూఓ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.

ఆతిథ్యం, భోజన ఏర్పాట్లు, వేదిక నిర్వహణ, సాంకేతిక సహకారం, సమాచార వ్యవస్థలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అతిథుల సమన్వయం వంటి బాధ్యతలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తూ నిరంతరం శ్రమించిన స్వచ్ఛంద సేవకుల అసాధారణ నిబద్ధతను సంస్థ ప్రత్యేకంగా అభినందించింది. ఈ ప్రాంతీయ సదస్సు సాధించిన విజయం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చేనేత వర్గాలను అనుసంధానిస్తూ ప్రస్తుత, భవిష్యత్ తరాలకు అర్థవంతమైన అవకాశాలను సృష్టించే అంతర్జాతీయ వేదికగా డబ్ల్యూడబ్ల్యూఓ పెరుగుతున్న శక్తిని ప్రతిబింబించింది. డబ్ల్యూడబ్ల్యూఓ అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసి, సంస్థ దీర్ఘకాలిక ప్రపంచ దార్శనికతను ముందుకు తీసుకువెళ్లే దిశగా ఇది మరో ముఖ్యమైన అడుగుగా నిలిచింది.

పద్మశాలి, దేవాంగ, తొగట వీర క్షత్రియ, భావసార క్షత్రియ, కర్ణభక్తులు, కుర్ని, పట్టుసాలి, స్వకులసాలి, ఖత్రి, కురిమిశెట్టి, తొగట, కరికాలభక్తులు, నీలి, నీలకంఠ, నెస్సి, కైకాల, సేనాపతుల, సెంగుంత, సాధనాసురులు, జాండ్ర, సెంగుంత ముదలియార్, కైకాల ముదలియార్, సాలియర్, దేవాంగ చెట్టియార్, సౌరాష్ట్రియన్స్, పట్టుసాలియర్, కైకోలర్స్ తదితర వర్గాలకు చెందిన వివిధ సామాజిక సంస్థలు, వృత్తి నిపుణులు, పారిశ్రామికవేత్తలు, యువత, మహిళలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మద్దతుదారులతో డబ్ల్యూడబ్ల్యూఓ తన సహకారాన్ని కొనసాగిస్తుంది. చేనేత సంప్రదాయాలను పరిరక్షించడం, విద్య,ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం, బలమైన మరియు ఐక్యమైన ప్రపంచ కుటుంబాన్ని నిర్మించడం కోసం సంస్థ నిరంతరం కృషి చేస్తుంది.

చేనేత వర్గాలను ఏకం చేద్దాం ప్రపంచవ్యాప్తంగా అనుసంధానిద్దాం

ఒకే మగ్గం ఒకే గమ్యం: ఐక్యతతో అల్లిన వస్త్రానికి వేడుక

కలిసుంటే మనం మరింత బలంగా ఉంటాం. సహకరించుకున్నప్పుడు అవకాశాలను సృష్టిస్తాం. ఒకరికొకరం అండగా నిలిచినప్పుడు రాబోయే తరాలకు మరింత ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మిస్తాం.

వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ గురించి

వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ డబ్ల్యూడబ్ల్యూఓ ప్రపంచవ్యాప్తంగా ఉన్న చేనేత వర్గాలను అనుసంధానించి, వారిని సాధికారులను చేయడానికి స్థాపించబడిన అంతర్జాతీయ లాభాపేక్షలేని వేదిక. చేనేత వారసత్వం, సంస్కృతిని పరిరక్షించడంతోపాటు విద్య, వృత్తిపరమైన నెట్‌వర్కింగ్, పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం, యువతమహిళా నాయకత్వం, సామాజిక సేవ, ఆర్థిక సాధికారతను ప్రోత్సహించేందుకు డబ్ల్యూడబ్ల్యూఓ కృషి చేస్తోంది.

వెబ్‌సైట్: www.world-weavers.org

సంస్థ: వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ (WWO)

 

 





చేనేత కులాలు ఏకమవుతున్న వేళ

చేనేత వర్గాల వారు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్న దృఢసంకల్పంతో చేనేత కులాల వారు అందరూ ఏకమవుతున్నారు. చేనేత వర్గం వారు విద్య, వ్యాపారపరంగ...