Oct 4, 2026

పల్లె ప్రజల గొంతుక, రైతాంగ పోరాటాలకు అక్షర ఆయుధం

 ‘జమీన్ రైతు’ వారపత్రిక


తెలుగు పత్రికా చరిత్రలో కొన్ని పత్రికలు కేవలం వార్తలను అందించే మాధ్యమాలుగా కాకుండా, ఒక సామాజిక ఉద్యమానికి ప్రతినిధులుగా, ప్రజల ఆకాంక్షలకు అక్షర రూపంగా నిలిచాయి. అలాంటి అరుదైన చరిత్ర కలిగిన వారపత్రికల్లో ‘జమీన్ రైతు’ ఒకటి. నెల్లూరు కేంద్రంగా వెలువడిన ఈ పత్రికకు దాదాపు శతాబ్ద కాలానికి చేరువైన ఘనమైన చరిత్ర ఉంది.
‘జమీన్ రైతు’ అనే పేరులోనే పత్రిక లక్ష్యం దాగి ఉంది. ‘జమీన్’ అంటే భూమి, ‘రైతు’ అంటే ఆ భూమిని సాగు చేసే వాడు. జమీందారీ వ్యవస్థ ప్రభావంతో రైతులు, కౌలు రైతులు ఎదుర్కొన్న దోపిడీ, అన్యాయాలు, సామాజిక అసమానతలను వెలుగులోకి తీసుకురావాలనే సంకల్పంతో ఈ పత్రిక రూపుదిద్దుకుంది. వ్యవస్థాపకుడు నెల్లూరు వెంకట్రామానాయుడు., పత్రిక తన మాస్ట్హెడ్లో 1930ను స్థాపన సంవత్సరంగా  చెబుతున్నది..
ప్రారంభంలో ‘జమీందారీ రైతు’ పేరుతో ప్రారంభమై, అనంతరం ‘జమీన్ రైతు’గా మారినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. జమీందారీ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కల్పించడమే కాకుండా, నెల్లూరు ప్రాంతంలో ఉప్పు సత్యాగ్రహం వంటి స్వాతంత్ర్యోద్యమ పరిణామాలకు కూడా పత్రిక ప్రాధాన్యం ఇచ్చింది. అంటే పత్రికా రచనను కేవలం సమాచార ప్రసారంగా కాకుండా, ప్రజా చైతన్య సాధనంగా ఉపయోగించింది.
స్వాతంత్ర్యోద్యమ కాలంలో స్వేచ్ఛాయుత పత్రికా రచన ఎంతటి సవాళ్లను ఎదుర్కొందో ‘జమీన్ రైతు’ చరిత్ర కూడా తెలియజేస్తుంది. 1941 ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు బ్రిటిష్ ప్రభుత్వం వెంకట్రామానాయుడు నివాసం, కార్యాలయంతో పాటు అప్పటి సంపాదకుడు చుండి జగన్నాథం నివాసాన్ని సోదా చేసినట్లు చారిత్రక రికార్డులు పేర్కొంటున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఏర్పడిన ఆంక్షల నేపథ్యంలో 1942 సెప్టెంబరు 1న పత్రిక ప్రచురణను తాత్కాలికంగా నిలిపివేసి, అదే సంవత్సరం నవంబరు 20న తిరిగి ప్రారంభించింది.
‘జమీన్ రైతు’ ప్రత్యేకత పల్లె జీవితాన్ని పత్రికా కేంద్రంగా మార్చడంలోనూ కనిపిస్తుంది. నగర రాజకీయాలకు మాత్రమే పరిమితం కాకుండా గ్రామీణ సమాజం, రైతు సమస్యలు, స్థానిక పరిణామాలు, ప్రజల కష్టనష్టాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా జిల్లా పత్రికా రంగానికి ఒక ప్రత్యేక నమూనాను ఏర్పరచింది. పల్లెలను ప్రపంచానికి పరిచయం చేయాలన్న లక్ష్యంతో అది పనిచేసిందని పత్రిక చరిత్రపై వచ్చిన విశ్లేషణలు పేర్కొంటున్నాయి.
కాలం మారింది. జమీందారీ వ్యవస్థ అంతరించింది. సాంకేతిక పరిజ్ఞానం పత్రికా రంగ స్వరూపాన్ని మార్చింది. అయినప్పటికీ ప్రజా సమస్యలను అక్షరబద్ధం చేయడం, గ్రామీణ సమాజానికి గొంతుకగా నిలవడం అనే పత్రికా విలువలు మారలేదు.
ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా రికార్డుల ప్రకారం ‘జమీన్ రైతు’ తెలుగు వారపత్రికగా నెల్లూరు నుంచి నమోదై ఉంది. 1957లో దాని రిజిస్ట్రేషన్ నమోదైంది.
దాదాపు శతాబ్దానికి చేరువైన ఈ ప్రయాణం ఒక పత్రిక మనుగడ కథ మాత్రమే కాదు; రైతు, పల్లె, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛాయుత పత్రికా రచనలతో ముడిపడిన తెలుగు జర్నలిజం చరిత్రలో ఒక ముఖ్య అధ్యాయం. కాలం మారినా ప్రజల పక్షాన నిలిచే పత్రికకు చరిత్రలో స్థానం ఉంటుందనే సత్యానికి ‘జమీన్ రైతు’ ఒక సజీవ సాక్ష్యం.  

                              

                                                                                  ----నందిరాజు రాధాకృష్ణ


వైద్యవృత్తికే తలమానికం డాక్టర్ అనూష


వైద్యం చేయడంలోనే కాదు పరిశుభ్రత పాటించడంలో ఆమెకామే సాటి

ఓపికే ఆమెకు అలంకారం

స్వచ్ఛతలో మంగళగిరికి మరోసారి రాష్ట్రస్థాయి గౌరవం

ముఖ్యమంత్రి నుంచి అవార్డ్ అందుకున్న మంగళగిరి ప్రభుత్వ డాక్టర్

డాక్టర్ అనూషకు సర్వత్రా ప్రశంసలు


మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి గణపతి నగర్ లోని  ఇందిరా నగర్ యూపీహెచ్‌సీ(అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్)కి చెందిన డాక్టర్ అనూష పరుచూరి అన్ని వర్గాల రోగులకు ఎంతో ఓపికగా వైద్య సేవలు అందించడంలో  వైద్య వృత్తికే తలమానికంగా నిలిచారు . ప్రజా వైద్యంలో ప్రజల ప్రశంసలు అందుకుంటున్న డాక్టర్ అనూష సేవలను ప్రభుత్వం కూడా గుర్తించింది. హెల్త్ సెంటర్ లో,  పరిసరాల్లో ఆమె పాటించే పరిశుభ్రత ప్రమాణాల ఆధారంగా రాష్ట్రస్థాయిలో ఉత్తమ స్వచ్ఛ హాస్పిటల్ అవార్డు  లభించింది.  గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కృషి చేస్తున్న వారిని గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం రాత్రి  ప్రతిష్టాత్మకంగా  నిర్వహించిన ‘స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026’ రాష్ట్ర స్థాయి పురస్కారాల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డాక్టర్ అనూషకు ఈ అవార్డు అందజేశారు. మెడికల్ ఆఫీసర్(సివిల్ అసిస్టెంట్ సర్జన్)గా ఆమె చేసే సేవల వల్ల ఆమెకు అభినందనలు లభించడమే కాకుండా మంగళగిరికే మంచి గుర్తింపు లభించింది. డాక్టర్ అనూష వైద్యసేవలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. 

డాక్టర్ అనూష మార్చి 3, 1993న గుంటూరులో జన్మించారు.  ఏలూరులోని ఏఎస్ఆర్ ఏఎం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్  పూర్తి చేశారు. ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలో 2,790 మంది పాల్గొన్న అతిపెద్ద 'రొమ్ము క్యాన్సర్ స్వయం-పరీక్ష కార్యక్రమంలో పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించారు. 2022  మార్చిలో మంగళగిరి ఇందిరా నగర్ హెల్త్ సెంటర్ లో ప్రభుత్వ వైద్యురాలిగా చేరారు. ఆమె బాధ్యతలు స్వీకరించే నాటికి ఈ హెల్త్ సెంటర్‌కు రోజుకు 10 మంది కంటే ఎక్కువ రోగులు వచ్చేవారు కాదు. ఆమె నిరంతర కృషి, అంకిత భావం,సేవా గుణం, రోగులతో ఆప్యాయంగా వ్యవహరించే తీరు వల్ల ప్రస్తుతం ఆ సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఆమె అందించే విశేష సేవలకు  జాతీయ, రాష్ట్ర స్థాయిలో పలు అవార్డులు లభించాయి.  ఆమె నాయకత్వంలో ఇందిరా నగర్ హెల్త్ సెంటర్‌కి జూలై 2023లో నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్‌క్యూఏఎస్) సర్టిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు లభించింది.  2024, ఆగస్ట్ 24న ఈ హెల్త్ సెంటర్ తరఫున 'రాష్ట్ర స్థాయి నాణ్యతా ప్రమాణాల అవార్డు' డాక్టర్ అనూష్ కు ఉత్తమ మెడికల్ ఆఫీసర్ అవార్డు అందుకున్నారు.ఈ ఏడాది జూలై 24న గుంటూరు జాయింట్ కలెక్టర్ నుండి 'ఉత్తమ డాక్టర్' ప్రశంసా పత్రాన్ని అందుకున్నాను.ఇవే కాకుండా రోటరీ ఐకానిక్ డాక్టర్ అవార్డు, రాష్ట్ర క్వాలిటీ అస్యూరెన్స్ అవార్డు,  శ్రీమతి నన్నపనేని లక్ష్మి స్మారక పురస్కారాలను కూడా ఆమె అందుకున్నారు. చేనేత కుటుంబాలకు చెందిన వారితోపాటు  వివిధ వృత్తులు చేసుకునే  నిరుపేదలైన రోగులు ఈ హెల్త్ సెంటర్ కి ఎక్కువగా వస్తారు. వారు అడిగే ప్రశ్నలకు డాక్టర్ అనూష ఎంతో ఓపికతో సమాధానాలు చెబుతారు. ఆ ఓపికే ఆమెకు మణి హారం. స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ అవార్డు అందుకున్న సందర్భంగా పట్టణ ప్రముఖులతోపాటు అన్ని వర్గాల ప్రజలు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. 






పల్లె ప్రజల గొంతుక, రైతాంగ పోరాటాలకు అక్షర ఆయుధం

  ‘జమీన్ రైతు’ వారపత్రిక తెలుగు పత్రికా చరిత్రలో కొన్ని పత్రికలు కేవలం వార్తలను అందించే మాధ్యమాలుగా కాకుండా, ఒక సామాజిక ఉద్యమానికి ప్రతినిధు...