వైద్యం చేయడంలోనే కాదు పరిశుభ్రత పాటించడంలో ఆమెకామే సాటి
ఓపికే ఆమెకు అలంకారం
స్వచ్ఛతలో మంగళగిరికి మరోసారి రాష్ట్రస్థాయి గౌరవం
ముఖ్యమంత్రి నుంచి అవార్డ్ అందుకున్న మంగళగిరి ప్రభుత్వ డాక్టర్
డాక్టర్ అనూషకు సర్వత్రా ప్రశంసలు
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి గణపతి నగర్ లోని ఇందిరా నగర్ యూపీహెచ్‌సీ(అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్)కి చెందిన డాక్టర్ అనూష పరుచూరి అన్ని వర్గాల రోగులకు ఎంతో ఓపికగా వైద్య సేవలు అందించడంలో వైద్య వృత్తికే తలమానికంగా నిలిచారు . ప్రజా వైద్యంలో ప్రజల ప్రశంసలు అందుకుంటున్న డాక్టర్ అనూష సేవలను ప్రభుత్వం కూడా గుర్తించింది. హెల్త్ సెంటర్ లో, పరిసరాల్లో ఆమె పాటించే పరిశుభ్రత ప్రమాణాల ఆధారంగా రాష్ట్రస్థాయిలో ఉత్తమ స్వచ్ఛ హాస్పిటల్ అవార్డు లభించింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కృషి చేస్తున్న వారిని గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం రాత్రి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026’ రాష్ట్ర స్థాయి పురస్కారాల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డాక్టర్ అనూషకు ఈ అవార్డు అందజేశారు. మెడికల్ ఆఫీసర్(సివిల్ అసిస్టెంట్ సర్జన్)గా ఆమె చేసే సేవల వల్ల ఆమెకు అభినందనలు లభించడమే కాకుండా మంగళగిరికే మంచి గుర్తింపు లభించింది. డాక్టర్ అనూష వైద్యసేవలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.
డాక్టర్ అనూష మార్చి 3, 1993న గుంటూరులో జన్మించారు. ఏలూరులోని ఏఎస్ఆర్ ఏఎం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలో 2,790 మంది పాల్గొన్న అతిపెద్ద 'రొమ్ము క్యాన్సర్ స్వయం-పరీక్ష కార్యక్రమంలో పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించారు. 2022 మార్చిలో మంగళగిరి ఇందిరా నగర్ హెల్త్ సెంటర్ లో ప్రభుత్వ వైద్యురాలిగా చేరారు. ఆమె బాధ్యతలు స్వీకరించే నాటికి ఈ హెల్త్ సెంటర్‌కు రోజుకు 10 మంది కంటే ఎక్కువ రోగులు వచ్చేవారు కాదు. ఆమె నిరంతర కృషి, అంకిత భావం,సేవా గుణం, రోగులతో ఆప్యాయంగా వ్యవహరించే తీరు వల్ల ప్రస్తుతం ఆ సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఆమె అందించే విశేష సేవలకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో పలు అవార్డులు లభించాయి. ఆమె నాయకత్వంలో ఇందిరా నగర్ హెల్త్ సెంటర్‌కి జూలై 2023లో నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్‌క్యూఏఎస్) సర్టిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు లభించింది. 2024, ఆగస్ట్ 24న ఈ హెల్త్ సెంటర్ తరఫున 'రాష్ట్ర స్థాయి నాణ్యతా ప్రమాణాల అవార్డు' డాక్టర్ అనూష్ కు ఉత్తమ మెడికల్ ఆఫీసర్ అవార్డు అందుకున్నారు.ఈ ఏడాది జూలై 24న గుంటూరు జాయింట్ కలెక్టర్ నుండి 'ఉత్తమ డాక్టర్' ప్రశంసా పత్రాన్ని అందుకున్నాను.ఇవే కాకుండా రోటరీ ఐకానిక్ డాక్టర్ అవార్డు, రాష్ట్ర క్వాలిటీ అస్యూరెన్స్ అవార్డు, శ్రీమతి నన్నపనేని లక్ష్మి స్మారక పురస్కారాలను కూడా ఆమె అందుకున్నారు. చేనేత కుటుంబాలకు చెందిన వారితోపాటు వివిధ వృత్తులు చేసుకునే నిరుపేదలైన రోగులు ఈ హెల్త్ సెంటర్ కి ఎక్కువగా వస్తారు. వారు అడిగే ప్రశ్నలకు డాక్టర్ అనూష ఎంతో ఓపికతో సమాధానాలు చెబుతారు. ఆ ఓపికే ఆమెకు మణి హారం. స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ అవార్డు అందుకున్న సందర్భంగా పట్టణ ప్రముఖులతోపాటు అన్ని వర్గాల ప్రజలు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.







No comments:
Post a Comment