1970 - 90 మధ్యలో నేను విపరీతంగా పుస్తకాలు చదివేవాడిని. జీవిత చరిత్రలు, సాంఘీక, చారిత్రక, డిటెక్టివ్ నవలలు, కథలు, నాటకాలు, నాటికలు, కవిత్వం, వ్యాసాలు... అన్ని చదివేవాడిని. బెంగాలీ సాహిత్యం, ఇంగ్లీష్ సాహిత్యం తెలుగు అనువాదాలు చదివేవాడిని. చలం, బుచ్చిబాబు, తాపీధర్మారావు, కొడవటిగంటి, సంజీవ్ దేవ్, రంగనాయకమ్మ,కోడూరి కౌసల్యాదేవి, యద్దనపూడి సులోచనా రాణి, యండమూరి....., షేక్‌స్పియర్, సోమర్ సెట్ మామ్...., శరత్ చంద్ర... తరిమెల నాగిరెడ్డి-తాకట్టులో భారతదేశం, కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించిన భారతీయ భాషల అనువాద పుస్తకాలు చదివేవాడిని.
రెండు వేలకు ముందు చాలా మంది రచయితలకు, రచయిత్రులకు లేఖలు రాసేవాడిని. వాళ్లు నాకు లేఖలు రాసేవారు. నేను ఎన్ని ఊళ్లు తిరిగినా, ఎన్ని ఇళ్లు మారినా మెట్రిక్ హాల్ టికెట్ నుంచి అక్రిడేషన్ కార్డులు, లేఖలు... వంటి వాటిని భద్రంగా ఉంచడం నాకు అలవాటు.
ఈ మధ్య తవ్వకాలలో స్వాతంత్ర సమరయోధులు వావిలాల గోపాలకృష్ణయ్య, డాక్టర్ సంజీవ్ దేవ్, గుంటూరు శేషేంద్ర శర్మ, ఆరుద్ర, ఐపీఎస్ అధికారి పేర్వావారం శ్రీరాములు, ప్రపంచ ప్రఖ్యాత నైరూప్య చిత్రకారుడు ఎస్.వి.రామారావు, ప్రముఖ చిత్రకారులు డాక్టర్ మాచిరాజు రామచంద్రరావు, అందే బాబా ప్రసాద్, అప్పటి టీటీడీ ఈఓ ఎస్.లక్ష్మీనారాయణ, చలసాని ప్రసాదరావు(ఈనాడు), రేగడి విత్తులు నవలా రచయిత్రి చంద్రలత, పడమటి గాలి నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు, నడక వీరుడు ఎం.ఆదినారాయణ, డాక్టర్ బీరం సుందర్రావు,అడిగోపుల వెంకటరత్నం, సాహితీ భూషణ్ పండిత రత్న విద్వాన్ గానుగపెంట హనుమంతరావు, గుంటూరు జిల్లా హేతువాద సంఘం అధ్యక్షులు, స్వాతంత్ర సమరయోధులు ఊరే కోటేశ్వరరావు... వంటివారితోపాటు నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన అత్యంత ముఖ్యులు మాస్టర్ కందుల రామచంద్ర రావు, డిగ్రీ కాలేజీలో మా పాలిటిక్స్ లెక్చరర్ ఎన్. వి. ఎన్. కుటుంబరావు ఆంధ్ర యూనివర్సిటీలో అప్పటి మా లెక్చరర్ డాక్టర్ జాన్ వెస్లీ, స్వాతి పైప్స్ అధినేత కౌతవరపు శ్రీనివాసరావు, మా బంధువులలో ముఖ్యులు మా బావ బిట్రా ముకుందరావు, ఆయన భార్య, మా కజిన్ బిట్రా జ్ఞాన సామ్రాజ్యలక్ష్మి, మా అన్నయ్య మోహన్ దాస్ బాపూజీ, మా అక్క బూదాటి విజయలక్ష్మి, నా క్లాస్ మేట్స్, మిత్రులు గద్దె అచ్యుతరావు, తిప్పావఝ్జుల కుమార్, బిట్రా రామచంద్రరావు, కాలే నారాయణరావు, తిరువీధుల బాబురావు,అందే వెంకటేశ్వరరావు, లాలో నా క్లాస్ మేట్ టి.కృష్ణ కుమార్... వంటి వారు నాకు రాసిన లేఖలు బయటపడ్దాయి. చాలా ఉత్తరాలు మిస్ అవగా, ఇవి మిగిలాయి. వాటిలో గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాసిన లేఖ కూడా ఉంది.
అప్పట్లో నాకు లెటర్స్, పుస్తకాలు వంటివి పోస్ట్ లో చాలా వస్తుండేవి. ప్రతి రోజూ పోస్ట్ మ్యాన్ (పేరు ఖాసీం అనుకుంటా) మా ఇంటికి వచ్చేవారు. లేఖలు రాయడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. ఆ లేఖలు, ఆ స్పందనలు, ఆ అనుభూతులు, ఆ వాక్యాలు, ఆ దస్తూరి, తెలుగు భాష సౌందర్యం... వేరు. సోషల్ మీడియా రాకతో అవన్నీ కట్ అయిపోయాయి. ఓ సారి ఎస్వీ రామారావు గారు అమెరికా నుంచి నాకు తెలుగులో లేఖ రాశారు. మా అమ్మాయి ఆ లెటర్ చూసి ‘‘అమెరికాలో ఉండే ఆయన తెలుగులో ఇంత చక్కగా లెటర్ రాశారేంటి డాడీ’’ అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.


No comments:
Post a Comment