సీరియస్ విషయాలయలతోపాటు కొన్ని సరదా విషయాలు... నేను సిటీ డెస్క్ ఇన్ చార్జిగా ఎక్కువ కాలం పనిచేసినందున, సిటీలో పనిచేసేవారందరూ ఎక్కువగా పరిచయం. ప్రతిరోజూ కలిసేవారం. రఘు, సాగర్, కళ్యాణరామ్, సుబ్బు(చాగంటి సుబ్రహ్మణ్యం-ఫొటోగ్రాఫర్), విజయ్, సాంబ, నగర విలేకరులు అందరూ ప్రతి రోజూ కలిసేవారు. కొందరు ఫోన్లు చేసేవారు. అందువల్ల వారితో సాన్నిహిత్యం ఎక్కువ.
విశాఖలో నన్ను అతి ఎక్కువగా
నవ్వించింది సుబ్రహ్మణ్యమే. సీరియస్ గా మీటింగ్ జరిగే సమయంలో కూడా చెవులో ఏదో
చెప్పి నవ్వించేవారు. శ్రీధర్ ఓ రెండు జోకులు స్పాట్ న్యూస్-స్టాక్ న్యూస్, న్యూస్
ఎడిటర్ – న్యూసెన్స్ ఎడిటర్ కూడా గుర్తు చేశారు. సుబ్బు మా ఇంటికి వచ్చి మా
పిల్లలను ప్రత్యేకంగా తీసిన ఫొటోలు ఇప్పటికీ మా ఇంట్లో ఉన్నాయి. రఘు ప్రతి రోజూ ఏదో ఒక ప్రాముఖ్యత కలిగిన,
సంచలనం కలిగించే న్యూస్ రాయాలన్న ఆతృతతో ఉండేవారు. అలాగే, మంచి మంచి వార్తలు
రాసేవారు. అయితే, తను రాసే కొన్ని ముఖ్యమైన వార్తలకు లీడ్ రాయమని సురేష్ ని
అడిగేవారు. సురేష్ పనిలో ఉంటే బతిమిలాడేవారు. సురేష్ జోక్ లు వేస్తూ, ఏదో ఒకటి
చెప్పి కాలయాపన చేసేవాడు. ఒక్కోసారి సిగరెట్ ఇస్తే రాస్తాననేవాడు. తన దగ్గర ఉంటే,
ఇచ్చేవారు. లేకపోతే తెచ్చిఆస్తాను రాయమని అడిగేవారు. తెచ్చిఇస్తేనే రాస్తాననేవాడు
సురేష్. చివరికి సిగరెట్ తెచ్చి ఇచ్చి, రాయించుకుని వెళ్లేవారు రఘు. ఆ తర్వాత
సుబ్బు వచ్చి రెండు జోకులు పేల్చి వేళ్లేవారు. నాకు గుర్తు ఉన్నంత వరకు గోపరాజు
నారాయణ రావు గారు, సురేష్, శ్రీధర్ గారు హెడ్డింగ్స్ బాగా పెట్టేవారు. అయితే, నేను
ఎక్కువగా హెడ్డింగ్స్ గోపరాజు నారాయణ రావు గారు, సురేష్ చేత పెట్టించేవాడిని.
నారాయణరావు గారు జనరల్ లో ఉండేవారు. ఆయనకు ఐటం ఇస్తే, కొద్దిసేపటి తర్వాత
హెడ్డింగ్ పెట్టి ఇస్తానని చెప్పి, అలాగే పెట్టి ఇచ్చేవారు. ఫొటో రైటప్స్
అబ్దుల్లా బాగా పెట్టేవారు. సిటీ పేజీలు అయినందు, కేవలం రైటప్ ఫొటోలు ఎక్కువగా
వాడేవారం. అబ్దుల్లా నా డెస్క్ లో ఉన్నా, వేరే డెస్క్ లో ఉన్నా, నేను అతనిచేతే ఎక్కువగా రైటప్స్ రాయించేవాడిని.
నేను ఎక్కువగా ఇజ్రాయిల్, సుధీర్ చేత పేజీలు పెట్టించేవాడిని. సుధీర్ ఎంత స్పీడ్
గా పెట్టేవాడో, ఇజ్రాయిల్ అంత జాప్యం చేసేవాడు. పేజీ మేకప్ లో రోజుకో కొత్తదనం
చూపించాలని సుధీర్ తాపత్రయపడేవాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. అప్పట్లో
పేజీలో రంగుల కోసం, పేజీలపైన హెడ్డింగ్ పక్కన, మాకు కావలసిన రంగు రావడం కోసం రంగుల
శాతం రాసేవారం. మిషన్ సెక్షన్ లోకి వెళ్లి ఆ రంగుల శాతం తెలుసుకునేవాళ్లం. ఈ
విషయంలో సురేష్ చాలా చురుకుగా ఉండేవాడు. అప్పట్లో
ఎవరున్నా సరే, మేం డెస్క్ లోనే సిగరెట్ తాగేవాళ్లం. ఎడిటోరియల్ డెస్క్ లో ఆ
సౌలభ్యం ఉండేది. వార్త రావడంతో సెంట్రలైజ్డ్ ఏసీలు వచ్చాయి. దాంతో, డెస్క్ లో
సిగరెట్ తాగే అవకాశం ఉండేదికాదు. నేను
కూడా అప్పట్లో సిగరెట్ తాగేవాడిని. అయితే,
నేను 15 ఏళ్ల క్రితం సిగరెట్ ని పూర్తిగా మానేశాను. మళ్లీ ముట్టుకోలేదు. ట్రైనీ
సబ్ ఎడిటర్ దగ్గర నుంచి న్యూస్ ఎడిటర్ వరకు హోదాలతో సంబంధంలేకుండా డెస్క్ లో అంతా
కలిసి పనిచేసేవాళ్లం. భాషతోపాటు అన్ని
విషయాలు కూడా అలాగే చర్చించేవాళ్లం. అలా సరదా సరదాగా టైం తెలియకుండా డ్యూటీ చేసేవారం.
ఆనాడు ఆంధ్రజ్యోతిలో పనిచేసినవారు ఇప్పుడు, ప్రభుత్వంలో, ప్రైవేటు రంగంలో,
పత్రికా రంగంలో ఉన్నత హోదాలకు ఎదిగిపోయారు. అయితే, మొన్న జరిగిన సమావేశంలో అవేమీ
తెలియకుండా, మేం అప్పట్లో ఎలా ఉండేవాళ్లమో అలాగే గడిపేశాం. నేను మన కార్యక్రమానికి
వచ్చి ఎంత ఆనందించానో, సుబ్బు పరిస్థితిని చూసి అంత బాధపడ్డాను. ఒక్క జోక్ కూడా
చెప్పలేని స్థితిలో ఉన్నాడు. అయితే, సుబ్బు మనల్ని నవ్వించలేకపోయినా, అతను మాత్రం
నవ్వుతూనే ఉన్నారు. ఇంత కాలానికి మనందరం కలిసిన ఆనందం అతని నవ్వులో చూశాను. నేను ఒంగోలులో
వార్తకు ఎడిషన్ ఇన్ చార్జిగా ఉన్న సమయంలో ఒకసారి
సుబ్బు అక్కడికి వచ్చారు. అప్పుడు సుబ్బు హిందులో చేసేవారు. నాలుగు జోకులు
వేసి నన్ను నవ్వించి వెళ్లారు. ఆ తర్వాత ఇదే చూడటం.
విశాఖ ఆంధ్రజ్యోతిలో ఇద్దరు మూర్తులతో నాకు సాన్నిహిత్యం ఉండేది. వారిలో
అకౌంటెంట్ మూర్తి మేం పెట్టే హెడ్డింగ్స్ ని సరదాగ తెగ విమర్శిస్తుండేవారు. అందులో
సద్విమర్శలు కూడా ఉండేవి. ఆయన మాట తీరుని
బట్టి ఆయనకు తెలుగు భాషా ప్రావీణ్యం ఉన్నట్లు అర్థమైంది. ఒక రోజు ఆయనను ‘‘అకౌంట్‌గా పనిచేసే మీకు ఇంతటి
తెలుగు ఎలా అబ్బంది’’ అని అడిగాను. తాను చిన్నప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారి
ఇంట్లో ఉండి చదువుకున్నట్లు చెప్పారు.

No comments:
Post a Comment