విశాఖపట్నం జీవితం అంటే నాకు ఇవటూరి సురేష్‌తో ముడిపడి ఉంటుంది. ఓ గొప్ప మిత్రుడు సురేష్‌ని విశాఖ నాకు ఇచ్చింది. నేను చూసిన పరిధిలో, నాకు తెలిసినవారిలో లౌక్యం తెలియని, కల్మషం లేని, అత్యంత నిజాయితీపరుడు సురేష్. సురేష్ నాకు 1989 నుంచి తెలుసు. జర్నలిజం వృత్తిలో మేమిద్దరం చాలా కాలం కలిసి పనిచేశాం. విజయవాడ ఆంధ్రభూమి లాంచింగ్ ఎడిషన్ లో ట్రైనీ సబ్ ఎడిటర్లుగా మేం ఇద్దరం ఒకేసారి జాయిన్ అయ్యాం. విశాఖ ఆంధ్రజ్యోతి లాంచింగ్ ఎడిషన్‌లో సబ్ ఎడిటర్లుగా ఒకే జీతంపై, ఒకే రోజు జాయిన్ అయ్యాం. ఆ తర్వాత విశాఖ వార్త లాంచింగ్ ఎడిషన్‌లో ఒకే రోజు, ఒకే జీతంపై సీనియర్ సబ్ ఎడిటర్లుగా జాయిన్ అయ్యాం. చెన్నై న్యూఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపులో మాత్రం సురేష్ నాకంటే ముందు జాయిన్ అయ్యాడు. సురేష్ అక్కడ తెలుగు పీపుల్స్.కామ్ కి చీఫ్ కంటెంట్ ఎడిటర్ గా, ఇన్ చార్జిగా ఉన్న సమయంలో నేను కూడా అక్కడ చీఫ్ కంటెంట్ ఎడిటర్ గా జాయిన్ అయ్యాను. అలా ఈ వృత్తిలో చాలా కాలం ప్రయాణం చేశాం. కలిసి పనిచేసినంత కాలం ప్రతి రోజూ ఇద్దరం కలిసే ఉండేవాళ్లం. కలిసే పనిచేసేవాళ్లం. సాంకేతికంగా కొత్త అంశాలను ఇద్దరం కలిసే నేర్చుకునేవాళ్లం. ప్రతిరోజూ ఆఫీసులో కలిసి ఉన్నా, ఆఫ్ రోజున కూడా కలిసేవాళ్లం. అంత స్నేహంగా ఉండేవాళ్లం. సురేష్ తెగ కబుర్లు చెబుతాడు. విశాఖలో ఈనాడు ప్రారంభం రోజు జరిగిన సంఘటనల నుంచి అతను అమెరికా వెళ్లినప్పుడు అక్కడ గమనించిన విషయాల వరకు పూసగుచ్చినట్లు చెప్పేవాడు. అతనికి ఉన్న పరిచయాల వల్ల అతనికి చాలా విషయాలు తెలుసు. ఎన్నో విషయాలు చెప్పేవాడు. విశాఖలో అతనికి తెలిసినవారినందరినీ పరిచయం చేసేవాడు. సురేష్ ది విశాఖ అయినందు, ఆంధ్రజ్యోతిలో పనిచేసిన నారాయణరావుగారు, రమణమూర్తి గారు, మన నవ్వులరేడు సుబ్బు.. లాంటివారందరూ అతనికి పాత పరిచయస్తులే.
1991 మే 19న ఆంధ్రజ్యోతి విశాఖ ఎడిషన్ ప్రారంభమైంది. అంతకంటే కొద్ది రోజుల ముందే మేమిద్దరం ఆంధ్రజ్యోతిలో చేరిపోయాం. ఈ ఎడిషన్ కోసమే ఎడిటర్ నండూరి రామమోహన్ రావు గారు మమ్మల్ని ఇద్దరినీ ఇంటర్వ్యూచేసి తీసుకున్నారు. విశాఖ నాకు కొత్త. సురేష్ సొంత ఊరు విశాఖ. అక్కడ అండ, దండ అన్నీ సురేషే.
నేను విశాఖ వచ్చిన కొత్తలో
వసీరా(వక్కలంక సీతారామారావు) అక్కడ ఆంధ్రభూమిలో పనిచేసేవారు. అప్పుడు ఆయన భార్య
డెలివరీకి పుట్టింటికి వెళ్లడం వల్ల, వసీరా ఒక్కరే ఇంట్లో ఉండేవారు. దాంతో, నన్ను
ఆ ఇంట్లో సెట్ చేసేశారు. మా ఫ్యామిలీని విశాఖ తీసుకువచ్చే వరకు నేను వసీరా గారి
ఇంట్లోనే ఉన్నాను. ఆ విధంగా వసీరా నాకు మంచి మిత్రుడు అయ్యారు. ఇక
ప్రముఖ కథా రచయితలు రావి శాస్త్రి(రాచకొంద విశ్వనాథ శాస్త్రి), కారా
మాస్టార్(కాళీపట్నం రామారావు), విరసం వ్యవస్థాపకులలో ఒకరైన చలసారి ప్రసాద్,
వంగపండు ప్రసాదరావు, కృష్ణాబాయి, ప్రముఖ నట
శిక్షకుడు డాక్టర్ సత్యానంద్, కె.బాలగోపాల్ గారి ప్రియ శిష్యుడు వీఎస్ కృష్ణ(మానవ హక్కుల
కృష్ణ - అప్పట్లో డెక్కన్ క్రానికల్ లో పనిచేసేవారు), ఆంధ్రవిశ్వవిద్యాలయం
జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ విభాగం మాజీ హెడ్ ప్రొఫెసర్ పి.బాబీవర్థన్... వంటి
అనేక మందిని సురేష్ నాకు పరిచయం చేశాడు. రావి శాస్త్రి గారు చనిపోయిన రోజు మేం ఇద్దరం
కలిసే వెళ్లాం. నేను ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం
విద్యార్థిని కాక ముందే బాబీవర్థన్ గారిని సురేష్ నాకు పరిచయం చేశాడు. చలసారి
ప్రసాద్, కారా మాస్టార్ లాంటి వారితో సురేష్ కి సాన్నిహిత్యం ఎక్కువ. వాళ్లు
సురేష్ తో ఫ్రెండ్స్ లా మాట్లాడేవారు.
జగదాంబ సెంటర్ సమీపంలో కారా మాస్టార్ గారి
అబ్బాయి ఉండేవారు. మాస్టారు కూడా అక్కడే ఉండేవారు. ఒక సాహితీ కార్యక్రమం నిర్వహణకు
సంబంధించి కారా మాస్టార్ గారిని నెల రోజులపాటు మేం ప్రతిరోజూ కలిసేవారం. జగదాంబ
సెంటర్ వార్త కార్యాలయం వద్ద ఓ అరుగుమీద
కూర్చొని గంటలు గంటలు మాట్లాడుకునేవారం. అప్పట్లోనే కారా మాస్టార్ గారికి కేంద్ర
సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించారు. అయితే, తెల్లారి లేస్తే, ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ,
ఆ ప్రభుత్వం ఇచ్చే అవార్డు తీసుకోవడం ఆయనకు ఇష్టంలేదు. తీసుకోవాలా? వద్దా? అన్న
మీమాంసలో ఉండేవారు. ఏం చేద్దాం అని సురేష్ ని కూడా అడిగేవారు. చివరకు కారా
మాస్టార్ ఆ అవార్డు తీసుకుని, ఆ డబ్బుని ‘కథానిలయం’ కోసం ఖర్చు చేశారు. ప్రముఖ సంపాదకులు పతంజలి గారిని పరిచయం చేసింది
కూడా సురేషే. ఆయన ఎడిటర్ గా ఉన్న సాక్ష్మి లాంచింగ్ ఎడిషన్ లో హైదరాబాద్ లో నేను
చీఫ్ సబ్ ఎడిటర్ చేరినప్పటికీ, అంతకు ముందే మహానగర్ కు ఎడిటర్ గా ఉన్న సమయంలో
సురేష్ ఆయన వద్దకు తీసుకువెళ్లి పరిచయం చేశాడు. సురేష్ హైదరాబాద్ లో కార్టూనిస్ట్
శ్యామ్ మోహన్ తో కలిసి ఒక రూమ్ లో ఉండేవాడు. అప్పుడు శ్యామ్ మోహన్ ని పరిచయం
చేశాడు. పేర్లు గుర్తుకు రావడంలేదు. ఇలా
చాలా మంది రచయితలను, ఇతర ప్రముఖులను
సురేష్ నాకు పరిచయం చేశాడు.
సురేష్‌తో కలిసి దీర్ఘకాలం పనిచేసినందున ఎన్నో మధుర జ్ఞపకాలు ఉన్నాయి. ఒక్క
విషయం మాత్రం తప్పక చెప్పాలి. నేను వార్తలో మానివేసిన తర్వాత, టీవీ9కి సెలెక్ట్
అయ్యాను. అయితే, జీతం విషయం రవిప్రకాష్ గారితో మాట్లాడి, అపాయింట్ మెంట్ ఆర్డర్
పంపుతామని మౌళి గారు చెప్పారు. కానీ, అపాయింట్ మెంట్ ఆర్డర్ మాత్రం రాలేదు. అది
అందడానికి ఆలస్యం అయ్యేట్లు ఉంది. అదే సమయంలో, చెన్నై న్యూఇండియన్ ఎక్స్ ప్రెస్
గ్రూపు నుంచి వార్తలో ఇచ్చిన జీతం కంటే 25
శాతం హైక్ తో నాకు అపాయింట్ మెంట్ ఆర్డర్ వచ్చింది. కనీసం ఇంటర్వ్యూకి కూడా
హాజరుకాలేదు. ఆ ఆర్డర్ కేవలం సురేష్ వల్లే వచ్చింది. సురేష్ యాజమాన్యంతో మాట్లాడి
నాకు ఇంటర్వ్యూ లేకుండా, చీఫ్ కంటెంట్ ఎడిటర్ గా అపాయింట్ మెంట్ ఆర్డర్ పంపించే
ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఆరు నెలలకే నాకు
జీతం పెంచే ఏర్పాటు చేశాడు. చెన్నై ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపులో సురేష్ చెప్పిన
అమెరికా (అంతకు కొద్దిరోజుల ముందే అమెరికా ప్రభుత్వ ఆహ్వానంపై అమెరికా వెళ్లి వచ్చాడు)
కబుర్లతో ఆనందంగా కాలం గడిపేశాను. మా అబ్బాయి కోరికపై అక్కడ మానేసి, హైదరాబాద్
సాక్ష్మి లాంచింగ్ ఎడిషన్ లో చీఫ్ సబ్ ఎడిటర్ గా జాయిన్ అయ్యాను.
విశాఖలో ఆరోగ్యం బాగోక నేను సీడీఆర్ లో చేరినప్పుడు, సురేష్ దగ్గర ఉండి చూసుకున్నాడు. నన్నే కాదు,
రమణమూర్తి గారిని అయితే, ఇంకా ఎక్కువగా చూశాడు. ఒక సారి రమణమూర్తి గారు కూడా ఆరోగ్యం బాగోక
సీడీఆర్ లో చేరారు. ఎక్కువసేపు ఆయన దగ్గరే ఉండి కుటుంబ సభ్యుడు కంటే ఎక్కువగా
చూశాడు. అప్పుడు నేను ప్రతిరోజు రమణమూర్తి గారిని చూడటానికి ఆస్పత్రికి
వెళ్లేవాడిని, నాకంటే ముందే వచ్చి సురేష్ అక్కడ ఉండేవాడు. ఒక్కోసారి రాత్రి పూట
కూడా అక్కడే ఉండేవాడు. సురేష్ వ్యక్తిత్వం
అంత గొప్పది. నా జీవితంలో ఎన్నో విషయాలలో అత్యంత ముఖ్యుడు సురేష్. వాస్తవానికి సురేష్
తో నా అనుబంధం గురించే చెప్పేటంతటి భాష నాకు తెలియదు. అటువంటి సురేష్ ని నాకు
అందించి, అత్యంత సన్నిహితుడ్ని చేసింది విశాఖ. అందుకే విశాఖ అంటే నాకు చాలా ఇష్టం. సముద్ర తీరం
అంటే నాకు ఎంతో ఇష్టం. విశాఖ, చెన్నై రెండు సముద్రతీర నగరాలలో మేం ఇద్దరం కలిసి
పనిచేశాం.
ఇక విశాఖ ఆంధ్రజ్యోతి రావి రామప్రసాద్, గారపాటి నరశింహారావు, గుంటూరు చంద్రశేఖర్, కొమ్మూరి రాజా, గోపరాజు
నారాయణరావు, వీవీ రమణమూర్తి, బి.నారాయణరావు గార్లతోపాటు, మోహన్ రావు,
శ్రీనివాసరెడ్డి, సాగర్, కోటేశ్వరావు(స్పోర్ట్స్), సుబ్బు, రఘు, కళ్యాణరామ్, అబ్దుల్లా, అకౌంటెంట్ మూర్తి,
స్పాట్ న్యూస్ మూర్తి..... లాంటివారిని అనేక మందిని ఇచ్చింది. నాకు విశాఖలో
తెలిసిన వారిలో ఎక్కువ మంది సురేష్, సాగర్, నవత, షర్మిల, అబ్దుల్లా, కృష్ణ... వంటి
వారందరూ సామాజికంగా మార్పు కోరుకునే రెబల్సే. వారి జీవన శైలిని గమనిస్తే మనకు అర్థమవుతుంది.
దేశంలో అత్యంత నిజాయితీపరులైన విలేకరులలో సాగర్ ఒకరు. విలేకరిగా సాగర్ నిజాయితీ గురించి నేను ఎంతో
మందికి చెప్పాను. ఇక ముందు కూడా చెబుతూ ఉంటాను.
నిజాయితీయే కాదు, మనిషిగా కూడా సాగర్ చాలా ఎత్తుకు ఎదిగారు.


No comments:
Post a Comment